
తాజా వార్తలు
మనకులాగే ప్రతి బండికీ ఓ గుండె ఉంటుంది... దానికీ బాగోగులుంటాయి... సరైన వైద్యుడితో వైద్యం చేయించుకోకుంటే మనకు ఎంతటి ప్రమాదమో... అరకొర పరిజ్ఞానమున్న మెకానిక్‌కి వాహనం అప్పగిస్తే దానికీ అంతటి నష్టమే! అందుకే మీ బైక్, కారుని సర్వీసింగ్‌కి ఇచ్చేముందు ఒక్కక్షణం ఆలోచించండిి. బండిని, దాని గుండెనూ నిశితంగా గమనించండి.
సమయం లేకనో, నిర్లిప్తతతో.. కారణం ఏదైనా చాలామంది తమ వాహనాల్ని సరైన సమయంలో సర్వీసింగ్ చేయించరు. కొందరైతే.. కంపెనీ వాళ్లు ఇచ్చే ఉచిత సర్వీసులూ వాడుకోరు. ఇంకొందరు ఆఁ.. సర్వీసుది ఏముందిలే! ఇంజిన్ ఆయిల్ మార్పిస్తే సరిపోదా! డబ్బులెందుకు వృథా అని ఆలోచిస్తారు. అధీకృత సర్వీసు సెంటర్లో కాకుండా పదో పరకో ఇచ్చి పక్కాలోకల్ మెకానిక్‌తో ఇంజిన్ ఆయిల్ మార్పిస్తారు. ఇక్కడే వస్తుంది చిక్కంతా.
ఇదే కీలకం
సర్వీసింగ్‌లో కీలకమైంది ఆయిల్ మార్చడం. ఇది ఇంజిన్‌కి గుండెకాయలాంటిది. హడావుడిగా బండి ఇంజిన్ ఆయిల్ మారుస్తానంటే కుదరదు. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేసి సొంత ప్రయోగాలు చేస్తారు. యూట్యూబ్‌లో రెండు మూడు వీడియోలు చూసి అరకొరజ్ఞానంతో ఇంజిన్ క్యాబిన్‌తో చెలగాటమాడతారు! తేడా వస్తే బండి ‘బోరు’మంటుంది! ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ క్యాబిన్ అనేవి ఏ వాహనానికైనా కీలకమైనవి. ఇంజిన్ ఆయిల్ ప్రధాన లూబ్రికెంట్.. దీన్ని సమయానికి మార్చకున్నా.. ఆయిల్ లెవల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇంజిన్ పిస్టన్లు, క్రాంక్షాఫ్ట్లు, వాల్వ్‌లు, ఇతర పరికరాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇంజిన్ పనితీరు మందగిస్తుంది.
ఒడుపుగా..
ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు వాహనం కిందిభాగంలో ‘డ్రెయిన్ నట్’ను జాగ్రత్తగా తెరవాలి. దీనికి త్రెడ్స్ (చారలు) ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ క్యాబిన్‌కు సైతం ఈ నట్కు సరిపడే రంధ్రం ఉంటుంది. నట్కున్న త్రెడ్స్కు సరిపోయేలా ఈ రంధ్రానికీ త్రెడ్స్ ఉంటాయి. ఆయిల్ మార్చే క్రమంలో ఈ నట్ను తెరిచిన తర్వాత.. క్యాబిన్లో ఉన్న పాత ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నట్ను తిరిగి క్యాబిన్కున్న రంధ్రానికి జాగ్రత్తగా అమర్చాలి. ఏ మాత్రం ప్రమత్తత, కంగారు ప్రదర్శించినా.. డ్రెయిన్ నట్ ‘స్లిప్’ అవుతుంది. నట్ రంధ్రంలో కూర్చుంటుంది కానీ క్యాబిన్ రంధ్రానికున్న త్రెడ్లు దెబ్బతింటాయి. ఇది మెకానిక్కు తెలిసిపోతుంది. ఎంత బిగించినా డ్రెయిన్ నట్ పూర్తిగా బిగుసుకోక అలా తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు డ్రెయిన్ నట్ స్లిప్ అయిందని బండి యజమానితో చెప్పడం మెకానిక్ నైతిక బాధ్యత. కానీ మనకెందుకొచ్చిందిలే... ఇప్పుడు చెబితే నేనే బాధ్యత వహించాల్సి వస్తుంది అని తను మిన్నకుండిపోతాడు. ఇంజిన్ ఆయిల్ నింపి సీల్ చేసి మనకు అప్పగించేస్తాడు. మనం బండిని ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు ఇంజిన్ ఆయిల్ చుక్కలుగా లీకై సమస్య బయటపడుతుంది. దాన్ని గమనించకపోతే, పట్టించుకోకపోతే ఆయిల్ లెవల్ పడిపోతుంది. నెలలపాటు ఇలాగే కొనసాగితే ఏకంగా ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు.
గండం గట్టెక్కాలంటే...
