close

తాజా వార్తలు

మోదీ ఊరికే పొగడరు..

 ‘మహా’ట్విస్ట్‌ ఇచ్చిన భాజపా

 శివసేనకు దిమ్మతిరిగే షాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘రాజకీయాలు.. క్రికెట్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు..’ వారం క్రితం మహారాష్ట్ర భాజపానేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక సమావేశంలో నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు. 

‘ఏం కాదు.. అంతా సవ్యంగానే జరుగుతుంది’ ఐదురోజుల కిందట రామ్‌దాస్‌ అఠవాలేకు అమిత్‌ షా ఇచ్చిన భరోసా..!  నిజమే.. చివరికి అంతా భాజపాకు సవ్యంగానే జరిగింది. 

రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయి.. ఎందుకో తెలుసా.. ఇక్కడ ఎవరికి ఎవరూ శాశ్వత మిత్రులు కారు. అందుకే ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో స్పష్టంగా తెలియాలి. లేకపోతే రాజకీయంగా పతనమైపోవడం ఖాయం. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో స్పష్టమైంది. ఇక్కడ ‘నాకేంటీ.. నీకేంటీ’ అన్న సిద్ధాంతం గెలుస్తుంది. శుక్రవారం శివసేన, కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాజకీయ తుపాను మొదలైంది.  భాజపా ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌కు ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ మద్దతు ప్రకటించడం.. దానికి గవర్నర్‌ ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో శివసేన మొండి పట్టుతో అధికారానికి దూరమైంది. 

మోదీ మాటలకు అర్థాలే వేరులే..

మోదీ, అమిత్‌ షా మాట్లాడే ప్రతి మాట వెనుక చాలా ప్రణాళిక ఉంటుంది. చిల్లర వివాదాలపై వారు ఎంత గింజుకున్నా స్పందించరు. రాజకీయాల్లో నోటిని ఇంత క్రమశిక్షణగా అదుపులో పెట్టుకోవాలంటే చాలా సత్తా ఉండాలి. ఈ విషయం చిరకాల మిత్ర పక్షమైన శివసేనకు బాగా తెలుసు. ఐదురోజుల క్రితం ఎన్సీపీ, బీజేడీలను ప్రధాని మోదీ పార్లమెంట్‌ సాక్షిగా ఆకాశానికి ఎత్తేశారు. అప్పుడే జరగబోయే నష్టాన్ని శివసేన పసిగట్టింది. మోదీ పొగిడిన ఒక రోజు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ప్రధాని మోదీతో  భేటీ అయ్యారు. ఇది లోలోపల శివసేనకు ఆందోళన కలిగించినా.. పైకి మాత్రం ‘మేమే రైతు సమస్యలపై మాట్లాడేందుకు పవార్‌ను ప్రధాని వద్దకు పంపించాము. ఆయన దేశం మొత్తానికి ప్రధాని’ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పైకి గాంభీర్యం ప్రదర్శించారు. కానీ, రైతు సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లిన పవార్‌ వెంట భేటీ సమయంలో ఏ ఎన్సీపీ నాయకుడు లేరు.. మరో పక్క ప్రధాని వెంట కూడా వ్యవసాయ శాఖ మంత్రి లేరు.. వీరిద్దరే ఏకాంతంగా భేటీ అయ్యారు. 

ఆ తర్వాత బయటకు వచ్చిన శరద్‌ పవార్‌ మాములుగానే కాంగ్రెస్‌, సేన నాయకులతో భేటీ అయ్యారు. శుక్రవారం ఈ పార్టీలు నిర్వహించిన భేటీలో అజిత్‌ పవార్‌ కూడా పాల్గొన్నారు. ఉద్ధవ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన శరద్‌పవార్‌ శనివారం చర్చలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ భేటీ ఆనంతరం కొన్ని గంటల్లో అజిత్‌ పవార్‌ భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా.. అజిత్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అయితే అజిత్‌ వెనక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.. కానీ, 20మందికి పైగా ఆయనతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి భాజపాకు మరికొందరి మద్దతు అవసరం. ఇతర రాష్ట్రాల్లో భాజపా వ్యూహాలను పరిశీలిస్తే మహారాష్ట్రలో భారీ సంఖ్యలో వలసలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రధాన పార్టీల వారున్నా ఆశ్చర్యపోనవసరంలేదు. చిన్నపార్టీలను పక్కనపెడితే దాదాపు 23 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. సాధారణంగా ఇండిపెండెంట్లలో అత్యధిక మంది ప్రభుత్వం ఏర్పాటు చేసే పక్షం తరఫునే నిలుస్తుంటారు.. ఎందుకంటే వారికి పనులు కావడం చాలా ముఖ్యం. ఈ రకంగా చూసుకొంటే భాజపాకు అధికారం నిలుపుకోవడం కొంత సులువైన పనే. భాజపాతో వెళ్లడం అజిత్‌ సొంత నిర్ణయమని.. పార్టీకి దానితో సంబంధం లేదని శరద్‌పవార్‌ ప్రకటించారు. ఎన్సీపీలో భారీ చీలిక జరిగితే మాత్రం సేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కష్టమైపోతాయి. ప్రస్తుతం ఏర్పడ్డ భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకోకపోతే మరోసారి ఎన్నికలకు వెళ్లే అవకాశాలే ఎక్కువ.

