close

తాజా వార్తలు

కారాహుషార్‌

ఇష్టమైన వస్తువు కాసేపు కనిపించకపోతే కంగారు పడిపోతాం...ఎంతో కష్టపడి కొన్న బండి చోరీకి గురైతే? ఆ బాధ మాటల్లో చెప్పలేం...దేశంలో ఏడాదికి రెండున్నర లక్షల మంది ఆ క్షోభను అనుభవిస్తున్నారు...
దొంగతనానికి గురవుతున్న ఖరీదైన వస్తువుల్లో ఇరవైశాతం వాహనాలే...జాతీయ నేర గణాంక సంస్థ చెబుతున్న వాస్తవాలివి...జాగ్రత్త పడకపోతే మనమూ బాధితుల జాబితాలో చేరే ప్రమాదముంది...
ఆ చోరుల ఆట కట్టించే దారులు తెలుసుకుంటూ వాహనాల్ని కాపాడుకుందాం.

వాహనానికి ఓనరవడం ఎవరికైనా సంతోషమే. నచ్చిన బండి కొనడం, అమ్మడం కొందరికి తేలికైన విషయం. కానీ చాలామందికి అది అపురూపమైన సంగతి. అత్యధికులు రూపాయిరూపాయి కూడబెట్టి లేదంటే బ్యాంకులో రుణం తీసుకుని కొంటుంటారు. అన్ని వ్యయ ప్రయాసలకోర్చి సొంతం చేసుకున్నదాన్ని దొంగల పాలు కాకుండా కాపాడుకోవడమూ తెలిసుండాలిగా. దీనికోసం మనమేం చేయాలంటే..

ఇవిగో దారులు
మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు.. కారు, బైక్‌.. వాహనం ఏదైనా.. చోరీకి గురి కాకుండా కాపాడుకోవడానికి విభిన్న దారులున్నాయి. మార్కెట్లో రకరకాల పరికరాలు, గ్యాడ్జెట్లు దొరుకుతున్నాయి. వాటిని వాహనానికి అమర్చుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. వీటి ఖరీదు మరీ ఎక్కువేం కాదు. వేయి రూపాయల నుంచి పదివేల వరకు పెడితే లక్షల విలువైన వాహనాలను పదిలం చేసుకోవచ్చు.
చక్రాలకు బంధనం
బండిని దొంగలపరం కాకుండా ఆదుకునే తేలికైన మార్గం ఇది. మనం రోడ్డు మీద వాహనం నిలిపితేనో, నోపార్కింగ్‌ స్థలంలో ఆపితేనో పోలీసులు కారు, బైక్‌ కదలకుండా ఒక పరికరంతో వీల్‌ లాక్‌ చేసేస్తుంటారు. దృఢమైన స్టీల్‌ రాడ్‌తో యూ ఆకారంలో ఉంటుందది. ఇలాంటివి రకరకాల రూపాల్లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీధుల్లో పార్కింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు వీటితో చక్రాలకు లాక్‌ వేసి కాపాడుకోవచ్చు. బైక్‌లకు అయితే స్టీల్‌తో తయారైన తాడులాంటి వీల్‌ లాక్‌ దొరుకుతుంది. బైక్‌ స్టాండ్‌ లాక్‌లూ అందుబాటులో ఉన్నాయి.

టైర్‌ నట్‌ లాక్‌
కారు, బైక్‌ దొంగిలించడానికి వీలు లేనప్పుడు టైర్లు విప్పదీసుకొని వెళ్లిపోయే తెలివి మీరిన దొంగలుంటారు. టైర్లు తొలగించడం తేలిక కావడంతో ఈ తరహా దొంగతనాలు ఎక్కువే జరుగుతుంటాయి. దొంగిలించిన వాటిని సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్లో అమ్ముకుంటుంటారు. అలాయ్‌ చక్రాలున్న టైర్ల ధర తక్కువేం కాదు. వీటికి పరిష్కారం ఏంటంటే టైర్‌ నట్‌ లాక్‌. చక్రానికి ఉండే నట్‌బోల్ట్‌ ఒకదానికి ఈ తాళం వేయొచ్చు. ఇతరులు దీన్ని విప్పడం అసాధ్యం.
స్టీరింగ్‌ లాక్‌
ముందు చెప్పిన పద్ధతులు పాటించడం ఇబ్బందిగా, మొరటుగా ఉంటుందని భావిస్తే కారు స్టీరింగ్‌ లాక్‌ని వాడి బండిని సేఫ్‌గా ఉంచుకోవచ్చు. కడ్డీలా పొడుగ్గా ఉండే ఈ లాక్‌ క్లిప్‌లా స్టీరింగ్‌ని రెండువైపులా పట్టి ఉంచుతుంది. దీంతో స్టీరింగ్‌ ఎటువైపూ కదలదు. దొంగ ఎలాగో తంటాలు పడి ఇంజిన్‌ స్టార్ట్‌ చేసినా బండిని పక్కకు తిప్పడం అసాధ్యం.  
కిల్‌ స్విచ్‌లు  
ఫ్యూయెల్‌ పంపునకు ఇంధనం, ఎలక్ట్రిక్‌ సరఫరా ఆపి వేసి ఇంజిన్‌ స్టార్ట్‌ కాకుండా చేస్తాయి కిల్‌ స్విచ్‌లు. ఒకవేళ దొంగ అద్దాలు పగలగొట్టి కారు లోపలికి చొరబడ్డా ఇంజిన్‌ స్టార్టవదు. కాకపోతే వీటిని బిగించడం నిపుణులైన మెకానిక్‌లకే సాధ్యం. ధర రూ.రెండువేల నుంచి పదివేల వరకు ఉంటుంది.


