close

తాజా వార్తలు

సి‘తారక్‌’ 

ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా

‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి అడిగే హక్కులేదు’ 
- అరవింద సమేత..లో ఎన్టీఆర్‌ డైలాగ్‌... 

సి‘తారక్‌’ 

అవును ఇప్పుడు ఎన్టీఆర్‌ నాన్న దూరమైన విషాదంతో యుద్ధం చేస్తున్నాడు. తన ఇద్దరి పిల్లల నవ్వుల్లో శాంతి చూసుకుంటున్నాడు. 
ఎనర్జీకి అడ్రెస్‌లాంటి తారక్‌... కష్టంలో తనని తాను మలుచుకుంటున్నాడు. ఇంట్లో జరిగిన పెద్ద విషాదం తర్వాత తనలో వచ్చిన మార్పులు... పిల్లల అల్లరి.. వారి చదువులు... ‘అరవింద సమేత’ కబుర్లు ‘హాయ్‌’తో పంచుకున్నాడు.* విషాదం నుంచి బయటపడడానికి ఎంత సమయం పట్టింది? 
నిజం చెప్పాలంటే ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా. నాన్న మరణం నేను మోస్తున్న అతి పెద్ద విషాదం. ఈ ఘటనతో జీవితం ఎంత క్షణికమో అర్థమైంది. ఎవ్వరూ దేనికీ అతీతులు కారని తెలిసింది. ఇప్పటి వరకూ 28 సినిమాలు చేశాను. ఒక్క సన్నివేశంలోనూ తండ్రికి కర్మకాండలు చేసే సన్నివేశంలో నటించలేదు. తొలిసారి అలాంటి సన్నివేశం ఒకటి వచ్చింది. అరవింద సమేతలో ‘రం.. రుధిరం’ పాటలో ఏం జరిగిందో నా జీవితంలోనూ అదే జరిగింది. ఇది యాదృచ్ఛికం అనాలా? విధి అనాలా? ప్రస్తుతం ఈ విషాదం మిగిల్చిన భారాన్ని నా నుంచి దింపుకోవడానికి ప్రయత్నిస్తున్నా. 
* మీ కుటుంబానికే రోడ్డు ప్రమాదాలు శాపంగా మారడం ‘విధిరాత’ అనుకుంటున్నారా? 
మాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. నిజంగా మనం నిమిత్తమాత్రులం. ఏం చేయలేం. దేన్నీ ఆపలేం. మా కుటుంబానికే కాదు, ఏ కుటుంబానికీ ఇలాంటి కష్టం రాకూడదు. 
* ఇప్పుడు డ్రైవింగ్‌ అంటే భయం వేస్తోందా? 
దేనికి భయం? భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్లేదెలా? కాకపోతే ‘ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి’ అని మాత్రం అర్థమైంది. నాన్న మరణం నాలో చాలా రకాలైన మార్పులు తీసుకొచ్చింది. ప్రాక్టికల్‌గా మారిపోయా. ఈమధ్య వెరైటీగానూ మాట్లాడేస్తున్నా. కన్ను తెరచి, మూసేలోగా జీవితం అయిపోతోందండీ. ఎవరి జీవితం ఎవరి కోసం ఆగదు. ఎవరి జీవితం వెనుక వాళ్లు పరుగులు పెట్టాల్సిందే. 
* మీ లక్ష్యాలు, ఆశయాలూ అన్నీ మారిపోయాయా? 
లక్ష్యం, ఆశయం అనే పెద్ద పెద్ద మాటలు వాడను గానీ, ఎవరి బాధ్యతని వాళ్లు సక్రమంగా పూర్తి చేయాలి. నాన్నని చూడండి... ఓ కొడుకుగా, తండ్రిగా, భర్తగా, తాతగా తన బాధ్యతలన్నీ పూర్తి చేశారు. సమాజం పట్ల తనకున్న కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అంతకంటే పరిపూర్ణమైన జీవితం ఎవరికి వస్తుంది. ఇప్పుడు నా లక్ష్యం... నా పిల్లలు మాత్రమే. నేను నాన్నలా పరిపూర్ణంగా బతకాలి. అలాంటి జీవితాన్నే నా పిల్లలకు ఇవ్వాలి. 
