close

తాజా వార్తలు

వసతులు అడిగితే కొట్టేవారు 

గురుకుల గురువు

వసతులు అడిగితే కొట్టేవారు 

తరగతి గదినే ప్రయోగశాలగా... గురుకులాలే వేదికగా... పిల్లల్లో దాగున్న ప్రతిభను వెలికితీస్తున్న ధీరుడాయన.. అమ్మ ఇచ్చిన స్ఫూర్తే ఆయుధంగా.. తనలో కలిగిన ఆలోచనే మార్గంగా.. అజ్ఞానంపై... జ్ఞాన యుద్ధం చేస్తున్న గురుకుల వీరుడాయన. పేదరికాన్ని జయించడానికి చదువు విల్లంబును పదునుదేల్చుతూ... ఎందరో విద్యార్థుల్లో విజ్ఞానజ్యోతులు వెలిగిస్తున్న ‘ప్రవీణు’డాయన... ఇప్పటికే అర్థమై ఉంటుంది... ఆయనే మన తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌.  ఉద్యోగాన్ని ఉద్యోమంలా చేస్తూ... గురుకులాల నుంచి ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న కార్యదీక్షదక్షుడి ఆలోచనలు, ప్రయోగాలు.. ‘హాయ్‌’కి ప్రత్యేకం.


నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం విక్టర్‌ ఫ్రాంకెల్‌ రాసిన ‘మ్యాన్స్‌ సెర్చ్‌ ఫర్‌ మీనింగ్‌’. బలమైన లక్ష్యం, సాధించి తీరాలన్న స్పష్టత ఉంటే పరిస్థితులైనా, హిట్లరైనా మనల్ని అడ్డుకోలేవని చెప్పే పుస్తకం ఇది. విక్టర్‌ ఫ్రాంకెల్‌ నిజజీవితంలో ఎదుర్కొన్న ఘటనలతో సాగిన పుస్తకం. ఇది నన్ను బాగా కదలించింది.


