close

తాజా వార్తలు

ఆరోగ్యానికి..కసాయం

తేనీరులో పంచదార తక్కువయినా.. చాయ్‌పత్తా ఎక్కువయినా కషాయంలా ఉందనేస్తాం..  కషాయం చేసే సాయం గురించి తెలీక అనే మాటలివి. రుచి తక్కువే కావొచ్చు.. తప్పనిసరైతే కానీ రుచి చూడకపోవచ్చు. కానీ సమపాళ్లలో మరిగిన కషాయానికి ఒక్కసారి మరిగామా.. చర్మం వికసిస్తుంది. జీవక్రియలు మెరుగవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కషాయాలు కాచుకుని చూడండి..

వనమూలికలతో..

కావాల్సినవి: దాల్చినచెక్క పొడి- పావుచెంచా, యాలకులపొడి- పావుచెంచా, లవంగాలపొడి- మూడు చిటికెలు, జాజిపువ్వు పొడి- చిటికెడు, శొంఠి పొడి, మిరియాల పొడి కలిపి- చిటికెడు.
తయారీ: నీళ్లలో పైన చెప్పిన అన్ని రకాల చూర్ణాలను వేసుకుని మరిగించుకోవాలి. స్టౌ కట్టేసి గోరువెచ్చగా అయ్యాక అందులో తేనె కలిపి 30ఎం.ఎల్‌ వరకూ తాగొచ్చు. ఈ చూర్ణాన్ని పాలతో చేసిన టీలో కూడా వేసుకుని తాగొచ్చు.
* కషాయాలనే డికాక్షన్లు అని కూడా అంటారు. వీటిని గోరువెచ్చగా తాగితే మంచిది. కషాయాలు మరిగి, నీటిలో నానే క్రమంలో వాటిల్లోని ఔషధాలు నీటిలోకి ఇంకుతాయి. తగిన ప్రమాణంలో పుచ్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. చలికాలంలో ఎదురయ్యే ఊపిరితిత్తులు, అజీర్ణ సమస్యలకు ఇవి విరుగుడుగా పనిచేస్తాయి.

వాముతో కషాయం

కావాల్సినవి: వాముపొడి- రెండు చెంచాలు, నీళ్లు- 100ఎం.ఎల్‌, నిమ్మరసం- రెండు చెంచాలు, నల్లఉప్పు- తగినంత.
తయారీ: నీళ్లలో వాముపొడి వేసి మరిగించుకోవాలి. స్టౌ కట్టేసి నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత అందులో రెండు చెంచాల నిమ్మరసం, తగినంత నల్లఉప్పు వేసుకుని తాగాలి. 
* శీతకాలంలో ఎదురయ్యే అజీర్తి సమస్యలని తగ్గిస్తుంది. కడుపులో వాయువుల కారణంగా ఏర్పడే ఇబ్బందులు తొలగిపోతాయి. విరేచనాలు తగ్గుతాయి. కడుపులో నట్టలు, క్రిములుంటే చనిపోతాయి. 

దాల్చినచెక్కతో..

కావాల్సినవి: దాల్చినచెక్కపొడి- అరచెంచా, యాలకులపొడి- పావు చెంచా, నీళ్లు- 100ఎం.ఎల్‌, తేనె- తగినంత
తయారీ: నీళ్లలో దాల్చినచెక్కపొడి, యాలకులపొడి వేసి బాగా మరిగించి స్టౌ కట్టేయాలి. తర్వాత తగినంత తేనె వేసుకుంటే సిన్నమన్‌ (దాల్చినచెక్క) కషాయం సిద్ధం. 
* ఈ కషాయంతో మతిమరుపు తగ్గుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం అందుతుంది. 

తులసి- నిమ్మరసంతో

కావాల్సినవి: తాజా తులసి ఆకులు- గుప్పెడు, నీళ్లు- 100ఎం.ఎల్‌, నిమ్మరసం- 30ఎం.ఎల్‌, తేనె- తగినంత 
తయారీ: నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించుకోవాలి. స్టౌ కట్టేసిన తర్వాత అందులో తేనె, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. 
* వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో వచ్చే జ్వరాలకు ఇది మంచి మందు.  జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి ఈ కషాయం రక్షణ కల్పిస్తుంది. రోజుకి ఒక్కసారి చాలు. 

శొంఠితో.. 

కావాల్సినవి: నీళ్లు- 100ఎం.ఎల్‌, శొంఠిపొడి- 5గ్రా, ఎండిన కమలా తొక్కలపొడి- రెండు చెంచాలు, తేనె- తగినంత 
తయారీ: ముందుగా నీటిలో శొంఠిపొడిని వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. కషాయాన్ని పొయ్యిమీద నుంచి దింపుకొన్న తర్వాత అందులో కమలా తొక్కల పొడి వేసుకోవాలి. కాస్త చల్లారాక అందులో తేనె వేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజులో రెండు సార్లు తాగొచ్చు. 
* ఇది జలుబు, దగ్గు, ఆయాసం, తలనొప్పి, ఒంటినొప్పులు, అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. 

మిరియాలు- నిమ్మరసం- పసుపుతో

కావాల్సినవి: నిమ్మరసం- రెండు చెంచాలు, మిరియాలు- చెంచా, పసుపు- చెంచా, నీళ్లు- 100ఎం.ఎల్‌, తేనె- తగినంత 
తయారీ: నీళ్లను మరిగించుకొని అందులో మిరియాలపొడి, పసుపు వేసి కషాయంగా కాచుకోవాలి. స్టౌ కట్టేసిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి అందులో నిమ్మరసం, తగినంత తేనె వేసుకోవాలి. 
* ఈ కషాయం శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మిరియాలు, పసుపు శరీర కణజాల నిర్మాణానికి సాయపడతాయి. చర్మ, కాలేయ, ఊపిరితిత్తుల ఇబ్బందులు రాకుండా చూస్తాయి. జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.
* వాముతో చేసిన కషాయం దగ్గుని తగ్గిస్తుంది. బరువు పెరగకుండా చూస్తుంది.
* పసుపు మతిమరుపుని తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. 
* రక్తపోటు, కొలెస్ట్రాల్‌ని అదుపు చేసే శక్తి దాల్చిన చెక్కకు ఉంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా చూస్తుంది. 
* మిరియాలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. దంతక్షయాన్ని నివారిస్తాయి. 

- డాక్టర్‌ పెద్దిరమాదేవి, ఆయుర్వేద నిపుణులు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.