close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ‘ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదు’

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఈ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీకి ఉన్న బకాయిలు రూ.3006కోట్లు ఉండగా.. ప్రభుత్వం రూ.3,903 కోట్లు చెల్లించిందన్నారు. మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీయే తిరిగి ప్రభుత్వానికి రూ.540కోట్లు చెల్లించాలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. హౌసింగ్‌ ప్రాజెక్టుల కోసం రూ.25వేల కోట్లు

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 1600 హౌసింగ్‌ ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఏఐఎఫ్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి ఇందుకు ఆమోదం తెలిపిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అయోధ్య కేసు.. ఏ తీర్పొచ్చినా సమ్మతమే

రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంలో సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు ఏదైనా సరే తమకు సమ్మతమేనని ప్రముఖ ముస్లిం గ్రూపు జమాయిత్‌ ఉల్మా ఐ హింద్‌ ప్రకటించింది. ప్రతి ముస్లిం కూడా కోర్టు తీర్పును గౌరవించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు జమాయిత్‌ ప్రెసిడెంట్‌ మౌలానా అర్షద్‌ మాదానీ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ప్రార్థనా మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించలేదని ముస్లింల విశ్వాసమని చెప్పారు. ఒకవేళ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చినా శాంతియుతంగా వ్యవహరించాలని ముస్లిం సోదరులకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఆర్టీసీపై ముగిసిన సీఎం కేసీఆర్‌ సమీక్ష

ఆర్టీసీ సమ్మె వ్యవహారం, హైకోర్టు విచారణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష ముగిసింది. సుమారు 9 గంటల పాటు సమీక్ష సాగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. గురువారం హైకోర్టులో విచారణ, విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం పరంగా ఎలాంటి కార్యాచరణ అవలంబించాలనే అంశంపై అధికారులతో సీఎం చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి

ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తూ వచ్చినందున లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కింది. వైకాపా మహిళా నేతల్లో ముఖ్యులుగా ఉన్న ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మకు కూడా గతంలో కీలక పదవులు కట్టబెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘మహా’ శుభవార్త ఎప్పుడైనా వినొచ్చు

మహారాష్ట్రలో ప్రస్తుత అసెంబ్లీ ముగింపునకు మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందున.. ప్రభుత్వ ఏర్పాటుపై ఏక్షణమైనా శుభవార్త వినిపించవచ్చని భాజపా నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మిత్రపక్షాల ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ముంగంటివార్‌ అన్నారు. బుధవారం శివసేన మంత్రులతో సీఎం నిర్వహించిన సమావేశం రైతుల సమస్యలను ఉద్దేశించిందని పైకి చెప్తున్నా, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిగాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. BSNLలో 70-80 వేల మందికి వీఆర్‌ఎస్‌!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రారంభమైంది. 70 నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల వ్యయ భారం తగ్గే అవకాశం ఉందని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది. నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 3 వరకు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే పుర్వార్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు

తనకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని తితిదే ఆగమ సలహాదారుగా నియమితులైన రమణ దీక్షితులు అన్నారు. తితిదే ఆగమ సలహామండలి సభ్యుడిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. గతంలో బలవంతంగా పదవీ విరమణ చేయించిన ప్రధాన అర్చకులు, అర్చకులను తిరిగి వారి స్థానాల్లో నియమించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రమణ దీక్షితులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బీమా చెక్కులు అందించిన కేటీఆర్‌

మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో బీమా చెక్కులను అందజేశారు. 80 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన 1,581 మంది తెరాస కార్యకర్తల కుటుంబాలకు రూ.31.62 కోట్లు చెల్లించామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను మోసగించిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌లో అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే కోర్టు మరోసారి తిరస్కరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.