close

తాజా వార్తలు

రాక్‌బీట్‌... రూటే సపరేటు!

చక్కటి స్వరంతో పాడాలనుకుంటున్నారా...
మంచి బీట్‌కి దుమ్ము రేపే డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నారా...
వంటల్లో ఆరితేరాలనుకుంటున్నారా...
మీ అభిరుచి ఏదైనా అక్కడ ఆచరణలో పెట్టొచ్చు.  కొంత ఆదాయాన్నీ అందుకోవచ్చు. అందరితోనూ శెభాష్‌ అనిపించుకోవచ్చు.
ఇదంతా ఎలా సాధ్యం అంటారా...
రెండు పదులు నిండని శ్రియా గుప్తా చేసిన అద్భుతం అది...  అదే నేషన్స్‌ రాక్‌బీట్‌.
అసలు ఆమె ఏం చేస్తుందంటే...

మాది పశ్చిమబంగ అయినా... పద్నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నేను ఇంజినీరింగ్‌లో చేరాక అంటే.. 2015లో నేషన్స్‌ రాక్‌బీట్‌ని ప్రారంభించా. హైదరాబాద్‌లోని వీఎన్నార్‌వీజేఐటీలో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశా. ప్రస్తుతం డెలాయిట్‌లో పనిచేస్తున్నా.

ప్రతి ఒక్కరికీ అంతర్గతంగా కొన్ని ఆసక్తులు ఉంటాయి. వాటిని ఏదో ఒక రూపంలో ప్రదర్శించాలని మనసు ఉవ్విళ్లూరినా... వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒత్తిళ్లు, సాంకేతికత, ఇతర లక్ష్యాలతో సాధ్యం కాకపోవచ్చు. సమయం లేకపోవచ్చు. ఒకప్పుడు నా పరిస్థితీ అదే. నాకు కవితలు రాయడమంటే ఇష్టం. సాహిత్యం చదవాలన్నది నా కల అయినప్పటికీ ఇంజినీరింగ్‌ ఎంచుకోవాల్సి వచ్చింది. మా అమ్మానాన్నలు నన్ను ఇంజినీర్‌గా చూడాలనుకోవడమే దానికి కారణం. మొదట్లో మొండికేశా. వాళ్లూ పట్టు వదల్లేదు. అప్పుడే అనిపించింది... ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా సరే దేన్నయినా సాధించొచ్చని. ఒకదానికోసం మరొకటి వదులుకోవడం ఎందుకనిపించి రెండూ పూర్తి చేయాలనుకున్నా. అదేమీ అనుకున్నంత సులువు కాదని క్రమంగా అర్థమైంది. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే నా స్నేహితుల్లో చాలామంది పరిస్థితీ అదేనని తెలిసింది. చివరకు నాలాంటివారందరినీ దృష్టిలో పెట్టుకుని నేషన్స్‌ రాక్‌బీట్‌ని ఐదేళ్లక్రితం ప్రారంభించా.

ఏం చేస్తామంటే...
ప్రీతికి సంగీతం అంటే ఇష్టం. నిత్యకి ఫ్యాషన్‌ అంటే పిచ్చి. రాహుల్‌కి చక్కగా వంట చేయడం అన్నా, నచ్చిన పదార్థాలు లాగించేయడమన్నా సరదా. ఇవన్నీ కేవలం ఇష్టాలుగా మిగిలిపోకూడదనేదే మా ప్రయత్నం. అందుకే వాళ్ల ఇష్టాలకు మేం నైపుణ్యాలు అందించి... ఆ ప్రతిభను నలుగురికీ పరిచయం చేస్తున్నాం. అంశాలవారీగా ఇంక్‌లేన్‌, ఇతిహాస్‌, టేస్ట్‌బడ్‌ వంటి అనేక పేర్లతో బృందాలు ఏర్పాటుచేశాం. రచన, చరిత్ర, ఆహారం, ఫ్యాషన్‌, సినిమా, నృత్యం, క్రీడలు... ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో ఆసక్తులు ఉన్న సుమారు రెండు వందల మందికి పైగా ఒక్కటయ్యాం. ప్రస్తుతం మూడువేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, పుణె వంటి చోట్లా మా శాఖలున్నాయి. మేం దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలూ ఇచ్చాం. ఎక్కడ సమావేశం అవ్వాలనుకుంటున్నామో ముందుగానే వాట్సాప్‌ ద్వారా సమాచారం పంచుకుంటాం.  ఏ బృందం దాన్ని సద్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకుంటాం. అవసరమైతే సాధన చేసేందుకు వర్క్‌షాప్‌లూ ఉంటాయి.

