close

తాజా వార్తలు

వంద మందినైనా చంపాలనుకున్నా

కోరుకున్న లక్ష్యం కోసం ప్రభుత్వ ఉద్యోగాలని సులభంగా వదులుకునేంత ధైర్యం ఆయనది! తాను తయారుచేసిన వ్యాక్సిన్లను స్వదేశంలోని బిడ్డలకూ అందించాలన్న లక్ష్యం కోసం ‘ఆర్‌యూ జోకింగ్‌’ అన్నా.. ‘గెటవుట్‌’ అన్నా.. పదకొండేళ్లు పాటు భరించిన సహనం ఆయనది. నాస్తికవాదం నుంచి మొదలైన ఆయన పయనం దైవత్వం దిశగా అడుగులు వేసింది. సంగీతం, సాహిత్యం తోడులేకపోతే ఏమయ్యేవాడినో... అనే శాంతా బయోటెక్‌ వరప్రసాదరెడ్డి మనసులో మాటలు...

ఎవరికైనా అమ్మ ఒడే తొలి బడి. తల్లి తన కొడుకు వివేకవంతుడైన పౌరుడిగా మారాలని కోరుకోవాలిగానీ కేవలం మార్కులే తెచ్చుకునే అక్రమార్కులుగా ఎదగాలని కోరుకోకూడదు. ముందు తల్లిలో మార్పు రావాలి. ఒకప్పుడు మోరల్‌ క్లాసులు ఉండేవి. ఇప్పుడు సబ్జెక్టుల బట్టీ, మార్కుల విధానంతో పిల్లలు రోబోలుగా తయారవుతున్నారు. 99శాతం మార్కులు రాకపోయినా, ఐఐటీలో సీటు రాకపోయినా నీ మొహం నాకు చూపించొద్దనే తల్లిదండ్రులు తయారయ్యారు. ఇలాంటి కన్నవాళ్లు, మార్కుల కోసమే పుట్టిన ఈ విద్యావ్యవస్థకి ఎలాంటి నైతిక విలువలు ఉంటాయి? రైతుల విషయానికొస్తే వాళ్లకు రుణమాఫీలు ఇవ్వడం కాదు.. రుణం అవసరం లేని పరిస్థితి కల్పించాలి.

* రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి బయటికెందుకొచ్చారు?
మనిషిని ప్రభావితం చేసేవి చదువు, తల్లిదండ్రులు, పెరిగిన వాతావరణం. రైతు కుటుంబంలో పుట్టాను. ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. అల్లరిచిల్లరగా ఉండేవాణ్ణి. అందుకే మా అమ్మ నన్ను మేనమామ దగ్గరికి పంపించారు. ఆయన కరుడుగట్టిన కమ్యూనిస్టు. సుందరయ్యగారి శిష్యుడు. క్రమశిక్షణ గల వ్యక్తి. నాకూ అదే భావజాలం అబ్బింది. డి.ఆర్‌.డి.ఒ.లో 23 ఏళ్ల వయసులో చేరాను. మాపై అధికారి తాను చెప్పినట్లే చేయాలనేవారు. కష్టమైనా ఏడేళ్లు అలాగే చేశాను. అంత కీలకమైన వ్యవస్థలో నిజాయితీ లేకపోవడం నన్ను చాలా బాధించింది. దీంతో బయటికి వచ్చేశాను. ఇది 1972 నాటి పరిస్థితి. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగం వచ్చింది. అక్కడ 90 శాతం దగా. ఐదేళ్లు ఉద్యోగం చేసి రాజీనామా చేశా.

* ఉద్యోగాలు వదిలేస్తున్నప్పుడు భయం లేదా?
వ్యవసాయం చేసుకునైనా బతికేయగలననే ధైర్యం ఉండేది. అందుకే ఉద్యోగాలు వదిలానుగానీ, విలువలు వదులుకోలేకపోయాను. నేను డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగం చేసేప్పుడు ఐడీబీఎల్‌లో నామినీ డైరెక్టర్‌ అయిన ప్రొఫెసర్‌ జగదీష్‌ ప్రసాద్‌గారు పరిచయమయ్యారు. 1985లో ఆయన భాగస్వామ్యంతో మిస్సైల్‌ బ్యాటరీలకు సంబంధించిన కంపెనీలో రూ.8.5 లక్షలు పెట్టుబడి పెట్టాను. ఆయన విజ్ఞత, నా కార్యశీలత కుదిరాయి. మాది గురుశిష్యుల బంధం. కంపెనీలో పరిశోధనకు పెద్దపీట వేశాం. సంస్థకు మంచి పేరొచ్చింది. తరువాత ఆయనతో విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