* ఉద్యోగాన్ని ఉద్యమంలా చేస్తున్నారు. మీరు గురుకులాల కార్శదర్శిగా వచ్చాక ఐఐటీ, నిట్‌, సివిల్స్‌ ర్యాంకులు ఎక్కువయ్యాయి. బాగా మార్పువస్తుందనే వార్తలొచ్చాయి. ఈరకమైన విద్యావిధానం ప్రవేశపెట్టాలనే తలంపు మీకెలా వచ్చింది? 
నేనూ సాంఘిక సంక్షేమ వసతిగృహంలోనే ఉంటూ చదువుకున్నా. అప్పట్లో పరిస్థితులు దారుణంగా ఉండేవి. టీచర్లు, వార్డెన్లు మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. కొందరు ఉపాధ్యాయులు, సీనియర్ల సాయంతో నేను ఈ స్థాయికి వచ్చాను. మా క్లాస్‌మేట్స్‌ ఇప్పటికింకా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలుగా, హమాలీలుగానే పనిచేస్తున్నారు. బాల్యంలో నేను కోల్పోయిందే.. ఇప్పటి లక్షలాది మంది పిల్లలు కోల్పోతున్నారేమోననే భావన నన్ను వేధించేది. అందుకే అదే పనిగా ఇటొచ్చాను. 
* విద్యార్థి దశలో మీరు ఎదుర్కొన ఇబ్బందులు, కష్టాల వల్ల ప్రేరణ కలిగిందా.. మీ అమ్మగారి నుంచి స్ఫూర్తి లభించిందా..? 
మా అమ్మ జీవిత ప్రయాణమే నాకొక గొప్ప స్ఫూర్తి. ‘నాన్నా.. మనం ఒక్కరే బతకడం కాదురా... మిగతా వారందరినీ అభివృద్ధిలోకి తీసుకురావా’లని అమ్మ చెప్పేది. ఆ తర్వాత నా కెరీర్‌ నేర్పిన పాఠాలూ తక్కువేం కాదు. కరీంనగర్‌లో ఎస్పీగా, బెల్లంపల్లిలో ఏఎస్పీగా, అనంతపురంలో ఎస్పీగా పనిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో స్పెషల్‌ ఆఫీసర్‌గా రెండేళ్లు పనిచేశా. ఈ సమయంలో విద్యార్థుల అమాయకత్వాన్ని, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసేవాణ్ని. చాలామందికి చెప్పులు కొనుక్కునే పరిస్థితి ఉండేదికాదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలనుకునేవాణ్ణి. దానికితోడు మా అమ్మ ఆలోచనలు నాలో స్ఫూర్తి నింపాయి. 
* చాలామంది అధికారులు ప్రభుత్వం, రాజకీయనాయకులు తమకి అడ్డుపడుతుంటారని చెబుతుంటారు. మీకు ఈ అవరోధాలు లేవా..? 
నాకెలాంటి ఇబ్బందులూ రాలేదు. ఎవరూ అడ్డుపడలేదు. గుండెలో ఏ వర్గాలకోసం పనిచేయాలి? ఎంత నిబద్ధత ఉండాలి... ఎంతవరకు త్యాగం చేయాలనే స్పష్టత ఉండాలి. ఇలా ఉండి మన ఉద్దేశం బావుంటే రాజకీయనాయకులు, పై అధికారులు మనకు అడ్డురారు. అందుకే ప్రభుత్వం చాలామందిని బదిలీ చేసినా.. నన్ను ఏడుసంవత్సరాలుగా గురుకుల కార్యదర్శిగానే ఉంచింది. అసలు మీకో విషయం తెలుసా? నేనీ రంగంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అడిగి మరీ వచ్చాను. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ సార్‌ ‘మీరు కంటిన్యూ అవుతారా’ అని అడిగారు. ఉంటానన్నా. 
