close

తాజా వార్తలు

‘ఇంతకంటే అందర్నీ ఒకేసారి చంపెయ్యండి’

దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

దిల్లీ: దేశ రాజధానిలో కాలుష్య నివారణకు కేంద్రం, రాష్ట్రాలు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇలా ప్రజలను బలవంతంగా గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచడం కంటే.. పేలుడు పదార్థాలు తెచ్చి ఒకేసారి అందర్నీ చంపేయడం నయమంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

దిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి తెలిపింది. ‘ప్రజలను మీరెలా చూస్తున్నారు? వారు చనిపోవాలని అనుకుంటున్నారా? పంట వ్యర్థాల దహనంపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత పంట వ్యర్థాల దహనం మరింత పెరిగింది. ఇది మీ వైఫల్యం కాదా? మీ వల్ల దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రజలు కాలుష్యంలో మగ్గుతున్నారు. పంట వ్యర్థాలపై మీరెలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే ప్రజలు చనిపోయినా ఫర్వాలేదనే కదా మీ ఉద్దేశం’ అని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలను న్యాయస్థానం ఎండగట్టింది.   

‘దిల్లీ కాలుష్యానికి మీరంటే మీరు కారణమంటూ నిందలు వేయడం చూస్తుంటే దిగ్భ్రాంతికరంగా ఉంది. మీ వల్ల ఎందుకు ప్రజలు ఇలా ఇబ్బంది పడాలి? వారిని బలవంతంగా ఎందుకు గ్యాస్‌ ఛాంబర్‌లో ఉంచాలనుకుంటున్నారు? అంతకంటే ఓ 15 బ్యాగుల పేలుడు పదార్థాలు తెచ్చి అందర్నీ ఒకేసారి చంపెయ్యండి’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీ ప్రస్తుతం నరకం కంటే దారుణంగా ఉందని, ఇతర దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయని ధర్మాసనం విచారం వ్యక్తం  చేసింది. ‘ఓ వ్యక్తి జీవితానికి మీరిచ్చే విలువ ఇదేనా..? మీకు కుర్చీలో కూర్చునే అర్హత లేదు’ అని దిల్లీ ప్రభుత్వంపై మండిపడింది. 

ఈ సందర్భంగా దిల్లీ చీఫ్‌ సెక్రటరీ వాదనలు వినిపిస్తూ.. రాజధానిలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాల కారణంగా పాలనపరమైన సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు తమ విభేదాలను పక్కనబెట్టి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సూచించింది. దిల్లీలో గాలి శుద్ధి టవర్ల ఏర్పాటుపై 10రోజుల్లోగా ప్రణాళిక రచించాలని స్పష్టం చేసింది. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.