close

తాజా వార్తలు

మాకేం కావాలంటే...

హాయ్‌ ఫ్రెండ్స్‌! మన పుట్టిన రోజు మనకు, ఇంట్లో వాళ్లకు మాత్రమే పండగ. కానీ చాచా నెహ్రూ పుట్టిన రోజు.. మనందరి పండగ. అది ఈరోజే. మరి ఆనందంగా మన పిల్లల పండగని జరుపుకోవడానికి సిద్ధమైపోయారా? టిప్‌టాప్‌గా తయారయ్యారా? మిఠాయిలు తిన్నారా? అయితే ‘బాలల దినోత్సవం’ సందర్భంగా కొంతమంది నేస్తాలు తమకేం కావాలో చెప్పారు. ఎలాగో తెలుసా? కవితలు రాసి. మరి ఎంచక్కా వాటిని చదివేసి.. మీ మనసులోని మాటలనూ అమ్మానాన్నలతోనూ, బడిలో టీచర్లతోనూ పంచుకోండి.

ప్రియమైన అమ్మానాన్నలకు,
నేను మీ చిన్నూని, ముద్దూని, స్వీటీనీ, బంగారాన్ని...!
మీ ఆశల భారాన్ని రోజు పుస్తకాలతో పాటు మోసిమోసి...
నడుం వంగిపోయిన విద్యార్థిని.
హోంవర్క్‌ చేశావా? మార్కులెన్ని? పక్కింటి బంటి క్లాస్‌ ఫస్టంట తెలుసా?...
ప్రశ్నల గాలివానకు వణుకుతున్న చిట్టిగువ్వను.
గాలి దూరని, వెలుతురు చేరని గదుల్లో పుస్తకాలే తింటూ, పుస్తకాలే తాగుతూ... కళ తప్పుతున్న లేత మొగ్గని.
రోజూ హోంవర్క్‌డైరీకి బదులు మా కళ్లలోకి చూడమని వేడుకునే పసికూనని.
ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌తో పాటు మా హృదయాన్నీ ఒకసారి తడమమనే కంటిపాపని.
వారానికొక్కసారైనా గ్రౌండ్‌కు తీసుకెళ్లమని ప్రాధేయపడే చిట్టిని.
మమ్మల్ని పుస్తకాలకు కట్టేసి... టీవీనో, సెల్‌ఫోనో పట్టుకోవద్దని బతిమాలే బాలుణ్ని.. బాలికని.

ఓ పీఎం, సీఎంల్లారా...
ఈ రోజు మాకొద్దు సెలవు... మా అమ్మానాన్నలకు ఇవ్వండి.
మాతో హాయిగా ఆడుకోమని, పాడుకోమని, మాట్లాడుకోమని, మా మాటలు వినమని, మా మనసులు చూడమని... చెప్పండి. అప్పుడే నిజమైన
బాలల దినోత్సవం.

అమ్మ ప్రేమంత స్వేచ్ఛ కావాలి
నాన్న గారాబమంత మైదానం ఉండాలి
చెల్లి నవ్వంత చందమామ కావాలి
నేను చేసే అల్లరంత వెన్నెల విరియాలి
తాతయ్య జుట్టంత తెల్లని మంచు కురవాలి
బామ్మ అల్లిన మల్లెలు నాతో ఆడుకోవాలి
నాకొచ్చే ఈ కల నిజమవ్వాలి

- బి.అర్చన, ఐదో తరగతి, ప్రాథమిక పాఠశాల, చేబర్తి, సిద్దిపేట జిల్లా
ఆటలు కావాలి ఆడించే అమ్మమ్మ కావాలి
పాటలు కావాలి పాడించే తాతయ్య కావాలి
అల్లరి కావాలి చేయించే నేస్తం కావాలి
పాఠం కావాలి కథలా చెప్పే టీచర్‌ కావాలి
దేవుడు కావాలి ప్రసాదం పెట్టే పూజారి కావాలి

