close

తాజా వార్తలు

అంపశయ్యపై సినిమా పాట

పాట చాలామందికి పేరు తీసుకొచ్చింది! పాటకు పేరు తీసుకొచ్చిన అక్షరజ్ఞాని మాత్రం... సిరివెన్నెల సీతారామశాస్త్రి!! ఈ పాట నేను రాశాను - అని చాలామంది రచయితలు కాలర్లు ఎగరేసుండొచ్చు. ‘నన్ను సీతారామశాస్త్రి రాశారు’ అని పాటలే పొంగిపోయి, పరవశించేలా చేసిన ప్రతిభాశాలి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి!!

ఆయన పాటలు వింటే - రక్తంలో కరెంటుని ఎక్కించినంత ఉత్సాహం, మెదళ్లలో కొత్త భావాల చిగుళ్లు మొలిపించగలిగేంత ఉద్వేగం! ఆయన పాటంటేనే - ఏళ్లకు ఏళ్లు దాచుకుని దాచుకుని మురిసిపోయే జ్ఞాపకం. పాటంటే పరవశం - పాట మాత్రం ఆయన వశం! పాటని పాఠంగా మార్చి, అక్షరంలో అణుబాంబంత విస్ఫోటం సృష్టించగల ధీశాలి.  మూడు వేల పాటలు రాసి - అంతకు లక్షరెట్లు శ్రోతల్ని ఉద్వేగంలో ముంచి, ఉల్లాసపరచిన సీతారామశాస్త్రితో.. పాట గురించి ‘హాయ్‌’ మాట్లాడితే - భావాలు వరదలయ్యాయి.. వెన్నెల తరగలయ్యాయి!!

అంపశయ్యపై సినిమా పాట

* సాధారణంగా పాట పదాల వెంట పరుగులు పెడుతుంటుంది. మీ శైలి చూస్తే.. మీ వెనుకే పదాలు పరుగెడతాయేమో అనిపిస్తుంటుంది. నిజానికి ఈ రెండింటిలో ఏది గొప్ప శైలి? 
పదాల వెనుక పాట పరుగెట్టడం ఆరోగ్యకర లక్షణం కాదు. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ ప్రస్తుతం ఇలాంటి ప్రయాణమే సాగుతోంది. భావం వెనుక పదాలు పరుగులు తీయాలి. భావమే తనకు కావాల్సిన పదాల్ని వెదుక్కుంటుంది. అభివ్యక్తి, స్వభావాలు, అనుభవాల భావాల వెనుక పదాలు పరుగెట్టినప్పుడే గొప్ప పాట పుడుతుంది. .

* పాటైనా, కవిత్వమైనా చిరస్థాయిగా మిగిలిపోవాలంటే...? 
కవిత్వం అనే మాటలోనే ప్రేమ, అవధుల్లేని ప్రేమ, అపారమైన క్షమ లాంటి దైవిక లక్షణాలుంటాయి. అసలు కవిత్వమంటేనే అది. కవిత్వమూ, ద్వేషమూ ఒకే వేదికపై ఉండడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. తిడుతూ రాస్తే కవిత్వం ఎందుకు? ఏ కళకైనా ఓ ప్రయోజనం ఉంటుంది. పాటకైనా, కవిత్వానికైనా భాష చాలా ముఖ్యం. నీ చుట్టు పక్కల ఉన్న వ్యవహార భాషలో ఉంటే మరింత మంచిది

