close

తాజా వార్తలు

అలాయ్‌..‘భళా’య్‌!

స్పోక్స్‌ వీల్స్‌ మంచివా? అలాయ్‌కి ఓటేద్దామా? కొత్త బైక్‌ కొనాలనుకునే కుర్రాడికి గందరగోళం...ఏ రకం ఎంచుకుంటే మెయింటెనెన్స్‌ బాగుంటుంది?...కారు యజమాని సందేహం...సామాన్యుల నుంచి ఏళ్లకొద్దీ వాహనాలు వాడే వారి అనుమానాలివి... అన్నింటికీ సమాధానం వెతికాం.. నిపుణుల సలహాలూ జోడించాం... ఇదిగోండి ఆ సమగ్ర వివరాల సమాహారం.

పదిహేనేళ్ల కిందట అలాయ్‌ చక్రాలు అన్నమాటే అరుదు. హీరో కరిజ్మా, బజాజ్‌ పల్సర్‌లాంటి కొన్ని మోటార్‌సైకిళ్లలో ఈ తరహా చక్రాలు వచ్చినపుడు అంతా వింతగా చూశారు. ఇప్పుడు బేసిక్‌ కమ్యూటర్‌ బైక్‌ల్లోనూ అత్యధికం ఇవే. కార్ల విషయానికొస్తే ఈ ట్రెండ్‌ స్పోర్ట్స్‌ కార్లలో మొదలైంది. ప్రస్తుతం అన్ని కార్లనూ చుట్టేసింది. ధర ఎక్కువైనా అత్యధికులు వీటికే ఓటేస్తున్నారు. స్టీల్‌ రిమ్‌తో వచ్చే స్పోక్‌ చక్రాలు రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, హీరో మోటాకార్ప్‌లాంటి కొన్ని బ్రాండ్ల మోడళ్లకి మాత్రమే పరిమితమయ్యాయి. వెరైటీ లుక్‌ కోరుకునేవాళ్లు, ఆఫ్‌రోడ్డులో వాడేవాళ్లు వీటిని ఇష్టపడుతున్నారు. అలాయ్‌ చక్రాలపై మోజు పడేవారికి మార్కెట్లో చాలారకాలైనవి అందుబాటులో ఉన్నాయి. కానీ ఇందులో అత్యధికం నకిలీవే. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. నియో, ఔరా, ప్లేటీ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాణ్యమైన బ్రాండ్లు అంటున్నారు నిపుణులు.ఎందుకిష్టమంటే


ఏదేమైనా ప్రస్తుతం అలాయ్‌ చక్రాలదే హవా. ఎందుకు వీటి వాడకం పెరిగిపోతోందీ అంటే ఇలా చెప్పుకోవచ్చు.
తేలికైనవి: స్టీల్‌తో తయారయ్యే స్పోక్‌ వీల్స్‌తో పోలిస్తే అలాయ్‌ చక్రాల బరువు తక్కువ. దీంతో బండి బరువు తగ్గుతుంది. స్టీరింగ్‌పై నియంత్రణ ఉంటుంది. తద్వారా వాహనం మైలేజీ పెరగడానికీ అవకాశం ఉంటుంది.
సౌలభ్యం: స్పోక్‌ చక్రాలున్న వాహనానికి ట్యూబ్‌లెస్‌ టైర్లు అమర్చడం అసాధ్యం. అలాయ్‌కి మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. ట్యూబ్‌లెస్‌ టైర్లు అత్యధిక కాలం మన్నుతాయి. వేడిని తట్టుకుంటాయి. మైలేజీ ఎక్కువనిస్తాయనే విషయం తెలిసిందే.
అందం: అలాయ్‌ చక్రాల్లో రకరకాల డిజైన్స్‌ అందుబాటులో ఉంటాయి. కాస్మొటిక్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తమ్మీద వాహనం అందాన్ని పెంచుతాయి. తుప్పు, చిలుము పట్టవు. త్వరగా పాడవవు.
భద్రత: స్టీల్‌ చక్రాలు అత్యధికంగా ఉష్ణాన్ని గ్రహిస్తాయి. అది టైరుపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అత్యధిక వేడితో బ్రేక్‌లు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అలాయ్‌లో ఆ ఇబ్బంది ఉండదు.
మెరుగైనవి: స్టీల్‌ రిమ్‌లతో పోలిస్తే అలాయ్‌ చక్రాలతో షాక్‌అబ్జార్బర్లు, బ్రేక్‌ డిస్క్‌లు, డ్రమ్‌లపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. దీంతో వాహనం సస్పెన్షన్‌ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. బ్రేక్‌లు త్వరగా చల్లబడతాయి. వాటి పనితీరు మెరుగవుతుంది.
దృఢత్వం: బరువు తక్కువగా ఉంటాయి కదాని వీటి దృఢత్వం తక్కువ అనుకోవద్దు. ఇవి కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అత్యధిక వేగంలో మంచి స్థిరత్వాన్నిస్తాయి. మంచి మన్నిక కోసం

