
తాజా వార్తలు
రాహుల్లాసం
పాతబస్తీలో పుట్టిపెరిగిన పక్కా హైదరాబాదీ రాహుల్ సిప్లిగంజ్!
ఏడో తరగతి ఫెయిలయ్యాడు. ఇంటర్ పూర్తి చేయడానికి నాలుగేళ్లు పట్టింది. జీవితంలో ఎన్నో ఓటములు, ఇబ్బందులొచ్చినా వెనకడుగు వేయలేదు. సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా దమ్మేంటో చూపాడు. సొంతంగా వీడియోలు చేశాడు. ఓల్డ్‌సిటీ యాసతో, అద్భుతమైన గాత్రంతో.. బిగ్‌బాస్ దాకా ప్రయాణం చేశాడు. విన్నర్‌గా నిలిచాడు. రాహుల్‌కి ఈ విజయం ఊరికే రాలేదు. రాత్రికి రాత్రే విజేత కాలేదు. బిగ్‌బాస్ షోలో కనిపించిన రాహుల్ బాల్యం ఎలా గడిచింది? ఈ విజయం వెనుక ఎవరెవరున్నారు? తను ఈ స్థాయికి రావడానికి అమ్మానాన్నలు అందించిన ప్రోత్సాహం ఎంత?... లాంటి విషయాల్ని అతనే ‘హాయ్’తో పంచుకున్నాడు.
బిగ్‌బాస్ షోతో ఎన్నో కుటుంబాలకు దగ్గరయ్యాను. మూడునెలలకు పైగా ప్రపంచంతో సంబంధం లేకుండా.. నాలుగు గోడల మధ్య పదిహేను మంది వ్యక్తులతో ఉండటం కష్టం. సహనం అంటే ఏంటో ఈ షో ద్వారా నేర్చుకున్నా. ఒకప్పుడు ఎవడిపైనన్న జోక్ వేస్తే పక్కటోళ్లు నవ్వితే జోక్ అనుకునేవాణ్ని. బిగ్ బాస్‌కి వచ్చాక జోక్ ఎవరిపైన వేస్తే వాళ్లూ నవ్వాలి.. అదే మంచి జోక్ అని తెలుసుకున్నా. బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవి, వరుణ్ సందేశ్ నాకు ఎంతో సహకరించారు. నోయల్ ఆదరణ మరిచిపోలేనిది.
రహస్యంగా ఉంచారు విజేతనయ్యాక... అమ్మా, నాన్న, తమ్ముడు, చెల్లి ఆనందానికి అవధుల్లేవు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొస్తూనే హైదరాబాద్ గల్లీల్లోంచి అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీలు ఇస్తూ లోపలికెళ్తే.. అమ్మా, నాన్న కళ్లలో ఆనందభాష్పాలు. ఇంట్లోకి వెళ్తూనే నాన్న ఆరోగ్యం బాగలేదని తెల్సింది. నాకు తెలిస్తే ఏకాగ్రత కోల్పోతానని వాళ్లు చెప్పలేదు. నేను హౌస్‌లోకి వెళ్లిన మూడోరోజు నాన్నకి గుండెపోటు వచ్చిందట. ఐసీయూలో రెండురోజులున్నారట. ఆ తర్వాత నలభై రోజులపాటు చికిత్స తీసుకున్నారట. ఇదంతా తెలిశాక నాకేం చేయాలో తెల్వలే. బయట జనాలు.. ఆనందం, కేరింతలు. లోపల బాధ. దిగమింగుకున్నా. నాన్న దగ్గరికెళ్లి ‘నాన్న.. ఏం కాదు. నీకేమైతది. గట్టిగున్నవ్..’ అంటూ భరోసాగా మాట్లాడా. |
ఆ రోజు అర్ధరాత్రి షో నుంచి ఇంటికొచ్చాక.. బయట నాకోసం జనాలు అరుస్తున్నారు. నామీద ప్రేమతో వచ్చిన అంతమందిని అర్ధరాత్రిపూట కంట్రోల్ చేయటం కష్టమనిపించింది. అందరికీ అభివాదం చేసి, కొద్దిసేపు సెల్ఫీలు దిగినా. మా ఇంటి వెనకాల గోడ దిగి.. హీరో వరుణ్‌కు ఫోన్ కొట్నా. మీ ఇంటికి వస్తున్నా. జనాలను సంజాయించలేనన్నా.... అన్నాను. అలా అమితానందాన్ని, తట్టుకోలేనంత బాధను ఒకేసారి అనుభవించా ఆ రోజు అర్ధరాత్రి! |
