close

తాజా వార్తలు

నేనూ స్లెడ్జింగ్‌ చేశా

నేనూ స్లెడ్జింగ్‌ చేశా

కాలాన్ని క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అంటూ విభజిస్తాం భారత క్రికెట్‌లోనూ అలాగే కోల్‌కతా టెస్టుకు ముందు.. తర్వాత అనడం సబబేమో! ఈడెన్‌ గార్డెన్స్‌లో 281 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత క్రికెట్‌ ముఖచిత్రాన్నే మార్చేసిన ఘనత.. మన వీవీఎస్‌ లక్ష్మణ్‌ది. స్టీవ్‌వా సారథ్యంలో పటిష్ఠమైన ఆస్ట్రేలియాతో ఫాలోఆన్‌ ఆడుతూ కష్టాల్లో ఉన్న భారత జట్టును విజేతగా నిలిపి ఆటగాళ్ల దృక్పథంలో మార్పు తెచ్చిన ఘనత అతడిదే. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మరోసారి ప్రత్యర్థికి ఫాలోఆన్‌ ఇవ్వకపోవడం లక్ష్మణ్‌ పంచ్‌కు నిదర్శనం. విజయవంతమైన కెరీర్‌ను ముగించి.. కామెంట్రీతో సెంచరీలు కొడుతున్న లక్ష్మణ్‌ ‘హాయ్‌’తో తన భావాలు పంచుకున్నాడు. ఆటలో అనుభవాలు, కుటుంబం, పిల్లలు... ఇలా పలు విషయాలు వివరించాడు. 
భగవద్గీత శ్లోకాలు చదివేవాడిని... 
నేను కర్మసిద్ధాంతాన్ని అనుసరిస్తా. తాత జగన్నాథశాస్త్రి గారి నుంచి మాకందరికీ దైవభక్తి అబ్బింది. చిన్నప్పుడు తాతగారు భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తియోగ చెప్పారు. 18 శ్లోకాల్ని నేను, అన్నయ్య రోజు ఉదయం, సాయంత్రం చదివేవాళ్లం. మొదట్లో అర్థం కాలేదు. తర్వాత అర్థం తెలిసింది. క్రికెట్లో 100 చేస్తే ఆనందం కలుగుతుంది. డకౌట్‌ అయితే నిరాశ చెందుతాం. రెండు సందర్భాల్లోనూ ఒకేలా ఉండాలని 12వ అధ్యాయం బోధిస్తుంది. చిన్నప్పుడు రిజర్వేషన్‌ లేకుండా రైలులో ప్రయాణించాం. బాత్‌రూమ్‌ల దగ్గర కిట్‌లపై పడుకున్నాం. డార్మెటరీలో వేడినీళ్లు ఉండేవి కావు. టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాక బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస. అయినా అప్పుడూ ఆనందంగానే ఉన్నా. ఆ తర్వాత సంతోషంగానే ఉన్నా. అంతర్జాతీయ క్రికెటర్‌ అవడానికి ప్రతి ఒక్కరు కష్టపడతారు. కానీ కొందరే సక్సెస్‌ అవుతారు. కొందరికే ఫలితం వస్తుంది. అర్జుడునికి కృష్ణుడు చెప్పేది అదే. హార్డ్‌వర్క్‌ చేయాలి. నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వాలి. ఫలితం గురించి ఆలోచించొద్దు. 
* సిక్సర్లు, బౌండరీలపై మోజు పెరగడం మంచిదేనా? 
ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లంతా మంచి బేసిక్స్‌ ఉన్నవాళ్లే. మూలాలు బలంగా ఉన్నప్పుడే ఫ్యాన్సీ షాట్లు ఆడొచ్చు. సిక్సర్లు, దూకుడు ముఖ్యమే. ఫార్మాట్‌కు అనుగుణంగా ఆడాల్సిందే. నేను క్రికెట్‌ మొదలుపెట్టినప్పుడు ఇన్నింగ్స్‌లు నిర్మించడం ముఖ్యం. ఇప్పుడు వేగంగా పరుగులు రాబట్టడం కీలకం. ఇది టీ20 జనరేషన్‌. వేగంగా పరుగులు చేయడం లాభిస్తుంది కానీ లాఫ్టెడ్‌ షాట్లతోనే క్రికెట్‌ నేర్చుకుంటా అంటే వృథా. మూలాలు, టెక్నిక్‌ బలంగా ఉన్నప్పుడే రాణించొచ్చు. అక్కడి నుంచి ఆటను ఎలాగైనా మార్చుకోవచ్చు. 
* గ్రెగ్‌ చాపెల్‌ ఎపిసోడ్‌ భారత్‌కు లాభం చేసిందా? నష్టం చేసిందా? 
కచ్చితంగా నష్టమే చేసింది. భారత్‌కు అది క్లిష్ట సమయం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ భయానక వాతావరణం ఉండేది. అదృష్టవశాత్తు ఆ దశను దాటాం. 2007-2011 భారత్‌కు స్వర్ణయుగం. ఎన్నో మంచి జట్లపై ఇంటా.. బయటా గెలిచాం. 
* మీ అమ్మానాన్నలా స్టెతస్కోప్‌ కాకుండా బ్యాట్‌ పట్టారు. మీ పిల్లలు మీలా క్రికెటర్లు అవుతారా? వైద్యులా? 
17 ఏళ్ల వయసున్నప్పుడు నాకు ఏ రంగం ఎంచుకోవాలో తల్లిదండ్రులు స్వేచ్చనిచ్చారు. ఎంచుకున్న రంగం వల్ల నీకు పేరు రాదు. ఆ రంగానికి నువ్వే వన్నె తేవాలనేవారు. వైద్యులుగా వాళ్ల రంగానికి వాళ్లు వన్నె తెచ్చేందుకు ప్రయత్నించారు. క్రికెటర్‌గా నేను ఆటకు వన్నె తెచ్చా. పిల్లలూ అంతే. వాళ్లు ఏం చేయాలనుకుంటే అదే చేయమంటా. కాకపోతే ఇష్టంతో చేయాలి. ఎంచుకున్న రంగాన్ని ప్రేమించాలి. ఈ విషయంలో నాది, శైలజది ఒకే అభిప్రాయం. 
* పిల్లలు ఏం చేస్తున్నారు? 
చిరెక్‌ స్కూల్‌లో సర్వజిత్‌ ఏడో తరగతి, అచింత్య ఐదో తరగతి చదువుతున్నారు. చదువులో ఇద్దరూ ఫస్టే. జీవితంలో విజయం సాధించాలంటే చదువు తప్పనిసరి. ఆ విషయంలో రాజీ పడేదే లేదు. చదువుతో పాటు ఆల్‌రౌండ్‌ నైపుణ్యమూ ముఖ్యమే. అప్పుడే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తారు. సర్వజిత్‌ అన్ని క్రీడలూ ఆడతాడు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, స్విమ్మింగ్‌లో ప్రావీణ్యం ఉంది. ఆర్ట్స్‌, డ్రామా, కూచిపూడి, వెస్టర్న్‌ డాన్స్‌, టెన్నిస్‌, స్విమ్మింగ్‌లో అచింత్య సూపర్‌. క్లాసికల్‌, వెస్టర్న్‌ పాటలూ పాడుతుంది. భవిష్యత్తులో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇస్తా. పిల్లల బాగోగులన్నీ శైలజ చూసుకుంటుంది. 
* క్రికెటర్‌... వ్యాఖ్యాతా.. రెండింటిలో ఏదీ కష్టం? 
రెండూ కష్టం కాదు సులువూ కాదు. రెండింటినీ ఆస్వాదించొచ్చు. దేశానికి ఆడటం.. గెలిపించడం.. ఓటమి నుంచి జట్టును కాపాడటం గొప్పగా అనిపిస్తుంది. క్రికెట్‌ నా ఫస్ట్‌లవ్‌. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక మళ్లీ అక్కడే అవకాశం లభించింది. బంగాల్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా, సన్‌రైజర్స్‌ మెంటార్‌గా పని చేస్తున్నా. హైదరాబాద్‌లో 3 అకాడమీలు ఉన్నాయి. 2013లో వ్యాఖ్యాతగా కెరీర్‌ మొదలుపెట్టా. 16 ఏళ్లు మైదానంలో ఆడా. ఇప్పుడు కామెంట్రీ బాక్సు నుంచి ఆడుతున్నా. 