* మీ సినీ ప్రయాణం కె.విశ్వనాథ్‌ గారితో మొదలైంది. మొదటి అడుగుతోనే కళల్ని ప్రేమించిన వ్యక్తి అండ దొరికింది. లేకపోతే మీ ప్రయాణం ఎలా ఉండేది..? 
ఆయన లేకపోతే నా మొదటి అడుగే చివరి అడుగు అయ్యేది. సహజంగా నేను కవిని. కవిత్వం కానిది నేను రాయలేను. మొదటి సినిమాలోనే కవిత్వం వ్యక్తపరిచే అవకాశం దక్కింది. అలా కాకుండా వేరేదేదో రాయమంటే నేను రాయలేక వెళ్లిపోయేవాడ్ని. నా తదుపరి ప్రయాణానికీ ‘సిరివెన్నెల’ చాలా దోహదం చేసింది. ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’ లాంటి సినిమాలు వెంట వెంటనే రావడంతో నా ప్రయాణానికి ఓ స్థిరత్వం ఏర్పడింది. దాదాపు మూడేళ్ల పాటు నా సహజ ప్రవృత్తికి అనుకూలమైన పాటలు రాసే కథలు దక్కాయి. బతుకు కోసం ఏదైనా చేయాలి, ఏమైనా రాయాలి అనే తాపత్రయం నాకు రాలేదు. నేను రాజీ పడలేదు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో అశక్తుడ్ని. స్త్రీ గురించి హీనంగా, హేయంగా రాయలేను. యువతకు ‘ప్రేమించండి - మిమ్మల్ని ఎవడు అడుగుతాడు? తోచిన దారిలో వెళ్లండి’ అంటూ వెర్రెక్కించలేను.

* కథలు రాశారట.. ఆ అనుభవాలు చెబుతారా? 
పదిహేను కథలు ప్రచురితమయ్యాయి. పోస్టులో పంపితే రెక్కలు కట్టుకుని తిరిగి వచ్చేసిన కథలు ముప్ఫై ఉన్నాయి. సగంలో వదిలేసినవి 400 ఉంటాయేమో. కథా రచనలో నా శైలి వేరు. కవితాత్మకంగా, చాలా క్లిష్టంగా ఉంటాయి. కథా నిర్వచనాలకు లొంగవు. అందుకే ఆ యుద్ధం నేను చేయలేదు. ఏడు కథల్ని ఎంచుకుని ‘ఎన్నో రంగుల తెల్లకిరణం’ అని పుస్తకంగా వేశాను.
* మూడు వేల పాటలు రాశారు. మరి మాటలు రాయమని ఎవరైనా అడిగారా? 
కొత్తలో అడిగారు. నేను ఒప్పుకోలేదు. మూడు గంటల విషయాన్ని మూడు వాక్యాల్లో చెప్పడం అలవాటు చేసుకున్నవాడ్ని. మూడు వాక్యాల్లో చెప్పాల్సింది మూడు గంటలు చెప్పడమంటే కష్టమేగా..!

* రాత్రి పూటే పాటలు రాస్తుంటారు. చీకటికీ మీకూ ఉన్న సంబంధం ఏమిటి? 
చీకటి ఏకాంతం ఎక్కువగా ఇస్తుంది. పాట రాయాలంటే నాలోకి నేను వెళ్తుండాలి. నాతో నేను మాట్లాడుకోవాలి. పోట్లాడుకోవాలి. అలా జరగాలంటే చాలా పొరల్ని దాటుకుంటూ వెళ్లాలి. ఆ సంఘర్షణకు రాత్రి అనువైన సమయం. వయసు మీద పడడంతో ఇప్పుడు రాత్రిపూట మేల్కోవడం తగ్గించా.

* రేపటి పాట ఎలా ఉండబోతోంది? 
నేను కోరుకున్న రూపంలోకి పరివర్తనం చెందుతుందనే అనుకుంటున్నా. జీవితానికి ఫుల్‌ స్టాప్‌ ఉండదు. ఓ ప్రళయం వచ్చి... సృష్టి అంతా నశించిపోవడాలు ఉండవు. చేసిన తప్పులు దిద్దుకుంటూ ముందుకెళ్లడమే మార్గం. అలా దిద్దుకోవాలంటే మనిషిని కాదు.. సమూహాన్ని చూడాలి. ఎవరైనా సముద్రం దగ్గర నిలబడి ‘నేను పొట్టి కెరటాన్ని చూశాను, పొడుగు కెరటాన్ని చూశాను..’ అనడు. ‘సముద్రాన్ని చూస్తున్నా’ అంటాడు. మనిషిని కేవలం మనిషిగా చూస్తే చాలా గందరగోళాలు ఎదురవుతాయి. మనుషులందరినీ కలిపి ‘ఓ మనిషి’ అనుకుంటే ఆ సంక్లిష్టత తగ్గుతుంది.