నాన్న ఇఫ్తార్ విందు ఇచ్చేవారు పాతబస్తీలో పుట్టిపెరిగినందుకు హిందీ, ఉర్దూ బాగొచ్చింది. మేం ముస్లిం కాలనీలో ఉండేవాళ్లం. మేమొక్కరమే హిందువులం. రంజాన్, బక్రీదు పండగలకు మా ఇంటికి మటన్ పంపించేవాళ్లు. పది లీటర్లకు పైగా షీర్ కుర్మా వచ్చేది. తినలేక, తాగలేకపోయేవాళ్లం(నవ్వులు). మానాన్న ఇఫ్తార్ విందు ఇచ్చేవారు. మా ఇంటికి ముస్లింలందరూ వచ్చేవారు. మా నాన్నకు సంగీతం అంటే ఇష్టం. నేను గోడలు, చెక్కల మీద దరువేస్తూ పాటలు పాడేవాణ్ని. అరే.. వీడు బానే పాడుతున్నాడు కదా అని.. నలుగురి ముందు పాడమనేటోడు. సంగీతం తరగతుల్లో చేర్పించాడు. మా గురువు పేరు శ్రీ పండిత్ విఠల్‌రావు. నిజాం పరిపాలనలో గజల్స్ పాడిన గొప్ప ప్రతిభావంతుడు. ఆయన మా తాతయ్య సెలూన్‌కి వచ్చేవారట. అలా బాగా దోస్త్ అంట. అందుకే పదోతరగతి నుంచి ఆరేళ్లపాటు ఆయన దగ్గర శిష్యరికం చేశాను. చదువు పెద్దగా అబ్బలేదు. గాయకున్ని కావాలని నిర్ణయించుకున్నా. మానాన్న బండిమీద స్టూడియోలకు తిప్పిండు. అక్కడ గంటలు గంటలు ఎదురు చూసేటోళ్లం. మా నాన్న నాతో స్నేహితుడిలా ఉండేవాడు. ఆయన లేనిదే నాకీ జీవితం లేదు. మా నాన్న నాపై పెట్టుకున్న నమ్మకం వల్ల ఇప్పుడు నేను గెలిచా. నాన్నకే ఈ ట్రోఫీ అంకితం. |
అదే నాకు పెద్దప్లస్! పాతబస్తీ నుంచి చదువులకోసం మేం లక్డీకపూల్ దగ్గర్లోని విజయనగర్‌కాలనీకి వచ్చాం. నాన్న పని అక్కడే. నేను మా ఇంటిదగ్గర ఉండే లయోలా స్కూల్లో చదివాను. ఏడో తరగతి ఫెయిలయినా. ఇంటర్ రెండేళ్ల చదువయితే.. నాకు నాలుగేళ్లు పట్టింది(నవ్వులు). చిన్నప్పుడు కబడ్డీ, మారంపేటి(రబ్బరు బాల్‌తో ఆడేఆట) ఆడేవాళ్లం. మా నాన్న చిన్నప్పటి నుంచి కొట్టిమరీ సంగీతం నేర్పించడం పెద్ద ప్లస్ అయింది. ప్రపంచం అర్థమయ్యాక... సంగీత సాధన ఆపలేదు. హార్మోనియంపై గంటలపాటు సాధన చేసేవాణ్ని. |
ఆ వీడియోలతోనే పేరొచ్చింది సొంతంగా సంగీత వీడియోలు చేయాలనుకున్నా. 2013లో ప్రారంభించా. బాలీవుడ్, హాలీవుడ్‌లాగా మంచి వీడియోలు చేయాలనే తపన ఉండేది. ఒక్కోదానికి రూ. మూడు లక్షల వరకూ ఖర్చు అయ్యేది. అప్పుడేమో ఓ పాట పాడితే నాలుగైదు వేలు వచ్చేవంతే. అదీ అమావసకో, పున్నానికో పాడుతుండె. స్పాన్సర్లు దొరక్కపోయేవారు. ‘మగజాతి’... అనే నా తొలి పాట కోసం నాన్న మా అమ్మ నగల్ని గిరీపెట్టి లక్షన్నర తెచ్చిండు. అదే నా జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అమ్మానాన్న నన్ను అంతగా నమ్మారు. అవకాశం ఇచ్చారు. నేను ఎలాగైనా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నా. పాట రాసేప్పుడు, ఎడిటింగ్‌లో నిద్రలేని రాత్రులు గడిపా. ‘మగజాతి’ విడుదల సమయంలో ఆండ్రాయిడ్ ఫోన్లే సక్కగ లేవు. అయితే రోజుకి ముప్పై వేల వ్యూస్ వచ్చేవి. