close

తాజా వార్తలు

ఆరంభ శూరులుగా మిగలొద్దు

3జీ, 4జీలా కాదు.. ఏకంగా 5జీలా దూసుకెళ్లాలి.. వేలు, లక్షలు కాదు.. కోట్లలో సంపాదించాలి.. టాప్‌ టెన్‌ స్టార్టప్‌ల్లో నాదొకటిగా మిగలాలి.. సక్సెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ నేనవ్వాలి..
- ఇలా అనుకునే అందరూ అంకుర సంస్థల వైపు అడుగులేస్తారు? అయితే, వీరిలో 90 శాతం ఆరంభశూరులే! తెలుసా?
వర్షకి మల్టీ నేషనల్‌ కంపెనీలో ఆరంకెల జీతం..   క్రమం తప్పకుండా వచ్చే ఇంక్రిమెంట్లు. కంపెనీ షేర్లు. హోదా.. గౌరవం.. సాఫీగా సాగిపోతున్న జీవితం. వీటన్నింటినీ వదులుకుని తనే సొంతంగా స్టార్టప్‌ పెట్టాలనుకుంది. ఎంత కాలం ఉద్యోగిగా ఉండాలి? తనో సంస్థగా ఎదగాలనుకుంది. ఆ దిశగా అడుగులు వేసింది..  తన నడకలోని స్థిమితత్వం ఎంత?  గమ్యం చేరేవరకూ సాగుతోందా? అందుకు ఏం కావాలి?
శ్రీనివాస్‌ చదవనైతే చదివాడుగానీ.. ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంటర్వ్యూలకు వెళ్లేవాడు కాదు. చుట్టూ ఉన్నవారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు... ‘తనో స్టార్టప్‌ పెట్టడం’, ఎలాగైనా అందరినోళ్లూ మూయించడం. ఇంటర్వ్యూలకు వెళ్లడం ఏంటి? తానే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. జీతం తీసుకోవడం కాదు. ఇవ్వాలనుకున్నాడు. యాక్షన్‌లోకి దిగాడు.. శ్రీనివాస్‌ నిర్ణయానికి ఉన్న సంకల్పం ఏపాటి? విజయ తీరాల్ని చేరతాడా? తనకి కావాల్సినవి ఏంటి?
.. వర్ష, శ్రీనివాస్‌ ఆలోచనలు మంచివే. అందరూ ఇదే నేపథ్యంలో స్టార్టప్‌లవైపు అడుగులేస్తున్నారు. కానీ, మార్కెట్‌లో వాస్తవాలు వేరు. ఎలాగంటే.. క్రికెట్‌లో రాణించాలంటే? ఆటపై ఆసక్తి.. కసి ఉంటే చాలనీ.. మొదటి బాల్‌నుంచి ఫోర్లు, సిక్సర్లు బాదేయాలని అనుకుంటారు. బాల్‌ని ఫేస్‌ చేయకుండానే పరుగుల సునామినీ సృష్టించాలనుకుంటారు. అయితే, ఏ ఇన్సింగ్స్‌లోనైనా.. ఆటలో పిచ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే.. ఆటకి ముందు పిచ్‌ని విశ్లేషిస్తారు. లేదంటే.. మొదటి రెండు, మూడు బాల్స్‌ బ్యాటుని అనుకున్నట్టే తాకినా.. నాలుగో బాల్‌కి దొరికిపోతారు. అప్పుడు ప్లేయర్స్‌ని ఏమంటారు? ఆటలో ఆరంభ శూరులే కదా! ఇదే మాదిరిగా అంకురాల స్థాపనలోనూ జరుగుతోంది. తమకి వచ్చిన ఆలోచనతో.. ఏదేదో చేసేయాలని ముందుకొస్తారు. తర్వాత ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయ్‌? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి?...
మీరే ఓ బ్రాండు అవ్వాలనుకున్నప్పుడు..
శ్రీనివాస్‌ ఎక్కడా ఉద్యోగం చేయలేదు.. ఏ ఉత్పత్తి రూపకల్పనలోనూ పాలు పంచుకోలేదు. ఒక సంస్థ ఎలా నడుస్తుందో తెలియదు. అయినా.. తనో బ్రాండుగా మారాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న పరిమిత వనరులతో తనో సంస్థలా ఎదగాలనుకుంటున్నాడు.. కానీ, తనకి వాస్తవాలు నేర్పే పాఠాలేంటి?..
అనుభవసారం ఎక్కడ?: ఏదైనా రంగాన్ని ఎంపిక చేసుకుని దాంట్లో సక్సెస్‌ సాధించాలనుకుంటే.. వాస్తవాల్ని ప్రత్యక్షంగా చూడగలగాలి. ఏదైనా అంకుర సంస్థని స్థాపించి వ్యవస్థగా ఎదగాలనుకుంటే? కచ్చితంగా కొన్నేళ్లయినా ఉద్యోగిగా పని చేయాలి. అప్పుడే వాస్తవ పరిస్థితుల్ని దగ్గరగా చూడడం వీలవుతుంది. ఏయే సందర్భాల్లో మీరెలాంటి పాత్ర పోషించాలో తెలుస్తుంది. లోటుపాట్లను అధిగమించడాన్ని నేర్చుకోవచ్చు.
పగటి కలలా ఉండొద్దు: కలలు కనడం అందరూ చేసేదే. వాటికి వాస్తవ రూపాన్ని కల్పించేది కొందరే. ఉద్యోగం చేయడం ఇష్టం లేదనో.. అందరూ అడుగుతున్నారనో.. రాత్రికి రాత్రి ఓ కంపెనీ పెట్టేసి సీఈవో అవ్వాలనుకోవడం పగటి కలే అవుతుంది. కావాల్సినంత డబ్బు స్టార్టప్‌ కలని నిజం చేయలేదు.
బాధ్యత వహించాలి: వివేకానందుడు చెప్పినట్టుగా.. ‘మీరు దేని గురించి అయితే పూర్తి బాధ్యత తీసుకోవడానికి సిద్ధమవుతారో దానికి మీరే యజమానులు అవుతారు’. సంకల్పించుకున్న పని సఫలమవ్వాలంటే పూర్తి బాధ్యత మీదే తీసుకోవాలి. అప్పుడే ముందుండి నడిపిస్తారు.
యుద్ధమే చేయాలి: స్టార్టప్‌తో కెరీర్‌ని ప్రారంభించడం అంటే.. యుద్ధానికి సిద్ధం అయినట్టే. అలుపెరుగని పోరాటం చేయాలి. ప్రత్యర్థి ఏ రూపంలో, ఎలా మీపై కొస్తారో ముందే ఊహించాలి. అందుకు తగిన ప్రణాళిక రచించాలి. ఇలా మీరే రాజు, మంత్రి, సైనికుడిగా చేసే యుద్ధం మీ జీవితానికి పరమార్థాన్ని అందిస్తుంది. మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.
* ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ‘అంకుర’ రణంలోకి దిగితే మీరెప్పటికీ ఆరంభ శూరులై మిగిలిపోరు. భావితరాలకు స్ఫూర్తి నింపేలా విజేతలవుతారు.

