close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏ రాష్ట్రమూ ఇంత దగా పడలేదు: జగన్‌

ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని సీఎం జగన్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌ సుముఖంగా లేరు.. ప్రయత్నిస్తా:పవన్‌

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌‌, ఎంపీ కేశవరావు, ఇతరులెవరూ సుముఖంగా ఉన్నట్టు కన్పించడంలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం తనను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారనీ.. సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తంచేశారని పవన్‌ తెలిపారు. గత 28 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదని బాధ పడ్డారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ జీవోలో తప్పేముంది?:పేర్ని నాని

దురుద్దేశంతో ప్రచురించే వార్తలపై చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తే మీడియాకు సంకెళ్లంటూ తెదేపా నేతలు ప్రచారం చేయడం సమంజసంకాదని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛకు వచ్చిన విఘాతమేమీ లేదన్నారు. సచివాలయంలో మరో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌ 30న ఇచ్చిన జీవో ప్రకారం ప్రభుత్వ శాఖల పనిలో రాజకీయ ఉద్దేశాలు, దురుద్దేశాలను ఆపాదిస్తే రిజాయిండర్ ఇవ్వాలన్నది మాత్రమే లక్ష్యమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ మరోమారు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన విచారణ, ప్రత్యామ్నాయ విధానంపై మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై ఈరోజు ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విచారణలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. శనివారం కేబినెట్‌ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫోన్లో మాట్లాడుకున్న ఉద్ధవ్‌, పవార్‌!

శివసేన, ఎన్సీపీ అగ్రనేతలు ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ గురువారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నట్లు ఇరు పార్టీలకు చెందిన నాయకులు విశ్వసనీయంగా తెలిపారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. శరద్ పవార్ నివాసంలో ఉన్నప్పుడు ఈ ఫోన్‌ సంభాషణ జరిగినట్లు వివరించారు. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం పదవి విషయంలో భాజపాతో శివసేన పొరపొచ్చాల నేపథ్యంలో ఈ ఫోన్‌ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇక 30 సెకన్లు మోగాల్సిందే: ట్రాయ్‌

ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ సమయం విషయంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి చెక్‌ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్‌ ఫోన్ల విషయంలో ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ టైమ్‌ను 30 సెకన్లుగా నిర్ణయించింది. ల్యాండ్‌లైన్‌ ఫోన్ల విషయంలో దీన్ని నిమిషంగా పేర్కొంది. ఇన్‌కమింగ్‌ కాల్‌ సమయాన్ని తగ్గించడం విషయంలో ఒక కంపెనీపై మరో కంపెనీ ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టెలిఫోన్‌ సేవా నిబంధనలను సవరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయ్‌..

అక్టోబరు నెలలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు తగ్గాయి. రూ. 95,380 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబరులో రూ. 1,00,710 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. అయితే గత నెలతో పోలిస్తే మాత్రం వసూళ్లు స్వల్పంగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ. 91,916 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్లకు తక్కువగా నమోదవడం వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘మ్యాచ్‌ 3 గంటలే.. ఎవరూ చనిపోరు!’

దిల్లీలో కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో భారత్×బంగ్లాదేశ్‌ తొలి టీ20పై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌ కోచ్‌ రసెల్‌ డొమింగో దిల్లీ కాలుష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌ జరిగేది మూడు గంటలేనని, ఆటగాళ్లకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదని అన్నారు. ‘గతంలో శ్రీలంక ఆటగాళ్లు వాయు కాలుష్యంతో ఇబ్బంది పడ్డారని అందరికీ తెలుసు. బంగ్లాదేశ్‌లో కూడా కాలుష్యం ఉంది. ఇతర దేశాలలో పోల్చుకుంటే దిల్లీ కాలుష్య సమస్య మాకు అంతగా ఉండదు. ఆటగాళ్లంతా మ్యాచ్‌పైనే దృష్టిపెట్టారు’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో తెలుగు టెకీ మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు అమెరికాలో అకాల మరణం చెందారు. గ్రీన్‌ కార్డ్‌ బ్యాక్‌లాగ్‌ లిస్ట్‌లో ఉన్న అతడి మృతితో గర్భిణి అయిన ఆయన భార్య అర్ధంతరంగా స్వదేశానికి తిరుగు ప్రయాణమవ్వాల్సి వచ్చింది. నార్త్‌ కరోలినాలో పనిచేస్తున్న శివ చలపతి రాజు మృతిచెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏ కారణంతో చనిపోయారన్న వివరాలు తెలియరాలేదు. ఆయన ఫేస్‌బుక్‌ వివరాలను బట్టి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నిట్‌లో ఉత్సాహంగా టెక్నోజియాన్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.