close

తాజా వార్తలు

మొక్కవోని ప్రయాణం 8వేల కిలోమీటర్లు

‘బాబోయ్‌! భూతాపం బాగా పెరిగిపోతోంది. పర్యావరణాన్ని కాపాడాలి. వీలైనన్ని మొక్కల్ని నాటాలి. అప్పుడే ముప్పు తగ్గుతుంది. చెట్లు ఉంటేనే మనం బాగుండేది’ ఈ మాటలు విన్న ఏ చిన్నారైనా ఇది మనకు కాదులే అనుకుంటుంది. కానీ ఓ అమ్మాయి మాత్రం అలా కాదు. ఇలాంటి మాటల్నే అందరికీ చెబుతోంది. అంతేనా? ఎంతో గొప్పగా ఆలోచించింది. ఆచరణలోనూ చూపిస్తోంది. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఏంటా సంగతులు?

ఏడో తరగతి చదివే అమ్మాయి ఇంట్లో మొక్కల్ని నాటి పెంచితేనే గొప్ప. మరి అలాంటి అమ్మాయి దేశమంతా మొక్కల్ని నాటాలనుకుంటే? ఇంకెంతో గొప్ప కదూ. తమిళనాడులోని కరూర్‌కు చెందిన రక్షణ... అచ్చంగా ఇదే కోవకు చెందుతుంది.

* పర్యావరణాన్ని రక్షించడానికి తన వంతుగా బోలెడన్ని కార్యక్రమాలు చేస్తోంది. చిన్న వయసులోనే ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

* ఈ ఏడాది రక్షణ పెద్ద సాహసమే చేసింది. అదేంటో తెలుసా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు వివిధ ప్రాంతాలు చుట్టేస్తూ ట్రక్కులో వెళ్లొచ్చింది. అదేదో విహారానికి కాదండోయ్‌. విత్తన బంతుల్ని జల్లడానికి. అవును... తగినంత మట్టి, ఇసుక, కోటి వరకు విత్తనాల్ని కలిపి ఐదున్నర లక్షల విత్తన బంతుల్ని తయారు చేసుకుంది. దీనికోసం చాలానే శ్రమించింది. అమ్మానాన్నల సాయం తీసుకుంది. వీటి తయారీకి 35 రోజుల సమయం పట్టిందట.

* అసలీ అమ్మాయికి ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే... రక్షణ నాలుగేళ్ల వయసులో నాలుగు గంటలపాటు ఏకధాటిగా కర్రసాము చేసింది. ఎంతోమంది అభినందనలు అందుకుంది. దీంతో చాలా సంతోషపడిందట. మరి ఈ ఆనందం నా ఒక్కదానికేనా అని వాళ్లమ్మని అడిగిందట. అయితే సమాజానికి నీ వంతు సాయం చేస్తే అందరూ హాయిగా ఉంటారంటూ అమ్మ సలహా ఇచ్చిందట. చిన్నప్పటి నుంచి కుటుంబసభ్యులు ఆలయాలు, రహదారుల పక్కన ప్రతి పండగకీ మొక్కలు నాటడం గమనించిన రక్షణ ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని నాటాలని నిర్ణయించుకుంది.

* అలా మొక్కలు నాటడంపై ఆసక్తి పెంచుకుంది. మొక్కల గురించి చదవడం మొదలుపెట్టింది. బోలెడంత సమాచారం సేకరించింది. పది లక్షల మొక్కల్ని నాటి రికార్డులూ సాధించింది.

* కొన్నాళ్లకి పచ్చని చెట్లు పెంచి... భూతాపం తగ్గించాలనే ఉద్దేశంతో దేశమంతా విత్తనబంతుల్ని వేయాలనే లక్ష్యం పెట్టుకుందట. ఇంట్లోవాళ్ల సాయంతో వాటిని తయారుచేసి తన ప్రయాణం చేసి వచ్చిందన్నమాట.

* కిలోమీటరుకు 50 వరకు విత్తన బంతుల్ని వేసిందట. వెళ్లి రావడానికి 32 రోజుల సమయం పట్టిందట.

* ఐదేళ్ల వయసు నుంచే సామాజిక కార్యక్రమాలు మొదలుపెట్టిన ఈ చిన్నారి... ఆడపిల్లలు చదువుకోవాలి, పక్షుల్ని కాపాడుకుందాం, సేంద్రియ సేద్యం మంచిది, బాలకార్మిక సమస్య, చిన్నారులపై అత్యాచారాల నివారణ లాంటి బోలెడన్ని విషయాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. చుట్టుపక్కల స్కూళ్లన్నీ తిరిగేస్తూ ఉపన్యాసాలు ఇస్తుంటుంది.

* ప్రస్తుతం కరూర్‌లోని వేలమ్మాళ్‌ విద్యాలయంలో చదువుకుంటోంది. ఇంకా లక్షల సంఖ్యలో మొక్కల్ని నాటడమే నా లక్ష్యం అంటోందీ చిన్నారి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.