
తాజా వార్తలు
డీగ్లామర్ గెటప్‌లతో వసూళ్ల వర్షం
ఏ మాత్రం రాజీపడని అగ్ర హీరోలు
సినిమా విజయం సాధించాలంటే ఏదైనా తారక మంత్రం ఉందా..? ఎందుకు లేదు! ఇప్పుడున్న ట్రెండ్‌ను ఫాలో అయితే సరిపోతుంది. దుమ్మురేపే ఫైట్లు, అదిరిపోయే స్టెప్పులు, కథానాయిక అందాలు.. కళ్లకు నల్లటి అద్దాలు, చేతికి రిస్టువాచ్, ఆకట్టుకునే ఆహార్యం.. ఇవన్నీ సినిమాలో ఉంటే.. విజయం తథ్యం..! ఇలా అనుకుంటే పొరబాటు పడినట్లే. ఎందుకంటే ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలంటే వీటిని మించిన వైవిధ్యం ఉండాలి. పాత కథ అయినా కొత్తదనం కనిపించాలి. పరిచయ గీతాలు, గాల్లో ఫైట్లతో హీరోయిజాన్ని చాటుకోనక్కర్లేదు. డీగ్లామర్‌గా కనిపించినా, బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించొచ్చు.. అని అంటోంది కోలీవుడ్. ఇలాంటి పాత్రలు చేయడానికి మన అగ్ర హీరోలు ఏ మాత్రం రాజీ పడటం లేదు. దర్శకుడి కథకు అడ్డువెళ్లకుండానే ఆయనను అనుసరిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అజిత్, విజయ్, కార్తి, ఆర్య వంటి హీరోలు ఇలాంటి వైవిధ్య బాటలో పయచే ఈ సారి బాక్సాఫీసు స్టార్లుగా మారారు. ఆ చిత్రాలతోపాటు మన హీరోల వైవిధ్యంపై ప్రత్యేక కథనం.
ఎప్పుడూ వైవిధ్యమే..!
తమిళ చిత్ర పరిశ్రమ అంటేనే వైవిధ్యం నిండిన కుండ. హీరోయిజాన్ని దూరంగా, ప్రేక్షకులు ఆశించే వినోదానికి మరింత దగ్గరగా ఉంటుంది. అయితే ఈ ఏడాది కాస్త ఎక్కువ మోతాదు వైవిధ్యాన్ని ప్రేక్షకులకు పంచిందనే చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో హీరోలు డీగ్లామర్‌గా, కొత్తదనంతో, బలమైన కథతో వచ్చిన సినిమాలే విజయం సాధించాయి. అందులో ప్రధానమైన సినిమా ఇటీవల వచ్చిన ‘ఖైదీ’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోకేష్ కనకరాజ్ ధైర్యానికి, సాహసానికి తెలుగు, తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో హీరోకు పాటలు లేవు, పెద్దగా పంచ్ డైలాగులు లేవు. అంతకు మించి.. పలువురు దర్శకులు ప్రాణంగా భావిస్తున్న హీరో పరిచయ గీతం ఇందులో అస్సలు లేదు. అంతేనా.. ఒకే డ్రస్‌లోనే సినిమా మొత్తం కథానాయకుడు కనిపిస్తాడు. అదీ.. మాసిన, చిరిగిన దుస్తులు. దానితోడు పెరిగిన జుట్టు, గడ్డం, చేతికి సంకెళ్లు. వాస్తవానికి ఇలాంటి పాత్రలో నటించడానికి ఒప్పుకోవడం కూడా పెద్ద సాహసమే. అతని డీగ్లామర్ పాత్రే ప్రేక్షకులకు మరింత అందంగా కనిపిస్తోంది. అందుకు కారణం చిత్ర కథ అన్నది సినీ విశ్లేషకుల మాట. చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దీపావళికి విడుదలై దక్షిణాదిలోనే హిట్ సినిమాగా మారడం విశేషం.
బిగిలే..
