close

తాజా వార్తలు

ఇస్మార్ట్‌ డ్రైవర్‌ ఆదేశిస్తే చాలు..

మీట నొక్కగానే కారు డోరు తెరుచుకుంటుంది... క్లిక్‌ కొడితే ఇంజిన్‌ ఆన్‌, ఆఫ్‌... ఆజ్ఞాపిస్తే జీ హుజూరంటూ కోరిన సర్వీస్‌ సిద్ధం... మనం ప్రమాదంలో చిక్కుకుంటే సన్నిహితులకు సందేశాలు పంపిస్తుంది... అన్నీ స్మార్ట్‌ఫోన్‌తోనే! ఈ ఫీచర్లు కావాలంటే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు... వాహన తయారీసంస్థలు ఇచ్చే డాంగిల్‌/గ్యాడ్జెట్‌ బిగిస్తే సరి... దీనికోసం అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు స్మార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశాయి...  వీటిని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌ అచ్యుత్‌. ఇంటి నుంచి ఆఫీసుకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం. కారులో కూర్చొని స్మార్ట్‌ఫోన్‌ తీశాడు. ఆఫీసుకెళ్లాలంటూ ఆర్డర్‌ వేశాడు. దగ్గరి దారి, పెద్దగా ట్రాఫిక్‌ లేని మార్గం ఫోన్‌ తెరపై మ్యాప్‌ రూపంలో ప్రత్యక్షమైంది. పావుగంటలో గమ్యం చేరాడు. మధ్యమధ్యలో ‘ఓపెన్‌ సన్‌రూఫ్‌’, ‘మ్యూజిక్‌ ఆన్‌’, ‘సెట్‌ ద టెంపరేచర్‌’, ‘ఏసీ ఆఫ్‌’.. అంటూ ఆదేశాలిస్తూనే ఉన్నాడు. విధేయుడిలా అన్ని పనులూ చక్కబెట్టేస్తోంది స్మార్ట్‌ఫోన్‌. ఖరీదైన కార్లలోనే కాదు.. పది లక్షల విలువైన వాహనాల్లోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. యాప్‌, గ్యాడ్జెట్‌, టెలిమాటిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ (టీసీయూ) ద్వారా మన స్మార్ట్‌ఫోన్‌, నావిగేషన్‌ తెరకు అనుసంధానించి ఈ సేవలు పొందేలా వేదిక సిద్ధం చేశాయి వాహన కంపెనీలు.


ఇలా పని చేస్తాయి
కనెక్టింగ్‌ యాప్‌లుంటే స్టీరింగ్‌ తిప్పడం మినహా ఎన్నెన్నో పనులు చక్కబెట్టేస్తుంది స్మార్ట్‌ఫోన్‌. ఒక్క క్లిక్‌తో, వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందొచ్చు. కేవలం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని టయోటా, నిస్సాన్‌ సంస్థల సేవలు పొందొచ్చు. కానీ వీటిలో ఫీచర్లు పరిమితం. పూర్తిస్థాయి ఫీచర్లు కావాలంటే వాహన సంస్థలు ఇచ్చే చిన్నపాటి గ్యాడ్జెట్‌, డాంగిల్‌ తీసుకోవాలి. వీటిని డాష్‌బోర్డ్‌ లోపలివైపు అమర్చుతారు. బ్లూటూత్‌, వై-ఫై ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ చేయాలి. తర్వాత వాహన, వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకోవాలి. మారుతిసుజుకీ ‘సుజుకీ కనెక్ట్‌’ పేరుతో టెలిమాటిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ అందిస్తోంది. దీన్ని ‘నెక్సా’ యాప్‌తో అనుసంధానించి వాడుకోవచ్చు. ఫోర్డ్‌, హోండా, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌లు డాంగిల్‌/గ్యాడ్జెట్‌ రూపంలో వస్తాయి. ఈమధ్య మార్కెట్లోకి వచ్చిన ఎంజీ హెక్టార్‌ కారు మరింత అడ్వాన్స్‌డ్‌. డాష్‌బోర్డ్‌లో ఉండే పదిన్నర అంగుళాల తాకే తెరనే స్మార్ట్‌ఫోన్‌లా పని చేస్తుంది. ‘ఐ స్మార్ట్‌’ అని పిలిచే ఈ అనుసంధాన వేదికతో టచ్‌, వాయిస్‌ కమాండ్స్‌తో కోరుకున్నది చేసేయొచ్చు. కాస్త ఖరీదైన మోడళ్లలోనే ఈ కనెక్టింగ్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. మారుతిసుజుకీలో బ్యాలెనో, బ్రెజ్జాలాంటి మోడళ్ల నుంచి మొదలవుతాయి. హ్యుందాయ్‌లో ఐ20 నుంచి, ఫోర్డ్‌లో ఎకోస్పోర్ట్‌తో మొదలవుతాయి. హోండాలో అన్ని కార్లలో ఈ ఫీచర్‌ ఉంది.


