close

తాజా వార్తలు

అండగా ఉంటే పెనుగండం కాదు

ఎల్లుండి ప్రపంచ మధుమేహ దినం
మధుమేహం - కుటుంబం

మధుమేహం అతిథి కాదు ఏదో ఒకట్రెండు రోజలుండి పోవటానికి. ఒకసారి వచ్చిదంటే ఒంట్లో పాతుకుపోయి ‘శరీర సభ్యుడి’లా మారిపోతుంది. లేనిపోని ఆగడాలు సృష్టించకుండా దీన్ని నియంత్రించుకోవటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇందుకు వ్యక్తిగత శ్రద్ధతో పాటు కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతైనా అవసరం. ఆహార, వ్యాయామ నియమాల దగ్గర్నుంచి మందుల వరకూ అన్ని విషయాల్లో అండగా నిలవటం ముఖ్యం. అందుకే ప్రపంచ మధుమేహ దినం ఈసారి ‘మీ కుటుంబాన్ని కాపాడుకోండి’ అని నినదిస్తోంది.

వయసుకా మధుమేహం! విడ్డూరంగా అనిపించినా ఇప్పుడిలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఏ ఇంట చూసినా ఒకరో ఇద్దరో మధుమేహం బారినపడ్డవారో లేదూ మధుమేహం అంచుల్లో ఉన్నవారో కనిపిస్తున్నారు. ఇది  ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు మరి. కొందరు వంశపారంపర్యంగా వస్తుందని భావిస్తుంటారు గానీ నిజం కాదు. తల్లిదండ్రులకుంటే పిల్లలకు రావాలని గానీ తల్లిదండ్రులకు లేకపోతే పిల్లలకు రాకూడదని గానీ లేదు. కాకపోతే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ. వీరిలోనూ అందరికీ రాకపోవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే- మధుమేహం ఉన్నా సగం మందికి ఆ విషయమే తెలియకపోవటం. తమకెందుకు వస్తుందని భీష్మించుకునేవారు కొందరైతే.. వచ్చాక మందులు వేసుకోకుండా తాత్సారం చేసేవారు ఇంకొందరు. సరిగ్గా ఇక్కడే కుటుంబ ప్రాధాన్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. క్రమం తప్పకుండా మందులు తీసుకోవటం, మంచి జీవనశైలిని పాటించటంలో ఇంట్లో వాళ్ల తోడ్పాటు తప్పనిసరి. మధుమేహం రాకుండా చూడటంలోనూ కుటుంబం పాత్రే ఎక్కువ. అందువల్ల మధుమేహం ఉన్నవాళ్ల కుటుంబ సభ్యులు అండగా నిలవటం.. మధుమేహం లేని కుటుంబాలు నివారణ చర్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. బాల్యం, యవ్వనం, మధ్యవయసు, వృద్ధాప్యం.. ఇలా ఆయా వయసుల్లో ఎవరినెలా కనిపెట్టుకోవాలో తెలుసుకొని ఉండటం ఉత్తమం.

బాల్యంలో బహు భద్రం!