వర్క్‌షాప్‌లు ఉంటాయి...
నా ప్రయత్నం భిన్నమైనదైనా... నాలాంటి ఆలోచనలు ఉన్నవారిని ఏకతాటిపై నడిపించడం కష్టమైంది. వీరంతా తమ అభిరుచులు చెప్పేవారు కానీ తరువాతి అడుగు వేయడానికి మాత్రం సాహసించేవారు కాదు. వాళ్లల్లో ధైర్యం రావడానికి అందరం తరచూ సమావేశం అయ్యేవాళ్లం. అవసరమైన నైపుణ్యాలకోసం వర్క్‌షాపులూ ఏర్పాటు చేశాం. ఫేస్‌బుక్‌ పేజీ ఏర్పాటు చేయడంతో మేం ఆశించిన స్పందన వేగంగా వచ్చింది. నేషన్స్‌ రాక్‌బీట్‌ హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఆరుగురు సభ్యులతో మొదలైంది. గాయకులు, డ్యాన్సర్స్‌, బీట్‌ బాక్సర్స్‌, కమెడియన్స్‌... ఇలా ఒకరేమిటి దాదాపు పదిహేడు విభాగాలకు చెందిన కళాకారులకు మా సంస్థలో స్థానం కల్పించాం.

బొమ్మలుగీస్తాం... కామెడీ చేస్తాం...
మా బృందం హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో సుల్తాన్‌ఉలూమ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కోసం సామాజిక చైతన్యం తెచ్చేలా వీధినాటకాలు వేసింది. డిజిటల్‌ మ్యాగజైన్‌తో మా రచనల సత్తా నిరూపించుకున్నాం. రాక్‌బ్యాండ్‌తో పాటలూ పాడాం. యంగిస్తాన్‌ నుక్కడ్‌, స్ట్రీట్‌కాజ్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఫ్లాష్‌మాబ్‌లతో దుమ్ము రేపాం. పబ్లిక్‌ స్పీకింగ్‌, ఇంగ్లిష్‌ టాకింగ్‌... ఒకటేమిటి లమాకాన్‌ వంటి చోట్లా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కాఫీ క్లబ్‌లు, ప్రైవేటు కార్యక్రమాల్లో లైవ్‌ మ్యూజిక్‌ ప్రదర్శనలూ ఇచ్చాం. ట్యాంక్‌బండ్‌ నుంచి చార్మినార్‌ వరకూ ఫొటోవాక్‌, కార్టూన్‌ల ప్రదర్శన చేశాం. మా బృందంలో ఆల్గారిథమ్‌ పేరుతో ఆల్‌గర్ల్‌ బ్యాండ్‌ ఉంది. వోకలిస్ట్‌ నుంచి డ్రమ్మర్‌ వరకూ అంతా అమ్మాయిలే. ఇలా ప్రదర్శించడం వల్ల మా గురించి అందరికీ తెలుస్తుందని, ఎప్పుడో ఒకప్పుడు అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం.


సేవకీ ప్రాధాన్యం...

సైనిక్‌పురిలోని గ్రేస్‌ సోషల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో పాటు మరికొన్ని సేవాసంస్థల్లోని చిన్నారులకు ఆసక్తి ఉన్న కళలపై శిక్షణ ఇస్తున్నాం. సామాజిక చైతన్యం తేవడం కోసం... వివిధ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగానూ పాల్గొని పలు అంశాలపై వీధినాటకాలు, స్టాండప్‌ కామెడీ....పాటలతో అవగాహన తెస్తున్నాం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుని చెత్త వేసే ప్రదేశాల్లో అందమైన వాల్‌ ఆర్ట్స్‌ వేశాం. మా బృందంలో క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఎందరో. వారితో కలిసి స్థానికంగా ఉన్న గ్రౌండ్స్‌లో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ మ్యాచ్‌లనూ ఏర్పాటు చేశాం. ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ని తయారు చేసి నగరంలోని పలు ఫ్లీ మార్కెట్‌లలో అమ్ముతున్నాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.