close

తాజా వార్తలు

ఉన్నచోటే 1...2...3

ఉద్యోగం ఉల్లాసం

అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఉద్యోగినులేమో మాకు వ్యాయామం చేసే తీరిక ఉండదంటారు. సమయం లేదని తగిన పోషకాహారమూ తీసుకోరు. మరో పక్క ఒత్తిడి... ఇవన్నీ కలిస్తే అధికబరువు, నీరసం, రక్తహీనత, నెలసరి వంటి సమస్యలెన్నో పీడిస్తాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే... జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం.

రమ్యకి పెళ్లయి రెండేళ్లు. పిల్లలు కలగకపోవడంతో పరీక్షలు చేయిస్తే థైరాయిడ్‌ అన్నారు. దీనికి పరిష్కారం అడిగితే...మందులు వాడటంతో పాటు జీవనశైలిలో మార్పులూ చేసుకోవాలని సూచించారు.
దీప్తిది ఆరేడు గంటలపాటు కూర్చుని చేసే ఉద్యోగం. ఒకప్పుడు సన్నగా ఉన్న ఆమె... ఉద్యోగంలో చేరాక ఊబకాయం బారిన పడింది. నడిస్తే ఆయాసం... తినకపోతే నీరసం. సమస్య ఏంటని డాక్టర్లని అడిగితే....ఆహారంలో చేసుకోవలసిన మార్పులతో పాటు రోజూ అరగంటైనా వ్యాయామం చేయాలన్నారు.
ధరణికి అందంగా కనిపించాలనే తాపత్రయం ఎక్కువ. పెళ్లయి పిల్లలు పుట్టాక... లావైంది. ఇంటి పనుల్ని, ఆఫీసు బాధ్యతల్ని సమన్వయం చేసుకోలేక తడబడుతుంది. దాంతో తినడం మానేసి అనారోగ్యాల బారిన పడింది. ఆసుపత్రికి వెళ్తే... మందులు, క్రీములు సరిపోవని పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయమని చెప్పారు.  

* ఆలస్యంగా పడుకోవడానికి అలవాటు పడితే...భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగరీత్యా తప్పనివారు ఇంటికి వచ్చిన రెండు గంటల్లోపే నిద్రపోయేలా చూసుకోవాలి. కనీసం ఏడు గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం.
* వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించలేం అనేవారు ప్రారంభంలో రోజుకి పది నిమిషాలే చేయండి. క్రమంగా దానికి అలవాటుపడతారు.  మీ దినచర్యని  ఒక పది నిమిషాల చొప్పున ప్రతి పదిహేనురోజులకోసారి ముందుకి జరపండి. అదెలాగంటే రోజూ ఆరింటికి నిద్ర లేస్తుంటే ఇకపై ఐదూ యాభైకే లేవండి.

