close

తాజా వార్తలు

సెట్లో నేను సింహాన్నే

బోయపాటి... మాస్‌ ఘనాపాఠీ
 

లైట్స్‌ ఆన్‌...
స్టార్ట్‌ కెమెరా...
యాక్షన్‌....
అంటూ మొదటి ఫ్రేమ్‌లోనే సినిమాలోని పవర్‌నంతా మనకు చూపించే దర్శకుడెవరు? మాస్‌ పల్స్‌ బాగా తెలిసినోడురా... అని మనం అనుకునేదెవర్ని? ఉగ్గుపాలతోనే మాస్‌ పట్టి ఉంటారేమో ఈయనకి? అని వ్యాఖ్యానించేది ఎవరి గురించి? ఇంకెవరు దర్శక సింహా బోయపాటి శ్రీను గురించే కదా! ఆ మాస్‌ మాంత్రికుడు బోయపాటి కుటుంబం, సంక్రాంతి కబుర్లు, సినిమా ముచ్చట్లు ‘హాయ్‌’తో పంచుకున్నారు.

సెట్లో నేను సింహాన్నే

‘‘ఓ అద్భుతమైన ఆయుధం తయారు అవ్వాలంటే భూమిలోంచి ఇనుము తీయాలి. దాన్ని ముక్కలుగా తెగ్గొట్టాలి. కొలిమిలో కాల్చాలి. సాన బెట్టాలి. అప్పుడు దాంతో యుద్ధం చేయాలి. ఊరికే వచ్చిన ఏ ఆయుధమూ.. పోరాడ్డానికి పనిచేయదు. ఇనుప ముక్క తీసుకెళ్లి ట్రైన్‌ ట్రాక్‌పై పెడితే అది కూడా ఆయుధం అవుతుంది. కానీ.. దాంతో యుద్ధం చేయలేవు. ఆయుధమే అన్ని కష్టాలు పడి తయారైతే.. మనం మనుషులం. ఇంకెంత కష్టపడాలి? పురిటినొప్పులు పడిన తరవాతే.. ప్రసవంలోని సుఖం, బిడ్డని కన్న ఆనందం అనుభవంలోకి వస్తాయి. పరిశ్రమలో ఏ ఒక్కరూ సులభంగా విజయాల్ని అందుకోరు. దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. దానికి విలువ ఇవ్వాలి.’’
* సంక్రాంతి పండక్కి మీ సినిమా వస్తోంది. ఈ సీజన్‌లో మీ సినిమా రావడం ఇదే తొలిసారి కదా..?
అవును. అటు పండగ.. ఇటు సినిమా. ఆ సంబరాలు రెట్టింపు అవుతాయని నా నమ్మకం. ‘వినయ విధేయ రామ’ పండగలాంటి సినిమా. సంక్రాంతి పండగ ఎంత బాగుంటుందో మా సినిమా అంత బాగుంటుంది. మా సినిమాతో పాటు వస్తున్న మరో మూడు చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా.
* మీ సినిమాలనగానే యాక్షన్‌, హీరోయిజంతో పాటు ఫ్రేమ్‌ పట్టనంత మంది పాత్రధారుల్ని చూపిస్తుంటారు. ఇదంతా.. మీరు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావం అనుకోవచ్చా?
నూటికి నూరుపాళ్లూ. ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనం అయిపోయింది. అలాంటి కుటుంబాల్ని తెరపై చూపిస్తే.. ‘అరె.. ఉమ్మడి కుటుంబంలో ఇంత అందం ఉందా’ అనే భావనైనా చాలామందిలో కలుగుతుందని చిన్న నమ్మకం. సినిమాలు చూసి జనాలు మారతారా? అనేది పక్కన పెడితే ఆ బాధ్యతైతే దర్శకుడిగా నాపై ఉందని బలంగా నమ్ముతా. మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం అనేది భారతీయత. అమ్మనాన్న, అక్క, తమ్ముడు.. ఇలా ప్రతీ బంధానికీ విలువ ఇస్తాం. అందుకే అలాంటి అంశాల్ని బలంగా చెప్పాలని ప్రయత్నిస్తుంటా.
* దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర మీరు శిష్యరికం చేశారు. ఆ అనుభవాలు మీకెంత ఉపయోగపడ్డాయి.?
ఓ కుటుంబ కథని ఎలా చెప్పాలి? భావోద్వేగాల్ని ఎలా జోడించాలి? అనేది ఆయన దగ్గర్నుంచే నేర్చుకున్నా. దానికి మించి నా జీవితం చాలా నేర్పింది. ఇప్పటికీ నాపై నా కుటుంబం, ఆ అనుబంధాలు ప్రభావం చూపిస్తుంటాయి.
* ఫొటోగ్రాఫర్‌గా, పాత్రికేయుడిగా పనిచేశారు. ఇప్పుడు తెలుగు నాట అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకులలో మీరొకరు. ఈ ప్రయాణం, నడిచొచ్చిన దారి ఇప్పటికీ గుర్తున్నాయా?
నాకు ఎక్కువ గుర్తొచ్చేవి ఆ రోజులే. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోలేను. నాకంటే చదువుకున్నవాళ్లు, మేధావులు ఈ పరిశ్రమలో ఉన్నారు. వాళ్లకు లేని అవకాశం దేవుడు నాకిచ్చాడు. అమ్మానాన్నల ఆశీర్వాదం, ‘నేను బాగుండాలి’ అని కోరుకునే శ్రేయోభిలాషుల వల్ల నేనీ స్థాయిలో ఉన్నాను. ప్రతి సినిమా మొదటి సినిమానే. ప్రాణం పెట్టి పని చేస్తా. సినిమా సినిమాకీ, విజయం విజయానికీ బాధ్యత పెరుగుతూనే ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. అవి చెప్పుకొనేవి కాదు. పనిపై ప్రేమ పెరిగింది తప్ప ఎన్నడూ తగ్గలేదు. ఇప్పటికీ నా స్క్రిప్టు నా స్వహస్తాలతో నేనే రాసుకుంటుంటా. ఆఖరి వెర్షన్‌ వరకూ.. రాస్తా.