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాల్లో చదివే విద్యార్థులు వాళ్ల కాలేజిల్లో ప్రదర్శించేలా హిట్ అయ్యిందా పాట. తర్వాత ఎందుకే.., మంగమ్మ.., ఏమాయలో.., మైకం.., పూర్బాయ్.., మాకి కిరికిరి.., దూరమే.., గల్లీ కా గణేష్.., పోయినవా.., దావత్.., హిజ్రా.. ఇలా దాదాపు పన్నెండుకు పైగా చేశా. వాడుక భాషలో పాటలు తీసినా. భవిష్యత్తులో నా సంతృప్తికోసం గజల్స్ చేస్తాను. నేను ఇప్పటి వరకూ చేసిన వీడియోల్లో ‘దావత్’కి రూ.15లక్షలయ్యింది. మాకీ కిరికిరి, గల్లీగల్లీ.. పాటలకు అత్యధిక వీక్షకులున్నారు. అలా ఆరేళ్ల కష్టం తర్వాత అందరికీ నా ప్రతిభ తెలిసింది. |
అదే నా డ్రీమ్ నేను ఏడోతరగతి ఫెయిలయినప్పుడు.. ఒకతను వచ్చి ‘మీ నాన్న అమెరికా కల కంటోంటే.. నువ్వేమో ఏడో తరగతిలో ఫెయిలయ్యావు’ అని వెటకారంగా మాట్లాడారు. ఆ రోజు బాధపడ్డా. అలాంటి వాళ్ల వల్లనే ఎదిగానేమో. ఇప్పటివరకూ అమెరికాకు పదిసార్లు వెళ్లొచ్చా. కువైట్, మస్కట్, దుబాయ్.. దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశా. నా కళనే.. అక్కడికి తీసుకెళ్లింది. నా బలం నా గొంతు. వీటన్నికంటే ముందు మా నాన్నే నా బలం! |
ప్రయత్నిస్తేనే అదృష్టమూ కలిసొస్తుందని నమ్ముతా. ఈ పరిశ్రమలో కోపం పనికిరాదు. అది ఉంటే గేటు బయటే ఉంటాం. సినిమాల్లో అవకాశాలొస్తే నటిస్తా. మా అమ్మానాన్నకి ఓ మంచి ఇల్లు కట్టించాలనేది నా కల. |
సింగర్‌గా ‘జోష్’ సినిమాతో (కాలేజీ బుల్లోడా..) 2009లో పరిశ్రమలోకొచ్చా. ‘ఈగ’లో టైటిల్ సాంగ్ పాడాను. ‘దమ్ము’లో వాస్తు బాగుందే... ఇలా మంచి అవకాశాలొచ్చాయి. ఇటీవల రంగస్థలం, చల్‌మోహనరంగ, గ్యాంగ్, పేట చిత్రాలకు పాడిన. |
అమ్మ పేరు సుధారాణి, గృహిణి. నాన్న పేరు రాజ్‌కుమార్, సెలూన్ ఉంది. తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. మా చెల్లికి పెళ్లయ్యింది. ముంబయిలో ఉన్నారు. నేను పుట్టి పెరిగింది ధూల్‌పేట్ దగ్గరలోని మంగల్హాట్ ప్రాంతం. ఘోరమైన గల్లీబాయ్ను. ఏక్ నంబర్ కా ఆవారా. ఆవారాగాడు అనొచ్చు(నవ్వులు). |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- ఎన్టీఆర్ తీరని కోరిక!
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
