
తాజా వార్తలు
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం రోజురోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అక్కడ ప్రజలకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సరి, బేసి సంఖ్య ఆధారంగా దిల్లీ ప్రభుత్వం వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినప్పటికీ హస్తినలో కాలుష్యం అదుపులోకి రావడం లేదు. విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాఠశాలలకు సెలవులు సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో దిల్లీ అగ్రస్థానంలో నిలిచి అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీన్నిబట్టి దిల్లీలో కాలుష్యం ఏమేరకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తాజా గణాంకాల ప్రకారం శుక్రవారం దిల్లీ వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఏకంగా 527కి చేరింది. ఈ జాబితాలో ఉన్న టాప్ టెన్ నగరాల్లో భారత ఉపఖండానికి చెందినవే ఆరు నగరాలు ఉండటం గమనార్హం. దిల్లీతో పాటు లాహోర్, కరాచీ, కోల్‌కతా, ముంబయి, కాఠ్మాండూ నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తున్న దిల్లీలో శుక్రవారం నమోదైన వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ)లు ఇలా ఉన్నాయి. పూసారోడ్డులో 777, రోహిణి ప్రాంతంలో 765, అశోక్ విహార్‌లో 757, ప్రగతి విహార్‌లో 733, ఓఖ్లాలో 722, నోయిడా సెక్టార్-125లో 665, చాణక్యపురిలో 660, ఆనంద్‌విహార్‌లో 535గా నమోదైంది. దీంతో అక్కడ ఏఐక్యూ ‘సివియర్ ప్లస్’ కేటగిరీని దాటేసింది. దీంతో దిల్లీ గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు సరి-బేసి విధానంలో నిబంధలను అతిక్రమించిన వారిపై గురువారం వరకు 4,309 చలాన్లు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.4 వేలు జరిమానాగా కూడా విధిస్తున్నారు.