close

తాజా వార్తలు

ఆద్వైతకు జేజేలు

తెలుగు సృజనకు జాతీయ ఖ్యాతి

* ఎవరీ అమ్మాయి?
సుద్దపల్లి వెంకట కృష్ణ అద్వైత. ఉండేది హైదరాబాద్‌లో.
* మరి మన పేజీలోకిఎందుకొచ్చింది?
సృజనాత్మక రచన (క్రియేటివ్‌ రైటింగ్‌) విభాగంలో నేషనల్‌ కల్చరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది.
* దీని ప్రత్యేకత ఏంటబ్బా?
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ...ఏటా కల్చరల్‌ రీసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ తరఫున పురస్కారాలు అందిస్తుంది. 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఉపకార వేతనం ఇస్తుంటారన్నమాట. అయితే ఈసారి ఈ పురస్కారానికి మొదటిసారిగా మన తెలుగు అమ్మాయి ఎంపికైంది. దేశం మొత్తంలో 30 మందికి ఈ ఉపకారవేతనాలు వచ్చాయి. వీళ్లలో తెలుగులో అద్వైత మాత్రమే ఎంపికైంది.
* అయితే చాలా గ్రేటే! ఇంతకీ అద్వైత ఏం చదువుతోంది?
సరూర్‌నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
* అన్నట్టూ స్కాలర్‌షిప్‌తో ఏం చేయాలి?
జనవరి, 2020 నుంచి అద్వైత తన డిగ్రీ చదువు పూర్తయ్యేవరకు తెలుగు రచనలు చేసేందుకు ఏటా రూ.9వేలు ఉపకారవేతనం అందుతుంది.

* అసలీ అమ్మాయికి రచనపై ఆసక్తి ఎలా వచ్చింది?
పిట్టకొంచెం.. కూత ఘనం అన్నట్లుగా నాలుగో తరగతి నుంచే అద్వైత రచనలు చేయడం మొదలుపెట్టింది. అమ్మానాన్నలు కృష్ణజయంతి, ఎస్‌.వి.కృష్ణ.. పబ్లిషర్లు. దీంతో ఇంట్లో ఉన్న కథల పుస్తకాలు, నవలలు చిన్నప్పట్నుంచి ఎక్కువగా చదివేది. అలా తనకు వచ్చిన ఆలోచనలతో సొంతంగా కథలు, కవితలు రాసేది. సరదాగా రాస్తూనే అభిరుచిగా మార్చుకుంది. ఈ అమ్మాయి ఆసక్తిని గమనించి అమ్మానాన్నలు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి ఎంతో ప్రోత్సహించేవారు.  
* ఇంతకీ ఎలాంటి రచనలు చేసింది?
చిన్నపిల్లలు ఇష్టపడే నీతికథలు ఎక్కువగా రాసింది. సింహం నవ్వింది, మామిడిచెట్టు - అరటిచెట్టు, తాబేలు చిప్ప, సింహం - ఒక రైతు,  పావురం-చీమ... ఇలా మొత్తం 20 కథలు రాసింది. మరో 30 వరకు లఘు కవితలు రాసింది. ప్రస్తుతం ఓ నవల రాస్తోంది. కార్టూన్లూ గీస్తోంది. పోయిన సంవత్సరం విజిలెన్స్‌ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో మొదటిస్థానం దక్కించుకుంది.
*పురస్కారానికి ఎలా ఎంపికైంది?
ఏటా ఫిబ్రవరిలో కల్చరల్‌ రీసోర్సెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌.. దరఖాస్తులు తీసుకుంటుంది. నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, నాటకం, క్రియేటివ్‌ రైటింగ్‌ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమంగా నిలిచే పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి వివిధ దశల్లో పోటీలు నిర్వహించి ఉపకారవేతనాలకు ఎంపిక చేస్తారు.
- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.