close

తాజా వార్తలు

మీరైతే ఏంచేస్తారు

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా... ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం.  మహిళలు ఈ విషయంలో ఒకింత నిర్లక్ష్యం చూపుతారనే అపవాదు ఉంది. తాము ఆ కేటగిరీ కాదంటూ... కసరత్తులకు కేటాయించే సమయం.... అది తమ ఆరోగ్యంపై చూపిన సానుకూల ప్రభావం గురించి మాకు వాట్సాప్‌ చేసిన కొందరు మహిళల గురించి తెలుసుకుందామా...

* ఆరోగ్య సంరక్షణకు మహిళలు వ్యాయామం చేయాలి. వారు బాగుంటేనే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. నేను వారంలో రెండు రోజులు... గంట చొప్పున ఏరోబిక్స్‌ చేస్తా. మిగతా రోజుల్లో నడక, ఈత వంటివి ఉంటాయి. వీటన్నింటితో రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు బరువునూ అదుపులో ఉంచుకుంటున్నా.
- పద్మజ, మలేసియా

* నాకు ఇద్దరు పిల్లలు. రెండూ సిజేరియన్‌ కాన్పులే కావడంతో బరువు పెరిగా. దీన్ని అదుపులో పెట్టుకోవడానికి అరగంట నడక, నలభై నిమిషాలు వ్యాయామం చేయడం మొదలుపెట్టా. తగినంత నీరు, సమతులాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నా.
- మల్లిక, సింగపూర్‌

* నేను ఫిట్‌నెస్‌ కోసం రోజూ ఉదయం అరగంట యోగా చేస్తా. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా విటమిన్‌ ఎ, సి ఉండే పండ్లు, డ్రైఫ్రూట్స్‌, ఫ్రూట్‌ సలాడ్లు తీసుకుంటా. వారాంతంలో ఒకరోజు మాత్రమే నాకు ఇష్టమైన పదార్థాలు తింటా. యోగాతో ఆరోగ్య సమస్యలకు దూరంగా, ప్రశాంతంగా ఉంటున్నా.
- యమున బొలిశెట్టి, నర్సాపూర్‌, పశ్చిమగోదావరి

* నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నా. ఏడాది నుంచీ వ్యాయామం మొదలుపెట్టా. వారంలో కనీసం నాలుగు రోజులు యోగా లేదా రకరకాల వ్యాయామాలు చేస్తా. కుదరకపోతే కాసేపు వాకింగ్‌ చేస్తా. ఇలా క్రమంతప్పకుండా చేయడంతో నిద్ర, నెలసరి సమస్యల నుంచి బయటపడ్డా.
- పావని, హైదరాబాద్‌

* నాకు పీసీఓడీ, థైరాయిడ్‌ సమస్యలున్నాయి. దీంతో నాకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని వైద్యులు చెప్పారు. మొదటి నుంచీ యోగా చేసేదాన్ని. తరువాత యోగాతో పాటు ఆహారంలో మార్పులు చేసుకున్నా. ఫలితంగా కొన్నాళ్లకు ఎలాంటి మందులు వాడకుండానే గర్భందాల్చి, బిడ్డకు జన్మనిచ్చా. మహిళగా ఇది నేను సాధించిన విజయమని అనుకుంటా. ఇప్పటికీ ఆ జాగ్రత్తలు పాటిస్తున్నా. మా పాపకూ అలాంటి ఆహారమే అందిస్తున్నా.
- మీనా, అనంతపురం

* నాకు థైరాయిడ్‌ సమస్య ఉంది. దీంతో పాటు కుటుంబ బాధ్యతలతో ఒత్తిడికి గురయ్యా. దీన్ని తగ్గించుకోవడానికి రోజూ ఉదయం గంటపాటు సూర్య నమస్కారాలు, అరగంట ధ్యానం చేయడం మొదలుపెట్టా. పిల్లలను స్కూల్‌కు పంపిన తరువాత కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటా. క్రమంగా నా ఆరోగ్యం మెరుగుపడింది.
- రమాదేవి, సికింద్రాబాద్‌

* నేను పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నా. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కొన్నాళ్లక్రితం యోగా నేర్చుకున్నా. అప్పటి నుంచీ మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నా. ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు నాలో ఆత్మవిశ్వాసమూ పెరిగింది.
- కావ్యశ్రీ, విద్యానగర్‌, హైదరాబాద్‌

* వ్యాయామం మొదలుపెట్టి మధ్యలో మానేసిన తరువాత దాని ప్రాముఖ్యం అర్థమైంది. వర్కవుట్లు చేసినప్పుడు బరువు తగ్గా. మానేసిన తరువాత మళ్లీ బరువు పెరిగా. ఫిట్‌నెస్‌పై మళ్లీ ప్రత్యేక దృష్టిపెట్టా. ఇప్పుడు రోజంతా చురుగ్గా ఉంటున్నా.
- సాయిదుర్గ, విజయవాడ

* వ్యాయామానికి సమయం లేకపోవడం, పని ఒత్తిడి, ఇంటి పనులతో అలసిపోవడం వంటి కారణాలతో నాకు కసరత్తు చేసే వీలుండదు. దాంతో నా దినచర్యలోనే చిన్నచిన్న మార్పులు చేసుకున్నా. ఏ మాత్రం ఖాళీ దొరికినా... నడిచేందుకు ప్రయత్నిస్తున్నా. పిల్లలను స్కూల్‌లో దింపాలన్నా, నిత్యావసరాలు కొనడానికి... నడిచే వెళ్తున్నా. ఈ చిన్న మార్పుతో ఒత్తిడి, అలసట వంటివి అదుపులోకి వచ్చాయి.
- నక్షత్రం అనిత, కరీంనగర్‌

