close

తాజా వార్తలు

నటనే నచ్చేది కాదు

నటనే నచ్చేది కాదు

పాఠశాలలో చదువుకొంటూనే సినిమా అవకాశాల్ని అందుకొంది మాళవిక నాయర్‌. టీనేజ్‌ దాటకముందే మంచి నటి అనిపించుకొంది. ‘ఎవడే సుబ్రమణ్యం?’లో ఆనంది పాత్రలో పరిణతితో కూడిన నటనని చూశాక ఎవరీ మాళవిక? అని ఆరా తీశారంతా. ఇంటర్‌ చదువుతున్న అమ్మాయని తెలిసి ఆశ్చర్యపోయారు. ‘కళ్యాణ వైభోగమే’లో ఆమె చేసిన సందడి ప్రేక్షకులకి మరింత దగ్గర చేసింది. ‘మహానటి’, ‘విజేత’ చిత్రాలతోనూ మెరిసిన ఆమె, ఇటీవల విడుదలైన ‘టాక్సీవాలా’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. డిగ్రీ రెండో యేడాది చదువుతూనే, సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మాళవిక తన బాల్యం, సినిమాల్లోకి వచ్చిన సంగతులు గురించి ముచ్చట్లివీ... 
ఒక పక్క చదువు... మరో పక్క సినిమా ప్రయాణం. ఇబ్బందిగా అనిపించడం లేదా? 
రెండూ ఇష్టమైనవే కదా! మనసుకు నచ్చిన పనులు చేస్తున్నప్పుడు ఏమాత్రం కష్టం అనిపించదు. రెండు పడవల ప్రయాణమైనా ఏ విషయంలోనూ ఇబ్బంది పడటం లేదు. 
మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? 
మా కుటుంబానికి సినీ నేపథ్యమంటూ ఏమీ లేదు కానీ, మా తాతయ్యకి రంగస్థలంతో అనుబంధం ఉండేదట. అలా మా నాన్న  నటన, సినిమా రంగంపై ప్రేమ పెంచుకొన్నారు. ఆయనే నన్ను ఈ రంగంలో ప్రోత్సహించారు. పదమూడేళ్ల వయసులోనే ప్రకటన రంగంలోకి అడుగుపెట్టా. ఆ వెంటనే సినిమా అవకాశాల్ని అందుకొన్నా. 14 యేళ్ల వయసులో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? స్కూల్‌, స్నేహితులే లోకం కదా! పైగా నేను చదువుల్లో చాలా చురుగ్గా ఉండేదాన్ని. చదువుకోకుండా ఇదంతా ఎందుకు అనిపించేది. కెమెరా ముందు ఎలా నటించాలో అర్థమయ్యేది కాదు. 
మరి సినిమాపై ఇష్టాన్ని ఎలా పెంచుకొన్నారు? 
మలయాళంలో చేసిన ‘కుకూ’ చిత్రానికిగానూ మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో నా నటనని చూసి మా నాన్న చాలా సంతోషించారు. సినిమా అంటే ఏంటనేది అప్పుడే అర్థమైంది. యాంత్రికంగా కాకుండా, కథల్ని, పాత్రల్ని ఆస్వాదించడం అలవాటైంది. అలా సినిమాపై ప్రేమ పెరిగింది. ‘ఎవడే సుబ్రమణ్యం?’ తర్వాత నా ఆలోచనలే మారిపోయాయి. అప్పటిదాకా సినిమా అనేది నా జీవితంలో ఓ భాగం అనుకొనేదాన్ని. కానీ ఇప్పుడు సినిమానే జీవితం అనిపిస్తోంది. 
ఇక వరసగా అవకాశాలొస్తే చదువు ఆపేస్తారా? 
చదువు... సినిమా దేన్నీ ఆపను. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలనేది నా సంకల్పం. అయితే ఇప్పుడు అది కూడా సినిమా మేకింగ్‌లోనే చేయాలని నిర్ణయించుకొన్నా. ఆ రకంగా నా చదువుని కెరీర్‌లో భాగం చేస్తానన్నమాట. డిగ్రీ తర్వాత విదేశాల్లో తప్పకుండా సినిమా మేకింగ్‌ కోర్సు చేస్తా. వీలైతే చిత్రలేఖనానికి సంబంధించీ చదువుతా. 

