close

తాజా వార్తలు

మలి జీవితంలో ఫిక్స్‌డ్‌ తోడు..

ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు క్రమం తప్పని ఆదాయం ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ ఆదాయం ఆగిపోకుండా   ఉండాలంటే.. దానికోసం పదవీ విరమణ నాటికి ఒక పెద్ద నిధిని జమ చేయాలి. ఆ మొత్తంపై వచ్చిన ఆదాయంతోనే మలి జీవితాన్ని ప్రశాంతంగా గడిపేలా ఏర్పాటు ఉండాలి. చాలామంది ఈ విషయంలో ముందునుంచీ జాగ్రత్తగా ఉండరు. తీరా పదవీ విరమణ చేసే రోజులు దగ్గరకొచ్చే సరికి ఆందోళన పడుతుంటారు. క్రమంగా కొంత మొత్తం జమచేస్తూ.. సంపదను సృష్టించేందుకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు వీటికి కొంచెం భిన్నం. మరి మీ కష్టార్జితాన్ని దీర్ఘకాలం పాటు ఫిక్స్‌ చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా!

మ్యూచువల్‌ ఫండ్లు.. ఈక్విటీలు.. ఇతర అనేకానేక పెట్టుబడి పథకాలు.. అందుబాటులో ఉన్నప్పటికీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) స్థానం దానికి ప్రత్యేకంగానే ఉంది. నిజంగా ఒక వ్యక్తి పెట్టుబడుల జాబితాలో ఎఫ్‌డీలు లేకపోతే అది అసంపూర్తిగా ఉన్నట్లే లెక్క. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదును వెనక్కి తీసుకోవడం, పారదర్శకంగా ఉండటం, ఏ వ్యవధికైనా ఎంచుకోవడం ఇందులో ఉండే ప్రధాన అంశాలైతే.. మార్కెట్‌ పరిస్థితులతో నిమిత్తం లేకుండా కచ్చితమైన రాబడిని అందించడం వీటి ప్రధాన ఆకర్షణ. వీటిని ఎంచుకున్నప్పుడు పెట్టుబడికి రక్షణ, వడ్డీకి హామీ ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి నష్టం లేకుండానే మంచి నిధిని సమకూర్చుకోవచ్చు. కాస్త జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేస్తే.. పదవీ విరమణ అనంతర జీవితానికి ఇది కచ్చితమైన భరోసానిస్తాయి.

వడ్డీ చెల్లింపు ఎలా? 
వడ్డీ చెల్లింపు ఎలా చేస్తున్నారు అనేదాన్ని బట్టి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో క్యుములేటివ్‌, నాన్‌ క్యుములేటివ్‌ రకాలుంటాయి. క్యుములేటివ్‌ను ఎంచుకున్నప్పుడు.. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ లెక్కించి, దాన్ని అసలులో కలుపుతారు. వ్యవధి తీరాక మొత్తం డబ్బును చెల్లిస్తారు. ఇది చక్రవడ్డీ విధానంలో పనిచేస్తుందన్నమాట. నాన్‌ క్యుములేటివ్‌ ఎఫ్‌డీల్లో మదుపు చేసినప్పుడు.. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. సంపదను సృష్టించాలంటే.. క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవడమే మంచిది. వడ్డీ మొత్తం అసలుకు కలవడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున సొమ్ము జమ అవుతుంది. పదవీ విరమణ కోసం మదుపు చేయాలన్న ఆలోచనతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఎంచుకునే వారికి ఈ ఐచ్ఛికం ఎంతో అనుకూలం.

వ్యవధులను మార్చండి.. 
జీవితంలో అనేక దశలు ఉంటాయి. ఒక్కో సమయంలో అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఎఫ్‌డీల వ్యవధిని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా డిపాజిట్‌ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత ఎంత మొత్తం వస్తుందనేది సులువుగా లెక్కేసుకోవచ్చు. కాబట్టి, ఆ లెక్కల ఆధారంగా మన లక్ష్యం ఎంత దూరంలో ఉంది, దానికోసం ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి పెట్టుబడిని నిర్ణయించుకోవచ్చు.