* ఎప్పుడూ ఎవరినీ విమర్శించని మీరు.. వ్యాఖ్యాతగా ఆటగాళ్లపై ఘాటైన విమర్శలు చేయాల్సొచ్చినప్పుడు ఇబ్బంది పడ్డారా? 
నేనెప్పుడూ బహిరంగంగా మాట్లాడను. నేనాడిన రోజుల్లో తోటివాళ్ల టెక్నిక్‌, దృక్పథం, జట్టు నిర్ణయాలపై డ్రెస్సింగ్‌ రూమ్‌లో చెప్పేవాడిని. సీనియర్‌ సభ్యుడిగా కోచ్‌, కెప్టెన్‌కు సలహాలిచ్చేవాడిని. అది నా బాధ్యత. ప్రతి ఒక్క సందర్భంలో నిజాయతీగా నా అభిప్రాయాలు వ్యక్తంచేశా. ఏం చేసినా నాలుగు గోడల మధ్యే. ఇప్పుడు వ్యాఖ్యాతగా ఆటను విశ్లేషిస్తున్నా. వ్యాఖ్యాత పనిచేయడమంటే తప్పులు మాత్రమే ఎత్తిచూపడం కాదు. మైదానంలో ఏం జరుగుతుందో దాన్ని వివరించడం. బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ కూర్పు, బ్యాట్స్‌మెన్‌ టెక్నిక్‌పై మాట్లాడటమే. ఎందుకు పరుగులు చేయడం లేదో చెప్పటమే. వేరే అజెండా లేనంత వరకూ నిర్మొహమాటంగా మాట్లాడొచ్చు. కావాలని ఆటగాడిని వెనక్కి లాగితే తప్పు. 
* మీ జీవితంపై పుస్తకం రాశారు. సినిమా తీస్తారా? 
వాస్తవికత ఆధారంగా సినిమా ఉంటే సరే. రెండేళ్ల క్రితం హిందీ, తెలుగు నుంచి ఇద్దరు దర్శకులు వచ్చారు. అప్పుడు నాకు సమయం లేక నా వివరాలు చెప్పలేకపోయా. ఇప్పుడు పుస్తకంలో అన్ని విషయాలు ఉన్నాయి. దాన్ని చూసి కథ రాసుకోవచ్చు. కానీ సినిమా పూర్తిగా వాస్తవికంగా ఉంటే బాగుంటుంది. నాకు మహేశ్‌బాబు అంటే  చాలా ఇష్టం. నా పాత్రŸను అతను చేస్తే బాగుంటుందేమో. మహేశ్‌ సినిమాలన్నీ బాగా ఎంజాయ్‌ చేస్తా. 
* మీ జీవితంలో ప్రత్యేక వ్యక్తులెవరు? 
అమ్మ, నాన్న, మామయ్య బాబాకృష్ణమోహన్‌. పెళ్లి తర్వాత శైలజ. 
* కామెంట్రీ ఇస్తున్నప్పుడు సరదాగా ఉంటారు.. మరి ఇంట్లో? 
కామెంట్రీ చెప్తున్నప్పుడు ఉండేదే నా అసలు స్వరూపం. జోకులు వేస్తూ సరదాగా ఉంటా. ఇంట్లోనూ అంతే. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, మామయ్య ఎవరూ నన్ను అంతర్జాతీయ క్రికెటర్‌గా చూడరు. లక్ష్మణ్‌గానే చూస్తారు. స్నేహితులు కూడా సెలబ్రిటీ అనుకోరు. అది నా అదృష్టం. 
* ఎప్పుడూ కొంటె పనులు చేయలేదా? 
కొంటె పనులు కాదు గానీ సరదాగా ఉండేవాళ్లం. సెహ్వాగ్‌, జహీర్‌, యువరాజ్‌, హర్భజన్‌, నెహ్రా కలిశామంటే నవ్వులు పూయాల్సిందే. మ్యాచ్‌ గెలిచినప్పుడు, సిరీస్‌ నెగ్గినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకోవడం అలవాటు. ఒక్కోసారి ఒక్కొక్కరు సంబరాలకు నాయకత్వం వహిస్తారు. అతను ఏం చెబితే అది చేయాలి. పాటలు పాడాలి. డాన్సులు చేయాలి. ఇష్టం లేకపోయినా  నిబంధనలు పాటించాల్సిందే. జట్టు గొప్పదనం అదే. నేను గొప్పగా పాడకపోయినా, డాన్స్‌ చేయకపోయినా తప్పేది కాదు. అలా మిగతా వాళ్లతో చేయించిన సందర్భాలున్నాయి. బాధపడేలా  కొంటె పనులు చేయలేదు. 
