close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం: కోదండరామ్‌

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షలు, రాస్తారోకోలు చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ‘సకల జన  భేరి’లో కోదండరామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్యాంక్‌ బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న, చిన్న కారణాలు చూపి కార్మికుల ఇంక్రిమెంట్లు తగ్గిస్తున్నారని, వారి వేతనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విలీనం చేసే వరకు పోరాటం ఆగదు

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు. సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాలు, విపక్ష  నేతలు హాజరై  ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. 26 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 1 నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందన్నారు. విద్యార్థుల తల్లులు లేదా వారి సంరక్షులకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బ్లాక్‌ మార్కెట్‌లో ఏపీ ఇసుక: లోకేశ్‌

ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. భవన నిర్మాణ కార్మికులు లోకేశ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. కొత్త ఇసుక విధానం పేరుతో విపరీతంగా ధరలు పెంచారని ఆరోపించారు. బ్లాక్‌ మార్కెట్‌లో లారీ ఇసుకను రూ.10వేల నుంచి రూ.40వేలకు  విక్రయిస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబుకు ఫోన్‌ చేసిన పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం సాయంత్రం తెదేపా అధినేత చంద్రబాబుకు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా నవంబర్‌ 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరగా.. పవన్‌ విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు  సమాచారం. ఇసుక అక్రమ రవాణా, కార్మికుల ఆత్మహత్యలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇసుక సమస్యపై బాధితుల పక్షాన కలిసి పోరాడేందుకు సిద్ధమని ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కశ్మీర్‌లో ముగిసిన ఈయూ బృందం పర్యటన

ఉగ్రవాదాన్ని అంతమొందించే విషయంలో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని కశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ఐరోపా సమాఖ్య బృందం వెల్లడించింది. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను పరిశీలించేందుకుగాను శ్రీనగర్‌కు వచ్చిన ఐరోపా సమాఖ్య పార్లమెంట్‌ సభ్యుల బృందం పర్యటన బుధవారం ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్‌లో సైదిరెడ్డితో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం సైదిరెడ్డిని మంత్రులు అభినందించారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తాను అసెంబ్లీలో అడుగుపెట్టడం పూర్వజన్మ సుకృతం అన్నారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధే తన అజెండా అని.. అక్కడి ప్రజలకోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సేనకు పెరుగుతున్న ‘స్వతంత్ర’ మద్దతు

మిత్ర పక్షాల మధ్య విభేదాలతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్న వేళ శివసేనకు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో స్వతంత్ర ఎమ్మెల్యే శివసేన వైపు నిలిచారు. సక్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మంజులా గవిత్‌ శివసేనకు మద్దతునిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈమె గతంలో భాజపాకు మద్దతివ్వడం విశేషం. అంతకుముందు మొత్తం 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఐదుగురు శివసేనకు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కశ్మీర్‌, లద్ధాఖ్‌ అధికారిక విభజన ఎప్పుడంటే..

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు, ఆ రాష్ట్రాన్ని కేంద్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే, జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌ల అధికారిక విభజన బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన మాజీ ప్రభుత్వాధికారి జీసీ ముర్మును జమ్ము కశ్మీర్‌కు, మాజీ ఐఏఎస్‌ ఆర్‌కే మాథుర్‌ను లద్ధాఖ్‌కు నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తిహాడ్‌ జైలుకు చిదంబరం 

కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని నవంబర్‌ 13 వరకు తిహాడ్‌ జైలుకు తరలించాలని దిల్లీ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ఆయన ఈడీ కస్టడీ బుధవారంతో ముగియడంతో దిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. మళ్లీ ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుహర్‌ ఆదేశించారు. ఒకరోజు కస్టోడియల్‌ విచారణ కావాలంటూ ఈడీ వేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.