* మొదటి సినిమా చేస్తున్నప్పుడు లక్ష్యాలు, ఆశయాలు ఏమైనా ఉండేవా? అవి తీరాయా, లేదా?
తీరడం అనేది ఉండదు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. ఊరి నుంచి ఇంత మందిని, ఇన్ని బంధాల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను. పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడాను. ఓ దర్శకుడ్ని అవ్వాలన్నదే కల. అయ్యాను. మంచి దర్శకుడిగా నిలబడాలి, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉండాలి. ‘భద్ర’ సమయంలో పెద్ద కోరికలు ఉండేవి కావు. ‘ఇంతొస్తే చాల్లే జీవితం సెటిల్‌ అయిపోతుంది’ అనుకునేవాడ్ని. మన ఆలోచనలతో పాటు ఆశలూ మారుతుంటాయి. నా దృష్టిలో ఆశ, ఆశయం డబ్బుతో ముడిపడి ఉండవు. పేరు, ప్రఖ్యాతులు ముఖ్యమే. శిఖరం అంచుల వరకూ ప్రయాణం చేస్తూనే ఉండాలి. అది చేరుకున్న తరవాత.. ఎంత గొప్పగా నిష్క్రమించాలో కూడా తెలిసుండాలి.
* సెట్లో బోయపాటి నియంతలా ఉంటాడని మీతో పనిచేసినవాళ్లు చెబుతుంటారు. అది నిజమేనా?
అక్షరాలా నిజం. అలానే ఉండాలి కూడా. మన చేతికి ఉన్న వేళ్లే ఒకలా ఉండవు. అలాంటిది నా యూనిట్‌లో 170 నుంచి 200 మంది ఉంటారు. అవుట్‌డోర్‌కు వెళ్తే ఇంకో 500 మంది అదనంగా కనిపిస్తారు. అంతమందిని ఎలా కంట్రోల్‌ చేయాలి. ‘సార్‌. సార్‌.. ఇలా నిలబడండి సార్‌.. అలా వెళ్లండి సార్‌’ అంటే పని జరుగుతుందా? నా సినిమా షూటింగ్‌ అంటే రోజుకి 12 నుంచి 20 లక్షలు అవుతుంది. ఒకొక్క షాట్‌కీ పది నిమిషాలు ఆలస్యం అయితే.. గంటలు గంటలు వృథా అవుతాయి. ఆ డబ్బంతా ఎవరు తిన్నట్టు? నిర్మాత బాగుండాలని కోరుకునే దర్శకుడ్ని నేను. తను బాగోపోతే నేనెలా బాగుంటా? అందుకే సెట్లో పనులు స్పీడుగా జరగాలి. తప్పదు.. నా సెట్లో నేను సింహంలానే ఉంటా. అలాగని నా యూనిట్‌పై ఈగ కూడా వాలనివ్వను.
* ఓ హీరో వంద మందిని మట్టికరిపించడం, కొడితే... భూమ్మీద బంతిలా లేచి పడడం.. ఇవన్నీ ఇప్పటికీ జనం చూస్తారని మీరు నమ్ముతున్నారా?
సినిమా అనేది ఓ కల. మనం చేయాలని, చేయలేని విషయాలు కొన్నుంటాయి. అవి తెరపై కథానాయకుడు చేస్తుంటే.. ప్రేక్షకులు ఆనందిస్తుంటారు. వాళ్లేం లెక్కలేసుకుని చూడరు. లాజిక్కులు వేసుకోరు. నిజ జీవితంలో ఓ అమ్మాయి ‘ఐ లవ్‌ యూ’ చెబితే... అబ్బాయి రోడ్డు మీద అప్పటికప్పుడు డాన్స్‌ చేసుకుంటూ పాట పాడుతుంటాడా? ఇవేం నిజ జీవితంలో జరగవని ప్రేక్షకులకు తెలుసు. కానీ వాళ్లు ఆస్వాదిస్తున్నారంటే అర్థం ఏమిటి? యాక్షన్‌ కోసమే యాక్షన్‌ అన్నది నాకు ఇష్టం ఉండదు. సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి.. నా హీరో విజృంభిస్తుంటాడు.
* ఈ దారి మార్చాలి.. అని ఎప్పుడూ అనిపించలేదా?
నేను వెళ్లేదారి సరిగా ఉన్నప్పుడు మారాల్సిన అవసరం ఏముంది? ‘జయ జానకి నాయక’ సినిమా విడుదల రోజున.. ఇంట్రవెల్‌ వరకూ చూసి ఓ పెద్దాయన ఫోన్‌ చేశాడు. ‘ఏంటి? ఇంత స్లోగా వెళ్లావేంటి? సినిమా ఇంత సాఫ్ట్‌గా తీశావేంటి’ అని అడిగాడు. ‘మీరు సెకండాఫ్‌ చూసి ఫోన్‌ చేయండి’ అన్నాను. సినిమా పూర్తయ్యాక.. ‘ఇదీ బోయపాటి సినిమా అంటే’ అని ఊగిపోయాడు. నన్నో యాక్షన్‌ సినిమాల దర్శకుడిలా చూస్తారు. అయితే కథల పరంగా కొత్తదారిలోనే వెళ్లా. ఏ కథ మరో కథలా ఉండదు. టక్కున మారిపోయి.. పక్కా లవ్‌ స్టోరీలు తీయడం కూడా సరైంది కాదు.