నేనూ, కె.విశ్వనాథ్‌ గారు ఓ సందర్భంలో ‘సినిమాకి పాటలెందుకు?’ అనే చర్చ లేవదీశాం. తన సినిమాల్లో పాటలకు అగ్రతాంబూలం ఇచ్చే విశ్వనాథ్‌ అంతటి వారే.. ‘పాటËలొద్దు’ అన్నారంటే.. ఎందుకని ఆలోచించాలి కదా? మనసు ఆకలి, ఆత్మ ఆకలి తీర్చేది.. కవిత్వం. ఆ అవసరం ఉంటేనే అలాంటి పాటలు రాయాలి. హాలీవుడ్‌లో పాట ఎందుకు కనుమరుగైపోయింది. బాలీవుడ్‌లో పాట రీ రికార్డింగుల్లో ఎందుకు కలిసిపోతోంది? ఎందుకంటే.. పాట జనాలకు నచ్చడం లేదు. అలాంటప్పుడు ఖర్చు ఎందుకు? ఈ ప్రశ్న సినిమా తీసేవాళ్లు వేసుకోవాలి. ఒక్కో పాటకు ఆరు లక్షల నుంచి ఆరు కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. సినిమా స్థాయిని బట్టి ఈ రేటు మారుతుంది. ఆరు పాటలు లేకపోతే 36 కోట్లు మిగిలిపోయినట్టే కదా! పాటలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి. ఈమధ్య హిట్టయిన సినిమాల్లో మీకెన్ని పాటలు గుర్తున్నాయి? అంటే పాటలున్నా, లేకున్నా పట్టించుకోవడం లేదనే కదా అర్థం. చెప్పాల్సిన కథ సూటిగా చెప్పు. లేదంటే పాట అవసరమయ్యే స్థాయి కథ తీసుకో.

* సినిమా స్థాయిని పాట పెంచగలదా? 
దుప్పటి అవసరమా? కాదా? అనేది గదిలో చలి ఉందా? వేడి ఉందా? అనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పాటా అంతే. ఇది వరకు పౌరాణిక గాథలు వచ్చేవి. అక్కడ వాడే భాష వేరు, పదజాలం వేరు. సాంఘిక చిత్రాల్లో మనదైన సమస్యలే ఇతివృత్తాలుగా ఉండేవి. ఆయా కథలకు పాటలు అవసరం లేదు. ఉన్నా.. దానికి కవిత్వం అక్కర్లేదు.

తెలుగు సినిమా తాలుకు ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా కాలం వరకూ పాటలో కవిత్వం అవసరం లేదు. అలాగని రాసినవాళ్లంతా కవిత్వం తెలియనివాళ్లా? అంటే అదీ కాదు. పింగళి, సముద్రాల ఇలాంటి మహా రచయితలున్నారు. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి? ఆత్మకు తగిలితే మందు సరిపోదు. మనసు కావాలి. అప్పుడే కవిత్వం అవసరం అవుతుంది.

‘చిలకా ఏ తోడు లేక’ పాట సాధారణమైన సందర్భంలోంచి పుట్టిన పాట కాదు. ఏ ఆడదీ తన మొగుడిని అమ్ముకోదు. ఆ అవసరం  ఇప్పటి వరకూ రాలేదు. అయినా ఆ పాట నిలబడిందంటే కారణం.. అందులోని భావాలేవో వాళ్లని తడిమాయని అర్థం. ఏ విషయాలు చెబుతున్నాం? ఎంత సార్వజనీనంగా, ఎంత సామాన్యంగా చెబుతున్నాం అనేదే పాట స్థాయిని నిర్ణయిస్తుంది.

