close

తాజా వార్తలు

డాష్‌బోర్డ్‌ ఏం చెబుతోంది ?

కారు కదలాలంటే కీ ఇచ్చేది అక్కడే... చక్రాలు ఏ దిశలో కదలాలో నిర్దేశించేది ఆ ప్రాంతమే... లోపలున్నవారికి చల్లని గాలులు వీచేది అక్కడినుంచే...  ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే ఎయిర్‌బ్యాగ్‌ల స్థావరం అదే... వాహనం నాడీ పడుతూ ఎక్కడ   ఏ సమస్య ఉన్నా చెప్పేస్తుంది... ఇంతకీ ఏంటది? అతి కీలకమైన డాష్‌బోర్డ్డ్‌... దాంట్లో ఒక్కొక్క పార్ట్‌ తీసుకుందాం.. అదేం చెబుతుందో విందాం.. ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

కాకారులో ఎన్ని విభాగాలున్నా మొత్తం వాహనాన్ని అదుపు చేసే కీలక విభాగాలు ఉండేది డాష్‌బోర్డ్‌లోనే. అందుకే దీన్ని కంట్రోల్‌ ప్యానెల్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ ప్యానెల్‌ అని కూడా అంటారు. ఇంజిన్‌ కీ నుంచి స్టీరింగ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, ఏసీ వెంట్‌లు, కంట్రోల్‌ మీటలు, యుటిలిటీ ట్రే, ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు హై-ఎండ్‌ కార్లలో అయితే సెంటర్‌ కన్‌సోల్‌ గేర్‌ షిఫ్టింగ్‌ లీవర్‌ కూడా ఇందులోనే అమరిపోతాయి.

సూచికలు.. మార్గదర్శులు

డాష్‌బోర్డు అనగానే అందరికీ గుర్తొచ్చేది వేగం చూపించే మీటర్‌, ఇంధనం ఎంతుందో చెప్పే మీటర్‌. ఇవేకాదు.. చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి.

ఏం చెబుతోంది?: స్పీడో మీటర్‌.. టాకో మీటర్‌.. ఆయిల్‌ లెవెల్‌ మీటర్‌.. మిగతా సమాచారం సూచించే డిస్‌ప్లేలు ఇందులోనే ఉంటాయి. వీటితోపాటు బండిలో లోపాలుంటే ఆ విషయం చెబుతుంటాయి ఇండికేటర్లు. ఎరుపు రంగులో మిణుకుమిణుకుమంటూ మనల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాయి. ఆ సంజ్ఞల సారం తెలిస్తే మనం కారు నాడీ పట్టేయొచ్చు. టైర్లలో గాలి తగ్గినా, ఇంధనం ఖాళీ అయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా, ఏబీఎస్‌లో తేడా వచ్చినా, బ్యాటరీ బాగోకపోయినా.. ఇలాంటి దాదాపు ముప్ఫై ఇండికేటర్లు డిస్‌ప్లే మీద ప్రత్యక్షమవుతూ హెచ్చరిస్తూనే ఉంటాయి. వీటిపై పూర్తి అవగాహన ఉంటే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. మెకానిక్‌తో అవసరం తగ్గిపోతుంది.

స్టీరింగ్‌తో మీ రూటు

స్టీరింగ్‌ లేకపోతే కారు అంగుళమైనా కదలదు. అంతటి ముఖ్యమైన విభాగం డాష్‌బోర్డులోదే.

ఏం చెబుతుంది?: ఇప్పుడొచ్చే కార్లలో దాదాపు అన్నీ పవర్‌స్టీరింగ్‌వే. వీటితో ఎంత సౌలభ్యం ఉంటుందో నిర్వహణ సరిగా లేకపోతే సమస్యలూ అంతేనంటారు వాహనరంగ నిపుణులు. ఇందులో ఉండే ప్రధాన సమస్య స్టీరింగ్‌ రాడ్డు అడుగుభాగంలో ఉండే ర్యాక్‌ సీల్స్‌ చిరిగి పోతుంటాయి. దీంతో స్టీరింగ్‌ బిగుసుకు పోతుంది లేదా మనం తిప్పకుండానే అటూఇటూ తిరుగుతుంది.  ఈ సమస్య ఉంటే సీల్స్‌ వెంటనే మార్చేయాలి. దాంతోపాటు స్టీరింగ్‌ చక్రం తిప్పుతున్నపుడు విపరీతమైన శబ్దం వస్తున్నా, వణుకుతున్నా స్టీరింగ్‌ ర్యాక్‌ మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం. సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి. కాలం చెల్లిన స్టీరింగ్‌ ఫ్లూయిడ్‌లు సమయానుకూలంగా మార్చితే ప్రయాణం సాఫీగా ఉంటుంది.