నటనే నచ్చేది కాదు

భవిష్యత్తులో దర్శకురాలు అనిపించుకుంటారన్నమాట...? 
ఎప్పుడనేది చెప్పలేను కానీ... దర్శకురాలు కావడం మాత్రం పక్కా. రచనతో పాటు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. వీలు దొరికినప్పుడంతా ఏదో ఒకటి రాస్తూ ఉంటా. అందులో సినిమా కథలున్నాయా? అని మాత్రం అడగకండి (నవ్వుతూ). సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా. అయితే నా సినిమా కంటే ముందు నేను గీసిన చిత్రాల్ని చూపించబోతున్నా. నాకు పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా వేసిన పెయింటింగ్స్‌తో త్వరలోనే ఓ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తా. 
మీ కళాశాలలో మిమ్మల్ని సెలబ్రిటీగానే చూస్తుంటారా? 
అది నాకు ఇష్టం ఉండదు. నా వ్యక్తిగత జీవితాన్ని సాదాసీదాగా గడపడాన్నే ఇష్టపడతా. నా స్నేహితులెవ్వరూ నన్ను సెలబ్రిటీగా చూడరు కానీ, సీనియర్స్‌, జూనియర్స్‌, మిగతా తరగతి అమ్మాయిలు మాత్రం నేను కనిపించానంటే ప్రత్యేకంగా చూస్తుంటారు. కొంతమంది సెల్ఫీ అంటారు, మరికొంతమంది కొత్త సినిమాల గురించి, అందులో కథానాయకుల గురించి అడుగుతుంటారు. దిల్లీలో చదువుకొనేటప్పుడైతే నేను నటిని అనే విషయం ఎవ్వరికీ తెలిసేది కాదు. తెలుగు సినిమాలు ఎక్కువగా చేశాను కాబట్టి హైదరాబాద్‌లో మాత్రం నన్ను బాగా గుర్తుపడతారు. 
పుట్టింది కేరళలో కదా, దిల్లీలో ఎందుకు చదువుకొన్నారు? 
మా నాన్న దిల్లీలో వ్యాపారం చేస్తుంటారు. అందుకే మా కుటుంబం అక్కడికి మారింది. చదువు, వృత్తి గురించి నేనొక్కదాన్నే హైదరాబాద్‌కి మకాం మార్చా. బేగంపేట్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. అమ్మానాన్నల కంటే  నా తమ్ముడిని బాగా మిస్‌ అవుతుంటా. వాడూ, నేను కలిసి బాగా అల్లరి చేసేవాళ్లం.

అప్పుడే కనెక్ట్‌ అయ్యా...

నేను సినిమాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. అంతెందుకు, కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో నటనని పెద్దగా ఆస్వాదించేదాన్నే కాదు. ఆడుతూ పాడుతూ స్నేహితులతో తిరగాల్సిన సమయంలో చుట్టూ లైట్లేంటి? ఈ కెమెరాలేంటి? అనిపించేది. ‘ఎవడే సుబ్రమణ్యం?’ చేస్తున్నప్పుడే సినిమాకి, నటనకి బాగా కనెక్ట్‌ అయ్యా. అప్పటివరకు నా సినిమా ప్రయాణం అయిష్టంగానే కొనసాగింది.

అదొక మంచి జ్ఞాపకం

‘‘చిత్ర పరిశ్రమలో నాకు స్నేహితులు తక్కువే. నా కథానాయకులతోనూ, దర్శకులతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. విజయ్‌ దేవరకొండ, నేను జంటగా కనిపించలేదు కానీ మూడు సినిమాల్లో కలిసి నటించాం. ‘ఎవడే సుబ్రమణ్యం?’లో నటిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉంటాడు. మంచి చెడులు పంచుకొనేంత చనువు ఉంది. ‘టాక్సీవాలా’లో నేను నటిస్తే బాగుంటుందని చెప్పింది తనే. నాని అయితే చాలా ప్రొటెక్టివ్‌. తన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బాగా చూసుకుంటాడు. నాగశౌర్య, కల్యాణ్‌దేవ్‌ మంచి స్నేహితులు. తమ్ముడితో ఎలా ఉంటామో, అలా నన్ను ట్రీట్‌ చేస్తుంటాడు శౌర్య. మేమిద్దరం కలిసి చేసిన ‘కళ్యాణ వైభోగమే’లో పెళ్లికూతురుగా నన్ను చూసి దిల్లీలోని మా టీచర్లు ఆశ్చర్యపోయారు. ‘ఇక్కడ కనిపించేది మా మాళవికేనా?’ అన్నారు. అదొక మంచి జ్ఞాపకం’’.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.