close

తాజా వార్తలు

పోలీసునని ఆ ఉద్యోగం ఇవ్వలేదు

క్షేత్రం బాగుంటే విత్తనం మొలకెత్తుతుంది... 
క్షేత్రస్థాయిలో బాగు చేస్తేనే వ్యవస్థలు సత్ఫలితాలనిస్తాయి. 
అవగాహన... ఆచరణ... ఒక బండికి రెండు చక్రాల్లాంటివి... 
నాకే కాదు... ప్రతి పౌరుడికీ ఈ  స్పృహ అవసరం 
దాన్ని పెంపొందించడమే నా లక్ష్యం అంటున్నారు 
పదవికి స్వచ్ఛంద విరమణ చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగిడిన ఐపీఎస్‌ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ. 
ఆయన రాజకీయ రంగ ప్రవేశం, కొత్త పార్టీ, వృత్తిగత విషయాలు ‘హాయ్‌’కి ప్రత్యేకం.

పోలీసునని ఆ ఉద్యోగం ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంలోనే వివాదం ఉంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రెండు ప్రాంతాలు చూశారు. అక్కడా భూములున్నాయి. ప్రస్తుతం రాజధాని కడుతున్న చోట భూములు బాగా పండుతున్నాయంటారు. పైగా నిర్మాణ వ్యయం ఎక్కువ. తర్వాత బయటనుంచి ఇక్కడికి ఎంతమంది రాబోతున్నారనేది ఓ ప్రశ్న. మహారాష్ట్రలో నాసిక్‌, ఔరంగాబాద్‌, నాగ్‌పూర్‌.. లాంటి భిన్నమైన ప్రాంతాలను అభివృద్ది చేశారు. అలా ఆలోచించినా మంచిదే. రాజధాని నిర్మాణానికి ఇన్ని వేల ఎకరాల సాగుభూములు తీసుకోకుండా, నిర్మాణ వ్యయం తక్కువ ఉండే స్థలం ఎంపిక చేసుకుని ఉంటే బావుండేది. 
మన దేశంలో ఉన్నది నిరుద్యోగం కాదు..అర్హతకు తగిన ఉద్యోగం లేకపోవడం. మన దేశంలో నిరుద్యోగిత 5శాతమే. యూరప్‌లో 18శాతం, 40 శాతం ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. మనకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు. అయితే యువత సామర్థ్యానికి 
తగ్గ ఉద్యోగాలు దొరకడం లేదు. ఇంజినీరింగ్‌ చేసినవాళ్లు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. దీనికి పరిష్కారంగా విద్యావిధానంలో మార్పు తేవాలి. ఉద్యోగాలు ఇవ్వగలిగే చదువు చెప్పాలి. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువతకు సరైన శిక్షణ ఇవ్వాలి. 
రుణమాఫీ గురించి కాకుండా... అసలు రైతులు రుణం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తోందో చూసుకోవాలి. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. ఇది బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి పెద్ద అవరోధం. కౌలురైతులు 1బీ ఫాం తెస్తే తప్ప రుణం ఇవ్వడం లేదు. ఇవన్నీ చేయలేక... కర్షకులు వడ్డీ వ్యాపారిని ఆశ్రయిస్తున్నారు. రుణమాఫీ వివరాలు పక్కాగా పరిశీలిస్తే... ఎక్కువ మంది భూమి యజమానులకే దక్కుతోందని అర్థమవుతుంది. పంట పండించే కౌలురైతులకు లబ్ధి కలగటం లేదు.

మీరు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.. ఇటీవల సీబీఐలో జరిగిన పరిమాణాలపై మీ అభిప్రాయం? 
ఇది దురదృష్టకరం. ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. అంతేగాకుండా అంతర్జాతీయంగా మన వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతుంది. అప్పుడు ఏవైనా విషయాల్లో విదేశాల నుంచి సహకారం లభించడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ‘లోక్‌పాల్‌’ తీసుకురావాలి.

