close

తాజా వార్తలు

కారుచిచ్చులో పడొద్దు!

'

మొన్న బెంగళూరులో వైమానిక ప్రదర్శనలో ప్రమాదం...
నిలిపి ఉంచిన వందల కార్లు, బైక్‌లు దగ్ధం!
నిన్న చెన్నై కంపెనీలో దుర్ఘటన...
పార్కింగ్‌ చేసిన నూటా యాభై కార్లు అగ్నికి ఆహుతి!!
ఇవే కాదు.. నిత్యం ఎక్కడో ఒకచోట వాహనాలు మంటల్లో కాలిపోతూనే ఉన్నాయి... విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి...ఎందుకిలా? లక్షలు పోసి కొన్న వాహనాలకు రక్షణ లేకపోతే ఎలా? ఈ అగ్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గమెలా? ఆ దుస్థితి రాకుండా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సమగ్ర వివరాలతో ఈవారం కథనం.

ముందుంది వేసవి. అగ్నిప్రమాదాలకు ఆస్కారమున్న కాలం. బైక్‌ మంటల్లో కాలిపోయిందనో, కార్లో మంటలు చెలరేగాయనో.. తరచూ వార్తలు వింటూ ఉంటాం. ఆ దుర్ఘటనల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ‘అయ్యో పాపం’ అనుకుంటాం. మనకూ ఆ పరిస్థితి రాకముందే మేల్కొందాం. అగ్నికి ఆజ్యం పోసే శత్రువుల జాడ తెలుసుకొని తగిన విధంగా సంసిద్ధమవుదాం.


 

ప్రమాదాలే హేతువులు

వాహనాల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రోడ్డుప్రమాదాలు. ఇతర వాహనాలు లేదా దేన్నైనా బలంగా ఢీకొట్టినపుడు ఆ రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడతాయి. అదేసమయంలో హుడ్‌ కింద ఉండే ఫ్లూయిడ్‌లు, ఇంధనాలు, ఇంజిన్‌, బ్యాటరీ, గ్యాస్‌ట్యాంక్‌లాంటివన్నీ చెల్లాచెదురవుతాయి.  ఆ ఘర్షణలో చిన్న నిప్పురవ్వ వీటిపై పడినా క్షణాల్లో మంటలు వ్యాపించే అవకాశం ఉంది. పెట్రోల్‌/ఇంజిన్‌ ట్యాంకుల్లో లీకేజీ అయినా మంటలు ఎగిసిపడతాయి. నిప్పు, ఇంధనాలు ఒకదానికొకటి జత కలిస్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.


 

బ్యాటరీలతో జాగ్రత్త

ప్రస్తుతం హైబ్రిడ్‌, విద్యుత్తు బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి, వినియోగదారుడికి మేలు చేయొచ్చుగానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టం అపారం అంటారు వాహనరంగ నిపుణులు. కాలపరిమితి ముగిసినవి, నాణ్యతలేని బ్యాటరీలతో మంటలు త్వరగా చెలరేగుతాయి. బ్యాటరీ కార్లలో అత్యంత సురక్షితమైందిగా గుర్తింపు పొందిన టెస్లా ఎస్‌ కూడా 2013లో మంటల్లో కాలిపోయింది. అంతకుముందు షెవర్లే వోల్ట్‌ మోడల్‌ అయితే టెస్ట్‌డ్రైవ్‌ చేస్తుండగానే మంటల్లో చిక్కుకుంది. కూలంట్‌లు లీకేజీలు, కాలపరిమితి ముగిసిన వాటిని వెంటనే మార్చడం పరిష్కారం.


 

వేడి పెరగనీయొద్దు

వాహనంలో అత్యంత ఉష్ణోగ్రత ఉండేవాటిలో కాటలిటిక్‌ కన్వర్టర్‌ ఒకటి.ఇది కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లాంటి విషపూరిత వాయువులను వడగట్టి కాలుష్యపు పొగను బయటికి పంపిస్తుంటుంది. దానికి ముందుండేది ఇంజిన్‌. ఇదీ ఉష్ణకేంద్రమే. స్పార్క్‌ప్లగ్‌లు, ఇతర పార్ట్స్‌లో ఏదైనా లోపం ఉంటే ఇంజిన్‌లో ఇంధనం సరిగా మండదు. అత్యధిక వ్యర్థాలు పోగవుతాయి. అప్పుడు భారమంతా కాటలిటిక్‌ కన్వర్టర్‌పై పడుతుంది. సాధారణంగా 900 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో వేడిగా ఉండే ఈ విభాగం 1100 డిగ్రీలకు చేరుతుంది. దీంతో చుట్టుపక్కలుండే హీట్‌ షీల్డ్‌లు, మెటల్‌ ఫ్లోర్‌ ప్యాన్‌లు వేడెక్కి క్యాబిన్‌ ఇన్సులేషన్‌, కార్పెటింగ్‌లను కూడా దహించి వేస్తాయి. సీళ్లు, గ్యాస్కెట్‌లు లీకైనపుడు.. రేడియేటర్‌ సరిగా పనిచేయకపోయినా ఇంజిన్‌ వేడెక్కుతుంది.విద్యుత్తు లోపాలు