కత్తి, తెరి, మెర్సల్.. ఇలా ఇటీవల వచ్చిన చిత్రాల్లో పక్కా క్లాస్‌గా నటించి మెప్పించారు విజయ్. అయితే దీపావళికి వచ్చిన ‘బిగిల్’ చిత్రంలో ఓ పాత్రను కాస్త డీగ్లామర్‌గానే చిత్రీకరించారు. మురికివాడలో ఉండే పాత రౌడీ ‘రాయప్పన్’ అనే పాత్రలో ఆయన నటించారు. కాషాయ రంగు పంచె, నల్లని చొక్కా, నుదుట బొట్టు, మెడలో ఏసు డాలర్, నల్లని ముఖంతో కాస్త భిన్నంగా కనిపించారు. ‘ఆనా ఎంగ ఆట్టం వెరిత్తనమా ఇరుక్కుం’ అంటూ విజయ్ చెప్పిన డైలాగుకు థియేటర్లో కేరింతల మోత మోగింది. విజయ్ అభిమానులకు ఈ పాత్ర చాలా కొత్తగా అనిపించింది.
తల సాహసం..
గత కొన్ని చిత్రాల్లో అజిత్ సాల్ట్ పెప్పర్ స్టైల్లోనే నటిస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘నేర్కొండ పార్వై’ చిత్రంలో వయసు మీదపడిన వ్యక్తిగా కనిపించారు. ఏదో అసంతృప్తి జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా, పెరిగిన గడ్డం, జుట్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కూడా హీరో పరిచయ గీతం లేదు. నేటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉక్కుపాదం మోపే కథాంశంతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రమిది. అందుకే హీరోయిజం కోసం పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. అయితే అజిత్ ఫైట్లు, ఉన్న రెండు పంచ్ డైలాగులకు మంచి స్పందన లభించింది.
సినిమా అంటే.. అలా ఉండాలి
ధనుష్ నటించిన ‘అసురన్’ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చెప్పిన మాట ‘ఇదీ సినిమా అంటే..’. వెట్రిమారన్ దర్శకత్వ శైలికి ఓ ప్రత్యేకత ఉంది. తన చిత్రాల్లో చిన్నపాటి పాత్రను కూడా అత్యంత సహజంగా చూపిస్తారు. అలాంటి కథానాయకుడి పాత్రను గాలికి వదిలేస్తాడా ఏంటి? ‘పొల్లాదవన్’, ‘ఆడుగలం’, ‘వడ చెన్నై’ చిత్రాల్లో ధనుష్ అద్భుతంగా తెరపై కనిపించేలా చేశారు. వీటన్నింటినీ మించిన స్థాయిలో ‘అసురన్’లో చూపించారు. వాస్తవానికి ‘వెక్కై’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అందులోని సహజత్వానికి తన దర్శకత్వ పటిమను వెట్రిమారన్ జోడించగా.. ఆ పాత్రకు ప్రాణం పోశారు ధనుష్. దీనికోసం ఆయన కెరీర్లోనే ఎప్పుడూ లేనంత డీగ్లామర్‌గా కనిపించారు. మాసిన పంచె, పొడవాటి చొక్కా, పెరిగిన గడ్డం, చింపిరి జట్టు.. అమాయకమైన అభినయంతో కట్టిపడేశాడు. కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో.. ఆగ్రహం కట్టలు తెంచుకునే ఓ సన్నివేశంలో ధనుష్ నటన అద్భుతం అనిపించింది. ఆ సన్నివేశం ఆకట్టుకోని ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి. వాస్తవానికి ప్రేక్షకుడు కోరుకునే అసలైన వినోదం ఇదే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు. అక్కడ వెట్రిమారన్ దర్శకత్వంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఆర్య మరో అవతారం
చాక్లెట్ బాయ్ ఆర్య ఇటీవల ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ‘మహాముని’. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. డబుల్ యాక్షన్ చిత్రాల్లోనే ఇది మరింత కొత్తగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇందులో మునిరాజ్ అనే పాత్రలో ఆర్య వైవిధ్యంగా నటించారు. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ఫొటోలే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సేంద్రియ వ్యవసాయం చేసే రైతుగా ముందుగానే శిక్షణ తీసుకుని మరీ ఇందులో నటించారు. అంతేకాకుండా స్వామి వివేకానందను అనుసరించే ఆ పాత్రలో మంచి నటనను ప్రదర్శించి అదుర్స్ అనిపించారు. సినిమా విజయానికి ఇదో ప్రధాన కారణంగా మారింది. ఇలా అగ్ర హీరోలు సైతం వైవిధ్యానికే ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుండటం విశేషం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- మరోసారి నో చెప్పిన సమంత
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
