close

తాజా వార్తలు

కంగారూల కొత్త లబ్‌..డబ్‌.. ‘లబుషేన్‌’

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి రికార్డుల మోత

ఒక ఆటగాడి నిషేధంతో జట్టులో చోటు దక్కింది. అతడు రాగానే చోటు పోయింది. మళ్లీ అతడి తలకే గాయం కావడంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు కీలకంగా మారిన ఆటగాడే మార్నస్‌ లబుషేన్‌. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో వరుస శతకాలతో విజృంభిస్తున్నాడు. ఆటతీరు, బ్యాటింగ్‌ శైలిలోనూ స్టీవ్‌స్మిత్‌ను తలపిస్తున్న అతడి కథేంటంటే...


స్మిత్‌ రాకతో..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నిషేధం తర్వాత స్టీవ్‌స్మిత్‌ రాకతో జట్టులో చోటు కోల్పోయాడు. యాషెస్‌ సిరీస్‌లో అదే స్మిత్‌ తలకు బంతి తగలడంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఇప్పుడు వరుస శతకాలతో చెలరేగి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో అతడు వరుసగా రెండు శతకాలు సాధించాడు. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న పోరులో 162 (238 బంతుల్లో) చేసిన అతడు 2019లో 829 పరుగులతో స్టీవ్‌స్మిత్‌నే అధిగమించడం గమనార్హం.


తొలి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. అప్పుడు జట్టులోకి అడుగుపెట్టాడు లబుషేన్‌. స్వతహాగా లెగ్‌ స్పిన్నరైన అతడు బ్యాటింగ్‌లోనూ సమర్థుడు. ఐతే 8 ఇన్నింగ్సుల్లో 26.25 సగటుతో 210 పరుగులే చేసి తుది జట్టులో చోటు చేజార్చుకున్నాడు. యాషెస్‌లో భాగంగా జరిగిన లార్డ్స్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ విసిరిన బౌన్సర్‌కు స్మిత్‌ తలకు గాయమైంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో తొలి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లబుషేన్‌ మైదానంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. ఆ సిరీస్‌లో మొత్తం మూడు అర్ధశతకాలతో చెలరేగాడు.


అనుకరణ అతడిదే

లబుషేన్‌ సహజంగానే స్మిత్‌ శైలిని అనుకరిస్తాడు. వికెట్ల ముందు ఫుట్‌వర్క్‌, బంతులను వదిలేసే విధానం, దేహభాష అచ్చం అలాగే ఉంటుంది. వీరిద్దరూ ఎక్కువ విషయాలను పంచుకుంటారట. బాగా మాట్లాడుకుంటారని మిగతా ఆటగాళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే లుబుషేన్‌ పాక్‌పై బ్రిస్బేన్‌ టెస్టులో 185, అడిలైడ్‌లో 162 పరుగులు చేశాడు. ప్రస్తుతం కంగారూ జట్టులో కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 2019 క్యాలెండర్‌ ఇయర్‌లో 63.76 సగటుతో ఇప్పటికే 829 పరుగులు చేసిన అతడు 1000 పరుగుల మైలురాయిని అధిగమిస్తాడని అంచనా. అతడి కెరీర్‌ సగటు 46.75తో పోలిస్తే ఈ ఏడాది సగటే ఎక్కువ. ఇక స్మిత్‌కు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లార్డ్స్‌ టెస్టు నుంచి 9 ఇన్నింగ్సుల్లో 77.77 సగటుతో 700 పరుగులు చేశాడు. డేవిడ్‌ వార్నర్‌తో కలిసి అడిలైడ్‌లో రెండో వికెట్‌కు 361 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు లబుషేన్‌. ఆసీస్‌ తరఫున రెండో వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఆసీస్‌ డిసెంబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఆ సిరీస్‌లో లబుషేన్‌ రికార్డులు సృష్టిస్తాడని అనుకుంటున్నారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.