 

మాకో ఫొటో స్టూడియో ఉండేది 

సంక్రాంతి గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. పెద్ద పండగ అదే కదా? పైగా మా ఇంట్లో ఆడ పిల్లల హడావిడి చాలా ఎక్కువ. సంప్రదాయాల్ని బాగా పాటిస్తాం. ఇంట్లో నిత్య పూజలు జరుగుతుంటాయి. పండగ పూటైతే ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. చిన్నప్పుడు సంక్రాంతి అనగానే గాలిపటాలు, కొత్త సినిమాలే గుర్తొచ్చేవి. వయసొచ్చాక, బాధ్యతలు పెరిగాక కాస్త మారాను. ఊర్లో మాకో ఫొటో స్టూడియో ఉండేది. పండగ పూట కొత్త దుస్తులు కట్టుకుని స్టూడియోలో ఫొటోలు తీయించుకోవాలన్న సరదా చాలామందికి ఉంటుంది. అందుకే.. ఈ రోజుల్లో నేను ఇంకాస్త బిజీగా ఉండేవాడ్ని. ఇప్పుడంటే మాంసాహారం అనేది సాధారణమైపోయింది. అప్పట్లో పండక్కో, పబ్బానికో, ఆదివారం పూటో.. వాటి జోలికి వెళ్లేవాళ్లం. ముక్కనుమ రోజున తినే ముక్కల కోసం ఎదురుచూపులు మొదలైపోయేవి. నాటుకోడి, గారెలు... ఇష్టంగా తినేవాళ్లం.

బ్యాంకు బ్యాలెన్స్‌ పెరిగిపోయేది

నేను బాగుండాలి.. డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే.. నా బ్యాంకు బ్యాలెన్సు ఎవరూ ఊహించనంత పెరిగిపోయేది. కానీ అది నా స్వభావం కాదు. డబ్బుల వెనుక పరిగెట్టను. అందుకే నిదానంగా సినిమాలు చేస్తున్నా. స్పీడు పెంచితే.. నేను బాగుంటానేమో. నిర్మాతలు నష్టపోతారు. ఇతర భాషా చిత్ర పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ నా హీరోల్ని విడిచి వెళ్లలేను. నాకు చరణ్‌ కావాలి, బాలయ్య కావాలి, బన్నీ కావాలి.. అందరూ కావాలి. ముందు వీళ్లతో పని చేశాకే.. బయటి చిత్ర పరిశ్రమ గురించి ఆలోచిస్తా’’

