close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు: మోదీ

ప్రపంచానికి ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలను భారత్‌ అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కోల్‌కతాలో అంతర్జాతీయ ఐదో సైన్స్‌ ఫెస్టివల్‌ను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ‘‘చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నా. చంద్రయాన్‌ 2 ప్రయోగంలో శాస్త్రవేత్తలంతా అలుపెరగకుండా శ్రమించారు. సత్ఫలితాలు వస్తాయని భావించారు. అంతా అనుకున్న ప్రణాళిక ప్రకారం జరగలేదు. అయినప్పటికీ ఆ మిషన్‌ మాత్రం విజయవంతమైంది. సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. కృషి, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయి’’ అని మోదీ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మరో రెండురోజులు బంద్‌: రెవెన్యూ ఐకాస

తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనకు నిరసనగా మరో రెండు రోజులు రెవెన్యూ కార్యాలయాల బంద్‌ పాటిస్తామని తెలంగాణ రెవెన్యూ ఐకాస స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఐకాస ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సంఘంతో పాటు తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్‌ఏ, రెవెన్యూ సర్వీసెస్‌ సంఘాలతో కూడిన ఐకాస ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తహసీల్దార్‌ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని.. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఐకాస డిమాండ్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యూపీకి కేంద్ర బలగాలు

అయోధ్య తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. వాటికి అదనంగా కేంద్ర మంగళవారం నాలుగు వేల మంది కేంద్ర సాయుధ బలగాలను యూపీకి పంపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీకి చెందిన 15 కంపెనీల బలగాల్ని యూపీకి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వినోదాల ‘ఈటీవీ విన్‌’ యాప్‌ వచ్చేసింది

డిజిటల్ మాధ్యమంలో మరో కొత్త అధ్యాయానికి ఈనాడు టెలివిజన్‌ శ్రీకారం చుట్టింది. 'ఈటీవీ విన్' పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా ప్రేక్షకులను వినోదాల ప్రపంచంలో విహరింపజేసేలా 'ఈటీవీ విన్' యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆవిష్కరించారు. గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పవన్‌.. చంద్రబాబు మాయలో పడొద్దు: అవంతి

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఐదుకోట్ల ఆంధ్రుల్ని అవమానపరిచేలా ఉన్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. రాజకీయాల్లో ఆవేశం పనికిరాదని.. ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని స్థితిలో పవన్‌ ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అవంతి మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు మాయలో పడొద్దని పవన్‌కు హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిర్మలా సీతారామన్‌కు హరీశ్‌ లేఖ

జీఎస్టీ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన రూ. 2,812 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. ఐజీఎస్టీలో రాష్ట్రానికి చాలా మొత్తం రావాల్సి ఉందని హరీశ్‌ లేఖలో పేర్కొన్నారు. 2018 మార్చి 31 నాటికి ఉన్న రూ. 1,76,688 కోట్ల ఐజీఎస్టీ తాత్కాలిక బదలాయింపు చేయకుండా కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేడెట్ ఫండ్‌కు బదలాయించారని మంత్రి లేఖలో ప్రస్తావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రేవంత్‌రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యత?:వీహెచ్‌

కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. గాంధీభవన్‌లో రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ ఎదుటే ఆ పార్టీ సీనియర్లు వాగ్వాదానికి దిగారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు గులాం నబీ ఆజాద్‌ పార్టీ నేతలతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆజాద్‌ వద్దకు వీహెచ్‌ వెళ్లారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎంపీ రేవంత్‌ రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. ప్రతి అంశంలో షబ్బీర్‌అలీ రేవంత్‌ రెడ్డికి తోడ్పాటుగా నిలుస్తున్నారంటూ వీహెచ్‌ ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గాజువాకను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: పవన్‌

తమపై అక్రమంగా బనాయించిన కేసులను వెనక్కి తీసుకోకుంటే తమ సత్తా చూపిస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల తర్వాత తొలిసారిగా గాజువాక వచ్చిన పవన్‌కు కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పవన్‌ దిశానిర్దేశం చేశారు. గాజువాకను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పవన్‌ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘మహా’ తీరం దాటినా టీ20 నిర్వహిస్తాం!

తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్‌, బంగ్లా రెండో టీ20కి ఏర్పాట్లు చేస్తున్నామని సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం తెలిపింది. వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని వెల్లడించింది. మ్యాచ్‌ నిర్వహించేందుకు వీలుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ‘మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు మేం సంసిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాం. నవంబర్‌ 7న ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌ మాత్రం సాయంత్రం మొదలవుతుంది’ అని ఆ సంఘం అధికారి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రూ.8,490లకే విదేశీ విమాన టిక్కెట్‌!

ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా  ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. దేశంలోని విమానయాన సంస్థల మధ్య నెలకొన్న విపరీతమైన పోటీ తట్టుకొనేందుకు ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా పరిమితమైన కాల వ్యవధిలో రూ.8,490 ప్రారంభ ధర (అన్నీ కలుపుకొని)తో  విదేశీ విమాన ప్రయాణానికి టిక్కెట్లను విక్రయించనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.