
తాజా వార్తలు
విజయవాడ: రాష్ట్రంలో ఇసుక లేక భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో కార్మికులు రోడ్డునపడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసత్యాలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేయలేరని అన్నారు. ఇసుక కొరత సృష్టించి సిమెంట్ కంపెనీలతో సీఎం బేరసారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భవననిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆయన విజయవాడలోని ధర్నాచౌక్లో 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుకను కూడా కబ్జా చేసి ప్రభుత్వం పెత్తనం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాను తయారు చేసి దేశం మీదకు వదిలారని మండిపడ్డారు. ‘ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంటే.. ఇంటి దొంగలు సీఎంకు కనపడరా?’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
‘‘ ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఇసుక సమస్యను సృష్టించారు. దాదాపు 35 లక్షల మంది తిండికి కూడా నోచుకోని దుస్థితి కల్పించారు. ఎవరూ చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోరు. కానీ భవన నిర్మాణ కార్మికులు సెల్ఫీ వీడియోలు తీసి తన బాధ చెప్పుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇసుక కొరత వల్ల 125 వృత్తుల వారు రోడ్డునపడ్డారు. ఇంతలా ఇసుక సమస్య ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. దేశంలోనే మొదటిసారిగా ఉచిత ఇసుక పాలసీ మేం తీసుకొచ్చాం. ఉచిత ఇసుక పాలసీపై విమర్శలు చేసి.. ఇవాళ మాఫియాకు అప్పగిస్తారా? పోలీసులకు స్వేచ్ఛనిస్తే 24 గంటల్లో మాఫియాను అడ్డుకుంటారు. ఈ సమస్యలకు ఉచిత ఇసుక పాలసీనే పరిష్కారం. దాదాపు 50 మంది కార్మికులు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించదా?’’అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇసుక దొరకదుగానీ.. పక్క రాష్ట్రాల్లో మాత్రం ఏపీ ఇసుక ఉంటోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడా భవనాలు నిర్మించే పరిస్థితి లేదన్నారు. తెదేపా గతంలో తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల ఎవరూ నష్టపోలేదని గుర్తు చేశారు. సొంత పొలంలోని మట్టిని ఇంటికి తెచ్చుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలా? అని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఎవరు ఇసుక బకాసులో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని చంద్రబాబు అన్నారు.
వ్యక్తిగత విమర్శలకు దిగుతారా?
‘జనసేన నాయకుడు లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా?’ అని చంద్రబాబు విమర్శించారు. అలాంటి విమర్శలు చేసే వారిని మేం కూడా వ్యక్తిగతంగా దూషిస్తే తట్టుకోగలరా? అని సవాల్ విసిరారు. విమర్శలు చేయడం మాని ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయాలని హితవు పలికారు. ‘ తప్పు అని ప్రశ్నిస్తే తప్పుడు చేసులు పెడతారా?’ అని చంద్రబాబు మండిపడ్డారు. 2430 జీవో తీసుకొచ్చి పత్రికలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
రూ. 10 వేలు నష్టపరిహారమివ్వాలి
ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణకార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షలకు చెల్లించాలని కోరారు. మాఫియాను కట్టడి చేసి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని అన్నారు.
ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం
ఇసుక కొరతతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామని, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. దీక్షకు వచ్చి తకు సంఘీభావం ప్రకటించిన బాధితులను ఆయన పరామర్శించారు. వారి బాధలు విని చలించిపోయారు. ఎవరికి తోచినట్లుగా వారు విరాళాలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన నేతలు తమకు తోచిన సాయం చేశారు.
ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి