close

తాజా వార్తలు

ఇసుక కొరత తీర్చేద్దాం: జగన్‌

ఏపీలో ఇసుక వారోత్సవాలు

అమరావతి: ఇసుక కొరతపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ  రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. నిర్మాణరంగంలో నెలకొన్న స్తబ్ధతకు తెరదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక తవ్వకాలు, పంపిణీపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన ఆయన వారం రోజులపాటు పూర్తిగా ఇసుకపైనే దృష్టిపెట్టి పనిచేయాలని సూచించారు. ఇసుక కొరతపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం తోసిపుచ్చారు. గత ప్రభుత్వంలో అవీనీతిమయమైన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. 
గతంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు, వరదలు వస్తున్నందున ఆశించినంత ఇసుకను వెలికితీయలేకపోతున్నామని చెప్పారు. ఈవిషయంపై తెలుగుదేశంపార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మరో వారంలో వరదలు తగ్గుతాయని భావిస్తున్నామన్న సీఎం.. ఇసుక వారోత్సవాలు చేపట్టి వారం రోజులపాటు ఇదే అంశంపై  దృష్టిపెట్టి పనిచేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వచ్చే వారం రోజులు సన్నద్ధంగా ఉండాలని, ఇసుక గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా పనిచేయాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళ్లకూడదని ఆదేశించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల వద్ద పటిష్ఠ పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్క లారీ కూడా ఎక్కడికీ తరిలిపోరాదన్న సీఎం.. సరిహద్దుల వద్ద అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా డీజీపీ పర్యవేక్షించాలని ఆదేశించారు. 

సరైన జాగ్రత్తలు తీసుకుని తప్పులు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని దొరకడంలేదనడం సరికాదని సీఎం అన్నారు. గతంలో మాఫియాతో ఇసుకను తరలించేవారని, అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని చోట్లా యంత్రాలు కాకుండా మనుషులతో పనిచేస్తున్నందున కార్మికుల అవసరం ఎంతగానో ఉంటుందని వివరించారు. వాగులు, వంకల్లో సుమారు 70చోట్ల ఇసుక రీచ్‌లను గుర్తించామని, గ్రామసచివాలయంలో చలానా కట్టి  20 కిలోమీటర్ల దూరం వరకు వాహనాల ద్వారా ఇసుకను తరలించుకోవచ్చని చెప్పారు. రీచ్‌ల్లో ఎవరు పని అడిగినా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 267 రీచ్‌లు ఉన్నా.. వరదల కారణంగా 69 చోట్ల మాత్రమే ఇసుక వెలికితీసే అవకాశముంటుందని వివరించారు. వారం రోజుల్లో పరిస్థితులు మెరుగుపడొచ్చని.. వరదలు తగ్గగానే భారీగా ఇసుక అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అప్పటి వరకు వాగులు, వంకలు, చిన్న నదుల్లో గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో  వెంటనే ఇసుక ఆపరేషన్‌ ప్రారంభించాలని ఆదేశించారు. పండ్లు ఇచ్చే చెట్ల మీదే రాళ్లు వేస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష తెదేపా దుష్ప్రచారాలను ఖండించాలన్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.