close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

అయోధ్య తీర్పు కథనాలు...

1.శ్రీరామ పట్టాభిషేకం
భారత చరిత్రలో ఇదో కొత్త మలుపు. శతాబ్ద కాలం నాటి సమస్యకు ముగింపు.. దేశమంతా ఉద్విగ్నంగా ఎదురుచూసిన క్షణాలు.. సుప్రీం నిర్ణయాన్ని శాంతియుతంగా స్వాగతం పలికిన అద్భుత ఘడియలు! దేశ లౌకిక సిద్ధాంతాలకు, భిన్నత్వ భావనలకు ఇబ్బందికరంగా మారిన అయోధ్య కేసుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం తుది పరిష్కారం చూపింది. హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు పరిచింది.  ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని నిర్దేశించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. అట్టుడికిన ట్యాంక్‌బండ్‌

ఆర్టీసీ కార్మికుల ఐకాస ట్యాంక్‌బండ్‌పై తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కట్టుదిట్టమైన నిర్బంధాన్ని అమలు చేసినా కార్మికులు, విద్యార్థి సంఘాలు, విపక్ష కార్యకర్తలు కొందరు ట్యాంక్‌బండ్‌ చేరుకున్నారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు.. లాఠీఛార్జి చేయడంతో కొన్నిచోట్ల మహిళా కండక్టర్లతో సహా సామాన్యులకు కూడా గాయాలయ్యాయి.  కొందరికి రక్తాలు కారాయి. ఒకపక్క లాఠీఛార్జి, మరోవైపు బాష్ప వాయుగోళాల ప్రయోగంతో కార్మికులు ఆగ్రహంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. కార్మికులు ట్యాంక్‌బండ్‌కు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు పలువురు నాయకులను ఉదయం నుంచే ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొందరిని గృహాల్లోనే నిర్బంధించారు. ఇంత నిర్బంధించినా తమ దీక్ష విజయవంతమైందని ఆర్టీసీ కార్మిక ఐకాస, రాజకీయ అఖిలపక్షం ప్రకటించింది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


3. కర్తార్‌పుర్‌ నడవా జాతికి అంకితం

పవిత్రభూమి డేరా బాబా నానక్‌లో అడుగుపెట్టడం తన పూర్వ జన్మ సుకృతమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అన్నారు. కర్తార్‌పుర్‌ నడవాను ప్రధాని మోదీ శనివారం నాడిక్కడ జాతికి అంకితం చేశారు. అనంతరం డేరా బాబా నానక్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ శిబిరం వద్ద మాట్లాడారు.  కర్తార్‌పుర్‌ సాహిబ్‌ నడవా అంశంపై భారత్‌ భక్తివిశ్వాసాలను అర్థం చేసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ సమాధి ఉన్న పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను పంజాబ్‌(భారత్‌లోని)లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారాను అనుసంధానిస్తూ నడవాను నిర్మించిన  సంగతి తెలిసిందే.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. సిరీస్‌ పోరుకు సై

టీమ్‌ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లా, రెండో మ్యాచ్‌లో భారత్‌ నెగ్గడంతో సిరీస్‌ 1-1తో సమమై.. ఆఖరి మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పర్యటనకు ముందే అగ్రశ్రేణి ఆటగాళ్లు తమీమ్‌, షకిబ్‌ దూరం కావడంతో ఢీలా పడ్డ బంగ్లా.. టీమ్‌ఇండియా ధాటికి ఏ మాత్రం ఎదురు నిలుస్తుందని అనుకున్నా తొలి మ్యాచ్‌లో విజయంతో అందరికి షాకిచ్చింది. రెండో టీ20లో టీమ్‌ఇండియా జోరు అందుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


5. ఇది అసమగ్ర నివేదిక

డెంగీ నివారణ చర్యలకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దోమల నివారణకు యంత్రాలు కొనుగోలు చేయాలంటూ ఆదేశాలిచ్చి రెండు వారాలైనా నేటికీ సమకూర్చకపోవడాన్ని తప్పుబట్టింది. మరో రెండు వారాల్లో సీజన్‌ ముగిసిపోనుందని, ఇంకెప్పుడు కొంటారని ప్రశ్నించింది. డెంగీ నివారణకు క్షేత్రస్థాయి చర్యలు నివేదికలకే పరిమితమై ఉన్నట్లు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. 1 నుంచి 6 వరకే ఆంగ్ల మాధ్యమం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, వచ్చే విద్యాసంవత్సరం నుంచి  1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలో బోధించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం స్పల్ప మార్పు చేసింది. ఆరో తరగతి వరకూ మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. శనివారం సీనియర్‌ అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


7. ‘మహా’ సర్కారు ఏర్పాటు కోసం భాజపాకు ఆహ్వానం

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను తెలియజేయాలని కోరుతూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శనివారం సాయంత్రం భాజపా నేతలకు సమాచారం పంపారు. శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా ఎక్కువ శాసనసభా స్థానాలు(105) గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. అయితే మిత్రపక్షమైన శివసేన మద్దతు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా ముందుకు రాలేదు.  ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. వీవోఏల తొలగింపునకు ప్రభుత్వ కుట్ర

వీవోఏల వేతనాన్ని రూ.10 వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన జగన్‌, ఆ మాట నిలబెట్టుకోకుండా ఉద్యోగులను తొలగించేందుకు కుట్ర చేయడం అమానుషమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ.. వీవోఏల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. తీర్పు వేళ ఆ ఇంటికి... ‘రాముడొచ్చాడు’...!

ఆ ఊరు పేరు రాములపల్లి. ఊళ్లో ఓ ఆసామి. ఆయన పేరూ రాములే. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తుండగా వాళ్లింటికి ‘రాముడొచ్చాడు’. అదెలా అనుకుంటున్నారా. రాములు భార్య సౌజన్యకు నెలలు నిండడంతో శుక్రవారం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెకు సహజ ప్రసవమైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయోధ్య తీర్పు వెలువడుతున్న సమయంలోనే బిడ్డ పుట్టాడన్న ఆనందంతో తండ్రి రాములు కుమారుడికి ‘జై శ్రీరాం’ అని పేరు పెట్టుకున్నారు.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


10. తీరానికి దగ్గరగా బుల్‌బుల్‌ అతితీవ్ర తుపాను

బుల్‌బుల్‌ అతితీవ్ర తుపాను శనివారం అర్ధరాత్రిలోపు సాగర్‌ ద్వీపాలు (పశ్చిమబెంగాల్‌), ఖేపుపారా (బంగ్లాదేశ్‌) మధ్య తీరం దాటొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 110-135 కిలోమీటర్లు ఉండొచ్చని తెలిపింది. తీరం దాటగానే ఇది క్రమంగా బలహీనపడుతుందని వెల్లడించింది. బుల్‌బుల్‌ తుపాను తూర్పు తీరంపై విరుచుకుపడుతుందని  భావిస్తున్న  నేపథ్యంలో విశాఖపట్నం రేవులో మూడు ఐఎన్‌ నావలు సిద్ధంగా ఉంచినట్లు  రక్షణ శాఖ తెలిపింది.  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.