సౌలభ్యాలెన్నో
* ఇంట్లో ఉంటూనే ఒకే క్లిక్‌తో డీలర్‌ దగ్గర సర్వీసింగ్‌ బుక్‌ చేసుకోవచ్చు.
* గత సర్వీస్‌ వివరాలు, తదుపరి సర్వీసింగ్‌ గడువు, మరమ్మతులు, ఖర్చులు సమస్త వివరాలు నమోదవుతాయి.
* తదుపరి సర్వీస్‌ డ్యూ డేట్‌పై క్లిక్‌ చేసి రిమైండర్‌లా సెట్‌ చేసుకోవచ్చు.
* కారు కంపెనీ డీలరు పనితీరు, సర్వీసింగ్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నామా, లేదా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వొచ్చు. ఫిర్యాదులూ చేయొచ్చు.
* పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువు ముగిసే కొద్దిరోజుల ముందే గుర్తు చేస్తుంది.
* సందేహాలు, సమస్యలు, ప్రమాదాలు.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాయం పొందడానికి 24 గంటల కస్టమర్‌ కేర్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే కంపెనీ ప్రతినిధులు సాయానికొస్తారు.
* డిజిటల్‌ లాగ్‌బుక్‌లో మన ప్రతి ప్రయాణాన్ని నమోదు చేసుకోవచ్చు.


అదిరే సర్వీసులు
కారుని స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్‌ చేస్తే పొందే సౌకర్యాలు లెక్కలేనన్ని. ఆధునిక గ్యాడ్జెట్‌లా, సాయపడే నౌకరులా, డీలరుతో వారధిలా, ఆపదల్లో హితుడిగా ఉపయోగపడుతుంది


ఆకట్టుకునే ఉపయోగాలు
* యాప్‌తోనే కారు డోరు లాక్‌/అన్‌లాక్‌ చేయొచ్చు. కొన్ని సెకన్లపాటు హారన్‌ కొట్టొచ్చు. కొన్నింట్లో ఇంజిన్‌ని ఆన్‌/ఆఫ్‌ చేసే సదుపాయమూ ఉంది.
* వాయిస్‌ కమాండ్స్‌తోనే మ్యూజిక్‌ ఆన్‌/ఆఫ్‌ అవుతుంది. ఏసీని నియంత్రించొచ్చు. చేత్తో పట్టుకోకుండానే ఫోన్‌లో మాట్లాడొచ్చు. దగ్గర్లోని ఏటీఎం, రెస్టారెంట్‌, మెడికల్‌ షాపుల్లాంటి అత్యవసర ప్రాంతాల వివరాలు చెబుతుంది.
* ఇంధనం అయిపోయినప్పుడు దగ్గర్లోని బంక్‌లకు దారి చూపిస్తుంది. సమీపంలోని కారు డీలర్‌షిప్‌ల వివరాలు, చిరునామా అందిస్తుంది.
* ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పొల్యూషన్‌ చెక్‌, వీఐఎన్‌లాంటి ముఖ్యమైన అన్ని డాక్యుమెంట్స్‌ని డాక్యుమెంట్‌ వాలెట్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు.
* కారులో కూర్చునే సీటుబెల్ట్‌, ఏసీ స్టేటస్‌, ఇంధన మట్టం, ఓడోమీటర్‌ వివరాలు.. తెలుసుకోవచ్చు. నియంత్రించవచ్చు.
* రోడ్డుప్రమాదాల్లో చిక్కుకున్నా, ఇంధనం ఖాళీ అయినా, టైరు పంక్చరై బండి ఆగిపోయినా యాప్‌ ద్వారా కస్టమర్‌ కేర్‌కి సమాచారం అందిస్తే నిమిషాల్లో ప్రతినిధులు అక్కడికి చేరుకుంటారు. మనని క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత తీసుకుంటారు.


కనెక్టింగ్‌ యాప్‌లు (బాక్స్‌)
* మారుతిసుజుకీ: సుజుకీ కనెక్ట్‌
* హ్యుందాయ్‌: బ్లూ లింక్‌
* ఫోర్డ్‌ మోటార్స్‌: సింక్‌
* హోండా మోటార్స్‌: కనెక్ట్‌
* టయోటా: కనెక్ట్‌
* నిస్సాన్‌: కనెక్ట్‌
* బీఎండబ్ల్యూ: కనెక్టెడ్‌


బాధ్యతగా భద్రత
* కారు బ్రేక్‌డౌన్‌ అయినప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు ఎస్‌వోఎస్‌ ఐకాన్‌ని కొద్ది క్షణాలపాటు నొక్కి పట్టుకుంటే ఎమర్జెన్సీ నెంబర్లకు సందేశాలు, ఫోన్‌కాల్స్‌ వెళ్లిపోతాయి. మనం ఏ లొకేషన్‌లో ఉన్నామో కూడా వాళ్లకి తెలిసిపోతుంది

*ఇంజిన్‌, బ్యాటరీ, ఆయిల్‌, బ్రేక్‌లు.. ఇలా ఎక్కడ లోపం తలెత్తినా స్మార్ట్‌ఫోన్‌ తెరపై అలర్ట్‌లు వస్తుంటాయి   

*వాహనాన్ని ఎవరైనా దొంగిలించినప్పుడు, ఎక్కడైనా పార్కింగ్‌ చేసి మర్చిపోయినా ‘లొకేట్‌ మై కార్‌’ ఆప్షన్‌ ద్వారా ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నా రియల్‌ టైంలో ట్రాక్‌ చేయొచ్చు 

* కారు ప్రమాదానికి గురైనా, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా వాహనదారు ప్రమాదంలో చిక్కుకున్నారని ఫ్యామిలీ/ఫ్రెండ్స్‌కి సెల్‌ఫోన్లకి సందేశాలు పంపిస్తుంది. దీనికోసం ‘ఎమర్జెన్సీ అలర్ట్‌’ ఉపయోగ పడుతుంది

* ‘డ్రైవింగ్‌ బిహేవియర్‌’ మన డ్రైవింగ్‌ తీరును నమోదు చేస్తుంది. దాన్ని సమీక్షించుకోవచ్చు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.