శివసేనకు భారీనష్టం.. 

రాజకీయంగా శివసేన భారీగా నష్టపోయింది. ఇప్పటికే భాజపాతో కలిసి పోటీ చేసి అధికారం కోసం సిద్ధాంత పరంగా విభేదించే కాంగ్రెస్‌తో జట్టుకట్టేందుకు సిద్ధమైంది. తమకన్నా చాలా చిన్న వయస్సులోని వారి కింద పనిచేయడానికి రాజకీయ నాయకులు సిద్ధపడరు.. వారి అహం దెబ్బతింటుంది. చిన్నవారి కింద పనిచేయలేక చాలా పార్టీల నుంచి సీనియర్లు వెళ్లిపోయిన ఘటనలు కోకొల్లలు. ఒక వేళ పనిచేయాల్సి వస్తే ఆ వ్యక్తి ఎంతో ప్రజాకర్షణ ఉన్న నాయకుడై ఉండాలి. శివసేన విషయంలో ఇదే జరిగింది.  దాదాపు 124కిపై స్థానాల్లో పోటీ చేసిన శివసేన గెలిచింది 56 స్థానాలు మాత్రమే.  సగం కంటే ఎక్కువ చోట్ల ఓడిపోయింది. మరోపక్క భాజపా 150 స్థానాల్లో పోటీ చేసి 105 చోట్ల గెలిచింది. దీంతో భాజపా విజయం శాతం సేనతో పోల్చుకొంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ఠాక్రే వంటి 30 ఏళ్ల వయసున్న వ్యక్తి కింద భాజపా నాయకులు పనిచేస్తారని శివసేన భావించడం వ్యూవూహాత్మకంగా చాలా పెద్దతప్పు. ఎన్సీపీకి 54 సీట్లు రాగా.. సేనకు 56 సీట్లు వచ్చాయి.. అలాంటప్పుడు కేవలం రెండు సీట్లు ఎక్కువ ఉన్న సేనకే ముఖ్యమంత్రి పీఠం వెళ్లడం కూడా అజిత్‌ పవార్‌ అసంతృప్తికి కారణం కావచ్చు.
 

మరోవైపు ఇప్పటివరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడిచింది. అంటే నేరుగా కేంద్రంలోని భాజపా రాష్ట్రంలో పాలన నడిపించినట్లు లెక్క. దీనికి తోడు భాజపాకు అత్యధికంగా 105 సీట్లు ఉన్నాయి. ఇటువంటి సమయంలో సేన అతి క్లిష్టమైన సంకీర్ణానికి ప్రయత్నించడం సాహసమే.

సంకీర్ణ రాజకీయాల్లో భాజపా దిట్ట..?

సేన కేవలం మహారాష్ట్ర రాజకీయాలకే పరిమితమైంది. భాజపా 2 స్థానాలు గెలిచి బుడిబుడి అడుగులు వేసినప్పటి నుంచి సంకీర్ణ రాజకీయాల్లోనే ఎదిగింది. వాజ్‌పేయి హయాంలో అధికారం చేపట్టినా.. 2014లో మోదీ నేతృత్వంలో మెజార్టీ ఉన్నా సంకీర్ణాన్ని వదులుకోలేదు. ఆ పార్టీకి సంకీర్ణాల విలువ తెలుసు.. సంకీర్ణాలను ఎలా నిర్వహించాలో కూడా బాగా తెలుసు. సేన ఇక్కడే భాజపాను తక్కువగా అంచనా వేసింది. ఆ ఫలితం ఇప్పుడు కళ్లముందుకొచ్చింది. సోనియాకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఎన్సీపీ.. ఆ తర్వాతి కాలంలో తిరిగి అదే కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. అలాంటిది భాజపాతో జట్టుకట్టదనే నియమం ఎక్కడా లేదన్న విషయాన్ని సేన గ్రహించలేదు. అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. దీనికి తగ్గట్లే రామ్‌దాస్‌ అఠవాలే నేడు మాట్లాడుతూ ‘‘అమిత్‌ షా చెప్పినట్లే నేడు అంతా సవ్యంగానే జరిగింది.. సుప్రియ సూలే కేంద్ర మంత్రివర్గంలో చేరవచ్చు’’ అని వ్యాఖ్యానించడం విశేషం...!

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.