* మీ మాటల్లో వేదాంతం ఎక్కువవుతోంది? 
ఇది వరకూ ఇంతేనండీ. ఇప్పుడు ఇంకాస్త పెరిగిందేమో. నాకు తెలిసి ప్రతీ రోజూ ఓ బోనస్‌ అనుకోవాలి. ఈరోజు సంతోషంగా నిద్రలేస్తే అది అదనపు జీవితం. మరణం ముందున్నప్పుడు ఎవరికైనా ఓ ప్రశ్న ఎదురవుతుంది. ‘ఇంతకాలం బతికాం కదా? ఈ ప్రయాణం సంతోషమేనా.. ఇంకా ఉండాలా’ అని. నేనైతే ‘ఇంతకాలం హ్యాపీగానే బతికాను.. నన్ను ఇక తీసుకెళ్లిపో’ అని చెప్పగలగాలి. అప్పుడే సంపూర్ణమైన జీవితం చూసినట్టు. 
* మీ నాన్నగారి నుంచి ఏం నేర్చుకున్నారు? 
ఊహ తెలిసినప్పటి నుంచీ చనిపోయేవరకు ఆయన ఒకే దృక్పథంతో ఉన్నారు. ఒకే మాటపై నిలబడ్డారు. వేసిన అడుగు వెనక్కి తీయలేదు. అలా ఉండడం చాలా కష్టం. మనిషంటే అలా ఉండాలి. ‘జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రయాణం ఆపకూడదు.. వాటిని పలకరిస్తూ ముందుకు సాగండి’ అని నాన్నగారు చెబుతుండేవారు. అవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలే. 
* మీ విజయాల్ని బాగా ఆస్వాదించేవారా? 
మాకంటే బాగా. ‘నాన్నకు ప్రేమతో’ చూసి చాలా సంతోషించారు. నాన్న కథ కదా, అందుకే త్వరగా కనెక్ట్‌ అయిపోయారేమో. అన్న సినిమా ‘పటాస్‌’ ఆయనకు బాగా నచ్చింది. పల్లెటూరి నుంచి వచ్చిన వ్యక్తి కదా? ఆ అలవాట్ల నుంచి బయటకు రాలేదు. ఆయన అలా నిమ్మకూరులోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు సరదాగా గిల్లేవారు. వీపుపై గట్టిగా కొట్టేవారు. ఇవన్నీ నాన్న తన ప్రేమని చూపించే పద్ధతులు. తాతగారి లక్షణాలు ఆయనలో చాలా కనిపించేవి. 
* అభయ్‌, భార్గవ్‌ల సంగతులేంటి? 
అభయ్‌కి అప్పుడే నాలుగేళ్లు వచ్చేశాయి. వాడు పెద్డోడైపోయాడు. అప్పుడప్పుడూ నా షూటింగులకు వస్తుంటాడు. వాడికి సిగ్గు ఎక్కువ. ఆ వయసులో అలానే ఉంటారేమో. చిన్నప్పుడు నేను అంతే కదా? (నవ్వుతూ). మా అమ్మకు ఇప్పుడు వాళ్లిద్దరే బలం. నాన్న మిగిల్చిన విషాదానికి మందు.. పిల్లల నవ్వుల్లోనే దొరుకుతోంది. అభయ్‌ కొడుకు కాదు, క్వశ్చన్‌ బ్యాంకు. అన్ని ప్రశ్నలెలా పుడతాయో అర్థం కాదు. ఫోన్‌ చూసి ‘ఇదేంటి’ అని అడుగుతాడు. ‘ఫోన్‌’ అన్నామనుకోండి.. ‘దాంతో ఏం చేస్తాం’ అని మరో ప్రశ్న వదులుతాడు. ఈ ప్రశ్నల పరంపర ‘ఫోను కనిపెట్టినవాడు ఎవడు’ అనేంత వరకూ వెళ్తుంది. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెబుతుంటాను. ఒక్కోసారి వాడేం ప్రశ్నలు అడుగుతాడో అని భయం వేస్తుంటుంది. అందుకే వాడ్ని చూసి పారిపోతుంటా. అప్పుడప్పుడూ అభయ్‌కి ప్రణతి కూడా బలైపోతుంటుంది. 
