close

తాజా వార్తలు

మెరుగై..మెరుపులా వచ్చాయి

యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌తో వచ్చిన మొదటి స్కూటీ ఏప్రిలియా ఎస్‌ఆర్‌ రేస్‌ 150...ఫీచర్లు పెంచి ధరలు తగ్గించిన రెనాల్ట్‌ క్యాప్చర్‌ 2019 ఎస్‌యూవీ...పేరు మార్చుకొని బుల్లెట్‌ వేగంతో దూసుకొచ్చిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ట్రయల్స్‌...అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యంగా మార్కెట్లోకి రంగప్రవేశం చేశాయి... అత్యధిక ఫీచర్లు, అందుబాటు ధరలు వీటి ప్రత్యేకత అంటున్నారు తయారీదారులు...ఓసారి సమీక్షిద్దాం రండి.



క్యాప్చర్‌ చేద్దాం

పది లక్షల్లో మంచి ఫీచర్లున్న ఎస్‌యూవీ ఏదని అడిగితే తప్పకుండా గుర్తొచ్చే పేరు రెనాల్ట్‌ క్యాప్చర్‌. అమ్మకాల్లోనూ ముందుంది. ఆ జోరు కొసాగించడానికి ఈ మోడల్‌కి ఎప్పటికప్పుడు మెరుగులద్ది అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తీసుకొస్తున్నారు. అలా ఈమధ్య రిలీజైందే క్యాప్చర్‌ 2019 అప్‌డేటెడ్‌ వెర్షన్‌.
రెండుకు కుదించి : గతంలో ఈ ఎస్‌యూవీలో నాలుగు మోడళ్లు ఉండేవి. అందులో ఆర్‌ఎక్స్‌ఎల్‌, ఆర్‌ఎక్స్‌టీ నిలిపివేసి ఆర్‌ఎక్స్‌ఈ, ప్లాటైన్‌ మోడళ్లు కొనసాగిస్తున్నారు.
వినోదం: ఏడు అంగుళాల తాకేతెరతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ మరింత అందంగా కనిపిస్తోంది. యాపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. క్యాబిన్‌లో మరింత నాణ్యమైన సీట్లు అమర్చి, రంగుల హంగులద్దారు.
భద్రత: గతంలో ఉన్నట్టుగానే రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌లతోపాటు కొత్తగా రేయర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌, సీటుబెల్ట్‌ రిమైండర్‌, స్పీడ్‌ అలర్ట్‌ సిస్టమ్‌ కొత్తగా చేర్చారు.
ఇంజిన్‌: 1.5లీటర్ల 106హెచ్‌పీ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5లీటర్ల 110హెచ్‌పీ డీజిల్‌ ఇంజిన్లతో వచ్చాయి. వరుసగా 5స్పీడ్‌, 6స్పీడ్‌ గేర్‌బాక్స్‌లతో పని చేస్తాయి.
ధర: రూ.9.50లక్షల నుంచి రూ.13లక్షలు (గత ఆర్‌ఎక్స్‌ఈ మోడల్‌కి రూ.యాభైవేలు తగ్గించారు)
పోటీదారులు: నిస్సాన్‌ కిక్స్‌, టాటా హారియర్‌, హ్యుందాయ్‌ క్రెటా