చిన్న వయసులో (15 ఏళ్ల లోపు) దాదాపు అందరికీ వచ్చేది టైప్‌1 మధుమేహమే. దీనికి ఇన్సులిన్‌ ఇవ్వటం తప్ప మరో మార్గం లేదు. పిల్లల మధుమేహంలో ప్రత్యేకత- గ్లూకోజు మోతాదుల్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటం. ఆడపిల్లల్లోనైతే ఇది మరింత ఎక్కువ. గ్లూకోజు ఒకరోజు 50 ఉండొచ్చు, మర్నాడు 500 ఉండొచ్చు. తిన్నప్పుడు పెరగకపోవచ్చు, తిననప్పుడు పెరగొచ్చు. అందువల్ల తరచూ రక్త పరీక్షలు చేస్తూ.. గ్లూకోజు స్థాయులకు అనుగుణంగా ఇన్సులిన్‌ మోతాదులు మార్చుకోవాల్సి ఉంటుంది. రోజుకు రెండు, మూడు.. కొందరికి నాలుగు సార్లు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి రావొచ్చు. తల్లిదండ్రులకిది కాస్త కష్టమైనదే అయినా నిర్లక్ష్యం పనికిరాదు. ‘అయ్యో.. అప్పుడే మధుమేహమా?’ అంటూ జాలి చూపుతూ పిల్లలను చిన్నబుచ్చొద్దు. మిగతా పిల్లల మాదిరిగానే చూడాలి. అందరిలా చదువుకోనివ్వాలి, ఇష్టమైన ఆటలు ఆడుకోనివ్వాలి. లేకపోతే కుంగుబాటుకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగటం చాలా ముఖ్యం. అందువల్ల గ్లూకోజు స్థాయులను బట్టి ఇన్సులిన్‌ మోతాదులను మార్చుకోవాలే గానీ మధుమేహం ఉందని చెప్పి ‘అది తినకూడదు, ఇది తినకూడదు’ అని ఆంక్షలు పెట్టొద్దు. అలవాటు లేనివి బలవంతంగా పెట్టే ప్రయత్నం చేయొద్దు. మంచి ఆహారం, చెడు ఆహారం అని ఉంటాయే తప్ప మధుమేహ పిల్లలకు ప్రత్యేకమైన ఆహారమేదీ ఉండదు. మిగతా పిల్లలకైనా కొవ్వులు, తీపి ఎక్కువగా ఉండే చెడు ఆహారం ఇవ్వకూడదు కదా. పుట్టినరోజు వేడుకల్లో కేక్‌ల వంటివి తినటం మామూలే. మధుమేహం ఉన్నంత మాత్రాన ఇలాంటి చిన్న చిన్న ఆనందాలకు, సంతోషాలకు పిల్లలను దూరం చేయటం తగదు. గంట, రెండు గంటల సేపు గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల తలెత్తే హాని కన్నా మిగతా పిల్లలతో కలవనీకుండా విడిగా ఉంచటం వల్ల రేగే మానసిక ఒత్తిడితో కలిగే నష్టమే ఎక్కువని తెలుసుకోవాలి. రక్తంలో గ్లూకోజు స్థాయులు చాలాసేపు మరీ ఎక్కువగా ఉంటే తక్కువ కాలం పనిచేసే ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే సరిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా తమకు మధుమేహం ఉందనే ఆలోచన పిల్లలకు రానీయకుండా చూసుకోవాలి.
* బడిలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల తోడ్పాటూ ముఖ్యమే. మధ్యాహ్నం పూట ఇన్సులిన్‌ తీసుకోవాల్సినవారికి సాయం చేయాలి. ముఖ్యంగా అందరి ముందు ఇన్సులిన్‌ తీసుకోవటానికి వెనకాడే ఆడపిల్లలకు అండగా నిలవటం అవసరం. నీరసం, నిస్సత్తువ వంటి హైపో లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే అప్రమత్తం కావాలి.
* ఆడపిల్లలకు మధుమేహం ఉంటే కొందరు తల్లిదండ్రులు.. ముఖ్యంగా పట్టణాల్లోని మధ్యతరగతి వాళ్లు ఆ విషయాన్ని దాచిపెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మధుమేహం గల ఆడ పిల్లలకు అన్నివిధాలా అండగా నిలవటం కుటుంబం బాధ్యత. భర్తకు, అత్తమామలకు విషయాన్ని చెప్పకుండా పెళ్లి చేస్తే చాటుమాటుగా, అరకొరగా ఇన్సులిన్‌ తీసుకోవాల్సి వస్తుంది. గర్భం ధరించినప్పుడూ ఇన్సులిన్‌ సరిగా తీసుకోకపోవచ్చు. దీంతో కడుపులోని బిడ్డకూ హాని వాటిల్లుతుంది. కిడ్నీ వైఫల్యంతో పెద్ద ప్రాణానికీ ముప్పు రావొచ్చు.

యవ్వనంలో ముప్పులకు కళ్లెం!