అంపశయ్యపై సినిమా పాట

* సినిమాకి పాటే అవసరం లేదు అని ఓ సందర్భంలో మీరే అన్నారు కదా! 
పాట అనేది దినుసు లాంటిది. అవసరమైన సందర్భంలోనే వాడాలి. కరివేపాకు కూరలోనే వేయాలి, పాయసంలో ఎందుకు? బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో పాటలు చూడండి. తిరునాళ్లలోనో, జాతరలోనో కథానాయకులు పాటలు పాడుకునేవాళ్లు. ఎందుకంటే.. వాస్తవ జీవితంలో పాటలు పాడుకునే చోటు అదే కాబట్టి. కొట్టుకోవడం అనేది వాస్తవికంగా ఉండేది. ఇప్పుడు సైన్స్‌ సూత్రాలే తలకిందులైపోయేలా తయారయ్యాయి ఫైట్లు. పాటలూ అంతే. సంగీతం, సాహిత్యం వేర్వేరు ముక్కలు అనుకుంటున్నారు. పసిపాప ఏడుపులో సంగీతం ఉంటుంది, ఆ ఏడుపు ఎందుకోసమో తల్లికి అర్థమవుతుంది. అంటే.. ఆ సంగీతంలోనూ అర్థాలున్నాయనే కదా. కథలు నేలపై ఉన్నంత వరకూ పాటలు బాగున్నాయి. ఎప్పుడైతే నేల విడచి సాము చేశాయో.. అర్థరహితంగా మారాయి. తెలుగు సినిమా పాట అంపశయ్యపై ఉంది. దానికి చికిత్స జరగాలి. ఎలాంటి పాటలు అవసరం అనే చర్చ జరగాలి.

* ‘సినిమా కవిగా ఉండిపోయారు కాబట్టే మీకు రావాల్సిన గుర్తింపు రాలేదు’ అని ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ చెప్పారు. మీకూ అలానే అనిపిస్తుంటుందా? 
అలా జరిగి ఉంటే, ఇలా చేసి ఉంటే అనే ఊహలకు అర్థం లేదు. మనదారిలో ఏం వస్తే అది స్వీకరించాలి. నువ్వేదో నువ్వు ఒప్పుకో. అది చాలా ముఖ్యం. ఇక్కడ ‘ఏమో’లతో పనేంటి? నేనున్న స్థితిని ఆనందించడం మానేసి ‘అది అయ్యి ఉంటే’ అంటూ చర్చ పెట్టి కాలయాపన చేయడం ఎందుకు? అయితే కొత్తగా వచ్చే గీత రచయితలకు ఓ సలహా ఇవ్వగలను. గీత రచనని మాత్రమే వృత్తిగా నిర్ణయించుకుని రమ్మని నేను చెప్పను. ఇది ఫుల్‌ టైమ్‌ జాబ్‌ కాదు. ఎన్నో పరిమితులమధ్య పాట రాయడం ఈరోజు కత్తిమీద సాము. కవిత్వాన్ని బతుకు తెరువుగా మార్చుకోకండి. సినిమా పాట రాయడానికి నేను పెట్టుకున్న ముద్దు పేరు.. ‘స్వేచ్ఛా బానిసత్వం’. అక్షరం లక్షల అవసరాల్ని తీర్చాలి.

* జాతీయ అవార్డుల విషయంలో తెలుగు పాటకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తారా? 
అవార్డుల గురించి పెద్దగా ఆలోచించను. అవార్డు ప్రక్రియలో థియరీ, ప్రాక్టికల్‌ అనేవి రెండుంటాయి. థియరీ రాజ్యాంగాన్ని చదవడమంత తేలిక. ప్రాక్టికల్‌ దాన్ని ఆచరించేంత కష్టం. థియరీ ప్రకారం అవార్డు జ్యూరీది ఎప్పుడూ రైటే. ప్రాక్టికల్‌గా మాత్రం కాదు. నలుగురు కలసి ఓ కమిటీ వేసుకుని, వాళ్ల నియమాల ప్రకారం అవార్డు ఇవ్వడం సాధ్యం కాదు. అసలు ఎవరు నిర్ణయిస్తారు ఇది కవిత్వమని? ఈ యేడాది వచ్చిన పాటల్లోకెల్లా అత్యుత్తమం ఇదే అని చెప్పే సామర్థ్యం ఎవరికి ఉంది? అసలు అంతటి శక్తి ఎప్పటికైనా వస్తుందా? అవార్డు జ్యూరీ ముందుకు రాకుండా అజ్ఞాతంగా ఎక్కడో అంతకంటే గొప్ప పాట ఉందేమో ఎవడికి తెలుసు..? నా వరకూ నేను.. నేను రాసిన ప్రతీ పాటకూ అవార్డు ఇచ్చుకుంటా. ఆ స్థాయి ఉందనుకుంటేనే పాట రాస్తా. లేదంటే రాయను.