పదవీ విరమణ తర్వాత చాలా ప్రాంతాలు తిరిగారు. స్పందన ఏంటి? 
ఒక విద్యార్థిగా నేను వెళ్లాను. ఎక్కడా బహిరంగ సభలు పెట్టలేదు. క్షేత్రస్థాయిలో అవగాహన ఉంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ బాగుంటే...ఆశయాలు మంచిగా ఉంటాయి. దీన్ని బట్టే అభివృద్ధి ఉంటుంది.  50 మంది రైతులు, చేనేతలున్న చిన్న సంఘాలతోనూ సమావేశమయ్యాను. ప్రతీ గ్రామంలో చాలా నేర్చుకున్నాను. 
వ్యవసాయ రంగంలోని సమస్యలకు  సమగ్రమైన పరిష్కారం అన్వేషిస్తున్నారా? 
చాలా ప్రాంతాల్లో రైతులతో చర్చించాను. సమస్యలపై పోరాటం చేస్తున్న రైతు సంఘాల నాయకులను కలిశాను. వ్యవసాయంలో పరిశోధన చేస్తున్న సంస్థల్లో శాస్త్రవేత్తలతో మాట్లాడాను. వ్యవసాయ డిగ్రీలు చదువుతున్న విద్యార్థులతో సంభాషించాను. చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. జీడీపీలో వ్యవసాయ రంగ వాటాను బాగా పెంచాలి. దీనికి వ్యవసాయంతోపాటు... అనుబంధ పరిశ్రమలను పటిష్ఠం చేయాలి. కర్షకులకు మార్కెట్‌ వ్యవస్థలో నష్టం జరుగుతోంది. తమకు మద్దతు ధరలు లభించేలా చూడాలని రైతులు కోరారు. 7వ వేతన సవరణ సంఘం తర్వాత... ఉద్యోగులకు ఆరంభం నుంచి నెలకు ఒకరికి కనీసం రూ.18000 ఆదాయం వస్తోంది. అదే రైతుకు నెలకు రూ.6400 కంటే మించడం లేదు. ఈ వ్యత్యాసం తగ్గించాల్సిన అవసరముంది. ఇందుకు మార్కెట్‌ వ్యవస్థలో దళారులను తీసేయాలి. రైతు సొసైటీలను పునరుద్ధరించాలి. గిట్టుబాటు ధరలు కల్పించాలి. ధరల స్థిరీకరణ నిధులు పెట్టి... నష్టం కలుగకుండా చేయాలి. 
దేశంలో ఎన్నో వనరులున్నా అభివృద్ధిలో ఎక్కడ గాడి తప్పాం? 
అభివృద్ధి అనేది... వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామికానికి... ఆ తర్వాత సేవారంగానికి రావాలి. అయితే మనం వ్యవసాయం నుంచి నేరుగా సేవారంగానికి వెళుతున్నాం. దీనివల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. తమిళనాడులో మంచి విధానాలు అవలంబించారు. అక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేశారు. శివకాశీలో బాణసంచా, ప్రింటింగ్‌ పరిశ్రమలను నెలకొల్పారు. కోయంబత్తూరులో ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేశారు. ఇలా చేయడం వల్ల అక్కడి వ్యవసాయరంగంలోని ఉత్పత్తులను ముందుగా పరిశ్రమల్లో వినియోగించే అవకాశం లభిస్తుంది. తర్వాత సేవారంగం అభివృద్ధి జరుగుతుంది. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. అబ్దుల్‌కలాం చెప్పినట్టు గ్రామాల్లో పట్టణ వసతులు కల్పిస్తే వలసలు నివారించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి చూపొచ్చు. 
పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్‌ అనేది పెద్ద సమస్య. వీటిల్లో రావాల్సిన సంస్కరణలు ఏంటి? 
ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ‘ఈనామ్‌’ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దీని ఫలితాలు సరిగ్గా లేవు. ఈ పథకం కంప్యూటర్‌కే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. నేను దీన్ని మదనపల్లి మార్కెట్లో గమనించాను. ఈ  లోపాలను సరిదిద్ది...సమగ్ర కార్యాచరణ రూపొందిస్తే మేలు. ఉత్పత్తులను, మార్కెట్లను సమన్వయం చేసుకోవడం అవసరం.
ఒక ఐపీఎస్‌ అధికారిగా అక్కడ ఎంతో చేయగలిగి ఉండి... మధ్యలో వదిలేసి వచ్చారెందుకు? 
2025లో నా పదవీ విరమణ ఉంది. ఇందుకు ఇంకా ఏడేళ్ల సమయం ఉంది.  ఈ ఏడేళ్ల కాలం భారతదేశానికి అత్యంత కీలకం. ఇక్కడ అప్పటికంతా 75 శాతం మంది యువతే ఉంటారు. వీరిని సరైన మార్గంలో పెట్టాలి. పోలీసు ఉద్యోగం చేసేటప్పుడు కూడా ...రైతులతో మాట్లాడేవాడిని. గ్రామాల్లో తిరిగేవాడిని. అయితే అక్కడ చేసే పనికి ఒక పరిమితి ఉంటుంది. అందుకే ఇంకేదైనా చేయాలని అనుకుంటూ ఉండేవాడిని. ఇంతలో గ్రామీణాభివృద్ధికి కృషి చేసే ఎన్‌ఐఆర్‌డీ సంస్థ ఒక ప్రకటన ఇచ్చింది. డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కావాలని అడిగారు. నేను దరఖాస్తు చేసి... ఇంటర్వ్యూకు వెళ్లాను. పోలీసు శాఖ వారికి దీన్ని ఇవ్వలేమని చెప్పారు. నాకున్న అభిరుచి, అనుభవాన్ని వివరించాను. వాళ్లు వినలేదు. వాస్తవానికి ఆ పోస్టు 4ఏళ్లుగా ఖాళీగా ఉంది. అయినా తీసుకోలేదు. సంవత్సరం తర్వాత మళ్లీ ప్రకటన ఇచ్చారు. మళ్లీ వెళ్లాను. నా ఆసక్తి గమనించమని చెప్పాను. మీరు గౌహతిలో పనిచేయమని చెప్పినా చేస్తానని చెప్పాను. వినిపించుకోలేదు. ఇక లాభం లేదనుకొని నేనే ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చాను.