ఎండల్లో హాయ్‌హాయ్‌

వేసవిలో చల్లగాలినిస్తూ, చలికాలంలో వెచ్చని వాతావరణం కల్పిస్తూ మనకు హాయినిచ్చేవి ఏసీ వెంట్‌లు.

ఏం చెబుతున్నాయి?: బయటి నుంచి వచ్చే గాలిని వడగట్టి మనకు కావాల్సినట్టుగా చల్లని, వెచ్చని గాలిని అందించేవివి. వాహనం పాతబడేకొద్దీ వెంట్‌ల్లో దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. పనితీరు మందగిస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందే. దీనికోసం అప్పుడప్పుడు డాష్‌బోర్డు వెనకాల ఉండే ఏసీ వెంట్‌ డక్ట్స్‌ని విప్పదీసి బాగుచేసి మళ్లీ బిగించాలి.

ప్రాణాలకు రక్ష

భద్రతా ఫీచర్లలో ముఖ్యమైంది ఎయిర్‌బ్యాగ్‌. స్టీరింగ్‌ వెనకాల, డ్రైవర్‌ పక్కన కూర్చునే పాసింజర్‌కి ఎదురుగా ఉండే రెండు ఎయిర్‌బ్యాగ్‌ల స్థావరం డాష్‌బోర్డ్‌నే.

ఏం చెబుతోంది: మనం ప్రమాదంలో పడినపుడు మన ప్రమేయం లేకుండా తెరుచుకొని ప్రాణాలు కాపాడేవి ఎయిర్‌బ్యాగ్‌లు. ఇవి మన గురించి జాగ్రత్తపడతాయి తప్ప వీటికోసం మనం ప్రత్యేకంగా జాగ్రత్త పడాల్సిన పనేం లేదు. వీటి పనితీరు, సెన్సర్లలో ఏదైనా లోపం ఉంటే డాష్‌బోర్డ్‌ డిస్‌ప్లేలో ఆ గుర్తు ప్రత్యక్షమవుతుంటుంది. ఆలస్యం చేయకుండా మెకానిక్‌ని సంప్రదించాల్సిందే. ఇక కారు ఏదైనా ప్రమాదానికి గురైనపుడు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయి. అప్పుడు డాష్‌బోర్డ్‌ డ్యామేజీ అవుతుంది. మరమ్మతు చేసి పూర్తిగా మార్చాల్సి ఉంటుంది.

వినోదం.. విషయం

ఈరోజుల్లో ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌లు లేని కార్లు అరుదు. నాలుగు నుంచి పదిహేను అంగుళాల తెరలున్న ఈ వినోద సాధనాలు ఓనర్లు, ప్రయాణికులను అలరిస్తున్నాయి.

ఏం చెబుతోంది: ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అంటే వినోదంతోపాటు విలువైన సమాచారం అందించే పరికరం. జీపీఎస్‌తో అనుసంధానమైతే మనకు దారి చూపుతుంది. కారుని పార్కింగ్‌ చేస్తున్నపుడు కెమెరాగా పని చేస్తుంది. వాహనంలో ఇంధనం ఎంత ఉందో చెబుతుంది. ఎంతదూరం ప్రయాణించామో లెక్కగడుతుంది. డోర్‌ పడకపోయినా అరిచి హెచ్చరిస్తుంది. ఇంతేకాదండోయ్‌.. దీన్ని మన స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకొని ఫోన్‌లా వాడుకోవచ్చు. సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు. ఇంత సౌకర్యంగా ఉండే వీటిలోనూ వాయిస్‌ కంట్రోల్‌ పనిచేయకపోవడం, తెర బ్లాంక్‌ అవడం, నావిగేషన్‌ లోపంలాంటి సమస్యలుంటాయి. ఓ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లా భావించి జాగ్రత్తగా వాడితే సగం సమస్యల్నుంచి గట్టెక్కినట్టే.