* వివాదాలకు దూరంగా ఉండటానికి కారణం? 
క్రికెటర్లు, క్రీడాకారులు దేశానికి రోల్‌ మోడల్స్‌. ఎంతోమంది యువత క్రికెటర్లను అనుకరిస్తారు. కాబట్టి రోల్‌ మోడల్స్‌గా బాధ్యతతో వ్యవరించాలి. చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు అప్‌సెట్‌ అవుతా. కొన్నిసార్లు కోపం వస్తుంది. అవేవీ బయటకు కనబడనీయను. భావోద్వేగాల్ని నియంత్రించుకుంటా. అందరూ చూస్తుంటారు కాబట్టి రోల్‌ మోడల్‌గానే ఉండాలి. 
* చాలామంది సారథ్యంలో ఆడారు.. మీకు నచ్చిన సారథి? 
సౌరభ్‌ గంగూలీ సారథ్యాన్ని ఆస్వాదించా. భారత క్రికెట్‌ అయోమయంలో ఉన్నప్పుడు గంగూలీ జట్టు పగ్గాలు స్వీకరించాడు. జట్టును పునర్‌ నిర్మించాడు. సమస్యకు లొంగిపోకుండా సవాళ్లకు ఎదురు నిలిచేవాడే నాయకుడు. గంగూలీ అలాంటోడే. నాయకుడు జట్టును తయారు చేస్తాడు. ఆత్మవిశ్వాసం నింపుతాడు. ఫలితం గురించి ఆలోచించొద్దని చెప్తాడు. యువ ఆటగాళ్లకు ధైర్యం నూరిపోస్తాడు. గంగూలీ అద్భుత నాయకుడు. 
* మీరు కెప్టెన్‌ కాలేకపోయానని ఎప్పుడైనా బాధపడ్డారా? 
నేనెప్పుడూ జట్టులో లీడర్‌గానే ఉన్నా. గంగూలీ, ద్రవిడ్‌ తర్వాత 2007-08 సీజన్‌లో కుంబ్లే కెప్టెన్‌ అయ్యాడు. అప్పుడు నా వయసు 34 ఏళ్లు. ఆ సమయంలో టీమ్‌ఇండియాకు యువ సారథి కావాలి. అప్పుడు ధోని వచ్చాడు. నాకు సారథ్యం దక్కలేదని ఎప్పుడూ బాధపడలేదు. కాకపోతే జట్టులో ఎప్పుడూ లీడర్‌గానే ఉన్నా. ప్రతి ఒక్కరు గౌరవించారు. ముఖ్యమైన సందర్భాల్లో సలహాలు, సూచనలతో జట్టుకు తోడ్పడ్డాను.
* సౌమ్యుడిగా ఉండే మీకు స్లెడ్జింగ్‌ చేయాలని అనిపించిందా? 
ఎందుకలా అనుకుంటున్నారు. నేనూ స్లెడ్జింగ్‌ చాలా చేసేవాడిని. కొందరు స్లెడ్జింగ్‌ అర్థాన్ని తప్పుగా చెప్తున్నారు. బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతను దెబ్బతీయడమే స్లెడ్జింగ్‌. దుర్భాషలాడటం.. వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం కాదు. పేస్‌ బౌలింగ్‌లో నేను స్లిప్‌లో ఉండేవాడిని. స్పిన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ద్రవిడ్‌.. సిల్లీ పాయింట్‌లో నేనుండేవాడిని. బ్యాట్స్‌మెన్‌కు దగ్గరి స్థానమిది. అప్పుడు బౌలర్‌ను ప్రోత్సహిస్తూ బ్యాట్స్‌మెన్‌పై స్లెడ్జింగ్‌ చేసేవాడిని. ఉదాహరణకు.. బంతి ఇప్పుడు బాగా తిరుగుతుంది ఎలా