* ఓ పుస్తకం చదవడం కంటే.. ఓ వ్యక్తితో ప్రయాణం చేయడం వల్లే ఎక్కువ విషయాలు అర్థమవుతాయి అని మీరే ఓ సందర్భంలో చెప్పారు. ‘ఫలానా వాళ్లతో ప్రయాణం చేయాలి’ అని మీకెప్పుడైనా అనిపించిందా? 
ప్రతీ వ్యక్తితోనూ ప్రయాణం చేయాలనే ఉంటుంది. నాకెందుకో గొప్ప వాళ్లు, మంచివాళ్ల కంటే.. చెడ్డవాళ్లు, వంకర వాళ్లు ఎక్కువగా స్ఫూర్తినిస్తుంటారు. వాడెందుకు అలా తయారయ్యాడో తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఓ మనిషి అంటే అతని అనుభవాలు, అతను చదివిన పుస్తకాలు. నా దృష్టిలో ప్రతీ వ్యక్తి 50 పుస్తకాలతో సమానం. అందుకే మనుషులతో మాట్లాడండి. వాళ్ల అనుభవాలు తెలుసుకోండి. చాలామంది చదవడం అనేది ఓ పనిగా పెట్టుకుంటుంటారు. అందుకే అందులోని భావాలు ఎక్కడం లేదు. జీవితంలోని ప్రతి పూట.. ఓ పుట అని మాత్రం తెలుసుకోరు. చదవాల్సివస్తే ఆ పుస్తకం తనకై తాను నీ చేతుల్లోకి వచ్చి వాలుతుంది. అలా చదవాల్సి వచ్చినప్పుడే పుస్తకం చదవాలి. నేను ఓ పుస్తకం చదివి, పక్కన పెట్టానంటే... ఆ పుస్తకం ఖాళీ అయినట్టే అర్థం.

* శ్రోత స్థాయి పెంచిన గీతరచయిత మీరని ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ అన్నారు. కలం పట్టుకున్నప్పుడు శ్రోత స్థాయిని దృష్టిలో ఉంచుకుంటారా? 
ఫలానా వాళ్ల కోసం ఫలానా రకమైన భాష వాడాలన్న ప్రతిపాదనలేం పాటకు లేవు. అలా అనుకుంటే అది దురుసుతనం దురహంకారం. మనిషికి ఉన్నట్టు భాషకు అంతస్తు, అంతరాలు లేవు. నా దృష్టిలో ఉత్తమ కవిత్వం, చెత్త కవిత్వం అనే విభజన రేఖ లేదు. ‘ఈ పాట నాలుగేళ్ల పిల్లాడికి అర్థమైతే చాలు.. నలభై ఏళ్లవాడు వినకపోయినా ఫర్వాలేదు’ అనుకుని పాట రాయలేను. పాటలో ఎన్నో భావాలుండొచ్చు. శ్రోత తన అవసరాన్ని బట్టి, తన పరిధిని బట్టి, తనకు కావల్సినవి ఏరుకుంటాడు. పసిపిల్లవాడి నవ్వుని రిక్షా తొక్కేవారు ఒకలా, మహారాజు మరోలా ఆస్వాదిస్తారా? నేను ఏ భావాన్నయితే మనసులో ఉంచుకుని పాట రాస్తానో, ఆ భావజాలానికి దగ్గరగా ఉన్న శ్రోత మనసులోకి నా పాట వెళ్తుంది. లేదంటే లేదు.