- పి. పావని, 7వ తరగతి, జి.ప.ఉ.పా.గూడూరు, కృష్ణాజిల్లా
రైతుబిడ్డని నేను ఆకలంటుంటాను
మా నాన్న కన్నీళ్లు ఆపమంటుంటాను
పచ్చగా ప్రతిపొలము పండాలనుకుంటాను
సరిపడా వానలు కురవాలనుకుంటాను
చెట్లు నరకొద్దని మిము వేడుకుంటాను

- పల్లవి, ఎస్తేరు, 8వ తరగతి, జి.ప.ఉ.పా, తాళ్లపాలెం
నాకేం కావాలంటే... అన్నంలోకి మంచి కూరలు
ఆడుకోవడానికి ఆవరణ... తిట్టని కొట్టని పెద్దలు
రోజుకో కథ చెప్పే బామ్మ...
ఇవన్నీ చెయ్యగలగడానికి కావాల్సినంత సమయం

- బద్రి, 7వ తరగతి, జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, గూడూరు
తాతగారి అనుభవాలు వినడమిష్టం
బామ్మచెప్పే పురాణకథలిష్టం
అమ్మ పెట్టే అప్పచ్చులింకా ఇష్టం
నాన్నతో తీరిగ్గా గడపడమిష్టం కానీ...
వాళ్ల చేతుల్లో ఫోన్‌ ఉంటే ఇవన్నీ కష్టం

- జి. వెన్నెల, 7వ తరగతి
అందలాలు ఎక్కించే అవకాశం రావాలని
ఒక్కపట్టు పట్టాలని ఒక్కోమెట్టు ఎక్కాలని
అడ్డంకులు దాటాలని అపజయాన్ని గెంటాలని
నా శక్తిని చూపాలని కృషితోనే విజయమని
నేను నమ్ముతున్నానని...

- పి. ప్రసన్న, ఎం. జ్యోతిక, 10వ తరగతి, జి.ప.ఉ.పా. గూడూరు
జెర్రీతో స్నేహం చేసే టామ్‌ని చూస్తానా?
పంజరమంటే తెలియని చిలకల్ని చూస్తానా?
ప్రమాదాలు జరగని రహదారిని చూస్తానా?
ఆడపిల్లకు అవమానం జరగని సమాజాన్ని చూస్తానా?
ఆటపాటలతో చదివించే కార్పొరేట్‌ బడిని చూస్తానా?

- ఎన్‌.వెంకటరమాదేవి, 9వ తరగతి, జి.ప.ఉ.పా, గూడూరు
చీకటికి రంగులేసే కుంచె కావాలి...
చంద్రుణ్ని నేలకు దించే గాలం కావాలి...
ఎగిరి చుక్కలను అందుకునే శక్తి కావాలి...
మబ్బుల్లో తేలి ఆడుకునేంత మైదానం కావాలి...
ఎంత తడిసినా జ్వరం రాని వాన రావాలి...
ఎంత అల్లరి చేసినా అమ్మ నాకు ముద్దులే ఇవ్వాలి...

- ఎన్‌. క్షితి కుందన, 5వ తరగతి, రోటర్డమ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, హైదరాబాద్‌
పచ్చటి మొక్కలు చక్కటి రోడ్లు ప్లాస్టిక్‌లేని వీధులు
పారే సెలయేర్లు.. పొగలేని కార్లు
పగలేని మనుషులు ఉన్న ఊరు నాక్కావాలి

- చిన్ని, 5వ తరగతి, బ్లోసమ్‌ స్కూల్‌, రాజమహేంద్రవరం
కొండనైన పిండి చేసే కండలు నాకు కావాలి
చేతనైన సాయం చేసే శక్తి నాకు కావాలి
తల్లిదండ్రుల తపన తీర్చే గెలుపు నాకు కావాలి
ఇవన్నీ కావాలంటే దురలవాట్లకు లోనుకాని సద్బుద్ధి నాకు కావాలి

- ఎం. సాయిసంతోష్‌, 10వ తరగతి, జి.ప.ఉ.పా. గూడూరు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.