అందుకే వాహన యజమానులు బాగా అనుభవం ఉన్న నిపుణులైన మెకానిక్‌లు లేదా అధీకృత సర్వీసింగ్ సెంటర్‌కే వెళ్లాలి. నట్ స్లిప్ అయినప్పుడు బయట మెకానిక్‌ల దగ్గరికి వెళ్తే షార్ట్‌కట్ పద్ధతుల్లో ఇంజిన్ ఆయిల్ ఛాంబర్కున్న త్రెడ్‌లను ఓవర్ డ్రిల్ చేసి.. దానికి డ్రెయిన్ నట్ను ఎక్కించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపిస్తారు. కానీ ఈ క్రమంలో సూక్ష్మ లోహ రజను ఇంజిన్ క్యాబిన్ లోపలికి వెళ్లిపోతుంది. ఇది పిస్టన్లను దెబ్బతీస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మొత్తం ఛాంబర్‌ను తెరిచి ఉన్న త్రెడ్‌లను మొత్తం తొలగించి కొత్త త్రెడ్ బిట్‌ను సిలికాన్ గమ్ సాయంతో ఛాంబర్ రంధ్రానికి అతికించి.. నూతన డ్రెయిన్ నట్ను సెట్ చేయించుకోవాలి. దీనికి సమయం, డబ్బూ కావాలి. ఈ జంఝాటం వద్దనుకుంటే నాలుగువేల రూపాయల్లో నూతన ఇంజిన్ ఆయిల్ ఛాంబర్ వస్తుంది. ఈ ప్రక్రియలో మొత్తం ఇంజిన్ విప్పాల్సి వస్తుంది కాబట్టి కచ్చితంగా అధీకృత సర్వీస్ సెంటర్లోనే బండిని ఇస్తే మంచిది.●
ఇవీ పాటించండి●
* సర్వీసింగ్‌కి ఇచ్చేముందు బండిలో ఆర్సీ, బీమా, కాలుష్య ధ్రువీకరణపత్రం.. ఇలాంటి విలువైన పత్రాలన్నీ తీసుకోవాలి.
* ఉచిత, చెల్లింపు సర్వీసింగ్ ఏదైనా సర్వీస్ రికార్డులు పక్కాగా పాటించాలి.
* సర్వీసింగ్ సెంటర్‌కి వెళ్లేముందే ఓడోమీటర్ రీడింగ్ రాసుకోవాలి.
* కారు, బైక్ ఏదైనా.. ఇంధన ట్యాంకులో 30శాతానికి మించి పెట్రోల్, డీజిల్ ఉండకుండా చూసుకోవాలి.
* కారు బూట్/సీటు కింద యాంప్లిఫయర్లు ఉంటే చెప్పాలి. వాటిపై నీరు, లిక్విడ్, ఆయిల్ పడకుండా చూడమనాలి.
* ఇంతకుముందు టైర్లను నైట్రోజన్ గాలితో నింపితే ఆ విషయం చెప్పాలి.
* మూలు ఆయిల్ నుంచి సింథటిక్ ఆయిల్‌కి మారాలనుకుంటే ఆయిల్ ఫిల్టర్లు కూడా మార్చమని చెప్పాలి.
గమనించాలిలా..
సమస్య వచ్చినప్పుడు బాధ పడే బదులు సర్వీసింగ్ ఇచ్చేముందు, తర్వాతా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బండిని సర్వీసింగ్‌కి ఇచ్చే ముందు.. మెకానిక్ చూసేలా ఫోన్లో ఫొటోలు తీసుకోండి. అప్పుడు మెకానిక్ ఎంతో జాగ్రత్తగా మరమ్మతులు చేస్తాడు. సర్వీసింగ్ అయిపోయాక బండి తీసుకునేటప్పుడు కొంతదూరం మెకానిక్‌తో కలిసి టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు సమస్యలేమైనా ఉంటే తెలుస్తాయి. అలాగే ఇంజిన్ ఆయిల్ సీల్ తెరిపించి ఆయిల్ కొత్తది మార్చారా? లేదా? అని చెక్ చేయండి. బ్యాటరీ, చైన్ చెక్ చేసుకోండి. డ్రెయిన్ నట్ దగ్గర ఆయిల్ అంటుకుని ఉంటే కాస్త అనుమానించాల్సిందే. దాన్ని ఓ సారి జాగ్రత్తగా తుడిచి ఓ గంట తర్వాత తిరిగి అక్కడ ఆయిల్ చేరుతుందో, లేదో చూడండి. చేరకుంటే పర్లేదు. చేరితే మాత్రం బండి డెలివరీ తీసుకోకండి. సర్వీస్‌సెంటర్ హెడ్ దృష్టికి తీసుకెళ్లండి. సర్వీస్‌సెంటర్‌లో ఇచ్చే రసీదులను భద్రంగా పెట్టుకోవాలి. ఏమైనా సమస్యలొస్తే వినియోగదారుల న్యాయస్థానానికి వెళ్లాలంటే ఇవే ఆధారం.
- ఎం.డి.దస్తగిర్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