సరైన చోటును ఎంచుకోండి..

న్ని రకాల బ్యాంకులూ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వివిధ వ్యవధులకు అందిస్తున్నాయి. అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేప్పుడు ఆయా సంస్థల పనితీరును బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీ) ఎంచుకునేప్పుడు వాటికి ఇక్రా, క్రిసిల్‌ వంటి సంస్థలు ఇచ్చే క్రెడిట్‌ రేటింగులను పరిశీలించాలి. ఒక సంస్థకు చెల్లింపుల సామర్థ్యం ఎంత ఉంది అనేది ఈ రేటింగ్‌ ఏజెన్సీలు చెబుతుంటాయి. సురక్షితంగా ఉంటూ.. మంచి రాబడిని ఇచ్చే సంస్థలను ఎంచుకోవడం ఎప్పుడూ అవసరం.

వెనక్కి తీసుకుంటున్నారా? 
భారతీయులు సహజంగానే పొదుపరులు. వారి పొదుపు అలవాటుకు సరిగ్గా సరిపోయే పథకాలుగా ఎఫ్‌డీలను చెప్పొచ్చు. కాలానుగుణంగా ఎన్నో పరీక్షలకు ఎదురొడ్డి నిలిచిన పథకాల్లో ఇవి ముందు వరుసలో ఉంటాయి. వీటిలో మదుపు చేసిన తర్వాత వెనక్కి తీసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యవధి పూర్తికాకముందే పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. రుసుములు వర్తిస్తాయి. దీనివల్ల మనం ఆర్జించినదానికన్నా తక్కువే చేతికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో తప్పనిసరిగా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే.. డిపాజిట్‌ను రద్దు చేసుకోకుండా.. దానిపై రుణం తీసుకునే అవకాశాన్ని పరిశీలించండి. దీనివల్ల మీ అవసరానికి డబ్బు అందుతుంది. అదే సమయంలో ఎఫ్‌డీ కూడా రద్దు కాకుండా చూసుకోవచ్చు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రేటు కాస్త అధిక వడ్డీ రేటు వస్తుంది.

ఆన్‌లైన్‌ బాటలో.. 
ఎఫ్‌డీ చేసేందుకు బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల శాఖలను నేరుగా సంప్రదించవచ్చు. కానీ, దీనికన్నా ఆన్‌లైన్‌ మార్గంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసేందుకు ప్రయత్నించవచ్చు. దీనివల్ల ఖాతాలో ఉన్న డబ్బును వెంటనే ఎఫ్‌డీగా మార్చేయొచ్చు. పైగా అనేక పత్రాల్లో సంతకాలు చేయడంలాంటి లాంఛనాలూ ఉండవు.

పన్ను భారం చూసుకోండి..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. వ్యక్తుల మొత్తం ఆదాయంలో ఈ వడ్డీ రాబడిని కలిపి చూపించాలి. అందువల్ల ఈ వడ్డీపై 0% - 30% వరకూ పన్ను వర్తించే అవకాశం ఉంది. వచ్చిన వడ్డీలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే.. 10శాతాన్ని మూలం వద్ద పన్ను కోత విధిస్తాయి. ఒకవేళ పాన్‌ వివరాలు తెలియజేయకపోతే ఇది 20శాతం వరకూ ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉన్నవారు ఫారం-15జి, ఫారం 15హెచ్‌ ఇవ్వడం ద్వారా మూలం వద్ద పన్ను పడకుండా చూసుకోవచ్చు.

ఒక నిర్ణీత సమయంలో ఒక కచ్చితమైన నిధిని జమ చేసేందుకు ఎఫ్‌డీలు ఎంతో ఉపయోగపడతాయి. దీర్ఘకాలంపాటు పొదుపు చేసిన పెద్ద మొత్తంతో సరైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకొని, మలి జీవితాన్ని ఆనందంగా మలచుకోవచ్చు.

- సచిన్‌ సిక్కా, సీబీఓ- రిటైల్‌, కార్పొరేట్‌ లయబిలిటీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.