close

తాజా వార్తలు

బొట్టు పట్టి సాధించారు!

ఎందుకంటే... ఆయనకు తెలుసు

భారతదేశంలో 33 కోట్ల మంది ప్రజలు నీటికోసం అలమటిస్తున్నారు.

ఎందుకంటే... ఆయనకు తెలుసు

తాను నివసించే ముంబయి నగరంలో 40 శాతం నీరు కేవలం నివాస గృహాల్లోనే వృధా అవుతోందని... 

ఎందుకంటే... ఆయనకు తెలుసు

బొట్టుబొట్టుగా కారిపోతున్న జలానికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు అంధకారమని, ఇళ్లలో ఉన్న పైపుల్లో, ఉపకరణాల్లో లీకులు లేకుండా చేస్తే ఏటా 20 లక్షల మంది దాహార్తిని తీర్చవచ్చని. అందుకే ఆయన కంకణం కట్టుకున్నారు... ప్రతి చుక్కకూ లెక్క కట్టాలని ప్రతి వారికీ ఈ లెక్కను నేర్పాలని...

ఇది పుష్కర కాలం నాటి మాట...
ముంబయి నగరంలో ఓ స్నేహితుడి ఇంట్లో కూర్చుని ఉన్నాడు 72 ఏళ్ల అబిద్‌ సూర్తి.
ఆయన ఉన్నదేమో హాల్‌లో... అందరూ ఆహ్లాదంగా మాట్లాడుకుంటున్నారు. కానీ అబిద్‌ చెవులకు మాత్రం మరో శబ్ధం వినిపిస్తోంది. టప్‌..టప్‌...మంటూ... ఎక్కడో నీరు లీకవుతోంది. అక్కడ నీరు కారుతోంది చుక్కలుగా... కానీ అబిద్‌కు మాత్రం ఆ చుక్క నీరు కింద పడ్డ శబ్ధం తనను ఎవరో సుత్తితో మొదినట్లు అనిపిస్తోంది. ఆ కారిపోతున్న నీటిపై ఆయనకున్న అవగాహన ఆయనను క్షణం కూడా నిలబడనీయడం లేదు. వెంటనే తన స్నేహితులైన ఆ ఇంటి యజమానులతో చెప్పి ప్లంబర్‌ను పిలిపించి...పైపులు, లీకులు అన్నీ బాగు చేయించి... ఆ ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా వృథా కాలేదని నిర్థరించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు.
కానీ ఆయనను ఆలోచనలు మాత్రం వెంటాడుతున్నాయ్‌... ఇంత మహానగరంలో ఎన్ని ఇళ్లలో... ఎన్ని లక్షల లీటర్ల నీళ్లు వృథా అవుతున్నాయో... వాటికి అడ్డుకట్ట వేయడం ఎలా?
దీనికోసం తానేం చేయాలి...? అక్కడే మొదలైందో బృహత్‌ ప్రయత్నం.
ఉన్నది చిన్న లీకేజీనే...  సెకను ఒక బొట్టు కింద పడుతోంది.
దీని ఫలితమేంటో తెలుసా? నెలకు వెయ్యి లీటర్లు వృథా. దీంతో ఒక కుటుంబం నెల రోజుల పాటు హాయిగా గడపొచ్చు. సమస్య చిన్నదే కదా అని వదిలేస్తే అదే జటిలమవుతుంది. భవిష్యత్తులో అతి తీవ్ర సమస్యలకు కారణమవుతుంది.
ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పాలి... వారికి అవగాహన కల్పించాలి.
దీనికోసం ఒంటరిగానే అడుగు ముందుకేశారు. తన కార్యక్రమాలకు  ఓ వేదిక ఉండాలని భావించారు. డ్రాప్‌ డెడ్‌ ఫౌండేషన్‌ అంటూ పేరుపెట్టారు. సేవ్‌ డ్రాప్‌...ప్రతి చుక్కనూ రక్షించుకుందాం అంటూ ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పడం మొదలుపెట్టారు.

స్నేహితులు... వారి స్నేహితులు, బంధువులు... వారి ఆత్మీయులు... ఇలా తెలిసిన, తెలియని వారి ఇళ్లకూ వెళ్లేవారు. అలా వెళుతూ ఓ ప్లంబర్‌ను కూడా తీసుకెళ్లేవారు.
చుక్కలుగా కారిపోతున్న నీటిని ఒడిసి పట్టాలని చెప్పడం... అలా చేయకపోతే జరిగే నష్టాలను చెప్పి వారికి అవగాహన కల్పించడం. ఇల్లంతా వెదికి ఎక్కడైనా నీరు వృథా అవుతుంటే దాన్ని బాగుచేయించడం... ఇదీ అబిద్‌ రోజువారీ జీవితం.
మొదట్లో ఎవరింటికైనా వెళితే ‘నీకెందుకింత బాధ అబిద్‌ భాయ్‌... ఏదో ఓ చుక్క పోతే ఏమవుతుంది?’  అని అనేవాళ్లు.
అబిద్‌ వారిని నీటి సంరక్షణ ఫలితాన్ని వివరించేవారు. నొప్పించకుండానే వారిని ఒప్పించేవారు. వారి ఇంట్లో లీకేజీలను తన డబ్బుతో బాగు చేయించేవారు. ఫలితంగా ఆయన సందర్శించిన ప్రతిచోటా అవగాహన. ఓ జల చేతన. ఆయన అవగాహన కల్పించిన ప్రతి చోటా నీటిని బంగారంలా వాడుకుంటున్నారు. భద్రంగా కాపాడుకుంటున్నారు. అబిద్‌ మంచి పెయింటర్‌. రచయిత కూడా కావడంతో ఆసక్తికరమైన పోస్టర్లు, సందేహాలతో కట్టిపడేస్తున్నారు. మసీదుల్లో, గుళ్లలో, అపార్టుమెంట్లలో ఆయన పోస్టర్లు ఎంతో మందిని ఆలోచింపజేస్తుంటాయి. వాటికి స్పందించి నీటి వృథా చేయకుండా ఉన్నవారు వేల సంఖ్యలో ఉన్నారు.

ఒకటి, రెండు కాదు. 12 ఏళ్లుగా ఆయనకు ఇదే పని. తనతో కలిసి వచ్చే వాళ్లు వస్తున్నా, లేకున్నా ఆయన  ఈ దారిలో ముందుకు సాగుతూనే ఉన్నారు. 2007లో ఈ జలోద్యమాన్ని ప్రారంభించిన ఏడాది కాలంలో 1666 గృహాలను సందర్శించారు... అక్కడ వృథా అవుతున్న 4 లక్షల లీటర్ల నీటిని సంరక్షించారు. అదే పుష్కరకాలంలో అక్షరాలా 2 కోట్ల లీటర్ల నీటి  వృథాను అడ్డుకున్నారు.
అబిద్‌కిప్పుడు 84 ఏళ్లు. ఇప్పుడూ ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అసలు మీకు ఈ పని ఎందుకు చేయాలనిపించిందంటే... తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటారు. ‘గుజరాత్‌లోని పవేరా మా ఊరు. అక్కడ మా అమ్మ బిందె నీళ్ల కోసం పడ్డ కష్టం గుర్తుంది. ఈ మహానగరంలో ఎందరో తల్లుల పోరాటం చూస్తున్నాను. వారి కోసం నా ఈ చిన్న ప్రయత్నం’ అంటూ వివరిస్తారాయన.


 
 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.