వ్వనం, ఆ తర్వాత దశలు చాలా కీలకం. 15-25 ఏళ్ల వయసులో శారీరక, మానసిక ఎదుగుదల ఒక రూపానికి వస్తుంటాయి. వీరిలో ప్రధానంగా కనిపించేది టైప్‌2 మధుమేహం. సుమారు 15-20% మంది దీంతో బాధపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇది 50% వరకూ చేరుకోవచ్చని అంచనా. దీనికి ప్రధాన కారణం ఊబకాయం. యుక్తవయసులో ఊబకాయం ఒకప్పుడు మనదగ్గర అంతగా ఉండేది కాదు. ఇప్పుడిది మనదగ్గరా ఎక్కువవుతోంది. ఆహార అలవాట్లు మారటం, శారీరక శ్రమ తగ్గటం వంటివన్నీ దీనికి బీజం వేస్తున్నాయి. కేక్‌లు, పిజ్జాలు, బర్గర్లు, మిఠాయిలు, చిప్స్‌, ఐస్‌క్రీములు, లావు బిస్కట్ల వంటి త్వరగా జీర్ణమయ్యే, ఎక్కువశక్తినిచ్చే పిండి పదార్థాలతో పాటు కొవ్వు పదార్థాలు తినటం పెరిగిపోయింది. ఇలాంటివి వంద గ్రాములు తిన్నా మనం రోజూ తీసుకునే ఆహారంతో లభించే కేలరీల్లో సగం వరకు తీసుకున్నట్టే. ఖర్చు కాకుండా మిగిలిపోయే కేలరీలన్నీ కొవ్వుగా మారిపోయి బరువు పెరగటానికి, చివరికి మధుమేహానికి దారితీస్తోంది. ఈ వయసుల్లో మధుమేహం బారినపడ్డవారికి అధిక రక్తపోటు, మూత్రపిండాల జబ్బులు,  రక్తనాళాల సమస్యలు, గుండెజబ్బులు ముందుగానే ముంచుకొచ్చే ప్రమాదముంది. మంచి విషయం ఏంటంటే- ఈ వయసులో మధుమేహాన్ని నూటికి నూరు శాతం నివారించుకునే వీలుండటం. ఇందులో కుటుంబం పాత్రే కీలకం. బరువు పెరగకుండా చూసుకోవటం ముఖ్యం. ఒకవేళ బరువు పెరిగితే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ వయసులో బరువు తగ్గటానికి మందులు ఇవ్వటం మంచిది కాదు. ఆహారంలో మార్పులు చేసుకోవటమే మార్గం. కొవ్వు పదార్థాలు, త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తినకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేలా చూసుకోవాలి. ఒకవేళ మధుమేహం వచ్చినట్టయితే మెట్‌ఫార్మిన్‌ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో గ్లూకోజు స్థాయులు అదుపులో ఉండొచ్చు గానీ అధిక రక్తపోటు, మూత్రపిండాల జబ్బులను నివారించుకోవటం సాధ్యం కాదు. కొందరికి ఇన్సులిన్‌ అవసరపడొచ్చు.

పెద్దయ్యాక అతి విశ్వాసం వద్దు!

ధుమేహం బారినపడ్డవారిలో 75 శాతానికి పైగా 25-65 ఏళ్లవారే. ఊబకాయం, శారీరక శ్రమ తగ్గటం, మానసిక ఒత్తిడికి తోడు వాతావరణ కాలుష్యం, నిద్రలేమి, పడుకునే వేళలు మారిపోవటం వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. మధుమేహం ఉన్నట్టు బయటపడ్డా దాన్ని అంగీకరించకపోవటం పెద్ద సమస్య. ‘నాకేంటి? మధుమేహమేంటి?’ అని చాలామంది కొట్టిపారేస్తుంటారు. అప్పుడే మందులు మొదలు పెట్టాలా? కొంతకాలం ఆగుతాను అని మొండికేస్తుంటారు. ‘ఏదో కాస్త గ్లూకోజు పెరిగితే పెరగొచ్చు గానీ రెండు మూడు నెలల్లో అదే తగ్గిపోతుందిలే’ అని అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. ఇది తప్పు. ఎవరికైనా మధుమేహం ఉన్నట్టు బయటపడితే మొట్టమొదటి రోజు నుంచే మందులు వేసుకునేలా వారిని ఒప్పించటం, క్రమం తప్పకుండా తీసుకునేలా చూడటం కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల బాధ్యత. మందులు వేసుకోవటమే కాదు, జీవనశైలి మార్పులూ ముఖ్యమే. కొవ్వు పదార్థాలు, త్వరగా జీర్ణమయ్యే, ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు మాన్పించాలి. క్రమం తప్పకుండా నడవటం వంటి వ్యాయామాలు చేసేలా, సామాజిక, మానసిక ఒత్తిళ్లను తగ్గించుకునేలా చూడాలి. గ్లూకోజు నియంత్రణలో లేకపోతే మధుమేహం మొదలైన ఐదేళ్లలోనే తిరిగి కోలుకోవటానికి వీల్లేని విధంగా అవయవాలు దెబ్బతినటం మొదలవుతుంది. అప్పటికీ జాగ్రత్త పడకపోతే పదేళ్లలోపే పరిస్థితి మరింత ప్రమాదకరంగా పరిణమించొచ్చు.
* ఉద్యోగాలకు, పనులకు వెళ్లే తొందరలో మందులు వేసుకోవటాన్ని మరచిపోకుండా చూసుకోవాలి. వేళకు భోజనం చేయటానికి అనువుగా ఆహారాన్ని వెంట తీసుకెళ్లేలా చూడాలి.
* బయట దొరికే పదార్థాల్లో ఉప్పు, నూనె, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ, గుండె జబ్బుల వచ్చే అవకాశం గలవారు (ఈసీజీ పరీక్షలో తేడాలు, మూత్రంలో సుద్ద పోవటం వంటివి ఉన్నవాళ్లు) ఇలాంటివి తినటం మంచిది కాదు. వీలైనంత వరకు ఇంట్లో వండినవే తినేలా చూడాలి.
* ఒక్క వ్యాయామాలతోనే బరువు తగ్గుతుందని అనుకోవటం పొరపాటు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల నిష్పత్తులు పాటిస్తూ ఆహార పరిమాణాన్ని తగ్గించుకోవాలి.