* హోం వర్కులు చేయడంలో సాయం చేస్తున్నారా? 
ఈ వయసులో పిల్లలకు హోం వర్కులేంటండీ. అలాంటివి నేనసలు ప్రోత్సహించను. నాకు తెలిసి సగం చదువు వాళ్లకు ఇంట్లోనే దొరకాలి. అమ్మమ్మ, నానమ్మలతో కూర్చుని, వాళ్లు చెప్పే కథలు వింటూ ఎదగాలి. మా అమ్మ అప్పుడప్పుడూ అభయ్‌కి రామాయణం, మహాభారతం కథలు చెబుతుంటుంది. పిల్లలకు అదే సరైన విజ్ఞానం కూడా. అమ్మమ్మ, నానమ్మల ఇంట్లో పెరిగిన పిల్లలకు మన సంస్కృతులు, సంప్రదాయాల గురించి బాగా అర్థమవుతుందని నా నమ్మకం. ఎంత జీవితాన్ని చూసుంటారు వాళ్లు..? కనీసం నాలుగు తరాల కథలు వాళ్లకు తెలుసు. అవన్నీ పిల్లలకు చెబుతుంటే ఎంత బాగుంటుంది? నేనైతే నా మనవళ్లకీ, మనవరాళ్లకీ కథలు చెప్పాలని ఫిక్సయిపోయా... అప్పటికి నేనుంటే.. (నవ్వుతూ). నాలుగేళ్ల పిల్లాడు ఆడుకోకపోతే వాడికేదో సమస్య ఉన్నట్టు. పెన్ను తీసుకుని గోడపై రాయకపోతే, ఇంట్లో ఉన్న వస్తువులు ఇరగ్గొట్టకపోతే, గొడవ చేయకపోతే ఏదో లోపం ఉన్నట్టు. వాళ్లు అల్లరి చేయాలి. హోం వర్కులు కాదు. 
* రామ్‌చరణ్‌తో చేస్తున్న మల్టీస్టారర్‌ సంగతులేంటి? 
ఆ సినిమా కోసం నేనూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. చరణ్‌ నాకు మంచి స్నేహితుడు. మేం కలిసి ఓ సినిమా చేస్తున్నాం అనేదానికంటే.. ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాం అనే విషయాన్ని ఎక్కువగా ఆనందిస్తున్నా. అందరు హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. కానీ అదంతా మమ్మల్ని నడిపించే సామర్థ్యం ఉన్న దర్శకుల చేతుల్లో ఉంటుంది. ప్రణాళికలు వేసుకుని చేస్తే మల్టీస్టారర్‌ సినిమాలు రావు. అలా ప్లాన్లు వేసుకుని చేసిన సినిమాలు ఏమయ్యాయో చూశారు కదా? 
* అరవింద సమేత... మరో ఫ్యాక్షన్‌ కథ అనుకోవచ్చా? 
ఫ్యాక్షన్‌ కథలు ఇది వరకు చాలా వచ్చాయి. వాటిలో హింసకు ఓ పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేశారు. మా వంతుగా మేం మరో మార్గాన్ని చూపిస్తున్నాం. ‘అరవింద సమేత’ అనేది త్రివిక్రమ్‌కి వచ్చిన ఆలోచన. ఆయన ప్రయాణంలో మేమంతా భాగమయ్యామంతే. అది పూర్తిగా త్రివిక్రమ్‌ మార్క్‌ చిత్రం. మేమైతే సందేశాత్మకమైన సినిమా తీద్దాం అని అనుకోలేదు. చెబుతున్న కథలో సందేశం ఇమిడి ఉంటే బాగుంటుంది అనిపించింది. అహింస గురించి చెప్పేవాళ్లకు హింస గురించి కూడా తెలిసుండాలి. అరవింద సమేతలో ఓ డైలాగ్‌ ఉంది... ‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి అడిగే హక్కులేదు’ అని. రెండు కోణాలూ తెలిసినప్పుడే మంచేదో, చెడు ఏదో బాగా చెప్పగలం.

