close

తాజా వార్తలు

Published : 05/09/2019 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మూడడుగుల మూర్తి...ముల్లోకాల కీర్తి!

ఈనెల 10 వామన జయంతి

భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు కుమారుడిగా వామనమూర్తిగా శ్రీమహావిష్ణువు సాకారమయ్యాడు. దీన్ని వామన ద్వాదశి, విజయద్వాదశి, శుక్ర ద్వాదశి, శ్రవణ ద్వాదశి, బలి ద్వాదశి, దాన ద్వాదశి అని వ్యవహరిస్తారు.
అణువుకన్నా అణువు...అనంతమైన చైతన్యం...అన్నిటిలో ఉన్నదొక్కటే...సృష్టిలోని సమస్త జీవులూ సూక్ష్మం నుంచి విరాట్‌ రూపం వరకు వైవిధ్యంగా ప్రకటితమవుతాయి.ఈ వైవిధ్య, వైరుధ్యాలు ఆత్మ, పరమాత్మల విషయంలో ఉండవని వేదోక్తి. ఆత్మ అనేది అణువు కంటే సూక్ష్మమైనది. అది ఎంత సూక్ష్మమైందో, అంత స్థూలమైందని కఠోపనిషత్తు చెబుతుంది. వామనావతారానికి నేపథ్యాంశమిదే. వామనావతారం ఆత్మ తత్త్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని సూక్ష్మస్థితిలో గ్రహించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ సూక్ష్మ స్థితి క్రమంగా పెరిగి పెద్దదై, విశ్వరూపమై, విశ్వవ్యాప్తమై, ఆపై పరమాత్మ తత్త్వమై విరాజిల్లుతుంది.
శ్రీమద్భాగవతం, వామన, భవిష్య, హేమాద్రి పురాణాల్లో వామనావతార విశేషాలు ఉన్నాయి. ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కొడుకు బలి చక్రవర్తి. రాక్షస వంశంలో పుట్టినా విష్ణు భక్తుడు. ఇంద్రుణ్ణి ఓడించి, స్వర్గానికి అధిపతి అయ్యాడు. దేవతలు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. ఆయన దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. బ్రహ్మ తేజస్సుతో, దివ్య యశస్సుతో వటువుగా వామనుడు దండాన్ని, కమండలాన్ని, గొడుగును ధరించి నర్మదానదీ తీరంలో బలిచక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. ‘స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...’ అంటూ బలిని వామనుడు ఆశీర్వదించాడు. ఆ బాలుడి వర్చస్సుకి, వాక్చాతుర్యానికి బలి ముగ్ధుడయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘మూడు అడుగుల భూమిని దానంగా ఇవ్వు చాలు’ అన్నాడు వామనుడు. ఆ వటుడి ఆకృతిలాగే అతని కోరిక కూడా కురచగా ఉందని బలి నవ్వుకున్నాడు. బలి గురువైన శుక్రుడు అసలు విషయాన్ని గమనించాడు. శ్రీహరి కపట బ్రహ్మచారిగా వచ్చాడని గ్రహించాడు. తన మూడు అడుగులతో ముల్లోకాల్ని ఆక్రమించి బలిని అణగదొక్కేస్తాడని గుర్తించాడు. ఇదే విషయాన్ని చెప్పి వటువుకు భూదానం చేయొద్దని బలిని హెచ్చరించాడు. శుక్రాచార్యుడి మాటల్ని పట్టించుకోకుండా వామనుడికి ఉదక పూర్వకంగా బలి చక్రవర్తి భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విశ్వరూపాన్ని సంతరించుకున్నాడు. ఓ పాదంతో భూమిని, మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతణ్ణి రసాతలానికి అణగదొక్కాడు. అదే సమయంలో బలి సర్వసమర్పణ భావానికి ప్రసన్నుడైన వామనుడు అతన్ని రసాతలానికి అధిపతిగా చేశాడు.
మరో కథ:
వామనావతారానికి సబంధించి వామన పురాణంలో మరో కథ ఉంది. దుంధుడు అనే దానవుడు దేవతలను గెలిచేంత బలాన్ని సంతరించుకోడానికి దేవికా నదీ తీరంలో అశ్వమేథయాగం మొదలుపెట్టాడు. దుంధుణ్ణి తెలివితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికా నదిలో ఓ దుంగలా తేలుతూ ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ణి రక్షించారు. తన పేరు గతిభానుడని, తాను మరుగుజ్జు అయినందున తన అన్న నేత్ర భానుడు తనకు దక్కాల్సిన ఆస్తిని ఇవ్వకుండా తనను నదిలో కట్టి పడేశాడని ఆ బాలుడు నమ్మబలికాడు. అతని దీనగాథ విని దుంధుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు అదే సమయంలో దుంధుణ్ణి భూమిలోకి తొక్కి సమాధి చేశాడు. ఈ కథ వామన పురాణంలో ఉంది.


