close

తాజా వార్తలు

మంచుకొండల్లో మేమున్నామని!

ఊరు గాని ఊరులో మనవాళ్లు తారసపడితే ఆనందం. మన కష్టాన్ని గుర్తించి ఆప్యాయంగా ఆదరిస్తే అంతకన్నా కావాల్సిందేముంది. ఇలాంటి అదృష్టం ఏ పొరుగూరులోనో కాకుండా.. అమర్‌నాథ్‌ యాత్రా మార్గంలో కలిగితే.. చిదానందం.. సదానందం..! అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తున్న తెలుగువారి కోసం తెలుగువాళ్లు ఓ మహత్కార్యం నిర్వహిస్తున్నారు. అమరనాథుడిని దర్శించడానికి వచ్చిన భక్తులకు తెలుగింటి వంటలు వండి, వడ్డిస్తున్నారు.
2010 అమర్‌నాథ్‌ యాత్రా సమయం. సిద్దిపేట నుంచి 45 కుటుంబాలు మంచుకొండలకు బయల్దేరాయి. సాఫీగా సాగుతున్న వారి యాత్రలో వాతావరణం అనూహ్య మార్పులు తీసుకొచ్చింది. ప్రతికూల పరిస్థితులతో యాత్రికులంతా వారం రోజుల పాటు బేస్‌ క్యాంప్‌లోనే ఉండాల్సి వచ్చింది. పరిసరాల్లో పండారాలు (ఉచిత భోజన కేంద్రాలు) ఎన్నో ఉన్నా.. వీరి ఆకలిని తీర్చలేకపోయాయి. ఉత్తరాది వంటకాలు జిహ్వకు రుచించలేదు కొందరికి. పడలేదు ఇంకొందరికి. ఏదోలా మంచు లింగాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. యాత్రానుభవాన్ని తలచుకొని.. తమలా ఇంకెందరు ఇలా బాధపడుతున్నారో అనుకున్నారు. ఆ క్షణంలోనే అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.
షడ్రసోపేతం.. 2011 నుంచి ఈ సమితి సేవలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి మంచు కొండల్లో మన భోజనం అందుబాటులోకి వచ్చింది. మొదటి ఏడాది బాల్తాల్‌ బేస్‌క్యాంప్‌లో ఉచిత అన్నదాన కేంద్రం ఏర్పాటు చేశారు. ఉచితం అనగానే.. పచ్చడి మెతుకులు, పచ్చిపులుసు అనుకునేరు! యాత్ర జరిగినన్ని రోజులూ షడ్రసోపేతమైన భోజనం అందిస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ఉదయం పాలు, టీతో పాటు ఇడ్లీ, ఊతప్పం, దోసె, ఉప్మా, పూరి వంటి ఘనమైన అల్పాహారం అందిస్తారు. మధ్యాహ్నం భోజనంలోకి ఆవకాయ, పప్పు, సాంబారు, పెరుగు, స్వీటు, అప్పడం వడ్డిస్తారు. నాణ్యత, రుచితో కూడిన భోజనం అందిస్తూ.. అందరి ఆకలి తీరుస్తున్నారు. 2013 నుంచి పహల్గామ్‌ దారిలోని పంచతరణి దగ్గర కూడా అన్నదాన కేంద్రం ఏర్పాటు చేశారు. బల్తాల్‌ క్యాంప్‌లో 8వ లంగరు (భోజనశాల), పంచతరణి దగ్గర 2వ లంగరులో అన్నదానం చేస్తున్నారు.

బృందసేవాగానం.. ఈ మహా క్రతువును నిర్వహించడానికి అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి బృందాలుగా ఏర్పడింది. యాత్ర మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ఒక్కో బృందం 10-15 రోజుల వరకు అక్కడే ఉంటారు. ఆ బృందం వచ్చే సమయానికి మరో బృందం సేవకు బయల్దేరుతుంది. ఇలా యాత్ర జరిగినన్ని రోజులు.. తెలుగు యాత్రికులకు సేవలందిస్తుంటారు. ఇక్కడ భోజనానికి వచ్చిన యాత్రికులు కూడా..  కాసేపు వడ్డనలో భాగస్వాములు అవుతుంటారు.

- క్రాంతికుమార్‌ కొలిశెట్టి, సంగారెడ్డి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.