అలాయ్‌, స్పోక్స్‌.. రకం ఏదైనా వాహనం పూర్తి భారం మోసేవి చక్రాలే. అవి అత్యధిక కాలం మన్నికగా ఉండాలంటే...
*కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత చక్రాల మీద ఒకలాంటి దుమ్ము పొర పేరుకుపోతుంది. దీన్ని శుభ్రం చేయాలంటే సాధారణ అలాయ్‌ వీల్‌ క్లీనర్‌ సరిపోతుంది. ఒక బాటిల్‌ తీసుకుంటే ఐదారుసార్లు శుభ్రం చేయొచ్చు. మెరుగ్గా పని చేస్తుందనే ఉద్దేశంతో స్టాండర్డ్‌ వీల్‌ క్లీనర్‌ వాడితే అలాయ్‌ చక్రాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
* ఒక్కోసారి అలాయ్‌ చక్రాలపై ఆయిల్‌, నీటి మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. అలాగే తుప్పు పట్టినా బాగుండదు. ఇలాంటి వాటిని తొలగించేందుకు ఫోమింగ్‌ ఓవెన్‌ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. దీంతో కొద్ది నిమిషాల్లో మరకలు మటుమాయం అవుతాయి. ఇవి వాడే ముందు చేతికి గ్లౌజులు, కళ్లకు తగిన రక్షణ ఉండేలా చూసుకోవాలి.
* మొండి మరకలను పోగొట్టడానికి మరో దగ్గరి దారి వెనిగర్‌ లేదా నిమ్మ ద్రావణం. వీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి అలాయ్‌ చక్రాలపై చల్లాలి. ఒకట్రెండు నిమిషాల తర్వాత ఒక పొడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది.
* స్పోక్స్‌కైతే మొత్తం చక్రాన్ని ముందు శుభ్రంగా నీటితో కడగాలి. బురద, దుమ్ము పోయేలా చూడాలి. దీనికోసం హోస్‌కి సన్నని రంధ్రాలున్న మూత బిగించాలి. తర్వాత కాసేపు ఆరబెట్టాక మెత్తని పళ్లున్న డీటెయిలింగ్‌ బ్రష్‌తో సుత్తిమెత్తగా తుడవాలి.
* చక్రాలు ఎక్కువ కాలం మనగలగాలంటే ప్రొటెక్టివ్‌ సీలంట్‌లను అప్లై చేయాల్సిందే. మరకల్లేని మెరుపు కావాలంటే ఇలాంటి జాగ్రత్త తప్పనిసరి. శుభ్రంగా తుడిచిన తర్వాత సీలంట్‌ని అప్లై చేయాలి. దుమ్ము, గ్రీజు, తారులాంటివి అంటుకోకుండా ఇది కాపాడుతుంది. ఈ సీలంట్‌లు స్ప్రే, వాక్స్‌ రూపంలో లభిస్తాయి.
* తొందరగా బాగు చేయొచ్చనే ఉద్దేశంతో యాసిడ్‌లు వాడతారు. కానీ అవి క్షేమకరం కాదు. పైగా మొత్తం చక్రాలే డ్యామేజ్‌ అవుతాయి. వాడుతున్నపుడు అనుకోకుండా మనపై పడినా ప్రమాదం.
* మార్కెట్లో దొరికే చక్రాల్లో అత్యధికం నకిలీవే ఉంటున్నాయి. కాస్త ధర తక్కువని వీటిని తీసుకోవద్దు. ఎక్కువ కాలం ఉండాలన్నా, భద్రత కోరుకున్నా ఒరిజినల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ వాడితే వాటి మన్నిక, ఆయుఃకాలం ఎక్కువగా ఉంటుంది.దృఢమైన స్పోక్స్‌


అలాయ్‌కి అత్యధిక ఆదరణ ఉన్నా స్పోక్స్‌ చక్రాలతోనూ కొన్ని లాభాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే
అలాయ్‌తో పోలిస్తే స్టీల్‌ రిమ్‌తో ఉండే స్పోక్స్‌ చక్రాలకు దృఢత్వం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాలు, ఎగుడుదిగుడు రోడ్లు, ఆఫ్‌రోడింగ్‌ కోసం వీటినే ఉపయోగించాలన్నది నిపుణుల మాట. ఇవి డ్యామేజీ అయినా, వంగిపోయినా మరమ్మతు చేయడం తేలిక. అలాయ్‌ అలా కాదు. చక్రం కదలకుండా మొరాయిస్తుంది. పూర్తిగా మార్చాల్సిందే. మరమ్మతుల ఖర్చే కాదు.. మొత్తంగా స్పోక్స్‌ వీల్‌ ధర కూడా తక్కువే. వీటితో పోలిస్తే అలాయ్‌ చక్రాల ధర దాదాపు యాభైశాతం ఎక్కువ. దేని ప్రత్యేకత దానిదే

బ్రాండ్‌, ధర తేడా లేకుండా ఇండియాలో ఎక్కువమంది తమ వాహనాల్లో అలాయ్‌ చక్రాలే ఉండాలని కోరుకుంటున్నారు. అల్లాయ్‌ చక్రాలు అల్యూమినియం, మెగ్నీషియం, నికెల్‌ లోహాలతో తయారు చేస్తారు. మంచి లుక్‌, డిజైన్‌, మన్నిక.. వీటి ఎంపికకు కారణాలు. అయితే లాంగ్‌ టూర్లు వెళ్లేవాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవాళ్లు, ఆఫ్‌రోడింగ్‌ చేసేవాళ్లు, క్లాసిక్‌ లుక్‌ కావాలనుకునేవాళ్లు స్పోక్స్‌ చక్రాలవైపు మొగ్గు చూపితేనే మంచిది. అలాయ్‌ కన్నా స్పోక్స్‌లో దృఢత్వం ఎక్కువ. మంచి రోడ్డు కండీషన్‌ ఉన్నవారు.. స్టైల్‌కి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్లు అలాయ్‌ ఎంచుకోవచ్చు.

- విద్యా నంబిరాజన్‌, పారామౌంట్‌ ఆటోబే సర్వీసెస్ 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.