ఎన్‌ఐఆర్‌డీలో అవకాశం రాకపోవడానికి రాజకీయ కారణాలేమన్నా ఉన్నాయంటారా? 
అలాంటివి లేవనే నాకనిపించింది. పోలీసు ఉద్యోగంలో ఉండబట్టే... నాకు గ్రామాల్లో సమస్యలపై అవగాహన ఉండదని వారు భావించారేమో.

రాజకీయ ఒత్తిళ్ల వల్లే మీరు ఉద్యోగం వదిలేశారని అన్నారు..! 
అలాంటిదేం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ఎంతో సహకరించారు. నీకు మంచి ఏరియాకు పోస్ట్‌ ఇస్తాను అనే వారు. లేదు సార్‌... ఎన్‌ఐఆర్‌డీలో అవకాశం వస్తుందని చెప్పేవాడిని.

పీపుల్స్‌ మేనిఫెస్టో(ప్రజా అజెండా)కు స్పందన ఎలా ఉంది? 
ప్రజల అవసరాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నం ఇది. నేను గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు పార్టీలుగా, కులాలుగా విడిపోయి ఉండటం కన్పించింది. పాతకాలంలోలా కలసిమెలసి ఉండే వాతావరణం తగ్గిపోయింది. ప్రభుత్వ పథకాలు వ్యక్తిగత ప్రయోజనాలు తీర్చేవిగా ఉన్నాయి. సమష్టి సమస్యలను పరిష్కరించేవి తక్కువ. గ్రామాల్లో మీకు ఏం కావాలో చెప్పండని అడిగాను. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా, నీటిపారుదల ఇలా... అనేక సమస్యలు చెప్పారు. వీటితోనే ప్రజా అజెండా తయారుచేస్తే బాగుంటుందనిపించి మొదలు పెట్టాం. దీనికి ఒక యూఆర్‌ఎల్‌ పెట్టి... ఫోన్‌లోనూ సమస్యలు తెలుసుకుంటున్నాం.

మీ అభిప్రాయాలకు సమీపంగా ఉన్న పార్టీ ఏదీ? మీకు ఏ పార్టీల నుంచి ఆహ్వానం అందింది? 
నా ఆలోచనలకు తగ్గ పార్టీలు అని కాదు... కానీ... వాటి కోసమే పనిచేసే పార్టీలు కావాలి. ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి నాకు ఫోన్‌ చేశారు. భాజపా నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. చర్చించి నిర్ణయం తీసుకుంటాను. మరోవైపు కొత్త పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాను. కొన్ని రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకుంటాను. పవన్‌ కల్యాణ్‌ నాకు వ్యక్తిగతంగా పరిచయం. మంగళగిరి మీటింగ్‌ పెట్టేటప్పుడు.. నేను విష్‌ చేశాను. చంద్రబాబు నుంచి ఎలాంటి ఆహ్వానం లేదు.

మీలాగే సర్వీస్‌ నుంచి బయటికొచ్చి.. కొందరు పార్టీలు పెట్టారు. ఎక్కువ మంది విజయం సాధించలేకపోయారు. మరి మీకు నమ్మకం ఉందా? 
సమయం పట్టొచ్చుగానీ... విజయం సాధించి తీరతాను. గతంలో పార్టీ పెట్టిన జయప్రకాశ్‌నారాయణను కలిశాను. ఆయన ఆలోచనలను తెలుసుకున్నాను. అరవింద్‌ కేజ్రీవాల్‌ గురించి చదివాను. ఇప్పుడు యువత చురుగ్గా ఉంది. ప్రజలను కలవడం సులభమైంది. సోషల్‌మీడియా పెద్ద ఆయుధం. దీని ద్వారా యువతను కలిసి... సమస్యలు వివరించాలనుకుంటున్నాను. బిహార్‌లో సోంప్రకాశ్‌ సింగ్‌ అనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ బాగా పనిచేసేవాడు. అక్కడి ప్రజలందరూ మీరే ఎమ్మెల్యే కావాలని కోరారు. ఆయన దగ్గర డబ్బులు లేవు... ప్రజలే చందాలు వేసి.. రూ.1.86 లక్షలు ఇచ్చారు. అందులో ఆయన 1.22 లక్షలు ఖర్చు పెట్టి... ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే నాదీ ఓ ప్రయత్నం. జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ అంటే ఇవే.