ఆత్మ చేతనకు నాలుగు పాదాలున్నాయని మాండుక్యోపనిషత్తు ప్రకటించింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అంతఃకరణం. మనస్సు నిర్మలమైతే బుద్ధి వికసిస్తుంది. చిత్తం పరిశుద్ధమవుతుంది. అప్పుడు అంతఃకరణం స్వచ్ఛ స్పటికంలా ప్రకాశిస్తుంది. ఆ స్థితి ఆత్మప్రస్థానానికి కారణమవుతుంది. దేదీప్యమానమైన అంతఃకరణం విశ్వ, తైజస, ప్రాజ్ఞావస్థలు దాటి అనంతచైతన్యంలో కలిసిపోతుంది. ఇలా ఆత్మలో పరమాత్మను సంలీనం చేయాలనేది వామనావతార సందేశం.


సప్త అథోలోకాల్లో ఆరవది రసాతలం. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు ఆ ఏడు లోకాలు. పాతాళలోకం నాగులది. దాని ఎగువన ఉండే రసాతలం రాక్షస జాతి ఆవాస స్థలమని పురాణాలు చెబుతున్నాయి.


రెండు తప్పులకు ‘బలి’!
బలి సామాన్యుడు కాదు...
ప్రహ్లాదుడి మనవడు...
మహా దాత...
తాత నుంచి వారసత్వంగా విష్ణుభక్తిని అందుకున్నవాడు...
కానీ రెండు దుర్లక్షణాలు ఆయనను అధోలోకానికి పడదోశాయి...
మొదటిది అహంకారం, రెండోది అపాత్రదానం


* వామన రూపంలో వచ్చింది విష్ణువని బలి ముందుగానే గ్రహించాడు. కానీ ఏమీ తెలియని వాడిలా వటువుని ఆహ్వానించి, సత్కరించాడు. మూడడుగుల నేలను వామనుడు అడిగేసరికి మురిసిపోయాడు. శ్రీహరి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు. సమస్త సృష్టికి అన్నీ సమకూర్చేది ఆయనే. అంతటి విష్ణువుకు తాను దానమిస్తున్నానన్న అహంకారం కమ్ముకుంది బలిని. తన చేయి పైన ఉందని ఆనందించాడు. సరిగ్గా ఆ భావనే ఆయన రసాతలానికి వెళ్లేలా చేసింది.
* బలి మహాదాత. అయితే అతి దానశీలత కూడా అనర్థదాయకమే. ఆ గుణమే బలి చక్రవర్తి బలహీనతైంది. అపాత్రులకు కూడా ఆయన విరివిగా దానాలు చేశాడు. ఫలితంగా విలువైన సంపద, నిరర్థకమైన వ్యక్తుల చేతుల్లోకి చేరడం మొదలైంది. అనర్హులకు అందలాలు దక్కాయి. అసమర్థులు ధనకనక వస్తువాహనాలను అందుకున్నారు. దీంతో లోక వ్యవహారాలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. అందుకే బలిని నిరోధించడం కోసం విష్ణువు వామనావతారంలో తరలివచ్చి పాతాళానికి తొక్కేశాడు.
తనను ఆరాధించే భక్తుడైనా సరే అసుర స్వభావం ఉంటే అణచివేయడం శ్రీహరి కర్తవ్యం. బలి విషయంలోనూ అదే చేశాడు. కానీ అసమానమైన భక్తికి మెచ్చి రసాతల లోకంలో ఆయన నివాసానికి స్వయంగా తానే వామనావతారంలో ద్వారపాలకుడిగా నిలిచాడు. ఆయనకు నిత్యం విష్ణు దర్శనభాగ్యం ప్రసాదించాడు.

అద్భుతం... ఆ రూపం!
త్రికరణశుద్ధిగా నీకు మూడు అడుగుల నేల దానం చేస్తున్నాను అని సంకల్పం చెప్పి బలిచక్రవర్తి కలశం నుంచి నీటిని వామనుడి చేతిలో వదిలిపెట్టాడో ... ఆ మరుక్షణమే వామనుడు విశ్వమంతా నిండిపోయేంతగా ఎదిగాడు. వామనుడు అలా ఎదుగుతున్న క్రమాన్ని పోతన భాగవతంలో అద్భుతంగా వర్ణించారు. చంద్రమండలం, ధ్రువనక్షత్రం, మహర్లోకం, సత్యలోకం కూడా దాటాడు. ఆకాశంలో ఉన్న సూర్యబింబం మొదట్లో ఆయనకు పట్టిన గొడుగులా కనిపించింది. ఆ తర్వాత కిరీటంలో పెట్టుకునే మణిగా మారింది. వామనుడు ఇంకా ఎదుగుతూనే ఉండడంతో సూర్యుడు ఆయన చెవులకు అలంకరించుకున్న మకర కుండలంలా,  కంఠానికి పెట్టిన హారంగా, బంగారు భుజకీర్తులుగా, ముంజేతికి ధరించిన కంకణంగా, మొలకు ధరించిన బంగారు సూత్రంలోని చిరుమువ్వలా కనిపించింది. అప్పటికీ వామనుడి విక్రమ స్వరూపం ఆగలేదు. దాంతో సూర్యుడు వామనుడి కాలి అందెగా, చివరకు పాదపీఠంగా మారిపోయాడు. అంటే  త్రివిక్రముడై ఎదిగిన వామనమూర్తి పాదం సూర్యలోకంలో ఉందని భావన. పాదమే సూర్యబింబం వద్ద ఉంటే శిరస్సు ఏ లోకాలు దాటి వెళ్లిందో. అంతటి మహోన్నతమై, విశ్వవ్యాపితమైన రూపాన్ని వామనుడు ధరించాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.