close

తాజా వార్తలు

జీవితమంటే... అంతేగా..అంతేగా..

జీవితమంటే... అంతేగా..అంతేగా..

అమాయకంగా చూడండి... అతనిలో ‘చంటి’ కన్పిస్తాడు. కోపంగా మాట్లాడండి...  ఆయనలోని ‘ఘర్షణ’ని చూపిస్తాడు. ‘ప్రేమ’గా పలకరించండి... ‘నువ్వునాకు నచ్చావ్‌’ అంటాడు. ఆనందంగా హాయ్‌ అనండి... ‘ఎఫ్‌2’లా నవ్వుని నలభైఇంతలు చేస్తాడు. ఇప్పటికే అర్థమైందనుకుంటా... అందరి హీరో వెంకటేశ్‌ గురించే ఇదంతా అని. ‘అంతేగా...అంతేగా’ అంటూ ఎఫ్‌2 విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఆయన ‘హాయ్‌’తో తన భావాలు పంచుకున్నాడు. జీవితం, సినిమాలు, క్రికెట్‌... ఇలా అనేక విషయాలు మాట్లాడాడు.
 

ఈ సంక్రాంతికి మీ సినిమా కూడా విడుదలైంది. పండక్కి సినిమాల్ని విడుదల చేయడం సెంటిమెంట్‌గా మారుతోందా?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’ ఇలా సంక్రాంతికి చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ బాగా ఆడాయి. పండగ అనగానే ఓ ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తుంది. ‘సినిమాకి వెళ్లాలి’ అని మానసికంగా సిద్ధమైపోతారు. పేక్షకుడికి వినోదం రకరకాల రూపాల్లో దొరికేస్తోంది. వాళ్ల దృష్టిని సినిమాలవైపు మళ్లించే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంటుంది. అందులో సంక్రాంతి ఒకటి.

ఎఫ్‌ 2 సినిమాపై మీరు ముందు నుంచీ గట్టి నమ్మకంతోనే ఉన్నారు. దానికి గల ప్రత్యేక కారణమేంటి?
వినోదాత్మక చిత్రాల్లో ఉన్న బలమే అది. కథ చిన్నదే కావొచ్చు. కానీ.. రెండుగంటల పాటు హాయిగా నవ్విస్తే సరిపోతుంది. ఆరోగ్యకరమైన వినోదానికి ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఎఫ్‌ 2లోనూ ఆ లక్షణాలు కనిపించాయి. అందుకే ఈసినిమాపై ముందు నుంచీ గట్టి నమ్మకం ఏర్పడింది. సంక్రాంతి సీజన్‌లో సినిమా రావడం, మంచి విజయాన్ని అందుకోవడం 2019కి మంచి బూస్టప్‌ దొరికినట్టు అనిపించింది.

సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇలాంటి గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉంటూ వేదాంతం మాట్లాడడం, ఇన్ని విషయాల గురించి లోతుగా ఆలోచించడం మీకు ఎలా అలవాటైంది?
ఇదేదో గ్లామర్‌ ఫీల్డ్‌ అని నేను అనుకోను. నా వరకూ ఓ వృత్తి అంతే. ఈ రంగుల లోకానికి నేనేమీ ఆకర్షితుడ్ని అయిపోలేదు. ఇక్కడ ఓ స్టార్‌ డమ్‌ ఉంటుందన్న స్పృహా నాకు లేదు. ఏదో వచ్చాను, నటించాను, ప్రేక్షకులు ఆదరించారు. మధ్యలో కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. ‘నాకు సినిమాలు కరెక్టేనా? నేను సినిమాలకు పనికొస్తానా’ అని ఆలోచించాను. విధి నన్ను ఇక్కడే ఉండమని నిర్దేశించిందేమో. అందుకే మెల్లమెల్లగా నిలదొక్కుకున్నా. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకున్నా. అప్పగించిన పని కోసం నూటికి నూరుపాళ్లు కష్టపడడం నాన్న, అన్నయ్యల దగ్గర నుంచి నేర్చుకున్నా. ‘అదేంటి ఆ హీరోకి అంత మంచి కథ దొరికింది’ అని ఎప్పుడూ మధనపడలేదు. ‘ఈ సినిమా నా వల్లే ఆడింది’ అని అనుకోలేదు. నేనో చుక్కని మాత్రమే. ఎన్నో చుక్కలు కలిస్తేనే ఓ రూపం వస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఇలానే ఉన్నా. ఇలానే మాట్లాడుతున్నా. ‘అదేంటి వెంకీ నువ్వింకా అలానే ఉన్నావేంటి?’ అని చాలామంది అడిగారు. ఎందుకో నాకూ తెలీదు. ఇది నా మార్గం. దీనికి మించిన మరో మార్గం ఉందేమో. ఆ సంగతి నాకు తెలీదు.