యాంటీ థెఫ్ట్‌ పరికరాలు
యాంటీ థెఫ్ట్‌ పరికరాలు ఉన్న వాహనాలకు బీమా కంపెనీలు ప్రీమియంలో ఎక్కువశాతం డిస్కౌంటు ఇస్తున్నాయి. కొన్ని ఖరీదైన కార్లు, బైకుల్లో ఇన్‌బిల్ట్‌గా ఈ ఫీచర్లు ఉంటే.. మిగతావాటికి మనం మార్కెట్లో కొని అమర్చుకోవచ్చు.
థెఫ్ట్‌ సెన్సర్లు: ఈ చిన్న గ్యాడ్జెట్‌ను కారు డోరు లోపలివైపు అమర్చి స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేస్తారు. ఎవరైనా అద్దం పగలగొట్టినప్పుడు, కీ నాబ్‌లో డూప్లికేట్‌ కీ పెట్టి స్టార్ట్‌ చేయాలని ప్రయత్నించినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో అలారం మోగుతుంది.

వెహికిల్‌ ఇమ్మొబిలైజర్‌: ఎవరైనా నకిలీ తాళంచెవితో కారుని దొంగిలించాలని ప్రయత్నించినప్పుడు, బలవంతంగా చోరీ చేయాలని చూసినప్పుడు .. ఇమ్మొబిలైజర్‌ గుర్తించి బండి స్టార్ట్‌ కాకుండా చూస్తుంది. కొన్ని కార్లలో ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. ఇవి లేనివాటిలో ప్రత్యేకంగా అమర్చుకోవచ్చు. దీనికి దాదాపు రూ.5వేల నుంచి 10వేల వరకు ఖర్చవుతుంది.
జీపీఎస్‌, ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌ డివైజ్‌: కారు, బైక్‌ చోరీని ఆపలేకపోయినా ఈ పరికరంతో చోరీ అయిన వాహనం ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. ముందు స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించాలి.

డాష్‌ కెమెరాలు: మన ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతులు, ప్రమాదాలను రికార్డు చేసే డాష్‌బోర్డ్‌ కెమెరాలు.. వాహనంలోకి అపరిచితులు వస్తే రికార్డు చేసి చోరులెవరో గుర్తించేలా చేస్తాయి.


ఇవీ పాటించండి
* కారు, బైక్‌ బయట కనిపిస్తేనే కదా.. దొంగల కళ్లు పడేది. వాహనాల్ని వీలైతే బయట పార్క్‌ చేయకుండా ఉండాలి. తప్పనిసరైతే వాటిపై కవర్లు కప్పి ఉంచాలి. కారు, బైక్‌ ఖరీదైనది అయితే ఆ బ్రాండ్‌ది కాకుండా సాధారణ కవర్లు కప్పితే దొంగల దృష్టి మరల్చవచ్చు.
* ఇగ్నిషన్‌ బటన్‌కి తాళం చెవి అలాగే ఉంచడం కొందరికి అలవాటు. ఇది చోరుల పనిని తేలిక చేస్తుంది. బైక్‌ స్టాండ్‌ వేసినప్పుడు, కారు పార్క్‌ చేసినప్పుడు వెంటనే కీ తీశామా? లేదా? అని చెక్‌ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అద్దాలు, సన్‌రూఫ్‌ దించాలి.
* వాహనంలో నగలు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లాంటి విలువైన వస్తువులు ఉన్నప్పుడు వేరేవాళ్లకు వాటిని దొంగలించాలనే దుర్బుద్ధి పుడుతుంది. ఇతరులకు కనిపించేలా విలువైన వస్తువులు కారులో, బైక్‌లో ఉంచకూడదు.
* ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్లే మార్గం గురించి ముందే తెలుసుకోవాలి. నేరాలకు ఆస్కారం ఉండే, సురక్షితం కాని దారిలో ప్రయాణించకుండా ఉంటేనే మేలు.
* జనసంచారం, వెలుతురు లేనిచోటే దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. జనం, వెలుతురు ఉన్నచోటే వాహనాల్ని నిలిపి ఉంచాలి.
* ఒకట్రెండు నిమిషాల పని కోసం ఇంజిన్‌ని ఆఫ్‌ చేయడం ఎందుకని కొందరు అలాగే వదిలేస్తుంటారు. ఈ కొద్దిసమయంలోనే వాహనాలు చోరీకి గురవుతుంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు. కొందరు అదనపు తాళం చెవులను లోపలే వదిలేస్తుంటారు. ఇదీ సరికాదు.
* బైక్‌ స్పార్క్‌ప్లగ్‌ వదులు చేసి ఉంచితే బండి స్టార్ట్‌ అవదు. దొంగల కళ్లు కప్పడానికి ఇదో మంచి చిట్కా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.