వాహనాలు మంటల్లో చిక్కుకోవడానికి మరో ప్రధాన కారణం ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌ పాడవడం. బైక్‌కి హెడ్‌లైట్‌ నుంచి టెయిల్‌ లైట్‌ దాకా ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ విస్తరించి ఉంటుంది.  కారులో అయితే బ్యానెట్‌ కింద, ఇంటీరియర్‌లో, డోర్లు, కార్పెట్‌ కింద, సీట్ల కింద.. ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఒక్కసారి షార్ట్‌సర్క్యూట్‌ జరిగితే క్షణాల్లో వాహనమంతా మంటలు చెలరేగుతాయి. ఊహించని ప్రమాదం జరుగుతుంది. గ్యాస్‌లు లీక్‌ కావడం.. గ్యాస్కెట్‌, రేడియేటర్లలో పగుళ్లు సైతం మంటలు పుట్టడానికి కారణమవుతాయి. 


 

లీకేజీలు ఆపుదాం

పెట్రోల్‌/డీజిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌, ట్రాన్స్‌మిషన్‌ ఫ్లూయిడ్‌, పవర్‌స్టీరింగ్‌ ఫ్లూయిడ్‌, బ్రేక్‌ ఫ్లూయిడ్‌, కూలంట్‌.. ఇవన్నీ కారు నడుస్తున్నపుడు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు సర్క్యులేట్‌ అవుతుంటాయి. ఇవి ప్రవహించే ద్వారాలు, పైపులు, నిల్వ ఉండే రిజర్వాయర్లు పాడై లీకేజీ అయినా, పగిలిపోయినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. పెట్రోల్‌ సాధారణంగా 7.2డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. మండినపుడు 258 డిగ్రీలకు చేరుకుంటుంది. దీన్ని బట్టి మంట ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాస్ట్‌ పైపులో పెట్రోల్‌/డీజిల్‌ లీకేజీ ఉన్నా కూడా మంటలంటుకోవడానికి కారణమవుతుంది.


ప్రమాదంలో చిక్కుకుంటే..

గాబరా, కంగారు పడొద్దు. వాహనాన్ని ఎడమపక్కకు తీస్కెళ్లి ఆపాలి. ఒకవేళ బానెట్‌ నుంచి పొగలు వస్తున్నా, చిన్నగా మంటలు మొదలైనా ఇంజిన్‌ ఆఫ్‌ చేయాలి. బానెట్‌ని ఎత్తి ఇంజిన్‌ చల్లబడేవరకూ అలాగే ఉంచాలి. కూలంట్‌ రిజర్వాయర్‌ ట్యాంక్‌ని తెరిచి తగినంత ఉందో లేదో ఓసారి పరిశీలించాలి. ఈ సమయంలో రేడియేటర్‌ ప్రెషర్‌ మూత చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా గుడ్డతో దాన్ని తీయాలి. ఇంజిన్‌ చల్లబడేవరకు ఎదురుచూడాలి. ఈలోగా అత్యవసర సర్వీసులైన 101, 108లకు ఫోన్‌ చేయాలి. స్థానికుల సాయం తీసుకుంటే మంచిది. మంటలు పెరిగితే వాహనం నుంచి దూరంగా వెళ్లిపోవడమే మంచిది. హీరోలాగా ఫీలై ఒంటరిగా మంటలార్పే ప్రయత్నం చేయొద్దు. ఒక్కోసారి పేలుళ్లు సంభవించవచ్చు. 