* గురుకులాల్లో అవినీతి ఎక్కువ, నాణ్యమైన ఆహారం ఉండదని కథనాలు వస్తుంటాయి. దీన్నెలా నియంత్రించారు..? 
దీనికి నిరంతర అజమాయిషీ ఉండాలి. తెలంగాణలో నాలుగు విజిలెన్స్‌ టీమ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. పిల్లలకు రోజూ నెయ్యి, చికెన్‌, వారానికి ఐదురోజులు గుడ్డు, మటన్‌ అందుతున్నాయా లేదా.. అని తల్లిదండ్రులకు తెలిసేది కాదు. ఈరోజు మేం వారిని అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యులుగా చేశాం. నేను ఒకసారి కర్నూలు జిల్లాలోని పత్తికొండ దగ్గర ఉండే స్కూల్‌కి వెళ్లాను. తల్లిదండ్రులు గేట్‌ దగ్గర ఉంటే వాచ్‌మెన్‌ వాళ్లు పరిగెత్తేలా అరిచాడు. అక్కడ కుక్కలు, పందులు కూడా ఉన్నాయి. వాచ్‌మెన్‌ని పిలిచి.. ‘ఈ జంతువులకంటే వాళ్లు హీనమైనవాళ్లా’ అని అతన్ని గదమాయించాను. వాళ్లను మళ్లీ పిలిపించి ప్రిన్సిపాల్‌ గదికి తీసుకెళ్లి కుర్చీల్లో కూర్చోమన్నా. వాళ్లంతా ఒకటే ఏడుపు.. ‘అయ్యా.. మేం ఏనాడూ లోపలికి రాలేదు. మా ఊళ్లలో పెద్దోళ్లు మమ్మల్ని కుర్చీల్లో కూర్చోపెట్టరు. అలాంటి మమ్మల్ని ఇలా.. ’ అని ఉద్వేగానికి గురయ్యారు. మీ పిల్లలకు ఏం చదువు చెబుతారు.. ఏం తిండిపెడతారని తెలుసా? అని అడిగాను. అవేమీ తెలీయవన్నారు. 
ఇకపోతే మేం ఈరోజున చేస్తున్నదేంటంటే పిల్లలకు ఏం తిండి పెడుతున్నారు? ఏ వస్తువులు అందుతున్నాయనేది తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. ఇన్ని గ్రాములు చికెన్‌ ఇచ్చాం అంటే కంప్యూటర్‌లో ఫీడ్‌ చేయాలి. దాన్ని ఎడిట్‌ చేయలేం. దీనికి అన్నపూర్ణ అనే సాఫ్ట్‌వేర్‌ క్రియేట్‌ చేశాం. ఆ సాఫ్ట్‌వేర్‌ నా ఆఫీసులో మానిటర్‌ అవుతుంది. దీంతో పాటు సీసీ కెమెరాల్లో పిల్లలు ఏం తింటున్నారని చూస్తున్నాం. దీంతోపాటు బరువు, ఎత్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. 
* చాలామంది సిలబస్‌ మాత్రమే చెబుతారు. మీరు బయటికొచ్చి పనిచేస్తున్నారు ఎలా? 
