close

తాజా వార్తలు

ప్రేమించాలనుకున్నా... ఏ అమ్మాయీ పడలేదు!

తను మాట్లాడుతుంటే మాటలు తడబడుతుంటాయి... ఆలోచనలు మాత్రం నిలువెత్తు కోటల్లా స్థిరంగా ఉంటాయి. చూడ్డానికి సింపుల్‌గా కనిపిస్తాడు... కథ అల్లి వినిపిస్తే ‘మామూలోడు కాదురా’ అనుకుంటారెవరైనా. ఎంబీఏ బోర్‌ కొట్టి ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చేసిన ఇతగాడు... ఎవరి దగ్గరా శిష్యరికం చేయకుండానే డైరెక్టర్‌ అయిపోయాడు... ‘ఘాజీ’తో మెప్పించి ‘అంతరిక్షం’తో మరోసారి మనముందుకొచ్చిన ఆ యువకుడే సంకల్ప్‌రెడ్డి.. సినిమాలు తీయాలనే తన గట్టి సంకల్పం... కుటుంబం, చదువు విశేషాలు పంచుకున్నాడిలా.

ప్రేమించాలనుకున్నా... ఏ అమ్మాయీ పడలేదు!

* అనుకోకుండా ఇటువైపు :
నిజానికి నాకు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబమూ కాదు. అనుకోకుండానే ఇటువైపు అడుగులు పడ్డాయి. ఎంబీఏ చదవడానికి ఆస్ట్రేలియా వెళ్లాను. ఒక సెమిస్టర్‌ పూర్తయ్యాక అదెందుకో నాకు సెట్‌ కాదనిపించింది. ఆపేసి తిరిగొస్తానంటే ఇంట్లో ఒప్పుకోరు. ఎంబీఏ వదిలేసి ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులో చేరిపోయా. చేరాక మనసుపెట్టా. దర్శకుడవ్వాలనే కల అప్పుడే మొదలైంది. కోర్సు పూర్తయ్యేవరకూ అమ్మానాన్నలకు చెప్పలేదు.
* గ్రాఫిక్స్‌ స్టూడియో :
ఇండియా తిరిగి రాగానే అర్జెంటుగా దర్శకుడైపోవాలనేది నా లక్ష్యం. సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకోవచ్చనే ఉద్దేశంతో సొంతంగా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ స్టూడియో ప్రారంభించా. కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌ తీశా. సినిమాలకు గ్రాఫిక్స్‌ కూడా చేశా. కొందరు దర్శకుల్ని కలిశా. పరిచయాలైతే పెరిగాయిగానీ ప్చ్‌.. అవకాశాలేం రాలేదు. ఇలా కాదనుకొని నేనే సొంతంగా ఏదైనా చిన్న సినిమా తీయాలని డిసైడయ్యా.
* రైలు ఆలస్యంతో :
ఓ సారి దైవదర్శనం కోసం అన్నవరం వెళ్లా. తిరిగొచ్చేటప్పుడు ట్రెయిన్‌ ఆలస్యమని తెలిసింది. అట్నుంచటే వైజాగ్‌ వెళ్లా. అక్కడే సబ్‌మెరైన్‌ మ్యూజియం చూశా. ఆశ్చర్యమేసింది. జలాంతర్గామి కథాంశంతోనే చిత్రం రూపొందించాలనే ఆలోచన మొదలైంది. అంతర్జాలంలో సమాచారం కొంత వెతికా. ఆ రంగంలో ఉన్న అనుభవజ్ఞుల్ని కలిశా. కథ సిద్ధమైంది. కొందరు నిర్మాతల్ని కలిసి వినిపించా. ఎవరూ ఆసక్తి చూపించలేదు.
* సినిమా కష్టాలు :
రూ.25 లక్షల్లో చిన్న సినిమా తీయాలని నా ప్లాన్‌. ముందు కొందరు స్నేహితులు సాయం చేస్తానన్నారు. తర్వాత మొహం చాటేశారు. ఒక్క ఫ్రెండ్‌ మాత్రం ఆదుకుంది. ఒక బిల్డింగ్‌లో పెద్ద జలాంతర్గామి సెట్‌ వేయించా. కొద్దిగా షూట్‌ చేసి గ్రాఫిక్స్‌ జతచేశా. క్యారెక్టర్స్‌ కోసం కొందరు నటుల్ని కలుస్తూనే ఉన్నా. ఈలోపు నా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. పని ముందుకు కదలట్లేదు. అప్పుడే ఆదుకున్నారు నిరంజన్‌రెడ్డి గారు. ఆయన ద్వారా నిర్మాత రామ్మోహన్‌గారు వారి ద్వారా సురేశ్‌బాబు, రానాలను కలిశా. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో స్టోరీబోర్డ్‌తో కథ తీసి చూపిస్తే వాళ్లకి నాపై నమ్మకం కలిగింది. సినిమా ముందుకెళ్లింది.
* పెద్దలు కుదిర్చిన పెళ్లి :
నా మొదటి సినిమాలో ప్రేమ, సెంటిమెంట్‌, రొమాన్స్‌కి చోటు లేదు. నా జీవితంలోనూ అంతే. నిజం చెప్పాలంటే నాకూ ప్రేమించి పెళ్లాడాలనే ఉన్నా... ఏ అమ్మాయీ పడలేదు. అయినా ప్రేమలో ఉన్న నా స్నేహితుల ప్రేమలకు మాత్రం సాయం చేసేవాణ్ని. క్లాస్‌లకి బంక్‌ కొట్టడం.. సిటీకొచ్చి ఎంజాయ్‌ చేయడం.. ఫ్రెండ్స్‌తో లాంగ్‌టూర్లు.. ఇవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు. నా జీవితంలో అందరిలాగే బీటెక్‌ చదివే రోజుల్నే ది బెస్ట్‌ డేస్‌గా చెబుతాను. తర్వాత నేను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకున్నా. నా భార్య పేరు కీర్తిరెడ్డి. తను ఫ్యాషన్‌ డిజైనర్‌. జోదాఅక్బర్‌కు అసిస్టెంటుగా పనిచేసింది. ఇద్దరు పిల్లలు దేవ్‌ కవిశ్‌, శ్యమంత్‌. ఇంట్లో సినిమాల కథలు అసలు మాట్లాడం.