చుట్టూ ఉన్న నెగిటివ్‌ ఎనర్జీని పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలో ఆలోచిస్తుంటారా?
నేను ఆలోచిస్తా. అందరూ అలానే ఆలోచించాలి. మన దగ్గరకు వచ్చి ఎవడో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతాడు. వాటిని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావ్‌ అనే విషయంలోనే ట్రిక్కంతా ఉంది. సంఘటన జరిగిన తరవాత
నీలో వచ్చిన మార్పే నువ్వేంటో చెబుతుంది. చెప్పినోడు, చేసినవాడు.. వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతారు. మరి నీ సంగతేంటి? వాడి గురించి ఆలోచించుకుంటే నీ బతుకేంటి. నీ ఆకలి నీది. నీ పని నీది. నీ గురించి ఎవరూ ఆలోచించరు. నీకు నువ్వే  ఆలోచించుకోవాలి. నీ యుద్ధం నువ్వే చేయాలి. ప్రతీ మనిషీ ‘నేను సమ్‌థింగ్‌ స్పెషల్‌’ అనుకోవాలి. అది నిజం కూడా. నాలా ఈ భూ ప్రపంచంలో మరొకడు ఉండడు. ఉండలేడు. లోతైన ఆలోచనల వల్లే అది సాధ్యం అవుతుంది.

మీరెప్పుడూ క్రియేటర్‌ అంటుంటారు కదా? అంటే దేవుడని అర్థమా? లేదంటే ప్రకృతి అనుకోవాలా?
దేవుడు అనేది ఓ చిన్న పదం. క్రియేటర్‌ అంటే ప్రకృతి. దాన్ని నమ్మాలి. మనల్ని తీసుకొచ్చి.. ఇక్కడ పడేసింది ఓ శక్తి అనుకోవాలి. దానికి ‘దేవుడు’ అని పేరు పెట్టుకుంటే పెట్టుకో. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకు. అది సెకండ్‌ హ్యాండ్‌ వస్తువు. దానికంటే ఆత్మ గొప్పది. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని నమ్ము. ఏం అడక్కుండానే చూడగలుగుతున్నావ్‌. మాట్లాడుతున్నావ్‌. గాలి పీలుస్తున్నావ్‌. ఇదంతా నిజం కదా? ఈ నిజాన్ని నమ్మాలి.

మీ ఇంట్లో వాళ్లకి ఇలాంటి విషయాలు చెబుతుంటారా? వాళ్ల రియాక్షన్‌ ఏమిటి?
‘ఇప్పుడు వీళ్లకో క్లాస్‌ పీకాలి’ అనుకుని ఎప్పుడూ చెప్పను. కానీ అవసరం అనుకున్నప్పుడు కొన్ని విషయాలు చెబుతుంటా. మనం ఉన్న స్థలం, ఎదుటివాళ్ల మనస్తత్వాలు ఇవన్నీ మన మాటలపై ప్రభావం చూపిస్తుంటాయి. మనలో ఎన్నో భావాలు ఉండొచ్చు. స్వీకరించేవాళ్లు లేకపోతే ఎన్ని చెప్పినా వ్యర్థమే. నాకు పెద్దగా ఆశలు ఉండవు. జీవితంపై ఆశలు ఎక్కువగా ఉన్నవాడ్ని ఆపి నేను స్పీచులు ఇచ్చినా ఎక్కవు.