రోబోటిక్స్‌, కోడింగ్‌ నేర్చుకోవాలని ఏ పాఠ్యపుస్తకాల్లో ఉండదు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా మేం పిల్లలకు వాటిని నేర్పిస్తున్నాం. ఐఐటీలో చదివినా గొప్ప శాస్త్రవేత్తలు కాలేకపోతున్నారెందుకు? ఓ ప్రయోగం చేశాక పేటెంట్‌ హక్కులు ఎలా సంపాదించుకోవాలో తెలియదు కాబట్టి. ఇవన్నీ కష్టమని కొందరు మళ్లీ సర్వీస్‌వైపు వస్తున్నారు. అందుకే మేం ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌ని పెంచాం. మా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, ఇంట్లో పనిచేసేవాళ్లు, డాక్టర్లు, సివిల్‌ సర్వీస్‌ చేస్తున్న వారు ఇలా ఎందరో మా పిల్లలకు పాఠాలు చెబుతారు. వాళ్ల బాధల్ని, బాధ్యతల్ని పంచుకుంటారు. అవే పిల్లల్లో ధైర్యం, చైతన్యం నింపుతున్నాయి. 
* విద్యార్థి వ్యక్తిత్వం, కెరీర్‌ బాగుండాలంటే ఉపాధ్యాయుడి కృషి అవసరం. మరి పిల్లలు, టీచర్ల మధ్య అనుబంధం ఎలా ఏర్పరుస్తున్నారు? 
మా ఉద్దేశంలో ఉపాధ్యాయుడే అమ్మ, నాన్న.  మా దగ్గర హౌస్‌పేరెంట్స్‌ సిస్టమ్‌ ఉంటుంది. ఇందులో ఒక్కో టీచరు ప్రతి నలభైమందికి అమ్మా,నాన్నలాగా ఉంటుంది. వాళ్లు పిల్లలతో రాత్రిపూట కలిసి ఉంటారు. కథలు చెబుతారు. వాస్తవానికి ఇళ్లలో ఉండే పిల్లలు వాట్సప్‌, ఫేస్‌బుక్స్‌, టీవీలకు దగ్గరగా ఉంటారు. ఇక్కడలా కాదు. హౌస్‌పేరెంట్‌ తన నలభై మంది పిల్లలకు వ్యక్తిత్వ, ఆర్థిక అవసరాల గురించి తెలుసుకుంటారు. ఇబ్బందుల్నీ, బాధల్ని పంచుకుంటారు. 
* బడిమానేసే పిల్లల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురుకులాల్లో వీటిని ఎలా తగ్గించారు? 
2012 వరకు మా పాఠశాలల్లో 3000 నుంచి 4000 వరకూ ఖాళీలు ఉండేవి. ఎందుకంటే ఇక్కడ వసతులు బాగుండేవి కాదు. ఉపాధ్యాయులు చెప్పేది వాళ్లకు అర్థమయ్యేది కాదు. ఈ ఏడాది సెట్‌ నిర్వహిస్తే.. 36 వేల సీట్ల కోసం 2.70 లక్షల మంది పోటీపడ్డారు. దీంతో 95 శాతం పాఠశాలలు నిండుగా ఉన్నాయి. కానీ విద్యార్థి వెళ్లిపోతున్నాడంటే రెండు రకాల కారణాలుంటాయి. ఒకటి పుష్‌ ఫ్యాక్టర్‌.. మన పాఠశాలలో సక్రమంగా లేని వాతావరణం పిల్లలను బయటకు వెళ్లేలా చేస్తోంది. మరొకటి పుల్‌ ఫ్యాక్టర్‌.. ఇంటి దగ్గర కారణాలేవో వారిని తిరిగి వెళ్లిపోయేలా చేస్తున్నాయి. వారికి మన బాధ్యతగా స్కూల్‌ వాతావరణం మార్చాలని నిర్ణయించాం. ప్రతి విద్యార్థికి ఏదో చేయాలి, చెప్పాలని తాపత్రయం ఉంటుంది. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఇక్కడి వాతావరణం ఉంటే వారిక్కడ ఉండరు. 