* ఎప్పటికీ ఇంతే :
మొదట్లో సినిమా రంగం వైపు వెళ్తానంటే అమ్మానాన్నలు కంగారు పడ్డారు. తర్వాత ప్రోత్సహించారు. ఇప్పుడు డైరెక్టర్‌ని అయ్యాక వాళ్లూ హ్యాపీ. బంధువులు, స్నేహితుల విషయానికొస్తే కొందరు నన్ను ప్రత్యేకంగా చూసినా చాలామంది ఎప్పట్లాగే నాతో ఉంటారు. నేనూ అంతే. ఎప్పటికీ నేను మామూలు సంకల్ప్‌నే.

ప్రేమించాలనుకున్నా... ఏ అమ్మాయీ పడలేదు!

పరిశోధిస్తా : చేసిన రెండు సినిమాల కథలూ క్లిష్టమైన సబ్జెక్టులే ఆ కథాంశంపై పట్టుందా? అని అడుగుతారు చాలామంది. నిజానికి ఆ టెక్నాలజీపై నాకు ఆసక్తి ఉన్నా పట్టులేదు. కానీ చేస్తున్న కథపై పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నది నా పాలసీ. ఘాజీ సినిమా కోసం వైజాగ్‌లోని సబ్‌మెరైన్‌ మ్యూజియం క్యురేటర్‌ని కలిసి సమాచారం తెలుసుకున్నా. ఆనాటి భారత్‌-పాక్‌ యుద్ధం చారిత్రక సంఘటనల విషయం తెలుసుకున్నా. ఇప్పుడు అంతరిక్షం సినిమా కోసం కూడా ఎంతో కసరత్తు చేశా. బెంగళూరు వెళ్లి ఇస్రోలో పదవీవిరమణ చేసిన కొందరు సైంటిస్టుల్ని కలిశాను. ఇంటర్నెట్‌ నుంచి చాలా సమాచారం తీసుకున్నా.

హాలీవుడ్‌కీ... మనకీ తేడా : అక్కడ ప్రీప్రొడక్షన్‌ పకడ్బందీగా ఉంటుంది. అంతా పక్కాగా రెండునెలల ముందే సిద్ధమవుతుంది. ఇక్కడ ఈ రోజు షూటింగ్‌ అంటే అప్పుడు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల సినిమా బడ్జెట్‌ పెరిగిపోతుంది. అందుకే నేను ప్రీప్రొడక్షన్‌కు బాగా కసరత్తు చేస్తా. ఈ సమయంలో వేరే సినిమాలు చూడను ఘాజీ తీసేటప్పుడు మూడేళ్లు ఏ సినిమా చూడలేదు. ఎందుకంటే ఆ దర్శకుల ప్రభావం నా మీద పడుతుందని భయం.
ఆకాశంపై ఆసక్తి : స్పేస్‌, సైన్స్‌, టెక్నాలజీపై మొదట్నుంచీ నాకు ఇష్టం ఎక్కువ. చిన్నప్పుడు ఇంటి దాబాపై టెలిస్కోప్‌ పెట్టుకొని ఆకాశం, నక్షత్రాలను ఆసక్తిగా చూసేవాణ్ని. వాటి దగ్గరికి వెళ్లాలని ఉబలాటపడేవాణ్ని. కాస్త పెద్దయ్యాక వీడియోగేమ్స్‌కి పెద్ద ఫ్యాన్‌లా మారిపోయా. ఏమాత్రం తీరిక దొరికినా విపరీతంగా ఆడేసేవాణ్ని. ఘాజీ, అంతరిక్షం సినిమాల కథలు రాయడానికి వేర్వేరు సంఘటనలు స్ఫూర్తి కలిగించినా అంతర్గతంగా నాలో ఉన్న ఆసక్తి కూడా వాటికి తోడైందేమో!
* పుట్టిపెరిగింది : హైదరాబాద్‌ దగ్గర్లోని ఇబ్రహీంపట్నంలో
* బీటెక్‌ తర్వాత : ఆర్నెళ్లు ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశా
* సోషల్‌మీడియా : దూరంగా ఉంటా. అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌ వాడతా
* స్నేహం : ఫ్రెండ్స్‌ తక్కువ. ఉన్నవాళ్లని ఎప్పటికీ వదులుకోను
* నచ్చే దర్శకులు : మణిరత్నం, క్రిష్‌లు. మణిరత్నం స్టైల్‌, టేకింగ్‌ నచ్చుతుంది
* సినిమాల్లోకి రాకపోయింటే : ఏదో కొత్త వీడియోగేమ్‌ తయారు చేసేవాణ్ని

- శ్రీనివాస్‌ బాలె


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.