- అన్వర్‌ మహమ్మద్‌, ఫొటో : మధు

ఆ ప్రయాణంలోనే కిక్‌

టెంపర్‌ లాంటి కథ నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జై లవకుశ’ ఇవన్నీ నా తరహా కథలు కావు. ‘ఎన్టీఆర్‌ ఇలాంటి సినిమాలు చేయగలడా’ అనే షాకింగ్‌ వాల్యూ నాకు కావాలి. దాని కోసమే ఎదురు చూపులు. ప్రతి సినిమా ఓ ప్రయాణమే. కొన్ని సార్లు సినిమా కోసం చేసిన ప్రయాణం బాగుంటుంది. ఫలితం సరిగా ఉండదు. కొన్నిసార్లు ప్రయాణాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఫలితం బాగుంటుంది. నాకు సినిమా ఫలితం కంటే, ప్రయాణం చేయడంలోనే కిక్‌ ఉంటుంది.

ఉన్నదాంట్లో బతికేస్తా

మన లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. కొత్త ఆశయాలు ఊరిస్తూ ఉండాలి. చిన్నప్పుడు ‘ఈ స్కూళ్లేంటి? త్వరగా ఇంటికి వెళ్లిపోతే బాగుణ్ణు’ అనుకునేవాడ్ని. పదో తరగతిలో ‘ఈ పరీక్షలు పాసైతే చాలు’ అనుకున్నా. అంతకు మించిన లక్ష్యాలేవీ ఉండేవి కావు. ‘మా అమ్మ కోసం ఒక్క సినిమా చేస్తే చాలు’ అనుకునేవాడ్ని. రెండో సినిమా వస్తుందని, రావాలని కోరికలు ఉండేవి కావు. ఇప్పుడు పాతిక సినిమాల మైలు రాయి వరకూ రాగలిగాను. ఇలా లక్ష్యాలు మారిపోతున్నాయి. నాకున్న దాంతో సుఖంగా బతికేస్తా.

త్రివిక్రమ్‌ గొప్ప స్నేహితుడు

నేను పుస్తకాలు చదవను కానీ, బాగా వింటానండీ. త్రివిక్రమ్‌ అనర్గళంగా పుస్తకాల గురించి చెబుతూ ఉంటే.. నేను ఓపిగ్గా అవన్నీ వినేస్తుండేవాడ్ని. ఆయన మంచి దర్శకుడే కాదు. అంతకు మించి నాకు గొప్ప స్నేహితుడు. నా దర్శకులందరినీ నేను బాగా ప్రేమిస్తా. ఎందుకంటే ఓ సినిమాకి తొలి ప్రేక్షకుడు దర్శకుడే. వాళ్ల మనసులో ఉన్న కథకు మేం రూపాలం మాత్రమే. దర్శకుడ్ని సంతృప్తి పరిస్తే.. ప్రేక్షకుడ్ని సంతృప్తి పరిచినట్టే.

మా ఆవిడా తగ్గుతానంటోంది

‘జై లవకుశ’ తరవాత బాగా లావైపోయా. ఓ దశలో 88.5 కేజీలు ఉన్నా. భయం వేసింది. ‘ఈ సినిమా కోసం కొంచెం ఫిట్‌గా మారాలి’ అని త్రివిక్రమ్‌ చెప్పారు. ఆయన అడిగిన దానికంటే ఇంకొంచెం తగ్గాలి అనిపించింది. దానికి తగ్గట్టు మంచి ట్రైనర్‌ దొరికాడు. ఫిట్‌గా ఉండడం సినిమా కోసమే కాదు, ఆరోగ్యానికీ మంచిది. లైఫ్‌ స్టైల్‌ కూడా మారిపోతుంది. నన్ను చూసి మా ఆవిడ కూడా మారింది. ‘ఈమధ్య నేనూ ఒళ్లు చేశా.. తగ్గి చూపిస్తా చూడండి’ అంటోంది. (నవ్వుతూ)...


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.