close

తాజా వార్తలు

అందుకే... మా ఆటలో ప్రేమికులెక్కువ!

ఆటగాడిగా అత్యుత్తమ స్థానం... శిక్షకుడిగా అత్యున్నత శిఖరం 
వ్యక్తిగా మహోన్నత దుర్గం.. మన జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌! క్రికెట్‌ దేశంలో బ్యాడ్మింటన్‌ మొక్కను మహావృక్షంగా మార్చిన ఘనత గోపీ సొంతం. నాటి ద్రోణాచార్యుడు తయారు చేసింది ఒకేఒక్క అర్జునుడిని అయితే.. నేటి ఈ ద్రోణాచార్యుడి ఖాతాలో ఇప్పటికే ఐదుగురు అర్జునులు ఉన్నారు. సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌, సాయిప్రణీత్‌, సిక్కిరెడ్డి లాంటి ప్రపంచ స్థాయి క్రీడాకారుల రూపశిల్పి ఆయన. భారత్‌లో బ్యాడ్మింటన్‌ను బ్రాండ్‌గా మలిచిన గోపీ మనోభావాలు ‘హాయ్‌’తో పంచుకున్నారు... 

అందుకే... మా ఆటలో ప్రేమికులెక్కువ!


బ్యాడ్మింటన్‌ ఖరీదైన ఆటగా మారిపోయింది. క్రీడాకారుడి వెంట తల్లి లేదా తండ్రి ఉంటున్నారు. ప్రయాణాలన్నీ విమానాల్లోనే. మంచి హోటల్‌లో బస. ఇప్పుడు దేశంలో అత్యంత ఖరీదైనది బ్యాడ్మింటనే! 
దేశంలో మరే కోచ్‌కు సాధ్యంకాని విధంగా క్రీడాకారుల్ని తయారు చేశారు. ఘనతల్ని సాధించారు. ఇది కష్టానికి ప్రతిఫలమా? అదృష్టమా? 
నాది కష్టపడేతత్వం. ఆటగాడిగా, కోచ్‌గా ఎప్పుడూ కష్టాన్నే నమ్ముకున్నా. నాకెప్పుడూ దేవుడి అండ దొరకడం నా అదృష్టం. 
ఉత్కంఠభరితంగా మ్యాచ్‌ జరుగుతున్నా మీలో భావోద్వేగాలు కనిపించవు. కారణం? 
పైకి అలా కనిపించినా లోలోపల నాక్కూడా టెన్షన్‌గా ఉంటుంది. ఆ టెన్షన్‌ నా ముఖంలో కనిపిస్తే ఆటగాడు మరింత ఆందోళనకు గురవుతాడు. అరిస్తే ఇంకా టెన్షన్‌లో పడతాడు. మన ఒత్తిడి వాళ్ల నెత్తిన వేయడం బాగోదు. నా గుండె దడదడ కొట్టుకుంటుంటే క్రీడాకారుడికి తప్పు చెప్పే ప్రమాదముంది. అందుకే ఎంతటి క్లిష్ట సమయంలోనూ ప్రశాంతంగా ఉంటా. లోపల ఆందోళన ఉన్నా భావోద్వేగాలు ముఖంలో కనపడనీయను. 
మ్యాచ్‌లకు ముందు క్రీడాకారుల నుంచి సెల్‌ఫోన్లు తీసుకుంటారంట. నిజమేనా? 
ఇప్పుడున్న అందరు క్రీడాకారులకు నేను చెప్పిందే వేదం. ఫలానా టోర్నీ ముందు ఇలా చేయాలి.. అంటే కచ్చితంగా అనుసరిస్తారు. ఒలింపిక్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ ముందు క్రీడాకారుల సెల్‌ఫోన్లు తీసుకోవడం నిజమే. మ్యాచ్‌లో బాగా అలసిపోయిన క్రీడాకారులకు విశ్రాంతి చాలా అవసరం. సెల్‌ఫోన్‌ వల్ల నిద్రకు భంగం కలగకూడదనే అలా చేస్తా. ఇప్పటి వరకు అందరూ నాకు సహకరించారు. ఎవరూ నా మాట కాదనలేదు. 
బ్యాడ్మింటన్‌లో ప్రేమ జంటలు ఎక్కువంటారు. ఎందుకని? 
బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ క్రీడ. బయటి వాతావరణంతో సంబంధం లేదు కాబట్టి ఎన్ని గంటలైనా సాధన చేయొచ్చు. చేస్తుంటారు కూడా. అలా రోజులో ఎన్నో గంటలు కలిసి సాధన చేస్తుంటారు. ఇంట్లో ఉండే సమయం కంటే బ్యాడ్మింటన్‌ కోర్టులో గడిపే సమయమే ఎక్కువ. బయటి స్నేహితులు చాలా చాలా తక్కువ. అందుకే కాబోలు తోటి వాళ్లే స్నేహితులవుతారు. అభిప్రాయాలు కలిసిన వాళ్లు ప్రేమికులుగా మారుతున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే... మా ఆటలో ప్రేమికులెక్కువ!
మీకు ఇంతటి క్రమశిక్షణ ఎలా అబ్బింది? 
బ్యాడ్మింటన్‌ నాకు చాలా ఇష్టం. ఆటగాడిగా ఉన్నప్పుడు బాగా రాణించాలని తపన పడేవాడిని. ఓడిపోవడం ఇష్టం ఉండేది కాదు. గెలవడం కోసం ఎంతవరకైనా కష్టపడేవాడిని. ఎంతసేపు సాధన చేయడానికైనా సిద్ధంగా ఉండేవాడిని. పెద్ద ఆటగాడైనా.. చిన్న ఆటగాడైనా.. ఏ దేశమైనా నేను ఓడిపోకూడదు అన్న కసి ఉండేది. ఎక్కడా నేను తక్కువ కాదు అన్న భావన బలంగా ఉండేది. అందుకే చిన్నప్పుడు బాగా గొడవలు పడేవాడిని. ఇప్పుడంటే దేశంలో బ్యాడ్మింటన్‌కు హైదరాబాద్‌ కేంద్రం. నేను ఆడినప్పుడు మన దగ్గర జాతీయ ఛాంపియన్‌ కూడా లేడు. నేషనల్స్‌లో ఒకరిని ఓడిస్తే గొప్ప ఘనత కింద లెక్క. నాకంటే మెరుగైన ఆటగాళ్ల చేతిలో ఓడినా బాధగా అనిపించేది. అంతర్జాతీయ స్థాయిలోనూ అలాగే ఉండేది. ఒకసారి ఓడితే తర్వాతి సందర్భంలో అతని చేతిలో ఓడొద్దని గట్టిగా అనుకునేవాడిని. మంచి ఆటగాడి చేతిలోనే ఓడిపోయా.. ఫర్లేదులే అన్న ఆలోచనలు అస్సలు రానివ్వను. తర్వాతి సారి వదలొద్దు అనే మొండి పట్టుదల ప్రదర్శించడం అలవాటైంది. పట్టుదల నుంచే క్రమశిక్షణ అబ్బింది. 