గాలి జనార్దన్‌ రెడ్డి, పలు కుంభకోణాల  కేసులు చూశారు. పకడ్బందీగా సాక్ష్యాలను రికార్డు చేశారు. అయినా నిందితులెవరికీ శిక్షపడట్లేదెందుకు? 
ఎక్కువ కేసులు బ్యాగ్‌లాగ్స్‌. లిటిగేషన్స్‌ ఈ దేశంలో ఎక్కువ. కేసులు బుక్‌ చేయాలి, కోర్టుకెళ్లాలి, సుప్రీంకోర్టుకి వెళ్లాలి. సమయం పడుతుంది. మన న్యాయవ్యవస్థ నిర్దోషికి శిక్ష పడకూడదంటుంది. కాబట్టి ప్రతిస్థాయిలో మనం ఎవరిపైన ఆరోపిస్తున్నామో వాళ్లకు అవకాశం ఇవ్వాలి. రిప్రజెంట్‌ చేసుకోనివ్వాలి. కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టులకు వెళ్తారు. దీనివల్లనే కేసుల విషయంలో జాప్యం జరుగుతోంది.

మీరు చేపట్టిన సీరియస్‌ కేసుల విషయంలో మీపై ఒత్తిడి ఉండేదా..? 
నాకు పని ఒత్తిడి మాత్రమే ఉండేది. మాకు ఉండే సిబ్బంది తక్కువ. అందుకే పనిగంటలు ఎక్కువగా ఉండేవి. నాకెవరిమీదా శత్రుత్వం లేదు. ఆ సమయంలో చట్టం ప్రకారం నా విధులు నిర్వర్తించాను. ఎవరి ఒత్తిళ్లూ లేవు.

మీరు ఎక్కువగా వ్యవసాయరంగం గురించి ఆలోచిస్తున్నారు. మీకెవరైనా వ్యవసాయశాఖా మంత్రి పదవి ఇస్తే..? 
వ్యవసాయం అయితే చేయాలి. జీరోబడ్జెట్‌ పాలిటిక్స్‌లో.. నా ఆలోచనలు అమలవుతాయనుకుంటే.. వెళ్తాను. వ్యక్తిగతంగా లబ్ధి అయితే నేను పట్టించుకోను.

రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై రాజకీయాల ప్రభావం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? 
శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మనకున్నాయి. వీటిపై ఇటీవల రాజకీయాల ప్రభావం పడుతోంది. వీరి చర్యలతో ప్రజలకు రాజ్యాంగ బద్ధ సంస్థలపై నమ్మకం సడలుతోంది. ఇది ప్రమాదకరం. ఇందుకు కారణం మనం ఎన్నుకుంటున్న నాయకులు. అందుకే ఎలాంటి వారికి ఓటేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

పోలీసునని ఆ ఉద్యోగం ఇవ్వలేదు

రాజీనామా చేసినప్పుడు...రాజకీయాల ఆలోచన లేదు. నాకు ఒక ఫౌండేషన్‌ ఉంది. దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లాను. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అవసరమని గుర్తించాను. చాలా చోట్ల ‘మీరే చేయొచ్చు కదా’ అని ప్రజలు ప్రశ్నించారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు మార్పు కావాలని అనిపించింది. యువతరాన్ని సరైన దారిలో పెట్టకపోతే పెద్ద సమస్యగా మారుతుంది. జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌... తేవాలనేది నా ఆలోచన. ఇలా అనేక ఆశయాలతో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాను. నా ఆలోచనలకు తగ్గట్లు పనిచేసే పార్టీల కోసం పనిచేయడానికి నేను సిద్ధం. 

పోలీసునని ఆ ఉద్యోగం ఇవ్వలేదు

ప్రకాశం జిల్లా ఉలవపాడులో ఎంతో మంచి మామిడి పండిస్తారు. రైతులకు అక్కడ మార్కెట్టు వసతి లేదు. రోడ్డు మీద పండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అక్కడికి దగ్గర్లోనే రెండు ఎంబీఏ కళాశాలలున్నాయి. ఇక్కడ విద్యార్థులంతా ఏటా మార్కెటింగ్‌లో సర్టిఫికెట్లు తీసుకొని వెళ్తున్నారు గానీ... అక్కడ ఉత్పత్తి అవుతున్న మార్కెట్‌ అవకాశాలను పట్టించుకోవడం లేదు. అందుకే వ్యవసాయాన్ని విద్యతో సరిగ్గా సమన్వయం చేయగలిగితే ఆశించిన ఫలితాలు రాబట్టవచ్చు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.