ఇలాచేస్తే కూల్‌కూల్‌

* వాహనాలను నిర్ణీత సమయానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాలి. ఆ సమయంలో పాడైపోయిన ఎయిర్‌ ఫిల్టర్లు, ఆయిల్‌ ఫిల్టర్లు, ఇంజిన్‌ కూలంట్‌, ఇంజిన్‌ ఆయిళ్లు మార్చుతారు. ఇవి భవిష్యత్తు ప్రమాదాలను నివారిస్తాయి.
* లిక్విడ్‌/ఫ్లూయిడ్‌ లీకేజీలను తరచూ పరిశీలిస్తూ సరిచేసుకుంటే ఓవర్‌హీటింగ్‌ సమస్యలు తీరతాయి. ప్రమాదం జరగకుముందే మేల్కొనవచ్చు.
* వాహనాలను డీలర్లకు సంబంధించిన అధీకృత సర్వీసింగ్‌ సెంటర్‌లోనే సర్వీసింగ్‌ చేయించడం మేలు. దీంతో రీకాల్‌ నోటీసులు, డిజైన్‌, కాంపోనెంట్‌ సమస్యలు ఏవైనా ఉంటే వాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.
* బైక్‌, కారు.. ఏదైనా విద్యుత్తు ఉపకరణాలు ఏమేం అవసరం ఉంటాయో అన్నీ వాహనంతోపాటే వస్తాయి. కొత్తగా చేర్చాల్సిన పన్లేదు. అదనంగా వచ్చే వాటితో అదనపు ముప్పుగా భావించాలి. ఏవైనా కొత్త గ్యాడ్జెట్లు, యాక్సెసరీలు బిగించాలనుకుంటే ఆథరైజ్డ్‌/క్వాలిఫైడ్‌ సర్వీస్‌సెంటర్‌ని సంప్రదించాలి.
* అందాన్ని రెట్టింపు చేసే మోడిఫికేషన్ల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధారణంగా వీటిలో నకిలీవే ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాటరీ నిర్జీవం చేయడమే కాదు.. అగ్నిప్రమాద  సమయంలో తీవ్రతను పెంచుతాయి.
* వేసవిలో ఏసీల వాడకం ఎక్కువ. వీటిని ఎక్కువ సమయం, హై మోడ్‌లో పెడితే కంప్రెషర్‌ మీద భారం ఎక్కువై ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. వీలైతే మధ్యమధ్యలో  ఆఫ్‌ చేస్తూ ఉండాలి.
* వేసవి మొదలవడానికి ముందే ఓసారి ఏసీ డక్ట్స్‌, రిఫ్రిజిరెంట్‌ లెవెల్స్‌ని చెక్‌ చేసి సర్వీసింగ్‌ చేయించాలి. అంతకుముందు చాలాకాలంపాటు ఏసీ సరిగా వాడకుండా ఉండటంతో అందులో వ్యర్థాలు అడ్డుపడి ఉంటాయి. అలాగే ఉపయోగిస్తే సిస్టమ్‌ మొత్తం వేడెక్కే ప్రమాదం ఉంది.
* హానికారక వాయువులను వడకట్టే క్యాటలిటిక్‌ కన్వర్టర్‌, బయటికి వదిలే పొగగొట్టాలు అత్యధిక వేడితో ఉంటాయి. కంబషన్‌ ప్రక్రియతో వీటిలో అత్యధిక ఉష్ణం పుడుతుంది. ఏమాత్రం తేడా  వచ్చినా మంటలు చెలరేగేందుకు ఇవి ప్రధాన కారణమవుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించినపుడు మధ్యమధ్యలో కాస్తవిరామం తీసుకోవాలి.
* ఎండుగడ్డి, ఇంధనాలు, త్వరగా మంటలంటుకునే స్వభావం ఉన్న వస్తువుల దగ్గర వాహనాలను పార్కింగ్‌ చేయొద్దు. ఇంజిన్‌ ఆన్‌లో ఉంచకూడదు. చిన్న నిప్పురవ్వ పడ్డా మంటల తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ ఉన్న ప్రదేశాల్లోనే బండ్లను పార్క్‌ చేయాలి.

* నిర్లక్ష్యం చేయకుండా కారులో మంటలార్పే యంత్రం తప్పకుండా అందుబాటులో ఉంచుకోవాలి. వాహనాల్లోంచి పెట్రోల్‌, డీజిల్‌లాంటి వాసన వస్తుందంటే ఎక్కడో లీకేజీ అవుతుందని అర్థం. తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వాహనాన్ని పక్కన ఆపి లీకేజీ సమస్య పరిష్కారం చేసిన తర్వాతే బండిని ముందుకు కదిలించాలి.
* వాహనాలపై మోతాదుకు మించి భారం వేయకూడదు. అత్యధిక బరువులు వేసి ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంజిన్‌ వేడెక్కుతుంది. వైర్లు కరుగుతాయి. టైర్లు పగలి ఒక్కోసారి అగ్గి కూడా పుడుతుంది.

హర్షిన్‌ లాల్‌పేట్‌, ఆటోమొబైల్‌ రంగ నిపుణుడు

రెండువారాల్లో బీమా

సమగ్ర బీమా పాలసీ (కాంప్రెహెన్సివ్‌) తీసుకున్న వాహనం అగ్నిప్రమాదంలో ఎంత నష్టపోయినా పరిహారం అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారు బీమా కంపెనీకి సమాచారం అందించాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీ, ప్రమాద వివరాలు, నష్టపరిహారం.. తదితర వివరాలు పూరించిన క్లెయింఫాం జత చేసి బీమా కంపెనీకి సమర్పించాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే రెండువారాల్లో బీమా పరిహారం అందుతుంది. బండి పాక్షికంగా కాలిపోతే బీమా కంపెనీ ప్రతినిధులు వచ్చి ప్రాథమిక సర్వే చేసి వాహనానికి జరిగిన నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనా వేస్తారు. ఏవైనా కారణాలతో పరిహారం నిరాకరిస్తే కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద న్యాయస్థానాన్ని మనం ఆశ్రయించవచ్చు. కొందరు కావాలనే చెడు ఉద్దేశంతో బండిని తగలబెట్టుకుంటారు. అలాంటపుడు క్లెయిమ్‌కి అనర్హులవుతారు.
- బైరపనేని నరేష్‌, అడ్వొకేట్‌ వాహన బీమా రంగ నిపుణులు

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.