వసతులు అడిగితే కొట్టేవారు 

* విద్యా బోధన, నేర్చుకోవడం ఆట, పాటలా సాగాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒత్తిడి. దీన్ని భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని జయించాలంటే ఏంచేయాలి? 
మన పరీక్షా విధానం మారాలి. మార్కులు, ప్రశ్నకు సమాధానం ఇలాగే రాయాలని చెప్పినంతకాలం ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. విద్యార్థి విజయాన్ని పునఃనిర్వచించాలి. ఈ రోజు 100 మీటర్ల పరుగులో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థి అద్భుతమైన ప్రతిభావంతుడే. ఐఐటీల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల్లాగే వీళ్లు కూడా. అసోంలో అథ్లెటిక్స్‌లో విజయం సాధించిన హిమాదాస్‌ ఐఐటీలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థికి ఏమాత్రం తీసిపోదని నేననుకుంటాను. ప్రతిభ, విజయాలను పునః నిర్వచించకుండా... పాఠశాలల్లో, ఇళ్లలో మంచి వాతావరణం రాకుండా ఆత్మహత్యలు ఆగవు. సివిల్స్‌ ర్యాంకు వస్తేనే కాదు డ్యాన్స్‌లో, క్రీడల్లో  ప్రతిభ చూపినా వారిని అద్భుతంగానే చూడాలి. 
* పోటీ పరీక్షలకు విద్యార్థులను ఎలా సంసిద్ధం చేస్తున్నారు? 
పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయో తెలిసుండాలి. జవాబు ప్రశ్నలోనే ఉంటుంది. సమయం ప్రధానం. రెండు గంటల్లో ఎలా పూర్తి చేయాలన్నది ముఖ్యం. స్పీడ్‌, స్కిల్‌, డెప్త్‌.. ఇవి ప్రధానం. ఇవి విద్యార్థికి చిన్నప్పటి నుంచే రావాలి. అంతేగాని, ఏదో షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లతో ఇవి అబ్బవు. మేం ‘బ్యాక్‌ టు బేసిస్‌’ ప్రోగ్రాం చేస్తున్నాం. పదో తరగతి విద్యార్థులు ఐదో తరగతి విద్యార్థులకు బోధిస్తారు. సామాన్యంగా ఈ రోజు ఒక పరీక్ష పూర్తయిందంటే.. చాలామంది పిల్లల్లో ఒక పీడ విరగడైందనే భావన కలుగుతోంది. మళ్లీ విద్యార్థి ఆ పాఠ్యాంశాల జోలికి వెళ్లే పరిస్థితి లేదు. ఇది సరైన విధానం కాదు. పదో తరగతి విద్యార్థి ఐదో తరగతి పిల్లలకు బోధించేలా తయారవ్వాలి. బేసిక్స్‌ గట్టిగా ఉన్నప్పుడు ప్రశ్నలు తికమక పెట్టినా ఇబ్బంది ఉండదు. ప్రశ్న పత్రాలని అనలైజ్‌ చేయడం, విద్యార్థులతోనే ప్రశ్నపత్రం తయారు చేయడం వంటి విధానాలు మంచి ఫలితాలనిచ్చాయి. గతేడాది రెండు కళాశాలల్లో 42 మంది నిరుపేద విద్యార్థులు మెడిసిన్‌ సీటు సాధించగలిగారు. వీరిలో అనాథలు, చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని విద్యార్థులు, దుస్తులు కొనుక్కోలేని పిల్లలు ఉన్నారు. ఈ నాలుగేళ్లలో 160 మంది విద్యార్థులు మెడిసిన్‌ సీటు సాధించారు. 
* మీరేమో ఐపీఎస్‌ అధికారి... ఈ విద్యావిధానం గురించి లోతుగా అధ్యయనం ఎలా చేశారు? 
నేను ఏ సబ్జెక్టు తీసుకున్నా అంతే. లోతుగా పరిశీలిస్తా. సమస్య మూలాలను తెలుసుకుంటాను. దానికి పరిష్కారాలు వెదుకుతాను. ఏదో ఆఫీసుకు వచ్చాను, ఇంటికి వెళ్లాను అని కాకుండా శ్రద్ధ పెట్టి పనిచేస్తాను. ప్రతి గుడిసె, ప్రతి గల్లీ... ప్రతి బస్తీకీ విద్య చేరాలనేది నా సంకల్పం. దీన్ని అందుకే జ్ఞాన యుద్ధం అన్నాం. ఇది అజ్ఞానం మీద యుద్ధం. సోమరితనం మీద యుద్ధం. ఎవరైనా పేదరికం నుంచి బయటపడాలంటే... ముందు మానసికంగా బలంగా మారాలి. మా అమ్మ చిన్నప్పుడు పనికి వెళ్లేది. ఇద్దరు టీచర్లు గుర్తించి ఆమెను స్కూల్‌కు తీసుకెళ్లారు. ఆమె చదువుకొని ప్రధానోపాధ్యాయురాలిగా మారింది. తన పిల్లలు బాగా చదువుకొనేలా చేసింది... ఇలాగే ప్రతి గల్లీలోనూ తల్లిదండ్రులు చదువు ప్రాధాన్యం గుర్తించాలనేది నా ఆలోచన.