ఆడతాడో. తికమక పడుతున్నాడు. డిఫెన్స్‌ను నమ్ముకోవట్లేదు. కుంబ్లే బౌలింగ్‌ చేస్తున్నాడు ఎల్బీగా ఔటవుతాడు అని అంటుంటే బ్యాట్స్‌మెన్‌లో అనుమానం మొదలవుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆటపై ఫోకస్‌ చేయలేడు. ఔటవుతాడు. కానీ ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు. మిగతా వాళ్లతో పోల్చుకుంటే ఆస్ట్రేలియన్లు నన్ను చాలా చాలా తక్కువ స్లెడ్జింగ్‌ చేశారు. 
* తొందరగా రిటైర్మెంట్‌ ప్రకటించానని బాధపడ్డారా? 
38 ఏళ్ల వయసులో రిటైరయ్యాను. మంచి ఫామ్‌లో, ఫిట్‌నెస్‌ ఉన్నప్పుడే ఆటకు గుడ్‌బై చెప్పా. నిజానికి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు 2010లోనే చెప్పా. జట్టు సభ్యులందరికీ ఈ విషయం తెలుసు. ఎందుకో బాగా ఆడుతున్నప్పుడే రిటైర్‌ కావాలని అనుకున్నా. ఇంకొన్నాళ్లు ఆడగలవు అనాలే తప్ప.. ఇంకెన్నాళ్లు ఆడతావు అనే మాట రావొద్దని తప్పుకున్నా. 
* టీనేజ్‌ జీవితం కోల్పోయానని అనిపించిందా? 
15 నుంచి 20 ఏళ్ల వరకు మిగతా వాళ్లలా కాలేజీ, యూనివర్సిటీలకు వెళ్లలేదు. అందరిలా ఫంక్షన్లు, డిన్నర్లు, లేట్‌నైట్‌ సినిమాలు చూడలేదు. ఉదయం 6 గంటలకు ప్రాక్టీస్‌, మధ్యాహ్నం ప్రాక్టీస్‌. రాత్రి తొందరగా పడుకుని మరునాడు ఉదయం మళ్లీ ప్రాక్టీస్‌ చేయాలి. ఇదే నా జీవితం. మిగతా వాళ్లలా జీవితం ఎంజాయ్‌ చేయలేకపోవచ్చు. నా వరకు నా జీవితంలో ఎంజాయ్‌ చేశా. పరుగులు సాధించా. మైదానంలో ఎక్కువసేపు గడిపా. అక్కడే నా ఆనందం వెతుక్కున్నా. అందుకు ఒక్కరోజు కూడా బాధపడలేదు. 
* రిటైర్‌ అయ్యాక చాలామంది లావైపోతారు.. మీరు మాత్రం..? 
మధ్యలో నేనూ లావయ్యాను. రిటైర్‌ అయ్యాక నాకు ఇష్టమైన పదార్థాలన్నీ తిన్నా. స్వీట్లు, ఐస్‌క్రీంలు, జంక్‌ఫుడ్‌ అన్నీ లాగించా. చాలా లావయ్యా. మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించా. అప్పుడు దేశం కోసం ఫిట్‌గా ఉన్నా. ఇప్పుడు ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నా. బ్యాడ్మింటన్‌, స్క్వాష్‌ ఆడతా. సరైన ఆహారం తీసుకుంటున్నా. 
* వన్డేల్లో మీరు సెంచరీ చేసిన ప్రతి సారి టీమ్‌ఇండియా గెలిచింది. మరి మీపై వన్డే ఆటగాడు కాదన్న ముద్ర పడిందెలా? 
1999, 2000 వరకు నేను వన్డేల్లో ఆడినప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లా. ధోని, యువరాజ్‌ల మాదిరి నేను పవర్‌ హిట్టర్‌ను కాదు. పవర్‌ గేమ్‌తో భారీషాట్లు ఆడలేను. టచ్‌, టైమింగ్‌ ఆటగాడిని. దాంతో ఆ స్థానంలో పరుగులు చేయలేదు. టాప్‌-3లో ఆడినప్పుడు విజయవంతమయ్యా. ఐతే భారత్‌లో ఒకసారి ఒక ముద్ర పడితే దాన్నుంచి  బయటపడటం కష్టం.