బుల్లెట్‌ మారింది

బుల్లెట్‌.. అరవై ఏళ్ల నుంచి కుర్రకారు గుండెల్లో కొలువై ఉన్న బైక్‌. రాజసం.. వారసత్వం.. వ్యామోహం కారణం ఏదైనా ఇప్పటికీ దానికున్న క్రేజ్‌ తగ్గలేదు. ఆ ప్రత్యేకమైన మోడల్‌కే ఇంకొన్ని ఫీచర్లు జోడించి ‘ట్రయల్స్‌’ పేరుతో తీసుకొచ్చింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ట్రయల్స్‌ 350, ట్రయల్స్‌ 500 విశేషాలేంటంటే...
డిజైన్‌: ట్రయల్స్‌  500 మోడల్‌ ఫ్రేమ్‌లన్నింటికీ ఖాకీ ఆకుపచ్చ రంగు అద్దారు. మిగతా బాడీకి సిల్వర్‌తోపాటు క్రోమ్‌ ఫినిషింగ్‌తో బండి మెరిసిపోతోంది. 350ట్రయల్‌ మోడల్‌కి క్రోమ్‌తోపాటు క్యాండీ ఎరుపు రంగు అదనం. ఎత్తులో సీటింగ్‌, వెనక టెయిల్‌లైట్‌కి సమాంతరంగా పైకొచ్చిన ఎగ్జాస్ట్‌.. బైక్‌ రూపాన్నే మార్చేసింది. రైడర్‌ మాత్రమే కూర్చునేలా సింగిల్‌ సీటు, పిలియన్‌ సీటుకి బదులు లగేజీ ర్యాక్‌ ఇచ్చారు. హెడ్‌ల్యాంప్‌ ప్రొటెక్టర్‌ జాలీ, ఇంజిన్‌ గార్డ్‌, ఇంజిన్‌కి బురద చిమ్మకుండా బాష్‌ప్లేట్‌ అదనం. బండి 1948లో తయారైందని చెప్పడానికి గుర్తుగా సైడ్‌ ప్యానెళ్ల మీద 48 అంకె ముద్రించారు. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
ఇంజిన్‌: ఇందులో మార్పుల్లేవు. 499సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5,250ఆర్‌పీఎం మీద 27.2బీహెచ్‌పీ శక్తి విడుదలవుతుంది. డ్యుయెల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ బండి పూర్తి నియంత్రణకు, భద్రతకు చిరునామాగా ఉన్నాయి.
ప్రత్యేకత: ఇది ఆఫ్‌రోడ్‌ మోటార్‌సైకిల్‌. మట్టిరోడ్లు, గతుకుల రోడ్లు, పర్వతప్రాంతాలు, హైవేలు.. ఎలాంటి రోడ్లపై అయినా పరుగులు తీస్తుంది. టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, గ్యాస్‌ ఛార్జ్‌డ్‌ షాక్‌అబ్జార్బర్లు, 280ఎంఎం డిస్క్‌బ్రేక్‌లు.. కుదుపుల్లేని ప్రయాణం అందిస్తాయి. 135ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌ అనువుగా ఉంది.
ధర రూ.1.62 లక్షలు (ట్రయల్స్‌ 350), రూ.2.07లక్షలు (ట్రయల్స్‌ 500)



ఏబీఎస్‌ స్కూటీ

మోటార్‌సైకిళ్లలో అత్యంత ప్రాముఖ్యమైన భద్రతా ఫీచర్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌). ఇప్పటికీ చాలా మోటార్‌సైకిళ్లలో అందుబాటులో లేదు. కానీ మొదటిసారి ఒక స్కూటీ ఆ ఫీచర్‌తో వచ్చింది. అదే ఏప్రిలియా ఎస్‌ఆర్‌ 150.
రేసింగ్‌ టెక్నాలజీతో రూపొందించిన స్కూటర్‌ ఏప్రిలియా. ఏబీఎస్‌ దీని మొదటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సడెన్‌ బ్రేక్‌ వేసినా బండి స్కిడ్‌ కాకుండా ఇది కాపాడుతుంది. అరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే బ్రేక్‌ వేసిన 1.7సెకన్లలో పూర్తిగా ఆగిపోతుంది. సగం డిజిటల్‌, సగం ఎనలాగ్‌ మీటర్‌ అమర్చారు. అందులో ఓడోమీటర్‌, ట్రిప్‌ మీటర్‌, సమయం చూసుకోవచ్చు. లెగ్‌రూం విశాలంగా ఉంది. డబుల్‌ బ్యారెల్‌ హెడ్‌లైట్‌ ఉంది. అత్యధిక వెలుతురు కావాలనుకుంటే హై, లో బీమ్‌ లైట్లు రెండింటినీ ఒకేసారి ఆన్‌ చేసుకోవచ్చు. మోటా జీపీ స్ఫూర్తితో రూపొందించిన మూడురంగుల డిజైన్‌ ఆకర్షణీయంగా ఉంది. ముందు టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, రేయర్‌ షాక్‌అబ్జార్వర్‌లు సాఫీ ప్రయాణానికి సహకరిస్తాయి. నాణ్యమైన సీట్‌ కుషనింగ్‌, విశాలమైన స్థలం దీని సొంతం. మన స్మార్ట్‌ఫోన్‌లో ‘ఏప్రిలియా కనెక్టివిటీ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే బోలెడు లాభాలున్నాయి. ఛాసిస్‌, ఓనర్‌ వివరాలు పొందుపరుచుకోవచ్చు. సర్వీస్‌ సెంటర్లు, డీలర్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఫైండ్‌ మీ, నావిగేట్‌ ఫీచర్‌తో బండి ఎక్కడుందో కనుక్కోవచ్చు.
ఇంజిన్‌: 154.8సీసీ, 10.06 బీహెచ్‌పీ శక్తి
అత్యధిక వేగం: 105కిమీ/గం

- డీనోస్‌ వాల్ట్‌, ఆటోమొబైల్‌ బ్లాగర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.