close

తాజా వార్తలు

బాలలే...భావిభారత బలాలు!

బాలల దినోత్సవం సందర్భంగా

చిన్నారుల్లో... అన్నింటినీ జయించగలమన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రపంచంతో పోటీపడగలిగే తెగువ వారి సొంతమవ్వాలి. నలుగురిని నడిపించగలిగే  నాయకులుగా తయారవ్వాలి. ఇవన్నీ జరగాలంటే తల్లే పిల్లల్ని ముందుండి నడిపించాలి. ప్రేమను పంచి పెద్దవాళ్లను చేయాలి. ధైర్యాన్నిచ్చి దారిచూపించాలి.  ఆరోగ్యంగా పెంచి అందనంత ఎత్తుకు తీసుకెళ్లాలి. ఉన్నతంగా తీర్చిదిద్ది ఉత్తములను దేశానికివ్వాలి.
పసిపిల్లల మనసు స్వచ్ఛం. తల్లిదండ్రులుగా మనం దాన్ని ఎలా తీర్చిదిద్దుతాం అనేదానిపైనే వాళ్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అతిగారాబంతో మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం, కఠిన నియమాలతో... కల్మషం ఎరుగని మనసుల్ని బాధపెట్టడం... రెండూ సరికాదు. ప్రేమగా చేసే చిన్నచిన్న ప్రయత్నాలే... వారిని ఉన్నతంగా నిలబెడతాయని అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడు స్నేహం పంచాలి. వారి భయాల్ని, అభద్రతని దూరం చేయాలి. కష్టం నుంచి బయటపడే భరోసా అందివ్వాలి. ఎదిగేందుకు చేయూత నివ్వాలి. సొంతకాళ్లపై నిలబడగలమన్న ధైరాన్ని అందించాలి.

* అతివద్దు...  
అమ్మ ప్రేమ, నాన్న గారాబం కలిసి పిల్లల్ని ఒక్కోసారి పెంకిగా మారుస్తాయి. అది మీ బలహీనతగా, వారి బలంగా మారుతుంది. కొందరు పెద్దలు తమ అతి ప్రేమతో పిల్లల్ని ఏ పనీ చేయనివ్వరు. ఈ తీరుతో వాళ్లు అన్నింటికీ ఇతరులపై ఆధారపడటం మొదలుపెడతారు. ఏ పనీ సొంతంగా చేయలేని స్థితికి చేరుకుంటారు. త్వరగా నిర్ణయాలూ తీసుకోలేరు. వాళ్లకు ఆ పరిస్థితి ఎదురుకాకూడదంటే... మీరే మార్గదర్శకం కావాలి. అన్నింటికీ ఓ హద్దు ఉండాలి. ప్రాపంచిక విషయాలపై అవగాహన కల్పిస్తూనే... తప్పొప్పుల్ని తెలుసుకునేలా చేయాలి. ప్రేమను పంచండి కానీ... అవసరమైనప్పుడు దండించడమూ అవసరమని అర్థంచేసుకోండి. వాళ్లు చెప్పే ప్రతిదానికి ఎస్‌ మాత్రమే కాదు... నో కూడా అంటారని తెలియజేయండి. చేయకూడని పని చేసినా... ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారంటూ సరిపెట్టుకోకండి. పొరపాటు జరిగినప్పుడల్లా దండించడం కన్నా... ఎదురయ్యే పరిణామాలు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి చూడండి.


* మానసికంగా ఎదగాలంటే...

పిల్లల ఎదుగుదల అంటే చదువే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. అదొక్కటే సరిపోదు. జీవననైపుణ్యాలు వారికి తెలిసి ఉండాలి. మానసిక పరిణతి అవసరం. వివిధ విషయాలపై పరిజ్ఞానం ముఖ్యం. భావోద్వేగాలను అదుపు చేసుకునే తీరు, చక్కటి వాక్పటిమ వంటివీ తప్పనిసరే. ఇవన్నీ సాధ్యం కావాలంటే... ముందు తోటిపిల్లలతో రోజుకో గంట ఆడేలా చూడండి. సర్దుకుపోవడం, ఓటమిని స్వీకరించే తత్వం, భావవ్యక్తీకరణ... వంటివన్నీ వాటంతట అవే సొంతమవుతాయి. పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తే విజ్ఞానం వస్తుంది. కుదిరినప్పుడల్లా కొత్త ప్రాంతాలకు తీసుకెళ్లండి. వారికి ఎలా జీవించాలో తెలుస్తుంది. పిల్లలతో ఎక్కువ సమయం మాట్లాడితే వాళ్ల గురించి వీలైనంత ఎక్కువగా మీరు తెలుసుకోగలుగుతారు. వాళ్ల ఉద్వేగాలు, ప్రవర్తన అర్థమవుతుంది. సమస్యల్ని పరిష్కరించగలుగుతారు.


*ఆత్మవిశ్వాసం పెంచండి...

