close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. 5100 రూట్లలో ప్రైవేటు బస్సులు: కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు సాగింది. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. 49 అంశాలపై సమావేశంలో చర్చించామని, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటించామని చెప్పారు. 5100 బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అనాలోచితంగా, అర్ధరహితంగా సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బండి సంజయ్‌ ఆరోపణలు అవాస్తవం: సీపీ

పోలీసులపై భాజపా ఎంపీ బండి సంజయ్ ఆరోపణలన్నీ అవాస్తవమని కరీంనగర్‌ ఇన్‌ఛార్జి సీపీ సత్యనారాయణ తెలిపారు. దీనిపై  ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. సకల జనుల భేరి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లి గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంతిమయాత్ర సందర్భంగా కరీంనగర్‌లో పోలీసులు తన కాలర్‌ పట్టుకొని చేయిచేసుకున్నారని ఎంపీ సంజయ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జనసేనకు బాలరాజు గుడ్‌బై

జనసేన పార్టీకి మాజీ మంత్రి, సీనియర్‌ నేత పసుపులేటి బాలరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు లేఖ రాశారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఆయన పార్టీలో చేరారు. ఐదు నెలల పాటు పార్టీలో కొనసాగానని, అందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు. తప్పని పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వస్తోందని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో నయానిజాం పాలన: లక్ష్మణ్‌

తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. శనివారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మొన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌, నిన్న ఎంపీ బండి సంజయ్‌లపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేలా ఒత్తిడి చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చైనాలో 5జీ నెట్‌వర్క్‌ ప్రారంభం

5జీ సాంకేతికత పరిజ్ఞానంలో అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలను అధిగమించాలని యోచిస్తున్న చైనా ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఆ దేశ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన చైనా మొబైల్‌,  చైనా యూనికాం, చైనా టెలికాం..5జీ డేటా ప్రణాళికలను విడుదల చేశాయి. 128యువాన్ల నుంచి 599 యువాన్ల వరకు నెలవారీ ధరల శ్రేణిని ఇందుకు నిర్ణయించాయి. బీజింగ్‌, షాంఘై సహా దాదాపు 50 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నాయి. వచ్చే ఏడాది నాటికి 10కోట్ల 70లక్షల మంది చందాదారుల్ని చేర్చుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అతణ్ని సీఎం చేస్తే మేం చులకనవుతాం

మహారాష్ట్రలో కాబోయే ముఖ్యమంత్రి భాజపా నేత మాత్రమే అయి ఉండాలని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధినేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారు. శివసేనకు సీఎం పదవి కేటాయిస్తే ఆదిత్య ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని, ఆయన్ను ఆ స్థానంలో చూడడం తమకు చులకనగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ముంబయిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అయోధ్య తీర్పు: పోలీసులకు సెలవులు రద్దు

అయోధ్యలోని ఏళ్లనాటి రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పును వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ‘మిలాద్‌ ఉన్‌ నబీ, గురునానక్‌ జయంతిలాంటి పర్వదినాలతో పాటు అయోధ్య కేసులోనూ త్వరలో తీర్పు వెలువడనుంది. దీంతో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబరు 1 నుంచి పోలీసు అధికారులు, సిబ్బంది ఎలాంటి సెలవులు తీసుకోకుండా నిషేధం అమల్లోకి వస్తుంది. మళ్లీ ఉత్తర్వులు వచ్చేంత వరకు పోలీసులు సెలవు పెట్టకూడదు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కర్తార్‌పూర్‌కు వెళ్తా.. అనుమతివ్వండి: సిద్ధూ

ఈ నెల 9న జరగనున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని.. పాకిస్థాన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గురునానక్‌ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం నుంచి తనకు  ఆహ్వానం వచ్చిందని పేర్కొన్నారు. సిక్కు మతానికి చెందిన వ్యక్తిగా  ఈ చారిత్రక సందర్భంలో గురు బాబా నానక్‌ను దర్శించుకోవడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. విమానాశ్రయాల్లో ఎందుకన్ని వీల్‌ఛైర్లు: మహీంద్రా

పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా మరో కొత్త చర్చను లేవనెత్తారు. విమానాశ్రయాల్లో భారీ వరుసలను తప్పించుకొనేందుకు వీల్‌ ఛైర్లను అతిగా వినియోగిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇతర వ్యాపారవేత్తలతో పోలిస్తే ఆనంద్‌ మహీంద్రా భిన్నంగా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. కొన్ని ప్రశ్నలకు వెంటనే స్పందిస్తారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో సెగ పుట్టించింది. విమానాశ్రయాల్లో అతిగా వినియోగిస్తున్న వీల్‌ ఛైర్ల గురించి ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిన్మయానంద్‌ కేసు: ఆమె పర్సు దొరికింది!

యూపీలో న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌ కేసులో సిట్‌ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన న్యాయ విద్యార్థిని పర్సును మురికి కాల్వలో గుర్తించినట్టు సమాచారం. చిన్మయానంద్‌ తనపై లైంగిక వేధింపులకు సంబంధించిన సాక్ష్యాలను రికార్డు చేసిన స్పై కెమెరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ అధికారులు చిన్మయానంద్‌కు చెందిన ముముక్షు ఆశ్రమం సమీపంలోని ఓ మురికి కాల్వలో కూలీలతో వెతికించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.