చిన్నారులు బ్యాడ్మింటన్‌ ఆడటం ఏ వయసులో మొదలు పెట్టాలి? 
బ్యాడ్మింటన్‌ నైపుణ్యానికి సంబంధించిన ఆట కాబట్టి 6, 7 ఏళ్లకు ఆరంభించాలి. మంచి స్కిల్స్‌ నేర్పిస్తే 10, 11 ఏళ్ల వరకు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. మన ఎత్తు, బరువులతో గొప్ప బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ క్రీడాకారులం కాలేం. కానీ కచ్చితంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారులం కావొచ్చు. శారరీకంగా మనకు ఆ లక్షణాలు ఎక్కువ. కాస్త దృష్టిసారిస్తే చాలు. ఏ అకాడమీ అయినా.. మూలాలు బాగా నేర్పిస్తే చాలు. 
మీ అకాడమీలో అడ్మిషన్‌ పొందాలంటే ఎలా? 
గోపీచంద్‌ అకాడమీలో అడ్మిషన్లు లేవు! అదనంగా కోర్టులు కట్టుకుంటే తప్ప కొత్తవారికి ప్రవేశాలు కల్పించలేం. సైనా 15 ఏళ్లుగా ఆడుతుంది. తన స్లాట్‌ తనకే ఉంది. కశ్యప్‌, శ్రీకాంత్‌, సింధు ఇలా ఎవరి కోర్ట్‌ వాళ్లకు కావాలి. వారు రిటైరయ్యేంత వరకు ఖాళీలు దొరకవు. కొత్తగా కోర్టులు ఏర్పాటు చేయడమే మార్గం. అంతకంటే ముందు నాణ్యమైన కోచ్‌ల్ని తయారు చేయాలి. ఆ రెండు జరిగే వరకు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు. రెండో, మూడో దశలో ఉన్న క్రీడాకారుల్ని తీసుకుని సానబెట్టొచ్చు. మొదటి దశలో ఉండే చిన్నారుల్ని తీసుకునే పరిస్థితి లేదు. జిల్లాలు లేదా ఇతర అకాడమీల్లో ఒకస్థాయికి చేరుకున్న క్రీడాకారుల్ని మరింత మెరుగ్గా తయారు చేయొచ్చు. 
మరో గొప్ప ఆటగాడు మీ స్థాయికి చేరుకోవడం సాధ్యమేనా? 
ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలా పనిచేసి.. ఈస్థాయికి చేరుకోవడం నూటికి నూరు శాతం కష్టం. అకాడమీ ప్రారంభించిన పదేళ్ల వరకు నన్నెవరూ ఆటంక పరచలేదు. నిశ్శబ్దంగా.. నా పని నేను చేసుకుపోయా. ఈరోజున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. అప్పుడు ఆటది లోప్రొఫైల్‌. పిల్లలకు ఏమీ తెలియదు. సైనా నువ్వు గెలుస్తావు అంటే గెలుస్తా అనేది. కశ్యప్‌ నువ్వు కొట్టేస్తావు అంటే సరే అనేవాడు. నేను చెప్పిందే వేదంలా ఉండేది. క్రీడాకారుల సంఖ్య పెరగడం.. ఆటకు ఆదరణ ఎక్కువవడం.. ప్రచారం పెరగడం వల్ల ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. 
మీ శిష్యులు మీకంటే గొప్ప ఘనతలు సాధిస్తుంటే అసూయ కలుగుతుందా? 
అలా ఆలోచిస్తే ఒక్కరోజు కూడా శిక్షణ ఇవ్వలేం. గురువును మించిన శిష్యులు కావడమన్నది సహజసిద్ధమైన ప్రక్రియ. కోచ్‌గా సున్నా నుంచి మొదలుపెట్టినప్పుడు ఆటగాడిగా నా ఘనతల్ని చూసుకుంటూ మురిసిపోవడం కుదరదు. ఇప్పటి బ్యాడ్మింటన్‌కు.. 20 ఏళ్ల క్రితం ఆటకు చాలా తేడా ఉంది. కోచ్‌గా ఎంతమంది క్రీడాకారుల్ని తయారు చేసినా.. క్రీడాకారులు అత్యున్నత స్థానాలకు చేరుకున్నప్పుడే ఆట అభివృద్ధి చెందుతుంది. కోచ్‌ వెనకాల ఉండటమే కరెక్ట్‌. క్రీడాకారులకే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రావాలి. 
ఆటగాడిగా రిటైరైనా మీ ఫిట్‌నెస్‌ మాత్రం అద్భుతం... ఏంటా రహస్యం? 
... ఈ రోజు ఉదయం 5.40కి అకాడమీకి వచ్చా. ఏకధాటిగా 4 గంటలు బ్యాడ్మింటన్‌ ఆడా. లంచ్‌ విరామం తర్వాత మళ్లీ కోర్టులో దిగా. క్రీడాకారులతో ప్రాక్టీస్‌ చేయిస్తుంటే నా ఫిట్‌నెస్‌ మరింత మెరుగవుతుంది. క్రీడాకారులతో ఆడాలి కాబట్టి వారు తీసుకునే ఆహారమే తీసుకుంటా. ప్రాక్టీస్‌ ఎంత అవసరమో ఆహారమూ అంతే. ఏది తక్కువ చేసినా కష్టం. క్రీడాకారులకు సాధన, ఆహారం, నిద్ర నూటికి నూరు శాతం ఉండాలి. తీపికి దూరంగా ఉంటా. కార్పొహైడ్రేడ్స్‌ తక్కువ తింటా. కూరగాయలు, చికెన్‌ తీసుకుంటా. ఏడేళ్లుగా కొబ్బరి నూనెతో చేసినవే తింటున్నా.  అకాడమీ వంటల్లో 80 శాతం కొబ్బరి నూనె వాడతారు. ఉదయం 4 గంటలకు అకాడమీకి వస్తా. రాత్రి 9 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తా. మధ్యలో సమయమంతా అకాడమీ, శిక్షణలో గడుపుతా.