నాకు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం గురించి ఎక్కువ తెలియదు. ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు... అక్కడి విద్యార్థుల్లోని అమాయకత్వం, పేదరికం నన్ను కదిలించాయి. అప్పుడు ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, తిరుపతి రావు, కృష్ణారెడ్డి వంటి వారు నన్ను ఈ దిశగా నడవమని సూచించారు. అప్పటికే నేను 17 సంవత్సరాలు ఐపీఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తించాను. అయినా ఏదో అసంతృప్తి ఉండేది. సరే ఒక్కసారి హార్వర్డ్‌ యూనివర్సిటీకి ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నా. 43 ఏళ్ల వయస్సులో ఉదయం 5గంటలకు లేచి చదివేవాడిని. జీఆర్‌ఈ, టోఫెల్‌ లాంటి కఠినమైన పరీక్షలకు సిద్ధమయ్యాను. హార్వర్డ్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేయడమే పెద్ద యుద్ధంలా ఉంటుంది.  2011లో ఎంపికయ్యాను. అక్కడ నాకు కొత్త ప్రపంచం పరిచయం అయ్యింది. ఎందరో దేశ ప్రధానులు, మంత్రుల పిల్లలతో కలిసి చదివాను. నల్లమల అడవుల నుంచి వచ్చి... 8వతరగతి వరకూ కరెంటు చూడని నేను హార్వర్డ్‌కు వెళ్లానని చాలా ఆనందపడ్డాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
మా దగ్గర ఒకప్పుడు ఉపాధ్యాయులు ఉండేవారు కాదు. ఇంగ్లిషు చెప్పేవారు లేరు. ఆ సమయంలో ఇంగ్లిషు వచ్చిన విద్యార్థులు పక్కవాళ్లకి చెబితే గంటకి పదిహేనువందలు ఇస్తామని చెప్పాం. అది అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చింది. ఉన్న బడ్జెట్‌లోనే అది రూపొందించాం. మా దగ్గర పదిహేను ఏళ్ల వయసుండే ఇంగ్లిషు వచ్చిన పిల్లలు 350 మంది ఉన్నారు. వీళ్లు ప్రతి ఏడాదీ పెరుగుతారు. వీళ్లకి నెలకి 3500 రూపాయలు వేరే స్కూల్‌కి వెళ్లి పాఠాలు చెప్పినందుకు ఇచ్చాం. స్కూల్‌ని నాలుగు గ్రూపులుగా డివైడ్‌ చేసి నాలుగు హౌస్‌లుగా క్రియేట్‌ చేశాం. ప్రతి హౌస్‌లో ఉండే 160 మందిని ఒక్కరే పర్యవేక్షించాలి. ఆదర్శవంతంగా, బాధ్యతాయుతంగా ఉండటానికి, నాయకత్వ లక్షణాలు అలవడటానికి అలాచేశాం. పర్వతారోహణను ముందుకు తీసుకొచ్చాం. మౌంటనీరింగ్‌, సైక్లింగ్‌లో మా పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించారు.

వసతులు అడిగితే కొట్టేవారు 

* నేను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 300 పాఠశాలలను సందర్శించాను. వేలాది మంది పిల్లలను కలిసి మాట్లాడాను. తెలంగాణలో శాటిలైట్‌ ఛానల్‌ ద్వారా పిల్లలతో మాట్లాడుతుంటాను. అక్కడికి వెళ్లినప్పుడు వందల మంది పిల్లల్లో ప్రతిభను గుర్తించాను. షేక్‌హ్యాండ్‌ చేస్తాను. అలా చేతులు కలిపినప్పుడు పూర్ణ, ఆనంద్‌కుమార్‌ వంటి పిల్లల చేతులు గట్టిగా తగిలాయి. ఎందుకిలా? అని ప్రశ్నిస్తే...వారు ఊర్లో పనికి వెళతామని చెప్పారు. ఏదైనా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అది నన్ను కదిలించింది. తర్వాత వారికి తగిన శిక్షణ ఇస్తే... వారు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారు. ఇంకా చాలా మంది ఐఐటీలకు వెళ్లారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లి విమానాశ్రయం చూస్తే చాలనుకున్న పిల్లలకు విమానంలో ఆమెరికాకు వెళ్లగలుగుతున్నారు. 
మా పాఠశాలల్లో క్వార్టెడ్‌ సిస్టమ్‌ ఉంటుంది. ప్రతి నలుగురు విద్యార్థులతో ఒక బృందం ఏర్పాటు చేస్తాం. రెండు లక్షల మంది విద్యార్థులను ఇలా విభజించాం. ఒక్కో పాఠశాలలో నలుగురు విద్యార్థులతో బృందాలున్నాయి. ఈ నలుగురిలో ఒకరు గానీ, ఇద్దరు గానీ సీనియర్‌ విద్యార్థులు ఉంటారు. మిగతావారు జూనియర్లు ఉంటారు. వీళ్లు తమకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉంటారు.

