close

తాజా వార్తలు

సర్వీసింగ్‌ సెంటరా.. గ్యారేజీకెళ్దామా?

కొత్త వాహనం కొన్నపుడు ఎవరికైనా సంతోషమే... ఏదైనా సమస్య వచ్చినపుడే పెద్ద చిక్కొచ్చిపడుతుంది... సర్వీసింగ్‌ సెంటర్‌కి వెళ్లాలా? స్థానిక మెకానిక్‌ని సంప్రదించాలా? అని... ఖర్చు తగ్గడమెలా? నాణ్యమైన సేవలు అందేదెలా? ఉచిత సర్వీసులేంటి? తప్పనిసరిగా దేనికి డబ్బులు చెల్లించాలి? అన్నీ సందేహాలే. వాటికి సమాధానాలివిగో.

హేశ్‌ కారు కొన్నాడు. బంధుమిత్రులందరికీ స్వీట్లు పంచాడు. షికార్లు మొదలుపెట్టాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బండి వేగం కాస్త పెంచితే స్టీరింగ్‌ వణుకుతున్నట్టు అనిపించింది. మరమ్మతు కోసం అధీకృత సర్వీసింగ్‌ సెంటర్‌కి వెళ్లాలా? దగ్గర్లోని మెకానిక్‌ను సంప్రదించాలా? కారు దీర్ఘకాలం మన్నికగా ఉంటూ, జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అటు వెళ్లాలా.. ఇటు వెళ్లాలా? ఎటూ తేల్చుకోలేకపోయాడు. అందరిదీ ఇలాంటి సమస్యే. నిజానికి వాహనం బ్రాండ్‌ ఏదైనా సాధారణ మెకానిక్‌ షాప్‌తో పోలిస్తే అధీకృత సర్వీసు సెంటర్లలోనే ఖర్చెక్కువ. దానికి తగ్గట్టే మెరుగైన సేవలందుతాయి. అలాగని అన్నింటికీ ఇదే సూత్రం వర్తించదు. చిన్నచిన్న రిపేర్లకు తెలిసిన మెకానిక్‌ని సంప్రదిస్తేనే చాలు. దేని ప్రయోజనాలు దానికున్నాయి.

పోల్చి చూద్దాం

* మీ కారు కొత్తదై ఉండి... వారెంటీలో ఉంటే అధీకృత సర్వీసు సెంటర్‌కెళ్లడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి ఉండదు. అదే సమయంలో డెంటింగ్‌, పెయింటింగ్‌ వంటి వాటికి స్థానిక గ్యారేజీకెళితే మీరు అనుకున్నంత నాణ్యత కనిపించకపోవచ్చు. ఉదాహరణకు మీ కారుకు మెటాలిక్‌ పెయింట్‌ ఉండి అది స్థానిక వర్క్‌షాపులో రిపేరు చేయించినట్లయితే అది మచ్చలా ఉంటుంది తప్ప మిగతా రంగులో  కలవదు. నాణ్యమైన పని కావాలంటే అధీకృత సేవా సెంటరు వైపే నడవండి. డబ్బు గురించి ఆలోచించొద్దు. 
* వారెంటీ ఉన్నా.. వీల్‌ అలైన్‌మెంట్‌, బ్యాలెన్సింగ్‌, ఎయిర్‌ ఫిల్టర్లు మార్చడానికి, దూరప్రయాణాలు చేస్తున్నపుడు సాధారణ చెకప్‌లు.. ఇలాంటి పనులకు స్థానిక గ్యారేజీకి వెళ్లి మరమ్మతులు చేయించుకోవచ్చు. వీటన్నిటికి స్థానిక మెకానిక్‌ దగ్గరకు వెళ్లినా వారెంటీకొచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఒక వేళ మీరు వారెంటీలో లేనట్లయితే ఇక ఆలోచించకుండా.. రొటీన్‌ సేవలకు స్థానిక గ్యారేజీకి వెళ్లి డబ్బును ఆదా చేసుకోవచ్చు. అయితే విడిభాగాలు, ఆయిల్స్‌, ఫిల్టర్లు మీరే కొనుగోలు చేసుకుని మీ కారులో విడిభాగాలన్నీ అసలువే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. 
* వీటన్నిటినీ పక్కనపెడితే వాహనం మరమ్మతుకు ముందు రెండుచోట్లా వ్యయాలను పోల్చిచూడండి. ఏది మంచిదో నిర్ణయించుకోండి. ఎంతైనా డబ్బులు ఊరికే రావు కదా.