కుమార్తె గాయత్రి, కుమారుడు సాయి విష్ణు ఎలా ఆడుతున్నారు? 
పిల్లలు బాగా ఆడుతున్నారని చాలామంది అంటున్నారు. ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. మరో మూడేళ్ల తర్వాతే వారి అసలు సత్తా ఏంటో తెలుస్తుంది. అండర్‌-15, అండర్‌-17లో గాయత్రి బాగా ఆడుతుంది. విష్ణుతో పాటు అతని తోటివాళ్లు కూడా రాణిస్తున్నారు. 
కుటుంబానికి సమయం ఎలా అడ్జెస్ట్‌ చేస్తారు? 
కుటుంబానికి కేటాయించే సమయం తక్కువే. ఇప్పుడంటే పిల్లలు పెద్దయ్యారు. కోచ్‌గా కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. ఐతే తక్కువ సమయమే అయినా ఉన్నంతసేపు ఎంజాయ్‌ చేసేవాళ్లం. వారితో ప్రేమగా ఉండేవాడిని. ఒకప్పటి కంటే ఇప్పుడు కొంచెం మెరుగు. అప్పుడు లక్ష్మి, అమ్మ చూసుకునేవారు. 
మీ విజయంలో కుటుంబం పాత్ర ఎంత? 
కలిసి మెలిసి పనిచేసే కుటుంబం దొరకడం నా అదృష్టం. అకాడమీ మొదలు పెట్టినప్పటి నుంచి అమ్మ, నాన్న, భార్య లక్ష్మి అందరూ కలిసి పని చేస్తున్నారు. నేను ఈస్థాయిలో ఉండటానికి వాళ్ల టీమ్‌ వర్కే కారణం. 
కోచ్‌గా విజయం సాధించడంలో అమ్మ సుబ్బరావమ్మ తోడ్పాటు? 
ఆటగాడిగా ఉన్నప్పుడు నాకు అండగా నిలిచింది. కోచ్‌గా మారినప్పుడు నాకు మద్దతునిచ్చింది. కోచ్‌గా పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకున్నప్పుడు అకాడమీ నిర్మాణం, అడ్మిషన్లు, అకౌంట్స్‌ చూడటం కుదరదు. అవన్నీ అమ్మ చూసుకుంది. తెర వెనుక నుంచి నాన్న మద్దతుగా ఉండేవారు. పూర్తిగా శిక్షణపైనే దృష్టి పెట్టడానికి అమ్మ, నాన్న ప్రధాన కారణం.
బలం : రెడీ టు వర్క్‌. ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉండే మనస్తత్వం. 
పుస్తకాలు : ఆధ్యాత్మిక, రిలీజియన్‌, మనోవిజ్ఞానశాస్త్ర, పోషకాహార సంబంధిత పుస్తకాలు చదువుతా. 
బలహీనత : కావాల్సినంత విశ్రాంతి తీసుకోలేకపోతుండటం. బ్యాడ్మింటన్‌ను విడిచి ఉండలేను. 
సినిమాలు :  చూడటం చాలా తక్కువ. థియేటర్‌కు వెళ్లను. ఫ్లైట్‌లో బోర్‌ కొడితే చూడటమే. 
అసంతృప్తి : అసంతృప్తి అన్న పెద్ద పదం వాడను. ప్రతిభను పూర్తిస్తాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. 
ప్రశాంతత కోసం : యోగా, ధ్యానం చేస్తా. తక్కువ సమయమే అయినా ప్రభావవంతంగా చేస్తా. రోజులో 30, 40 నిమిషాలు చేస్తా.

