close

తాజా వార్తలు

పిల్లల కోసం బీమా తీసుకోవచ్చా?

మా అమ్మాయి వయసు 7 ఏళ్లు. తన ఉన్నత విద్యాభ్యాసం కోసం అవసరమైన డబ్బును జమ చేసేందుకు జీవిత బీమా పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఏడాదికి రూ.30వేల వరకూ చెల్లించగలను. ఎలాంటి పాలసీని ఎంచుకోవాలి? ఏదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
- స్వాతి

మీరు జీవిత బీమా పాలసీని మీ కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. కేవలం పెట్టుబడి దృష్టితో దీన్ని తీసుకోకూడదు. మీ జీవిత బీమా అవసరాల కోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. పెట్టుబడి కోసం ఎంచుకోవాలనుకుంటే.. రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ పాలసీల్లో.. 3-5శాతం రాబడి వస్తుంది. యూనిట్‌ ఆధారిత పాలసీల్లో రుసుములు పోను.. దీర్ఘకాలంలో 8-10శాతం రాబడిని ఆశించవచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు మదుపు చేయాలనుకుంటున్న డబ్బులో రూ.12,500లను సుకన్య సమృద్ధి పథకంలో జమ చేయండి. మిగతా రూ.17,500లను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. ఇలా చేయడం వల్ల మీకు జీవిత బీమా పాలసీలకన్నా అధిక మొత్తం రావడానికి అవకాశం ఉంటుంది. విద్యా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడీ వస్తుంది.

నేను ఒక ప్రైవేటు ఉద్యోగిని. మా సంస్థ నుంచి యాజమాన్య బృంద ఆరోగ్య బీమా పాలసీ ఉంది. దీనికి కొన్ని ఉప పరిమితులు ఉన్నాయి. ఇవేవీ లేకుండా ప్రత్యేకంగా నేను ఒక పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇలా చేయడం మంచి ఆలోచనేనా?
- దయాకర్‌
బృంద ఆరోగ్య బీమా ఉండటం అవసరం. అదేసమయంలో దానిపైనే మొత్తం ఆధారపడటమూ సరికాదు. మీరు ఉద్యోగం మారినా, లేక మీ సంస్థ బృంద ఆరోగ్య బీమా పాలసీని తీసేసినా మీకు ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి, వ్యక్తిగతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిదే. పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి ఉప పరిమితులు లేకుండా చూసుకోవాలి. అపోలో మ్యూనిక్‌ ఆప్టిమా రీస్టోర్‌ పాలసీని పరిశీలించవచ్చు.

నా వయసు 25 ఏళ్లు. ఇటీవలే ఉద్యోగంలో చేరాను. నెలకు రూ.28వేలు వస్తున్నాయి. ఇందులో నా ఖర్చులు పోను రూ.12వేల వరకూ మిగులుతున్నాయి. ఇప్పటి వరకూ ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేదు. నేను ఈ డబ్బును ఎలా ప్రణాళిక వేసుకోవాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
- ప్రతాప్‌
మీపైన ఆధారపడిన వారు ఎవరైనా ఉంటే.. ముందుగా మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోండి. అదే విధంగా రూ.25లక్షల వరకూ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ తీసుకోండి. ఆరోగ్య బీమా తప్పనిసరి. మీ దగ్గర కనీసం రూ.1,00,000 అత్యవసర నిధి ఉండేలా చూసుకోండి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.12వేలలో రూ.4,000లను ప్రజా భవిష్య నిధిలో జమ చేయండి. మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. యూటీఐ ఈక్విటీ ఫండ్‌, యాక్సిస్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్‌లను పరిశీలించవచ్చు.

మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. తన వివాహానికి అవసరమైన మొత్తాన్ని జమ చేసేందుకు నెలకు రూ.30వేల వరకూ మదుపు చేద్దామనుకుంటున్నాను. ఇంకా 8-9 ఏళ్ల సమయం ఉంది. ఈలోపు వీలైనంత డబ్బు జమ చేయాలి. దీనికోసం మేము ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి? ఎంత వరకూ రాబడి ఆశించవచ్చు? ఎంత నిధి జమయ్యే అవకాశం ఉంది?
- రవి
మీ అమ్మాయి వివాహానికి ఇంకా 8-9 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి, మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా.. ద్రవ్యోల్బణానికి మించి రాబడి రావాలి. అదే సమయంలో మంచి మొత్తం జమ కావాలి. దీనికోసం మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు మదుపు చేయాలనుకున్న మొత్తంలో రూ.20వేలను ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో పెట్టండి. ఎస్‌బీఐ మ్యాగ్నం మల్టీ క్యాప్‌ ఫండ్‌, కోటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌, మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌లను ఎంచుకోవచ్చు. మిగతా రూ.10,000లను డెట్‌ ఫండ్లకు కేటాయించండి. దీనికోసం యాక్సిస్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఈ రెండు రకాల పెట్టుబడులతో సగటున 11శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు. నెలకు రూ.30,000లను 9 ఏళ్లపాటు మదుపు చేస్తే.. దాదాపు 11శాతం రాబడితో.. రూ.50,99,029 దాకా జమయ్యే అవకాశం ఉంది.

- తుమ్మ బాల్‌రాజ్‌, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.