అధీకృత సేవాకేంద్రాల్లో..

వారెంటీ: కారు, ద్విచక్రవాహనం కొత్తది అయినపుడు ఉచిత సర్వీసులకు తప్పకుండా అధీకృత సర్వీసు సెంటరుకి వెళ్లాల్సిందే. అక్కడ మన వాహనానికి సంబంధించి సర్వీసింగ్‌, మరమ్మతుల డేటానంతా రికార్డు చేస్తుంటారు. ఒకవేళ మీరు ఆ నెట్‌వర్క్‌ బయట ఏదైనా కారణంతో రిపేరు చేయించుకున్న పక్షంలో ఆ వారెంటీని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వారెంటీలో ఉన్నంతకాలం అధీకృత సర్వీసు సెంటరుకు మాత్రమే వెళ్లాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఏవైనా విడిభాగాలు మార్చుకోవాలంటే.. వారెంటీలో మార్చుకోవచ్చు. లేబర్‌ ఛార్జీలు, ఇతరత్రా రుసుములు ఎక్కువగా ఉన్నా ఉచిత సర్వీసులతో పొందే ప్రయోజనాలు చాలా ఉంటాయి. 
నాణ్యమైన విడిభాగాలు: బ్రాండ్‌ ఏదైనా డీలర్ల దగ్గర విడిభాగాలు నాణ్యమైనవే ఉంటాయి. నకిలీల గొడవ ఉండదు. వీరికి ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ (ఓఈఎమ్‌)తో ముందస్తుగా ఒప్పందాలుంటాయి. స్థానిక గ్యారేజీలో అదే బ్రాండ్‌కు సంబంధించి విడిభాగాలు ఉండకపోవచ్చు. అప్పుడు మనమే బయటికెళ్లి వెతికి తెచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. బాడీ ప్యానెళ్లు కూడా ఇక్కడ తీసుకోవడమే మేలు. బయటి దుకాణాల్లో ఎక్కువశాతం నకిలీవే ఉంటాయి. తెలియనివాళ్లు మోసపోయే ప్రమాదం ఉంది. 
తిరిగి అమ్మాలంటే: మీ కారును అధీకృత సేవా సెంటర్లలోనే సర్వీసింగ్‌ చేయించడం వల్ల రీసేల్‌ సమయంలో ప్రయోజనం దక్కుతుంది. ముఖ్యంగా ప్రీమియం కార్ల విషయంలో ఇది మనకు కనిపిస్తుంది. 
నైపుణ్యం, సాంకేతికత: వీరి వద్ద ఉండే ఎక్విప్‌మెంట్‌, నైపుణ్యం వల్ల మంచి నాణ్యమైన సర్వీసులు లభిస్తాయి. ముఖ్యంగా ఈసీయూ (ఇంజిన్‌ కంట్రోల్‌ యూనిట్స్‌) వంటి ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ ఉండే ఆధునిక కార్లను సరైన సాఫ్ట్‌వేర్‌తో పరిశీలించాల్సి ఉంటుంది. స్థానిక గ్యారేజీల్లో ఈ సదుపాయం ఉండదు. బయటి మెకానిక్‌లకు అన్ని వాహనాలపైనా పరిమిత అవగాహనే ఉంటుంది తప్ప ఏ మోడల్‌పైనా పూర్తిస్థాయి నైపుణ్యం ఉండదు. అది అధీకృత సర్వీసు సెంటర్‌లో మాత్రమే సాధ్యం. సాంకేతిక నిపుణులకు ఆ బ్రాండ్‌ కంపెనీలే శిక్షణనిస్తాయి. కాబట్టి వాళ్లు ఒకే బ్రాండ్‌పై కచ్చితమైన నైపుణ్యం ఉంటుంది.

