close

తాజా వార్తలు

భారీ మూల్యం

రైల్వేకి రూ.12 కోట్ల నష్టం
ఇది ప్రాథమిక అంచనాయే

నగర ఎంఎంటీఎస్‌ చరిత్రలో తొలి ప్రమాదమే రైల్వేకి భారీ నష్టం మిగిల్చింది. దెబ్బతిన్న బోగీల వల్లే రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది.

ఈనాడు, హైదరాబాద్‌; కాచిగూడ, న్యూస్‌టుడే: కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద సోమవారం ఉదయం లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌, కర్నూల్‌ - సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ(హంద్రీ) ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటనలో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 గంటల పాటు సివిల్‌, సిగ్నలింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు ప్రమాద అనంతర పనుల్లో నిమగ్నమయ్యారు. రైళ్ల మళ్లింపు, రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ, విద్యుదీకరణ, సిగ్నల్‌ వ్యవస్థ తీర్చిదిద్దడం ఇలా  అనేక పనులు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఎంతవరకు నష్టం వాటిల్లి ఉంటుందో ఎప్పుడే అంచనా వేయడం కష్టం. దెబ్బతిన్న రైళ్ల బోగీలకు మాత్రం రూ.12 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కంటే ఎంఎంటీఎస్‌ రైలు బోగీలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ రైలులోని డ్రైవర్‌ క్యాబిన్‌, రైలును ముందుకు నడిపే వ్యవస్థ(ఇంజిన్‌)తో పాటు.. మొత్తం 7 బోగీలు దెబ్బతిన్నాయి. కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌వి పాత బోగీలు కావడంతో నష్టం ఆ మేర ఉండదంటున్నారు.

దెబ్బతిన్నవి 11 బోగీలు.. ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా వచ్చి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ వేగానికి ఎంఎంటీఎస్‌ రైలు ముందు డ్రైవర్‌ క్యాబిన్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఎంఎంటీఎస్‌లోని 7 బోగీలు దెబ్బతినగా అందులోని రెండు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 4 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శ్రీపెరంబదూర్‌ ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌)లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఎల్‌హెచ్‌బీ(లింక్‌ హాఫ్‌మెన్‌ బుష్‌) బోగీలను ఎంఎంటీఎస్‌ రైళ్లలో వినియోగిస్తున్నారు. దీని ఒక్కో బోగీ రూ.3.50 కోట్ల వరకు ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ రైళ్లలో మొత్తం 12 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగీలో 375 మంది చొప్పున ఎంఎంటీఎస్‌ రైలులో 4500 వరకు ప్రయాణం చేయొచ్చు. ఐసీఎఫ్‌లో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన పాత రకం బోగీలను ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వినియోగిస్తున్నారు. ఒక్కో బోగీ ధర రూ.70 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ రైలు ప్రమాదంలో ఇంజిన్‌, బోగీలు దెబ్బతినడం ద్వారా రూ.12 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

రెండో రోజూ తిరగని ఎంఎంటీఎస్‌లు
ఈనాడు, హైదరాబాద్‌, కాచిగూడ, న్యూస్‌టుడే: రైలు ప్రమాదం తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్‌ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సాధారణ స్థితికి వచ్చినా.. ఆ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను పునరుద్ధరించలేదు. నేటి నుంచి ఎంఎంటీఎస్‌లు నడుస్తాయని రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. సోమవారం హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్లో రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం మధ్యాహ్నానికి కాని సాధారణ పరిస్థితి నెలకొనలేదు. రైలు ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కాచిగూడ నుంచి నడవాల్సిన రైళ్లను సికింద్రాబాద్‌ నుంచి నడుపుతున్నారు. మధ్యాహ్నం తర్వాత కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిచినా, బుధవారం నుంచి పూర్తి స్థాయిలో నడుస్తాయని అధికారులు తెలిపారు.

గంటల ఆలస్యంగా.. ప్రమాద ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం తెల్లవారుజామున 3.50 గంటలకు కాచిగూడకు రావాల్సిన సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 11.35 గంటలకు వచ్చింది. తెల్ల్లవారుజామున 3.30కి రావాల్సిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 12.10 గంటలకు, తెల్లవారుజామున 5.40 గంటలకు రావాల్సిన మైసూర్‌- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 1.05 గంటలకు కాచిగూడకు చేరాయి. మంగళవారం రాత్రి 7.05 గంటలకు వెళ్లాల్సిన బెంగళూర్‌- మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 10.05 గంటలకు, రాత్రి 9.05 గంటలకు వెళ్లాల్సిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 11.05 గంటలకు వెళ్లాయి. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా రాత్రి 8.05 గంటలకు బయలుదేరింది. కాచిగూడ నుంచి రాత్రి 10.10 గంటలకు వెళ్లాల్సిన కాచిగూడ-రేపల్లె రైలును సికింద్రాబాద్‌ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు నడిపారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.

పునరుద్ధరణ పనులను పరిశీలించిన రైల్వే జీఎం
రైలు ప్రమాద ఘటనలో దెబ్బతిన్న ఎంఎంటీఎస్‌ ఇంజిన్‌, బోగీలు, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ బోగీల తొలగింపు, పట్టాల పునరుద్ధరణ పనులను ద.మ. రైల్వే జీఎం గజానన్‌ మాల్య సోమవారం అర్ధరాత్రి పరిశీలించారు. సోమవారం విధి నిర్వహణలో భాగంగా విశాఖపట్నం వెళ్లిన జీఎం రాత్రికి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వెంటనే కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏజీఎం బీబీసింగ్‌, డీఆర్‌ఎం సీతారాంప్రసాద్‌ తదితర ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.