close

తాజా వార్తలు

భద్రత..భద్రమిక!

ఎయిర్‌బ్యాగ్‌ లేనిదే కారు కదలదు...ఏబీఎస్‌ లేనిదే బైక్‌ ముందుకెళ్లదు...బండి నడవాలంటే భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేే... ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా పది వరకు ఫీచర్లు ఉండాల్సిందే... ప్రమాదాలు తగ్గించడానికే ఈ నిబంధనలంటోంది ప్రభుత్వం...డెడ్‌లైన్‌లూ వచ్చేశాయి.. వీటితో రోడ్డుపై రాజాలా దూసుకెళ్లొచ్చు... ఇంతకీ ఏంటవి? ప్రయోజనాలేంటి? ఎప్పట్నుంచి అమల్లోకి వస్తున్నాయి?


148,000
రోడ్డుప్రమాదాల కారణంగా భారత్‌లో గతేడాది చనిపోయినవారి సంఖ్య. ఇది ప్రపంచంలోనే అధికం. ఈ అపకీర్తి తగ్గించుకుంటూ.. రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలో కోల్పోయేవారి సంఖ్యను రెండేళ్లలో సగానికి తగ్గించాలనుకుంటోంది ప్రభుత్వం. అందుకే మన రోడ్లపై తిరిగే కార్లు, ద్విచక్రవాహనాల్లో భద్రతా ప్రమాణాల సంఖ్యను ఏటికేడు పెంచుకుంటూ వస్తోంది. ఈ నిర్ణయం ఆర్థికంగా కొంత భారమైనా ప్రయాణికుడి ప్రయోజనం దృష్ట్యా అమల్లోకి తేవడానికి వాహన తయారీదారులు సైతం ఆచరణలో సహకరిస్తున్నారు.
ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, సీటు బెల్ట్‌ రిమైండర్‌.. చెప్పుకుంటూ పోతే వాహనాల్లో దాదాపు ఇరవైవరకు సేఫ్టీ  ఫీచర్లుంటాయి. ఒక్కో భద్రతా ఫీచర్‌ పెరిగితే ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గుతుందంటారు నిపుణులు. అయితే ప్రస్తుతానికి ఎక్కువ ఫీచర్లు విలాసవంతమైన కార్లలోనే అందుబాటులో ఉన్నాయి. బేసిక్‌ కారుకి, 125సీసీ సామర్థ్యం దాటిన ద్విచక్ర వాహనాలకూ  ఈ ప్రమాణాలు అమలు చేసేలా నిబంధనలు సవరించారు. వాహన తయారీదారులకు కొంత గడువునిచ్చారు. భవిష్యత్తులో తప్పనిసరి కాబోతున్న   ఆ సేఫ్టీ ఫీచర్లు ఏంటంటే.


 

రివర్స్‌ తిప్పలు తప్పుతాయి
రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు: పార్కింగ్‌ చేస్తున్నపుడో, వెనక్కి తీస్తున్నపుడో వాహనం చక్రాల కిందపడి పిల్లలు చనిపోయే సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపేదే రివర్స్‌ పార్కింగ్‌ సెన్సర్లు. బండి వెనక దేనికైనా తగిలినా డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. కారుని వెనక్కి తీసుకున్నపుడు ఏదైనా వస్తువు, మనుషులు సమీపంలోకి వచ్చినపుడు సెన్సర్లు అలర్ట్‌ అవుతాయి. పెద్దగా బీప్‌ శబ్దం వస్తుంటుంది.
గడువు: జులై 1, 2019


 

ప్రమాదాలకు అదుపు
ఏబీఎస్‌: వేగంగా వెళ్తున్న కారుకి అకస్మాత్తుగా బ్రేక్‌లు వేస్తే బండి అదుపు తప్పి పల్టీలు కొడుతుంది. నియంత్రణ కోల్పోయి ముందున్న వాటిని ఢీకొడుతుంది. బ్రేక్‌ వేసినపుడు ఆ ఫోర్స్‌ నాలుగు చక్రాలపై ఒకేసారి పడటంతో అలా జరుగుతుంది. అదే యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఫీచర్‌తో బ్రేకింగ్‌ శక్తి ఒక్కసారిగా కాకుండా సెకను విడిచి సెకనుకోసారి మెల్లిమెల్లిగా అప్లై అవుతుంది. చక్రాలు లాక్‌ కావు.  బ్రేక్‌ వేస్తూ, వదులుతూ ఉండటంతో వాహనం నియంత్రణలోకి వచ్చి అనుకున్న వైపు  తిప్పుకొని వెళ్లిపోవచ్చు.
గడువు: ఏప్రిల్‌ 1, 2019


 

వాహనంలో ఇరుక్కుపోమిక
సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ మాన్యువల్‌ ఓవర్‌రైడ్‌: సాధారణంగా సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌తో కారు తలుపులన్నీ మూసివేస్తుంటాం. అయితే ఒక్కోసారి విద్యుత్‌ వ్యవస్థ విఫలమైనపుడు డోర్లు ఓపెన్‌ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడుతుంది. లోపల చిన్నపిల్లలుంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటపుడు మాన్యువల్‌ ఓవర్‌రైడ్‌ ఫీచర్‌ ఉంటే మామూలుగా డోర్లు  తెరవడానికి అవకాశం ఉంటుంది.
గడువు: అక్టోబర్‌ 1, 2019


 