స్థానిక మెకానిక్‌లైతే..

సాధారణంగా మన ఇంటిదగ్గరుండే గ్యారేజీలకు చుట్టుపక్కల వాళ్లూ వెళ్తుంటారు. వారిని అడిగితే అక్కడ పని నాణ్యత, ఖర్చు ఎలా ఉంటుందో చెబుతారు. అదీకాక స్థానిక గ్యారేజీల యజమానులకు అక్కడకు వచ్చే వినియోగదార్లు తమ గురించి ఇతరులకు చెప్పడం ద్వారానే మరింత మంది వినియోగదార్లు వస్తుంటారు. అందుకే మన పనిని ఇష్టంగా, సంతృప్తికరంగా చేస్తారు. 
వీటిలో తేడా ఉండదు: ఆయిల్‌ మార్చడం, ఫిల్టర్‌ మార్పు, వాటర్‌ వాష్‌లాంటివి అధీకృత సెంటర్‌లాగానే వీరు కూడా చేయగలరు. మనం వెళ్లినపుడల్లా మెకానిక్‌తో, టెక్నీషియన్లతో మంచి దోస్తీ కుదురుతుంది. తద్వారా ప్రతిసారీ మన వాహనాన్ని ఒకే మెకానిక్‌తో బాగు చేయించుకోవచ్చు. అపుడు మీ కారు గురించి వారికి క్షుణ్నంగా తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫ్యామిలీ డాక్టరులాగే మన కారుకి ఫ్యామిలీ మెకానిక్‌. పైగా కారు పక్కనే ఉండి ప్రతిదీ పర్యవేక్షించవచ్చు. అధీకృత సర్వీసు సెంటర్లలో ఈ వెసులుబాటు ఉండదు.
ఖర్చులు కలిసొస్తాయి: అన్నింటికి మించిన ప్రయోజనం ఏమిటంటే.. స్థానిక గ్యారేజీల్లో సేవలకు లేబర్‌ ఛార్జీలు, ఇతరత్రా సర్వీసు ఛార్జీలు తక్కువ. డీలర్‌షిప్‌ సర్వీస్‌సెంటర్లతో పోలిస్తే విడిభాగాలు, ఆయిల్‌ ఖర్చులు ఒకేలా ఉన్నా.. లేబర్‌ ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అధీకృత సేవా సెంటర్లతో పోలిస్తే ఇక్కడ నాలుగింట మూడొంతుల ఖర్చు మిగులుతుంది. ఉదాహరణకు డీలర్‌షిప్‌ సెంటర్లో వాహనం ఆయిల్‌ మార్చడం, ఆయిల్‌ ఖర్చు, ఫిల్టర్ల మార్పు, అన్ని నట్లు, బోల్టులను బిగించడంలాంటి సర్వీసుకు దాదాపు రెండు వేల రూపాయలు వసూలు చేస్తారు. దీనికి జీఎస్‌టీ అదనం. దీంతోపాటు ఏదైనా చిన్న సమస్య ఉంటే అదనంగా రూ.ఐదారు వందల బిల్లు వేస్తారు. అదే స్థానిక గ్యారేజీలో పూర్తి సర్వీసుకు వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. మీరు విండ్‌స్క్రీన్‌ వైపర్లను మార్చమని చెప్పామనుకోండి అందుకు లేబర్‌ ఛార్జీ ఏమీ తీసుకోరు కూడా. అధీకృత సర్వీసు సెంటర్లు ఇందుకు అదనంగా రూ.250 దాకా వసూలు చేస్తాయి. 
వారెంటీలో ఉన్నా: వారెంటీలో ఉన్నపుడు స్థానిక గ్యారేజీకి వెళ్లకూడదని ఏమీ లేదు. కొన్ని చిన్న పనులకు వెళ్లినా వారెంటీకొచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఆయిల్‌ ఛేంజ్‌, ఫిల్టర్ల మార్పు, వాషింగ్‌, పాలిషింగ్‌లకు అధీకృత సేవాకేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

- బెజవాడ వెంకటేశ్వర్లు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.