మీరు మీ పిల్లలకో పని చెప్పారు. వాళ్లు మీరు ఊహించినదానికన్నా బాగా చేశారనుకోండి. వెంటనే ప్రశంసించండి. అది వారి ఆత్మవిశ్వాసాన్నే కాదు, ఇంకా బాగా చేయాలన్న తపననూ పెంచుతుంది. పిల్లలు ఏదయినా ఆటలో విజయం సాధించకపోయినా, మార్కులు తెచ్చుకోకపోయినా.. తిట్టడం, కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. కారణాలు గుర్తించగలిగితే పరిష్కారం తేలికవుతుంది. అంతేతప్ప ‘నువ్వు ఇంతే... నీకు ఏమీ చేతకాదు...’ అనే మాటలు వద్దు. దాంతో ఆత్మన్యూనతకు లోనవుతారు. ముందు వాళ్ల సమస్యను తెలుసుకుని అధిగమించేందుకు మార్గాలు వెతకండి. చిన్నచిన్న లక్ష్యాలు పెట్టండి. ఒక్కోదాన్ని చేరుకునేలా ప్రోత్సహించండి. కొన్నింటిని సాధించగలిగితే వారిలో ఆత్మవిశ్వాసం దానంతట అదే పెరుగుతుంది. ఇదే తీరు పెద్దయ్యాక కొనసాగించగలుగుతారు. అంతేతప్ప తోటివారితోపోల్చే ప్రయత్నం వద్దేవద్దు.


*ఆరోగ్యం- ఆహారం...

చిన్నవయసులో నేర్పించే ఆహారపుటలవాట్లు భవిష్యత్తులో వారి జీవనశైలిని సవ్యమైన మార్గంలో నడిపిస్తాయి. అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆ శ్రద్ధ తల్లిగా మీరే తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ని వీలైనంత తక్కువగా తీసుకునేలా చూడండి. బదులుగా నోరూరించే పదార్థాలు మీరే చేసిపెట్టండి. అన్నిరకాల పోషకాలు అందేలా చూడండి. మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు అందిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. అన్నిరకాల కూరగాయలు, పండ్లు మొదటి నుంచే అలవాటు చేసేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు అందిస్తే... ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. ఆహారంతోపాటు కంటినిండా నిద్ర, తగినంత వ్యాయామం అవసరం. తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉన్న పదార్థాలను పిల్లలకు అందించడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు.  


* ఊహలు- కలలు అవసరమే...

చిట్టిబుర్రల్లో ఉండేవి చిన్న ఆలోచనలేం కాదు. నిత్యం ఎన్నో సందేహాలు వాళ్లను నిలవనివ్వవు. వాటికన్నింటికీ సమాధానం మీ దగ్గర ఉండకపోవచ్చు. అలాని వారిని తిట్టడం, ప్రశ్నించే వారి తత్వాన్ని నిరోధిస్తే ఎలా... మీకు ఏదైనా సమాధానం తెలియకపోతే నిజాయతీగా తెలియదనే చెప్పండి. కొత్త విషయాలను చెప్పడానికి మీరు ప్రదర్శించే కుతూహలం...వారిలో సరికొత్త ఆలోచనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే మీలో చాలా సహనం ఉండాలి. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని మీరే పెంచాలి. ఇది బలవంతంగా కాకుండా... సహజంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఉదాహరణకు ఖాళీ సమయంలో వారేం చేస్తున్నారో గమనించండి. మీ పాప ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నిస్తుంటే రంగు పెన్సిళ్లు ఇచ్చి ప్రోత్సహించండి. వివిధ ఆకృతుల్ని ఎలా గీయాలో, రంగులు ఎలా నింపాలో నేర్పించండి. చక్కగా అనుకరిస్తారు. మీ అబ్బాయి ఎప్పుడూ యానిమల్‌ ప్లానెట్‌ వదిలిపెట్టకుండా చూస్తుంటే... జంతువుల బొమ్మలతో కూడిన పుస్తకాలు, పజిళ్లు అందించండి. ఏదయినా సరే... వారి అభిరుచిని గమనించి పదునుపెట్టుకునేందుకు సహకరించండి. అంతేతప్ప మీ ఆలోచనల్ని వారిపై రుద్దే ప్రయత్నం వద్దు. వారు కనే కలలు...అద్భుతాలకు పునాదులు అవుతాయి.  


* అప్రమత్తత- పరిశీలన...

పిల్లలపై రకరకాల అఘాయిత్యాలు జరుగుతోన్న రోజులివి. చుట్టూ ఉండే పరిసరాలతో పాటు నిత్యం ఎన్నో అంశాలు ఆ చిన్న మనసుల్ని ప్రభావితం చేయొచ్చు. లైంగికవేధింపులు, తోటివారు హద్దుమీరి ఆటపట్టించడం, అనుకోని ప్రమాదాలు... వంటివన్నీ పిల్లలకు ఎదురవకుండా ఉంటే బాగుంటాయి కానీ... వాటిని ముందే ఊహించడం మంచిదే. అలాంటివి ఎదురుకాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలన్నీ చిన్నారులకు ముందే తెలియజేయాలి. సమస్యలు రాకుండా చూడటమే కాదు, ఒకవేళ వస్తే ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు ముందే నేర్పించాలి. మీరు వాడే ఫోనునెంబరు వాళ్లకు కంఠతా పట్టించడం, ఇంటి చిరునామా నేర్పించడం, దేన్నీ దాచుకోకుండా పెద్దవాళ్లకు చెప్పడం... వంటివన్నీ అవసరమే.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.