* నేను కొన్నాళ్లక్రితం కుంగుబాటుకు గురయ్యా. దాన్నుంచి బయటపడేందుకు రెండేళ్లు మందులు వాడటంతో విపరీతంగా బరువు పెరిగా. దాన్ని తగ్గించుకోవడానికి రోజూ గంటన్నర సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచీ చురుగ్గా మారా.
- శ్రీదేవి, హైదరాబాద్‌

* నాకు నాలుగేళ్లక్రితం మైగ్రేన్‌ వచ్చింది. యోగాతో దీనికి ఉపశమనం ఉంటుందని వైద్యులు సలహా ఇచ్చారు. అప్పటి నుంచీ అది  దినచర్యలో భాగం చేసుకున్నా. పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తరువాత రోజూ గంటసేపు యోగా, ఇతర వ్యాయామాలు చేస్తా. సమస్య చాలామటుకూ అదుపులోకి వచ్చింది.
- ఎస్‌.కృప, హైదరాబాద్‌

* పిల్లలకు మనం ఇచ్చే మొదటి ఆస్తి ఆరోగ్యమేనని నమ్ముతా. ఆరోగ్యంతో పాటు శరీరం, మనసు మన మాట వినాలంటే యోగా, వ్యాయామం చేయాల్సిందే. ఇవి నా జీవితంలో ఒక భాగం. వీటిద్వారానే శరీరానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నానని నేను భావిస్తున్నా.
- ప్రియారెడ్డి, బేగంపేట్‌

* ప్రతిఒక్కరికీ వ్యాయామం అవసరం. నేను పదేళ్లుగా యోగా, ధ్యానం చేస్తున్నా. దీనివల్ల సానుకూల దృక్పథం పెరిగింది. మా పిల్లలూ ఇప్పుడు యోగా చేస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంటున్నారు.
- పి.వి.నళిని, విశాఖపట్టణం

* నాకు నలభైఏళ్లు. మా వారు, మా అమ్మాయి నేను... రోజూ యోగా, ప్రాణయామం చేస్తాం. శరీరక, మానసిక ప్రశాంతతకు ఇవెంతో మేలుచేస్తాయి. యోగా, నడకలో ఏదో ఒకటి తప్పకుండా చేస్తే నడివయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు మహిళలు దూరంగా ఉండొచ్చు.
- అపర్ణాదేవి, హైదరాబాద్‌

* నాకిప్పుడు ఏడోనెల. ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యాయామం చేయమని వైద్యులు, స్నేహితులు సూచించారు. మొదట్లో చిన్న చిన్న పనులకే అలసిపోయేదాన్ని. వ్యాయామం మొదలుపెట్టిన తరువాత చురుగ్గా మారా. దీంతో నాకు సుఖ ప్రసవం అవుతుందనే నమ్మకం వచ్చింది.
- కె.శిరీష, గచ్చిబౌలి, హైదరాబాద్‌

* నాకు ఎంత పని ఉన్నా... రోజూ గంటపాటు వాకింగ్‌ చేస్తా. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా. వీటితో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నా.
- సీహెచ్‌.సోనీ, వనస్థలిపురం

* ఇంటిపనుల్లోనే అన్ని రకాల వర్కవుట్లు ఉన్నాయని నేను నమ్ముతా. అందుకే మా ఇంట్లో అన్ని పనులూ నేనే చేసుకుంటా. దీంతోపాటు రోజూ ఉదయం గంటసేపు వాకింగ్‌కి వెళ్తూ ఆరోగ్యంగా ఉంటున్నా.
- రఘుతేజ, హైదరాబాద్‌

* నేటి కాలంలో వ్యాయామం తప్పనిసరి. అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి ఉదయం నడక మొదలుపెట్టా. ధ్యానం, డాబా మెట్లు ఎక్కి దిగడం, తోటపని వంటివి చేస్తున్నా. దీంతో ఆరోగ్యం మెరుగుపడింది. మానసికగా ఉల్లాసంగానూ ఉండగలుగుతున్నా.
- సరళ జగన్నాథ్‌, విజయనగరం

* నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నా. రోజూ ఉదయం పిల్లల్ని స్కూల్‌కు పంపించిన తరువాత మా కమ్యూనిటీలో అరగంట సేపు వాకింగ్‌ చేస్తా. దీంతో రోజంగా హుషారుగా ఉండగలుగుతున్నా. ఒత్తిడికి దూరంగా ఉండటానికి సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకుని అరగంట యోగా చేస్తా.
- కల్యాణి, కూకట్‌పల్లి

* నేను రెండేళ్లనుంచి యోగా చేస్తున్నా. దీంతో ఎప్పటినుంచో వేదిస్తున్న మోకాళ్ల నొప్పులు, సైనస్‌ తగ్గుముఖం పట్టాయి. బరువు తగ్గడంతో పాటు ఈ వయసులోనూ రోజువారీ పనులను సులువుగా చేసుకోగలుగుతున్నా.
- శ్రీదేవి.

* నాకు యాభైఏళ్లు. ఆరోగ్యం కోసం రోజూ అరగంట నడకకు కేటాయిస్తా. క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటా.
- ఉదయగిరి లక్ష్మీదేవి, కడప

* నేను రోజూ యోగాతో పాటు కొన్ని నియమాలు పాటిస్తా. లిఫ్ట్‌కు బదులు నడిచి మెట్లు ఎక్కడం, పొద్దున్నే ప్రాణయామం, కనీసం రెండు యోగాసనాలు, నేలపై కూర్చొని భోజనం చేయడం, ధ్యానం వంటివి చేస్తా. వీటితోపాటు సమతులాహారం, సానుకూల దృప్పథంతో ఆలోచించడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటున్నా.
- శాంతాభాస్కర్‌, చిత్తూరు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.