చేయండిలా

* ఎక్కువరోజులు శుభ్రం చేయకపోతే డాష్‌బోర్డ్‌ జిడ్డులా మారుతుంది. మూలల్లో, ఏసీ వెంట్‌ల్లో హానికారక బ్యాక్టీరియా పోగవుతుంది. నెలకోసారైనా గోరువెచ్చని నీటిలో మైల్డ్‌సోప్‌ కలిపి మెల్లిగా రుద్దుతూ శుభ్రం చేయాలి. స్పాంజ్‌కి బదులు మైక్రోఫైబర్‌ క్లీనింగ్‌ క్లాత్‌ ఉపయోగిస్తే మంచిది.
* ఎక్కువ కార్లలో డాష్‌బోర్డ్‌ని యురేథాన్‌ ఫోమ్‌ మీద వినైల్‌ కవర్‌ వేసి తయారు చేస్తారు. దీనిపై తరచూ ఎండ వేడి తగులుతుంటే పగుళ్లు ఏర్పడతాయి. రంధ్రాలు పడతాయి. అందుకే ఎప్పుడైనా కారుని ఎండ పడని ప్రదేశాల్లోనే నిలిపి ఉంచాలి.
* డాష్‌బోర్డ్‌ మీద చిన్నచిన్న రంధ్రాలు, పగుళ్లు అసహ్యంగా కనిపిస్తాయి. వాటిపై వినైల్‌ పెయింట్‌ వేస్తే కొత్తదానిలా తళతళలాడుతుంది. అక్కడ లిక్విడ్‌ మెటల్‌ ఫిల్లర్‌, సిమెంట్‌ మిక్స్చర్‌, ఎపోక్సీ, వినైల్‌ డైలతో ప్యాచ్‌లు వేసి కొత్తదానిలా చేసుకోవచ్చు.
* వినైల్‌ క్లీనర్‌తో వాహనం సీట్లు, ఇంటీరియర్లు శుభ్రం చేస్తుంటారు. దీంతోనే డాష్‌బోర్డ్‌ని తుడిస్తే అలర్జీ కారక బ్యాక్టీరియాలు చనిపోతాయి.
* ఖరీదైన కార్లలో ఉండే ఎయిర్‌ క్వాలిటీ సెన్సర్లు బయటి నుంచి లోపలికొచ్చే గాలిని శుభ్రం చేసి ఏసీల్లోకి పంపిస్తాయి. కానీ ఎక్కువ కార్లలో ఈ సౌలభ్యం ఉండదు.  ఏసీ వెంట్లలో దుమ్ము, ధూళి పేరుకుపోయి శ్వాసకోస రోగాలకు కారణమవుతాయి. అందుకే సీజన్‌ మారినప్పుడల్లా ఏసీ వెంట్‌లను బయటికి తీసి శుభ్రం చేయించాలి.

* డాష్‌బోర్డులో, దాని వెనకాల ఉండేవన్నీ ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత విడిభాగాలే. ఇందులో తేమ చేరితే త్వరగా పాడవుతాయి. కాబట్టి నీరు, కాఫీటీలు, కూల్‌డ్రింక్స్‌లాంటి తేమ పదార్థాలు దానిపై పడకుండా, ఎక్కువ సేపు నిలిచి ఉండకుండా చూసుకోవాలి.
* కారులో ఏసీని వాడకపోతే కూలంట్‌లు లీకేజీ అవుతాయి. వెంట్‌ల్లో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దుమ్ము ఎయిర్‌ఫ్లోకి అడ్డు పడుతుంది. కారు వాడినా, వాడకపోయినా అప్పుడు ఏసీ వెంట్‌లను ఆన్‌/ఆఫ్‌ చేస్తుండాలి.


 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.