మీ పిల్లలు మీలా ఆలోచిస్తారా?
నా ఆలోచనల ప్రభావం వాళ్లపై కొంత వరకూ ఉంటుంది. కానీ నేనేదీ రుద్దను. ఎవరి బ్యాగేజీ వాళ్లది. ఎవరి జీవితాన్ని వాళ్లే నడిపించుకోవాలి. ఎవరి తప్పుల్ని వాళ్లు తెలుసుకోవాలి. అందులోంచి నేర్చుకోవాలి. నొప్పి లేకపోతే జీవితం విలువ తెలీదు. కాకపోతే.. వాళ్లని ఓ క్రమ పద్ధతిలో పెంచాను. ఎంత ఉన్నా ఒదిగి ఉంటారు.

మీ భావాలని, అభిప్రాయాల్ని రాయాలనుకున్నారా?
నేనేదీ ఆలోచించి చేయను. సహజంగా జరగాలి. ప్లాన్‌ చేసుకుంటే.. లోపలున్న ‘ఈగో’ బయటకు వచ్చేస్తుంది. ‘ఇంత మంచి పుస్తకం రాశాం.. జనాలు చదువుతారా? వాళ్లకు అర్థం అవుతుందా’ అనే గోల మొదలవుతుంది. ఉన్న పుస్తకాలే ఎవడూ చదవడం లేదు. రమణ మహర్షి, జీసెస్‌, బుద్ధుడు, పరమహంస.. ఎంత విజ్ఞానాన్ని ఇచ్చారు. అవన్నీ మనం చదువుతున్నామా? లక్షలు పోసి.. స్టార్‌ హోటల్‌కి వెళ్లి అక్కడ పర్సనాలిటీ డెవలెప్‌మెంట్‌ క్లాసులు మాత్రం తీసుకుంటుంటాం. ఎందుకు అదంతా? ‘భగవద్గీత’లో ఉన్నదేగా వాళ్లూ చెప్పేది..? అది చదివితే సరిపోతుంది.

వ్యక్తిత్వ వికాస పుస్తకాల వల్ల ప్రయోజనం లేదంటారా?
ఓ ప్రేరణ దొరుకుతుంది. చదివిన వెంటనే ఓ సాంత్వన లభిస్తుంది. అయితే ఆ విషయాల్ని నీ జీవితంలో ఎంత వరకూ అమలు చేస్తున్నావు? అనేది చాలా ముఖ్యం. సమస్య వచ్చినప్పుడు చదువుతావు. అంతా బాగుంది అనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తావు. అక్కడే వస్తుంది చిక్కంతా.

ఈ జీవితాన్ని వదిలి ఎక్కడకైనా వెళ్లాలి అనిపిస్తుంటుందా?
కొన్నిసార్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటా. అయినా లగ్జరీ ఎక్కడ లేదు..? ఓ చెట్టుకింద కూర్చుంటే లగ్జరీ లేనట్టా...? విలాసవంతమైన వస్తువులు తాత్కాలిక ఆనందాన్నే ఇస్తాయి.

బిగ్‌ బాస్‌ 3 సీజన్‌కి మీరే హోస్ట్‌ అని ప్రచారం జరుగుతోంది?
లేదు.. నిజానికి బిగ్‌ బాస్‌, మీలో ఎవరు కోటీశ్వరుడు ముందు నా దగ్గరకే వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు.

నాన్న, అన్నల్లా వ్యాపార రంగం మిమ్మల్ని ఆకర్షించలేదా?
డబ్బు ఎప్పుడూ ఆకర్షించలేదు. ఇప్పుడు ఇలా ఉండడం సౌకర్యంగా ఉంది. అది చాలు అనిపించింది. కెరీర్‌ ప్రారంభంలో ‘కొంత డబ్బు ఉండాలి’ అనుకునేవాడ్ని. అదెప్పుడో వచ్చేసింది. ఇప్పుడు నా అకౌంట్లో పడుతున్నదంతా బోనస్‌ అనే అనుకోవాలి. డబ్బు అవసరమైనదానికంటే ఎక్కువ సంపాదించినా సమస్యే. తక్కువ ఉన్నా ఇబ్బందే. కావల్సినంత ఉండేలా చూసుకోవాలి.

నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి.. ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తాయి. చాలామంది అభిమాన చిత్రాలవి. ఆ సినిమాలు అలా నిలబడిపోవడానికి కారణమేంటి?
నిజంగా ఆ ఫార్ములా నాక్కూడా తెలీదు. ఓ ‘గుండమ్మ కథ’లా మిగిలిపోయిన సినిమాలవి. ఎక్కడకు వెళ్లినా... ఆ సినిమాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఎక్కడా ఎలాంటి అసభ్యత లేకుండా తీసిన సినిమాలవి. అందుకే అలా నిలబడిపోయాయి. అలాంటి మంచి పాత్రలు నాకు దక్కడం ఆనందంగా ఉంది. వాటికి మించి సినిమాలు చేయాలని నాకూ అనిపిస్తుంటుంది. నటుడిగా నేను సవాళ్లని ఇష్టపడతాను. కానీ అవి ఎలాంటి పాత్రలు, ఏరకమైన సినిమాలు అనేవి నేనూ చెప్పలేను. ‘దంగల్‌’, ‘తారే జమీన్‌ పర్‌’లాంటి సినిమాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా.

నాన్నగారు రామానాయుడు లేని లోటు అన్నయ్య సురేష్‌బాబు తీరుస్తున్నారా?
నాన్నగారు లేరు అని అస్సలు అనుకోవడం లేదు. ఆయన అరుదైన బ్రీడ్‌. చాలామంచి మనిషి. నాకూ మా కుటుంబానికీ పాజిటీవ్‌ ఎనర్జీ ఇచ్చి వెళ్లారు. అది మా చుట్టూనే తిరుగుటుంటుంది.

మీనాన్నగారి బయోపిక్‌ తీసే ఆలోచన ఉందా?
ఇంకా ఏం అనుకోలేదు. వస్తుందేమో చూడాలి.

డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారంటారా?
కష్టపడినప్పుడు దానికి గుర్తింపుగా చాలా వస్తాయి. అదంతా నీ కష్టానికి ప్రతిఫలం. కొన్నిసార్లు తక్కువ వస్తుంది. ఇంకొన్నిసార్లు ఎక్కువ వస్తుంది. నువ్వు అడక్కు. ఇస్తే వద్దనకు. పక్కవాడితో పోల్చుకోకు. రెండేళ్లు కష్టపడి ఓ కారు కొనుక్కున్నావ్‌. పూజ చేసి, దిష్టి తీసేలోగా.. పక్కింట్లో నీకంటే ఖరీదైన కారు కనిపిస్తే.. ‘అరె వాడెలా కొన్నాడు?’ అంటూ జుట్టు పీక్కోకు. అలా చేశావంటే రెండేళ్ల నీ కష్టం బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు ఎంత సంపాదించావ్‌ అన్నది కాదు. ఆ సంపాదించినదాంట్లో ఎంత సుఖంగా ఉన్నావ్‌ అనేదే ముఖ్యం.

 

రోజూ పండగలా చేసుకోవాలి

చిన్నప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. భోగి పండగ బాగా జరిగేది. పతంగులు చూడాలంటే హైదరాబాద్‌ రావాలి. పండగ రోజున ఇంట్లోవాళ్లమంతా కలిసేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూ, భోజనాలు చేయడం అలవాటు. ఇక్కడికి వచ్చాక.. ఆ ఆనందానికి సినిమా తోడైంది. పండగ అనగానే కొత్త సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. పండగ వాతావరణం చూస్తున్నప్పుడల్లా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. పండగల ఉద్దేశం నాకు నాకు తెలిసి ఆనందాన్ని పంచడమే. ప్రతి మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి.. ‘ఈరోజైనా సంతోషంగా గడుపుదాం..నలుగుర్నీ కలుద్దాం’ అనే సానుకూల దృక్పథాన్ని పండగలు తీసుకొస్తాయి. పండగ అయిపోయాక... ‘అరె... ఇన్ని రోజులు ఎంత బాగున్నాం.. మిగిలిన రోజులూ ఇలానే గడుపుదాం’ అనిపిస్తుంది. ప్రతి రోజూ ఓ పండగలా చేసుకునే పద్ధతి మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. 