గర్భిణులపై ఒత్తిడి తేవద్దు

ప్రస్తుతం గర్భిణుల్లో 16% మందిలో గర్భిణి మధుమేహం (జెస్టేషన్‌ డయాబిటిస్‌) కనిపిస్తోంది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు దీని బారినపడుతున్నారన్నమాట. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశముంది. గర్భిణుల్లో మధుమేహం అనగానే కుటుంబసభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అన్నం మానెయ్యమని, జొన్నలు, రాగుల వంటివి తినమని చెబుతుంటారు. ఇష్టం లేకపోయినా పెద్దలు చెప్పారనో, మొహమాటం కొద్దో కొత్త కొత్త ఆహారాలు తీసుకోవటం మొదలెడుతుంటారు. నిజానికి గర్భిణి మధుమేహంలో కొత్తగా ఎలాంటి ఆహార మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా రోజూ తినే ఆహారమే ఇవ్వాలి. అలవాటులేని, జీర్ణం కాని పదార్థాలు పెట్టటం తగదు. గర్భిణులను ‘అది తినొద్దు, ఇది తినొద్దు, ఎక్కువగా తింటున్నావు’ అని వేధిస్తుంటే మానసిక ఒత్తిడికి దారితీయొచ్చు. దీంతో రక్తపోటు పెరిగిపోవచ్చు. పిండం కదలికల వేగం పెరిగి, కాన్పు సమయంలో బిడ్డకు పేగు మెడకు చుట్టుకోవచ్చు. భోజనం చేశాక నడవాలనీ కొందరు ఒత్తిడి చేస్తుంటారు. ఏదో రెండు మూడు అడుగులు వేస్తే ఇబ్బందేమీ లేదు గానీ ఆయాసం వచ్చేలా ఎక్కువగా నడవటం, కఠినమైన వ్యాయామాల వంటివి తగవు. అలా చేస్తే పిండానికి తగినంత ఆక్సిజన్‌ అందక ఎదుగుదల దెబ్బతినొచ్చు. గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవటమే మార్గం. అంతే తప్ప ఆహార, వ్యాయామ నియమాల పేరుతో ఒత్తిడి తీసుకురావొద్దు.

వృద్ధాప్యంలో నిర్వేదం తగదు!

ధుమేహం గల వృద్ధుల్లో (65 ఏళ్ల తర్వాత) ఒక రకమైన నిర్వేదం కనిపిస్తుంది. ‘మందులు వేసుకుంటే ఎంత? వేసుకోకపోతే ఎంత? ఎలాగూ పోవాల్సిన వాళ్లమే కదా’ అని వాపోతుంటారు. ఇలా నిరాశలోకి జారిపోకుండా చూసుకోవాలి. మందులు వేసుకోవటం, సాధ్యమైనంతవరకు ఆహార, వ్యాయామ నియమాలు పాటించటం ముఖ్యమని గుర్తించేలా చేయాలి. ఈ వయసులో అలవాటులేని ఆహారాలు కొత్తగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో జీర్ణశక్తి తగ్గుతుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యేవి ఇవ్వటమే మేలు. భోజనం చేశాక గంట, గంటన్నరలో ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న పేగుల్లోకి వెళ్లిపోవాలి. ఒకవేళ ఎక్కువసేపు జీర్ణాశయంలోనే ఉండిపోతే పొట్ట ఉబ్బరం, ఛాతీలో మంట, బి విటమిన్ల లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే అందుబాటులో లేని పదార్థాలను ప్రత్యేకించి తెచ్చుకోవాల్సిన పనిలేదు. ఏదైనా తినటానికి అనువుగా, హితవుగా ఉండాలని గుర్తుంచుకోవాలి.  
* ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో పిల్లలు ఇంటికి దూరంగా ఉండటం వల్ల ఎంతోమంది వృద్ధులు ఒంటరిగా ఉండాల్సి వస్తోంది. ఇలాంటివారిని ఎవరో ఒకరు కనిపెట్టుకునే ఏర్పాట్లు చేయాలి.

బొమ్మ: శ్రీనివాస్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.