* 2017-18 విద్యా సంవత్సరంలో తెలంగాణ గురుకుల విద్యాలయాల నుంచి, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల నుంచి 100 మంది విద్యార్థులు దిల్లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మకమైన కాలేజీల్లో చేరారు. వీరిలో 60 శాతం మంది విద్యార్థులు ఓపెన్‌ కాంపిటేషన్‌లో సీటు సాధించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్ల పిల్లలు, దిల్లీలో ధనవంతుల పిల్లలు చదువుతున్న సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో, శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, హిందూ కాలేజ్‌ వంటి చోట్ల వంద మంది మా పిల్లలు చదువుతున్నారు. ఆదిలాబాద్‌ అడవుల నుంచి వచ్చిన విద్యార్థులూ అక్కడ చదువుతున్నారు. మరైన్‌ ఇంజినీరింగ్‌, షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ కెప్టెన్లను తయారు చేసే ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో 12 మంది, సెంట్రల్‌ యూనివర్సిటీలో 21 మంది విద్యార్థులు, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో నాలుగేళ్లలో దాదాపు 200 మంది విద్యార్థులు చేరారు. 
* కంప్యూటర్‌ కోడింగ్‌ కూడా నేర్పించమని విద్యార్థులు కోరుతున్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం నుంచి చతుర్భాషా సిద్ధాంతం అమలు చేస్తున్నాం. ఇందులో మాతృభాష తెలుగు, దేశభాష హిందీ, మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌ భాష కోడింగ్‌ కూడా పిల్లలకు నేర్పిస్తున్నాం.
మేం వసతి గృహాల్లో ఉన్నప్పుడు బడికి వస్తున్నామా లేదా అని ఎవరూ పట్టించుకునేవారు కాదు. వార్డెన్లు నెలకు రెండుసార్లు వచ్చేవారు. వారికి అనుకూలంగా ఉండే సీనియర్ల అజమాయిషీలో వసతిగృహాలు ఉండేవి. వాళ్లే నడిపించేవారు. మనకు రావాల్సిన వసతులు వచ్చేవికావు. ఎవరైనా గట్టిగా అడిగితే వాళ్లను దారుణంగా కొట్టేవారు. ఉన్నతాధికారులను మేం ఎప్పుడూ చూడలేదు. అసలు వాళ్లు మాకెలాంటి వసతులు కల్పిస్తారనే విషయాలు తెలిసేది కాదు.
వెనుక బెంచీ కాన్సెప్ట్‌ని మేం ఛాలెంజ్‌ చేస్తున్నాం. విద్యార్థులందరినీ వృత్తాకారంలో కూర్చోబెడుతున్నాం. తరగతి గదిలోనే పాఠాలు ఎందుకు చెప్పాలి? పక్కన ఉన్న పొలంలో పాఠాలు చెబుతున్నాం. పూర్వకాలం గురుకులాల్లో బెంచీలు లేక.. చెట్ల కింద పాఠాలు చెప్పారని నేననుకోను. ప్రకృతి ఒడిలో విద్యా బోధన జరిగిందనిపిస్తుంది. ఇదీ అంతే! ఫ్యాక్టరీలోనూ పాఠాలు చెబుతున్నాం. వెనుక బెంచీ విధానాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నాం.
ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు రకరకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తద్వారా వారిలో దాగున్న ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. సమ్మర్‌ క్యాంప్‌లలో రెజ్లింగ్‌, జూడో, యంగ్‌ పొలిటీషియన్‌ క్యాంపు, యంగ్‌ జర్నలిస్టు క్యాంపు... ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దీని వల్ల వారిలో స్వాభావికమైన నైపుణ్యాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అమ్మాయిల కోసం వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌ అనే కార్యక్రమం పెట్టాం. వారికి ప్రశ్నించడం నేర్పుతున్నాం.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.