అంపశయ్యపై సినిమా పాట

ప్రేమించుకోవడం అనే మాట బహుశా సినిమాల్లోనే వినిపిస్తుందనుకుంటా. సినిమావాళ్లు కనిపెట్టిన పదం అనుకుంటుంటా. నిజానికి నాకు ఈ ప్రేమించుకోవడం అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాదు. ‘మేం కామించుకుంటున్నాం’ అని నేరుగా చెప్పలేక ఇలాంటి పదాలు సృష్టించారనిపిస్తుంది.

నా జీవితమే నా గురువు. నా రెండో గురువు తండ్రి. నా మూడో గురువు మాస్టారు. నాలుగో గురువు శివానంద మూర్తిగారు.  నా అయిదో గురువు నాకు నేనే. నాలో ఉన్న ప్రశ్న నాకు పెద్ద గురువు. వీళ్లంతా జీవితాన్ని మలుచుకునే విధానం నేర్పారు. నేను ప్రశ్నని విపరీతంగా ప్రేమిస్తా. అది జవాబుగా మారేంత వరకూ దాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తుంటా. ఎవరేం చెప్పినా వింటా. భగవద్గీత చదువుతూ ‘ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు కదా’ అని ప్రతీదానికీ తలాడించను.

ఈరోజుల్లో కవిత్వం గురించి తప్ప దాని ముందున్న విశేషణాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్త్రీ కవిత్వం, ముస్లిం కవిత్వం, ఆ వాదం, ఈ వాదం.. ఇవే కదా మనకు కనిపిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అందులో విద్వేషమే ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని పాఠాలుగానూ చేర్చేస్తున్నారు. పిల్లలకు మనం బోధించాల్సింది అదా? కవిత్వం పేరిట ఏదైనా రాసేయొచ్చా? ‘కుచ్‌ పానాహైతో కుచ్‌ దేనా సీఖో’ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇవ్వడంలో స్వేచ్ఛ చాలా తక్కువ. నిన్ను నువ్వు పోగొట్టుకుంటే తప్ప ఇవ్వలేవు. అలా ఇవ్వడం నేర్చుకుంటే ఏ గొడవలూ ఉండవు. స్వేచ్ఛ కోసం నీ భావాల్ని ఇష్టమొచ్చినట్టు ప్రకటించే స్వేచ్ఛ నీకు ఎవరిచ్చారు? బ్లూ ఫిల్మ్స్‌ తీసి ఇదే స్వేచ్ఛ అనగలవా? సమాజం ఒప్పుకొంటుందా?  ఏ భావాలు బహిరంగంగా చెప్పాలో, ఏది గుప్తంగా అట్టిపెట్టుకోవాలో రచయితకు తెలియాలి.

* మీ ప్రయాణం కొత్తలో ‘ఎవరైనా మెచ్చుకుంటే బాగుణ్ణు’ అనిపించిందా? 
నన్ను నేను మెచ్చుకుంటే బాగుణ్ణు అనుకుంటా. ఎందుకంటే నాలో తీవ్రమైన విమర్శకుడు ఉన్నాడు. ఇప్పటి వరకూ నేను మూడు వేల పాటలు రాశా. అందులో తప్పొప్పులు ఎవరికి అర్థమైనా, అవ్వకపోయినా నాకు తెలుసు. ఈ ప్రయాణంలో నన్ను నేను క్షమించుకోని పాటలు కొన్ని రాశా. కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పులు చేసిన పాటలు కొన్ని ఉన్నాయి. నన్ను నేను మెచ్చుకోవడం నాకు ప్రధానం. శ్రమ పడింది నేను. ఆ పాట కోసం పడిన పాట్లు నాకే తెలుస్తాయి. నొప్పులు పడిన తరవాత బిడ్డ బయటకు రాగానే తల్లి మొహంలో కనిపించే శాంతి... మరొకరు పంచలేరు.. ఇవ్వలేరు. పాటా అంతే.

- మహమ్మద్‌ అన్వర్‌,  ఫొటోలు: జయకృష్ణ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.