సైనా, సింధులలో ఎవరు అత్యుత్తమం?

అందుకే... మా ఆటలో ప్రేమికులెక్కువ!

ద్దరిలో ఎవరు అత్యుత్తమన్నది కష్టమైన ప్రశ్న. అది నన్నడగడం ఇంకా అన్యాయం. క్రీడాకారుల్ని పోల్చడం సరికాదు. ఎవరి ప్రత్యేకత వారిది. ఒక సమయంలో సైనా సూపర్‌. ఇంకో సమయంలో సింధు అద్భుతం. ఒకరి కెరీర్‌తో ఇంకొకరిని పోల్చి చూడలేం. 
భారత బ్యాడ్మింటన్‌లో సైనాది ప్రత్యేక స్థానం. ఒక భారత క్రీడాకారిణి ఏ స్థాయికి చేరుకోగలడో సైనా చూపించింది. తొలిసారి ఘనతలు అందుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే. మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సైనా, సింధులవి ప్రత్యేక అధ్యాయాలు.
చిన్నప్పుడు నేను సన్నగా, పొట్టిగా ఉండేవాడిని. ఆరిఫ్‌ సర్‌ నన్ను ‘చువ్వా.. చువ్వా’ అనేవాడు. అందరి ముందు నన్నలా పిలుస్తుండేసరికి కోపం వచ్చేది. ఫిట్‌నెస్‌, కసరత్తులు చేసి బలంగా తయారయ్యా. కొంచెం కష్టపడితే శారీరకంగా ఎవరికీ తక్కువగా ఉండాల్సిన పనిలేదు. మనలో నైపుణ్యం కూడా ఉంది. ఈ రెండు కలిస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారులు కావొచ్చని అప్పుడే అనిపించింది. నేనే ఆల్‌ ఇంగ్లాండ్‌ గెలిచినప్పుడు మిగతావాళ్లు ఛాంపియన్లు ఎందుకు కాలేరని అనుకున్నా. నేనేమీ బలవంతుడిని కాదు. అయినా గెలిచా. ఈలెక్కన ఎవరైనా విజేతగా నిలవొచ్చు అన్న ఫిలాసఫీతో అకాడమీ మొదలుపెట్టా.
- వరికుప్పల రమేశ్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.