మనలోనే అద్భుతాలు

ప్రతిక్షణం అందమైనది. ఇన్ని మంచి క్షణాల్ని అందిస్తున్న ప్రకృతికి రుణపడి ఉండాలి. ప్రతీరోజూ ఓ అద్భుతం అని ఫీల్‌ అవ్వాలి. రాత్రి పడుకుని ఉదయం లేస్తున్నామంటే, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నామంటే, నడుస్తున్నామంటే... ఇవన్నీ అద్భుతాలే. దురదృష్టం ఏమిటంటే అద్భుతాల కోసం ఎక్కడెక్కడో వెదికేస్తుంటాం. అది మనలోనే ఉందన్న విషయం తెలుసుకోం. అది తెలుసుకుంటే జీవితం కొత్తగా అనిపిస్తుంది. ఆ నిజం మర్చిపోయి బతికేస్తుంటాం. ప్రపంచాన్ని రిపేర్‌ చేద్దామని ప్రయత్నిస్తుంటాం. ముందు నిన్ను నువ్వు బాగుచేసుకో. ప్రపంచం తరవాత. 

మరీ ఎక్కువ చేస్తున్నానేమో

క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఇండియా ఎక్కడ మ్యాచ్‌ ఆడినా వెళ్లి చూడాలనిపిస్తుంటుంది. కొన్నిసార్లు అన్నయ్య నాతో వస్తుంటాడు. ఇంకొన్నిసార్లు రానా వస్తుంటాడు. ప్రపంచకప్పు రాబోతోందని కదా.. ప్లాన్‌ చేసుకోవాలి. మ్యాచ్‌ చూస్తున్నప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేను. 120 బంతుల్లో వందసార్లు లేచి గోల చేస్తుంటా.. (నవ్వుతూ). అది మరీ ఎక్కువ అవుతోందేమో... అన్నిసార్లు లేవకూడదేమో అని తరవాత అనిపిస్తుంటుంది. టీ 20ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఎవరెవరు ఆడినా, ఎక్కడ లీగ్‌ జరిగినా చూస్తుంటా. ఆఖరి ఓవర్లు మరింత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటాయి. ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలవడం చూసి చాలా ఎంజాయ్‌ చేశాను.

ఏదీ మార్చలేదు 

జీవితమంటే... అంతేగా..అంతేగా..

జీవితంలో, సినిమాలో మూడు దశలుంటాయి. ముందు పని చేయాలి, ఆ తరవాత ఫలితం గురించి ఆలోచించకుండా అందులోంచి మనం బయటకు వచ్చేయాలి. మూడోది స్వీకరణ. ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడానికి మనసుని సిద్ధంగా ఉంచుకోవాలి. మంచో చెడో ఏదైనా కావొచ్చు. మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోకపోతే చాలా కష్టం. ఓ అట్టర్‌ ఫ్లాప్‌ వస్తే.. ‘అరె మన పని అయిపోయింది’ అనే భయం వెంటాడుతుంది. సడన్‌గా హిట్‌ వస్తే.. ‘మనల్ని మించినవాడు లేడేమో’ అన్న అతివిశ్వాసం మొదలైపోతుంది. రెండూ మంచివి కావు. అందుకే ఓ సినిమా చివరి దశలో ఉన్నప్పుడే నేను మానసికంగా బయటకు వచ్చేస్తా. అందుకే హిట్లూ, ఫ్లాపులూ నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి.

- మహమ్మద్‌ అన్వర్‌, ఫొటోలు : జయకృష్ణ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.