మీరో వ్యవస్థగా మారేటప్పుడు..
వర్ష అప్పటివరకూ ఓ సంస్ధలో ఉద్యోగి. తన పని తాను చేసుకుపోతే చాలు. నెల తిరిగేసరికి లక్షల్లో జీతం. వ్యక్తిగత ఉన్నతితో కెరీర్‌ని ప్రారంభించిన వర్ష వ్యవస్థగా మారాలనుకున్నప్పుడు తనకి అప్పటివరకూ చవిచూడని ఎన్నో సవాళ్లు..
* కాలంతో పరుగు: ఉద్యోగంలో ఇన్ని గంటలు పని చేస్తే చాలు. బ్యాగు సర్దుకుని మదిలో ఎలాంటి ఆలోచన లేకుండా ఇంటికి వెళ్లొచ్చు. అంకుర సంస్థ నిర్వహణలో పరిస్థితి వేరు. కాలంతో పరుగెత్తాలి. ఆగాలని చూస్తే అంకుర ప్రస్థానం ఆగినట్టే.
* నిత్యాన్వేషణ: కంపెనీ ప్రాజెక్టు వర్కులో ఉన్నప్పుడో.. క్లైంట్‌కి ప్రజెంటేషన్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడో ఉద్యోగిగా ఆలోచిస్తే సరిపోతుంది. మీదే కంపెనీ అయితే! నిత్యం ఏదోక ప్రాజెక్టు మీ టేబుల్‌పైకి వస్తూనే ఉంటుంది. తీరిక లేకుండా ట్రెండ్స్‌ని విశ్లేషించాలి. ఇందుకు రోజూ పరిశోధన, పరిశీలన అవసరం.
* బ్యాలెన్స్‌ తగ్గుతుంది: నెలనెలా జీతంతో బ్యాంకు బ్యాలెన్స్‌ రెట్టింపు అవడమే చూస్తారు. అవసరానికి వాడుకుంటారు. నిశ్చింతగా అనిపిస్తుంది. ఇక్కడ అలా ఉండదు. స్టార్టప్‌ పురుడు పోసుకుంది మొదలు... ఎకౌంట్‌ బ్యాలెన్స్‌ తగ్గుతూ వస్తుంది. కష్టపడి కూడబెట్టిందంతా ఆలోచనని నమ్మి పెట్టుబడిగా పెట్టాల్సివస్తుంది. ఎకౌంట్‌ ఖాళీ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇలాంటి స్థితిలోనే స్థిమితంగా ఆలోచించాలి.
* సర్వం మీరే అనుకోవాలి: ఏదైనా కంపెనీలో ‘టీఎల్‌’గా ఉన్నప్పుడు మీ వంతు బాధ్యతగా ఎంత వరకూ చేయగలరో అంత వరకే చేస్తారు. ప్రాజెక్టు పూర్తవ్వగానే ఊపిరి పీల్చుకుంటారు. అంకుర సంస్థ సీఈవోగా మీ బాధ్యత వేరు. మీకొచ్చిన ఆలోచనను ఆవిష్కరణగా మలచాలి. దాన్ని వినియోగదారులకు చేరవేయాలి. ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. యూజర్లు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవాలి. సర్వం మీరే అయ్యి ఆవిష్కరణే జీవిత లక్ష్యం అవ్వాలి.
* వర్ష ఇలా ఆలోచిస్తే ఆరంభంలోనే కాదు. అన్ని సందర్భాల్లోనే అంకురానికి ఆయువు పోస్తూ వ్యవస్థలా ఎదిగి తీరుతుంది.

- కోటిరెడ్డి సరిపల్లి కేజీవీ గ్రూపు ఛైర్మన్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.