ఈ పరిస్థితి పై ముగ్గురిదే కాదు...రకరకాల బాధ్యతల్ని తలకెత్తుకునే అతివలందరిదీ. ఉద్యోగినుల పరిస్థితి అయితే మరీనూ. ఇంటి పనులు చక్కబెట్టుకుని ఆఫీసుకి వెళ్లి విధులు నిర్వర్తించడం అంటే కత్తిమీద సామే. ఏడెనిమిది గంటలు ఆఫీసులో...ఆపై ప్రయాణంలో మరో రెండు గంటలు... ఉదయం లేచిన దగ్గర్నుంచి రోజు గిర్రున తిరిగిపోతుంది. పోనీ ఇంటికి తిరిగి వచ్చాక కాసేపైనా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు. ఇవన్నీ నేటి మహిళలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వీటన్నింటినుంచీ బయటపడాలంటే...
* ఆహారం
*
ఆఫీసుకి వెళ్లాలనే తొందర్లో అల్పాహారం మానేస్తుంటారు చాలామంది. దీనివల్ల అలసట, గ్యాస్‌ సంబంధిత సమస్యలు మొదలై క్రమంగా అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. అలాకాకుండా లేచిన వెంటనే ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లు  లేదంటే బార్లీ జావ తీసుకోండి. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. డీహైడ్రేషన్‌ సమస్యా అదుపులో ఉంటుంది. ఆపై రెండు ఖర్జూరాలు, నానబెట్టిన బాదం తినొచ్చు. ఇవన్నీ లేచిన అరగంట లోపు చేస్తే... తరువాత మీకు దొరికిన సమయాన్ని బట్టి టిఫిన్‌ తినొచ్చు. పాలు, గుడ్డు తెల్లసొన వంటివీ మీ అల్పాహారంలో భాగం చేసుకుంటే కావలసిన పోషకాలు అందుతాయి. రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు.
* మధ్యాహ్నం, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన భోజనం ఉండాలి. మధ్యమధ్యలో తినేందుకు పండ్లముక్కలు, నట్స్‌ వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. పని ఒత్తిడి కొన్నిసార్లు ఆకలి మందగించేలా చేస్తుంది. ఇంకొన్ని సార్లు అతిగా తినాలనే ఆలోచననూ కలిగిస్తుంది. ఇలాంటప్పుడు జంక్‌ఫుడ్‌ జోలికి పోవద్దు.  లేదంటే శరీరంలో చెడుకొలెస్ట్రాల్‌ చేరి బరువూ పెరుగుతారు. ఎప్పుడైనా వేళకాని వేళ ఆకలేస్తే ముందు ఓ గ్లాసు నీళ్లు తాగండి. అప్పటికీ ఆకలి తీరకపోతే తరువాత పండ్లు, నట్స్‌ తీసుకోండి.  
* పనిలో పడితే మంచినీళ్లు తాగడమూ మర్చిపోతారు కొందరు. మీ పరిస్థితీ అదే అయితే ఆ తీరు మార్చుకోండి. రోజంతా శరీరానికి సరిపడా నీళ్లు తాగుతూ ఉండండి. అప్పుడే జీవక్రియల పనితీరు సక్రమంగా ఉంటుంది. నీటిశాతం ఎక్కువగా ఉండే కమలాఫలం, ద్రాక్ష, పుచ్చకాయ, యాపిల్స్‌ వంటివీ తీసుకోండి. ఇవన్నీ శరీరానికి తగిన పోషకాలను అందించి జుట్టు, చర్మం తేమగా ఉండేలా చేస్తాయి.  
* ఆఫీసులో వ్యాయామం
మహిళల్లో కొవ్వుశాతం 15 నుంచి 18 శాతం మధ్యలో ఉండాలి. దీంతోపాటూ... పించ్‌ టెస్ట్‌ చేయాలి. అంటే కాలు, తొడ, నడుము, పొట్ట ఇలా కొవ్వు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చర్మాన్ని లాగి చూడటమే ఈ పరీక్ష. ఇందులో రెండు అంగుళాల కంటే ఎక్కువగా కొవ్వు చేతికి దొరకకూడదు. అంతకంటే ఎక్కువగా కొవ్వు దొంతరలు చేతికి చిక్కుతుంటే వ్యాయామం మీకు తప్పనిసరి అని అర్థం. ఇలాంటివారు మరికాస్త శ్రద్ధపెట్టాలి. అందుకోసం ఈ సులువైన కసరత్తులు మీకు ఉపయోగపడతాయి.
* మెట్లెక్కుదాం... ఇంటి నుంచి ఆఫీసుకి ప్రయాణించేసరికి అలసట మామూలే. దాంతో వెంటనే లిఫ్ట్‌దగ్గరకి చేరిపోతాం. ఒక్క నిమిషం ఓపికపట్టి  మెట్లపై నడిచివెళ్లండి. దిగేటప్పుడూ దీన్ని పాటించండి. దీనివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుందట. కెలొరీలూ కాస్త ఎక్కువగానే కరుగుతాయి. బరువును అదుపులో ఉంచుకోవడం సులువవుతుంది.
* నడక... ఆఫీసులో అదేపనిగా కూర్చోవద్దు. పక్క సీటులో ఉన్న సహోద్యోగితో మాట్లాడాలన్నా...లేచి వెళ్లండి. కంప్యూటర్‌ ముందే కూర్చుని భోజనం చేసే అలవాటు మాని క్యాంటీన్‌కి వెళ్లండి. దానివల్ల తిన్నవెంటనే వచ్చి సీటులో కూర్చోకుండా... రెండు నిమిషాలైనా అటూ ఇటూ నడవగలుగుతారు.
* కుర్చీతోనే కుస్తీ...
* గంటకోసారైనా కుర్చీలోంచి లేచి ఉన్నచోటనే కదలకుండా జాగింగ్‌ చేయండి. లేదా అక్కడే నిలబడి ఆపకుండా ఓ ఇరవైౖసార్లు మార్చ్‌ఫాస్ట్‌ చేస్తున్నట్లు కాళ్లు, చేతులు కదిపితే సరి. దీనివల్ల ఆ భాగాల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
* పనిలో విరామం దొరికినప్పుడు నిటారుగా కూర్చుని కాళ్లను దగ్గర పెట్టి రెండు చేతుల్నీ పైకి ఎత్తి వాటి వేళ్లనీ కలపండి. ఇలా ఒక నిమిషం చేసినా చాలు.
* కుర్చీని ఆధారంగా చేసుకుని చేతులు ముందుకు చాచి సిటప్స్‌ చేయొచ్చు. అలానే కూర్చుని కాళ్లతో సైక్లింగ్‌ ప్రయత్నించండి.
* కుర్చీలో నిటారుగా కూర్చుని కుడికాలుని మడిచి ఎడమకాలి తొడపై పెట్టండి. ఆపై మీ తలను నెమ్మదిగా దానికి ఆన్చడానికి ప్రయత్నించండి. ఇలానే మరోకాలితోనూ చేస్తే సరి.
* కుర్చీలో నిటారుగా కూర్చుని రెండు కాళ్లను దగ్గరగా పెట్టాలి. చేతులు కదపకుండా రెండు కాళ్లను చాచి పైకి ఎత్తాలి. అలానే ముందుకి, వెనక్కి చేస్తే మంచిది. దీనివల్ల తొడ, పొట్ట దగ్గరున్న కొవ్వు తగ్గుతుంది.
* రోజంతా కదలకుండా కూర్చోవడం, వంగిపోయి పనిచేయడం.. వల్ల టెన్షన్‌ నెక్‌ సిండ్రోమ్‌ అనే సమస్య ఎదురవుతుంది. అంటే మెడ, భుజాలపై భారం పడుతుంది. కుర్చీలో కూర్చునే విధానమూ గమనించుకోవాలి.
* సీటులో నిటారుగా కూర్చుని కుడిచేతిని వెనక్కి మడిచి అరచేతిని పైకి పెట్టాలి. ఎడమచేత్తో దాన్ని అందుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఇలానే మరో చేత్తో చేయాల్సి ఉంటుంది.


సులువుగా చేసే ఈ వ్యాయామాల్ని మీకున్న సమయాన్ని బట్టి ఒకటి నుంచి మూడు నిమిషాల వరకూ చేయొచ్చు.


బొమ్మలు: మాకిరెడ్డి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.