ఫిబ్రవరిలో బాలయ్యతో సినిమా

బాలయ్య బాబుతో నా అనుబంధం ప్రత్యేకమైనది. సినిమాలకు అతీతంగా ఈ బంధం సాగుతుంది. నేను ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉంటా. దాగుడుమూతలు ఇష్టం ఉండదు. మొహమాటం కొద్దీ ఏదో మాట్లాడడం నచ్చదు. ఓ వ్యక్తి ముందు.. నా సమక్షంలో లేని మరో వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడను. సరిగ్గా.. ఇలాంటి లక్షణాలే బాలకృష్ణగారిలో కనిపిస్తాయి. అందుకే నేనంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మా నుంచి మూడో సినిమా వస్తోంది. ఫిబ్రవరిలో లాంఛనంగా మొదలెడతాం. ఇదేం రాజకీయ ప్రధానమైన చిత్రం కాదు. సామాజిక అంశాలతో సాగేదే. వాటిలో అంతర్లీనంగా పాలిటిక్స్‌ కూడా ఉండొచ్చు.
* నేను రాసుకునే ప్రతీ కథ దాదాపుగా చిరంజీవిగారికి వినిపిస్తుంటా. ఆయన విలువైన సలహాలు ఇస్తుంటారు. ‘వినయ విధేయ రామ’ కథ ఆయనకు బాగా నచ్చింది. ‘సైరా’ తరవాత రెండు కొత్త సినిమాలు చేస్తున్నారాయన. అది పూర్తయ్యాకే నా సినిమా ఉండొచ్చు.

ఇప్పుడు సినిమా ఓ భాగం

‘‘పెదరాయుడు’, ‘పెద్దరికం’, ‘బలరామకృష్ణులు’ ఈ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నేను స్వతహాగా పెద్దాయన ఎన్టీఆర్‌గారి వీరాభిమానిని. కథానాయకుడిగానే కాదు, రాజకీయ నాయకుడిగానూ ఆయన పద్ధతులు, విధివిధానాలూ బాగా నచ్చేవి. కృష్ణగారి సినిమాలూ విపరీతంగా చూసేవాడ్ని. అప్పట్లో వినోదానికి ఏకైక మార్గం సినిమానే. ఈ రోజు చాలా దారులు ఉన్నాయి. సినిమా ఓ భాగంగా మారిపోయింది. మిగిలిన మార్గాల నుంచి.. జనాల దృష్టి సినిమావైపు మళ్లించడం చాలా కష్టంగా మారిపోయింది.

మోక్షజ్ఞ తొలి సినిమా నాతో కాదు

బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తొలి సినిమాకి నేను కరెక్ట్‌ కాదు. నాతో సినిమా అనగానే అభిమానులు ఏవేవో ఆశిస్తారు. తొలి సినిమాకే అవన్నీ చూపించకూడదు. తను కొన్ని సినిమాలు చేశాక అయితే... బాగుంటుంది.

అలా కలిసొచ్చిందంతే

నేనొచ్చి ‘యాక్షన్‌’ చెప్పగానే సినిమా మొదలవుతుంది. ‘కట్‌’ అనగానే సినిమా పూర్తవుతుంది. ‘సింహా’లో సరదాగా ట్రై చేశాను. అది బాగా కలిసొచ్చింది. ఇప్పుడు కొనసాగిస్తున్నాను.

నేనేదో సాధిస్తానని నమ్మింది వాళ్లే

సెట్లో నేను సింహాన్నే

నా కుటుంబమే నా బలం. నా ఆయుధం. సినిమాల్లో నేనేదో సాధిస్తానని నమ్మింది వాళ్లే. మరీ ముఖ్యంగా అక్క, అన్నయ్యల ప్రోత్సాహం మర్చిపోలేనిది. అన్నయ్యగారి అబ్బాయి బలరాం నా దగ్గరే సహాయకుడిగా    పనిచేస్తున్నాడు. అర్ధాంగి పార్వతి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఆమెపై నాకున్న ప్రేమ, మా ఇద్దరి అనుబంధం.. ‘వినయ విధేయ రామ’లో కొన్ని పాత్రల్లో కనిపిస్తుంది. హర్షిత్‌, జోషిత, వర్షిత్‌ నా ముగ్గురు పిల్లలు. వాళ్లే నా ప్రపంచం.

- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటోలు: జయకృష్ణ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.