హెచ్చరించే అలారమ్‌
స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌: వాహన వేగం పెరిగినకొద్దీ డ్రైవరుకి నియంత్రించే శక్తి తగ్గుతుంది. 120కిమీ స్పీడ్‌ దాటినపుడు ప్రమాదం ఎదురైతే అదుపు చేయడం ఎనభైశాతం సాధ్యం కాదంటారు భద్రతా నిపుణులు. ఈ ప్రమాదాన్ని నివారించేదే స్పీడ్‌ వార్నింగ్‌ సిస్టమ్‌. 80 కిమీలు దాటితే ఈ స్పీడ్‌ అలారమ్‌ యాక్టివేట్‌ అయ్యి ప్రతి అరవై సెకన్లకోసారి మోగుతుంది. వంద దాటితే ఇంకా గట్టిగా, 120 దాటితే స్పీడ్‌ తగ్గించేవరకూ  అలారమ్‌ మోగుతూనే ఉంటుంది.
గడువు: జులై 1, 2019


 

మోటార్‌సైకిళ్లకూ ఏబీఎస్‌


125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే అన్ని ద్విచక్ర వాహనాలు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌)ను కలిగి ఉండాలన్నది నిబంధన. ఏప్రిల్‌ 1, 2018 నుంచి తయారయ్యే అన్ని వాహనాలకూ తప్పనిసరి చేసినప్పటికీ.. ఏప్రిల్‌ 1, 2019 నుంచి ప్రస్తుత మోడళ్లన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. 125 సీసీ కంటే తక్కువ మోడళ్లు కూడా తప్పనిసరిగా కాంబి-బ్రేకింగ్‌ వ్యవస్థ(సీబీఎస్‌)ను కలిగి ఉండాల్సిందే. రోడ్లపై టైర్లు పట్టు కోల్పోకుండా, బండి వేగంలో ఉన్నపుడు సడెన్‌ బ్రేక్‌ వేసినపుడు నియంత్రించేదే ఏబీఎస్‌.
గడువు: ఏప్రిల్‌ 2019


 

ప్రాణాలు గాల్లో కలవకుండా
ఎయిర్‌బ్యాగ్‌లు, సీటు బెల్టు రిమైండర్‌: కారు వేగంగా దేన్నైనా ఢీకొట్టినపుడు కళ్లు మూసి తెరిచేలోగా విచ్చుకొని వాహనంలో ఉన్నవారికి రక్షణ కల్పించేవి ఎయిర్‌బ్యాగ్‌లు. చాలా ప్రమాదాల్లో ఎయిర్‌బ్యాగ్‌ల కారణంగా ప్రాణాలు దక్కించుకున్నవారిని చూస్తుంటాం. ప్రస్తుతానికైతే డ్రైవరు సీటుకి ఎయిర్‌బ్యాగ్‌ ఉండటం తప్పనిసరని నిబంధన చేశారు. చోదకుడు, చోదకుడి పక్కన ఉన్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకునే  వరకూ హెచ్చరిస్తూ అలారమ్‌ మోగుతూ అప్రమత్తం చేసేదే సీటుబెల్ట్‌ రిమైండర్‌.
గడువు: జులై1, 2019


 

సత్తా తేలిపోతుంది
క్రాష్‌ టెస్ట్‌ నార్మ్‌ కంప్లైయన్స్‌: కొత్తగా తయారైన ఒక కారు మోడల్‌ భద్రతాపరంగా ఎంత సురక్షితమైనదో గ్లోబల్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం తేల్చి చెబుతుంది. కొత్త వాహనాలు ఈ పరీక్షను ఎదుర్కోవడం తప్పనిసరి కాబోతోంది. ఈ సంస్థ ఇచ్చే స్టార్‌ రేటింగ్‌ ఆధారంగా ఫైవ్‌స్టార్‌   పొందిన కార్లను అత్యుత్తమైనవిగా చెబుతారు. నిర్దిష్ట వేగంతో కారును ముందుకు పోనిస్తూ ముందుభాగం, ఇరుపక్కలా కారును ఢీకొట్టిస్తారు. లోపల కూర్చున్నవారు ఎంత సురక్షితంగా ఉన్నారో గమనించి రేటింగ్‌ ఇస్తారు.
గడువు: అక్టోబరు 1, 2019

- బెజవాడ వెంకటేశ్వర్లు

 

ప్రయోజనాలే ఎక్కువ
ప్రభుత్వం చెబుతున్న భద్రతా ప్రమాణాలు పాటిస్తే కార్ల ధరలు ఎనిమిది నుంచి పదిశాతం పెరుగుతాయని వాహన కంపెనీలు చెబుతున్నాయి. కానీ ఈ ఫీచర్లన్నీ ఉంటే దక్కే ప్రాణాల విలువ అమూల్యం. ఈ ఫీచర్లతో వాహనం బరువు పెరిగి మైలేజీ తగ్గే అవకాశం ఉందనే సందేహం ఉంది. ఆ లోటు పూడ్చడానికి తయారీ సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఏదేమైనా భద్రతా నిబంధనలు ఆహ్వానించదగ్గవి. అయితే ఫ్రంటల్‌ క్రాష్‌ పరీక్షలపై మరిన్ని కఠిన నిబంధనలు తీసుకురావాల్సి ఉంది.

 

- శేఖర్‌ విశ్వనాథన్‌, టయోటా కిర్లోస్కర్‌ వైస్‌ ఛైర్మన్‌


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.