స్కూల్‌ ఏర్పాటు చేస్తా

మూడేళ్ల క్రితం వీవీఎస్‌ ఫౌండేషన్‌ మొదలుపెట్టాం. నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం. ప్రస్తుతం 41 మంది ఐఐటీ, 92 మంది (7, ఆపై తరగతులు) విద్యార్థులకు చదువు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో కూడిన స్కూల్‌ ఏర్పాటు చేయాలన్నది నా లక్ష్యం.

రక్తంలోనే దైవభక్తి

దైవభక్తి నా రక్తంలోనే ఉంది. తాత జగన్నాథశాస్త్రి గారు తన ఆస్తినంతా తన గురువుకు ఇచ్చేసి హైదరాబాద్‌లో భగవద్గీత ప్రచారం చేశారు. అప్పుడు నిజాం సర్కారు ఉండేది. తాతగారు చనిపోయినప్పుడు నాన్న పక్కనే ఉన్నారు. అహం బ్రహ్మస్మి.. అహం బ్రహ్మస్మి.. అహం బ్రహ్మస్మి అంటూ తాత చనిపోయారంట. ఎంతమందికి అలాంటి మోక్షం లభిస్తుందని అంటారు నాన్న. సాయిబాబా మీద పాటల ఆల్బమ్‌ను మామయ్య తీసుకొచ్చారు. మా కుటుంబంలో అందరికీ దైవభక్తి ఉండటం నా అదృష్టం.

పర్యటనలో జపమాల

దయం లేవగానే స్నానం చేసి పూజ చేస్తా. సాయంత్రం మరోసారి స్నానం చేసి శ్లోకాలు చదువుతా. పర్యటనకు వెళ్లినా పుస్తకాలు, జపమాల వెంట ఉంటాయి. నా రూమ్‌లో కచ్చితంగా పూజకు సంబంధించిన సామగ్రి ఉంటుంది. ఉదయం ఇంట్లో సుప్రభావతం, విష్ణు సహస్రనామం, సాయిబాబా హారతి, హనుమాన్‌ చాలీసా వింటాం. సాయంత్రం దైవ చింతన పాటలు ఉంటాయి. బయటికి వెళ్లినా ఇయర్‌ ఫోన్‌లో వింటా.

రిటైర్మెంట్‌ అంటే ..

దేహం, ప్రదర్శన, ఫిట్‌నెస్‌ ఇవేవీ రిటైర్మెంట్‌కు కారణాలు కావు. మెదడులో ఆ భావన వచ్చిందంటే అదే సరైన సమయం. ఒకసారి మెదడులో ఆలోచన వచ్చిందంటే ఆటను ఆస్వాదించడం ఆగిపోతుంది. తీవ్రమైన గాయమైతే తప్ప బ్యాట్స్‌మెన్‌కు ఫిట్‌నెస్‌తో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆటను ఆస్వాదించినంత కాలం పరుగులు చేస్తాడు. అలిస్టర్‌ కుక్‌ మరో నాలుగైదేళ్లు ఆడగలడు. కానీ ఆటను ఎంజాయ్‌ చేయలేకపోతుండటంతో రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

హాబీలు

పుస్తకాలు చదువుతా. సంగీతం వింటా. సినిమాలు చూస్తా. బ్యాడ్మింటన్‌ ఆడతా

నచ్చిన వ్యాఖ్యాత?

బిల్‌ లారీ 

నచ్చిన ప్రదేశం

స్విట్జర్లాండ్‌లో ఇంటర్‌లాకెన్‌

నచ్చిన పుస్తకం 

అబ్దుల్‌ కలాం ఆత్మకథ 

నచ్చిన తారలు

అమితాబ్‌ బచ్చన్‌, శ్రీదేవి

బాధపెట్టిన సందర్భాలు

2003 వన్డే ప్రపంచకప్‌కు ఎంపికవకపోవడం

నేను నేర్చుకున్న నాటికీ... ఇప్పటికీ క్రికెట్లో కోచింగ్‌ మెథడాలజీ మారింది. ఒకప్పుడు టీచర్‌, కోచ్‌ ఏం చేయాలో చెప్పేవాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆటగాడికే వదిలేస్తున్నారు. ఆప్షన్స్‌ ఇస్తున్నారు. ఇలా చేస్తే ఇది జరుగుతుంది.. అలా చేస్తే అది జరుగుతుందని చెప్తున్నారు. ఏది మంచిదో తేల్చుకోవాల్సిందే ఆటగాడే. అతనిపైనే ఎక్కువ బాధ్యత. ఆటగాడి సమస్య గురించి చెప్పకుండా దానికి కారణాలు వెతికి పరిష్కారం సూచించే కోచ్‌లు పెరిగారు.

- వరికుప్పల రమేశ్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.