* విడిపోయాక మీ డబ్బులు మీకు రాలేదా?
నన్ను ఆయన బాగా ఇబ్బంది పెట్టారు. అక్కడ రాజకీయ ప్రమేయం మొదలైంది. గొడవైంది. మానసికంగా చాలా బాధపడ్డాను. కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

* వ్యాక్సిన్‌ ఆలోచన ఎలా వచ్చింది?
అప్పుడు మా కజిన్‌ అమెరికాకు తీసుకెళ్లాడు. ఆ గగనయానం దైవఘటనగానే భావిస్తాను. అమెరికాలో హెపటైటిస్‌ బి గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. దాన్ని ఎయిడ్స్‌ కంటే తీవ్రమైన వ్యాధిగా భావించేవారు. హెపటైటిస్‌ బి చాలా రకాలుగా వస్తుంది. పైగా మరణాలు ఎక్కువ. మనదేశంతో పాటు ఆసియా దేశాల్లో ఆ వ్యాధి తీవ్రత గురించి వాళ్లు చర్చించేవాళ్లు. అక్కడ మన పిల్లలు, మన దేశం గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం విన్నాను. ‘మీకు కావాల్సినంతమంది పిల్లలున్నారు కదా! కొందరు చనిపోతే ఏంటి?’ అన్నట్లు మాట్లాడారు. బాధేసింది. హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ గురించి ఆలోచన మొదలైంది.
మనదేశానికి వచ్చి అహ్మదాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీకి వెళ్లా. ఇక్కడ హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ అవసరం గురించి అంజిరెడ్డికి చెప్పా. ‘ఇది బయోటెక్నాలజీ సంగతి. ఆ పరిజ్ఞానం సంపాదించడానికి మనకు సమయం పడుతుంద’న్నారు. దీంతో మళ్లీ అమెరికాకి వెళ్లాను. ఓ బయోటెక్నాలజీ నిపుణుడిని కలిశాను. ‘మీది పేద దేశం... సాధ్యపడదు. మూడేళ్ల క్రితం మేం అభివృద్ధి చేశాం. ఇది అర్థం కావాలంటే మీకు 30 ఏళ్లు పడుతుంది’ అన్నారాయన. మన దేశం గురించి చాలా వ్యంగంగా మాట్లాడాడు. నాకైతే అతన్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఓ ఉత్తరాది వ్యక్తిని కలిస్తే ‘వీళ్లు మనకు నూతన పరిజ్ఞానం అందివ్వరు. మనమే దీన్ని సాధించుకోవచ్చ’ని వివరించారు. డబ్బు, ఓపిక దానికి చాలా అవసరమని చెప్పారు. నేనా ఇంజినీరింగ్‌ చదివినవాడిని... జీవశాస్త్రం గురించి అఆలు కూడా తెలీవు. అందుకే ముందు మంచి బృందాన్ని తయారు చేయాలనుకున్నాను.

* నిపుణులు, డబ్బు ఎలా సమకూర్చుకున్నారు?
హైదరాబాద్‌లో అప్పటికి బయోటెక్నాలజీ కంపెనీలు లేవు. దీంతో ఆ రంగంలో పనిచేసేవారూ అందుబాటులో లేరు. విదేశాలకు వెళ్లిన బయోటెక్నాలజీ వాళ్లను వాకబుచేశాను. ‘మీరు ఇక్కడ చదువుకొని అక్కడకు వెళ్లారు.. ఈ దేశానికి ఏమీ తిరిగి ఇవ్వరా’ అని ఉత్తరాలు రాశాను. కొద్దిమంది సానుకూలంగా స్పందించారు. ముగ్గురొచ్చారు. జాయిన్‌ అయ్యాక ఇద్దరు వెళ్లిపోయారు. ఒక్కరే ఉండిపోయారు. మరోవైపు భాగస్వామిగా ఉంటానన్న కంపెనీ రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంకుల చుట్టూ తిరిగాను. బయోటెక్నాలజీ నేపథ్యంలో లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరికి మానాన్న భూమి అమ్మి కావాల్సిన డబ్బు సర్దారు. మా కజిన్‌, స్నేహితులు సాయం చేశారు. రూ.2 కోట్లతో మల్లారెడ్డిగారి సౌజన్యంతో ల్యాబ్‌లో పనిచేయడం ప్రారంభించాం. అమెరికా వాళ్లు 18 డాలర్ల వ్యాక్సిన్‌ను మనకు 35 డాలర్లకు అమ్మేవాళ్లు. ఒక్కో డోసు రూ.840. ముగ్గురు పిల్లలుంటే దాదాపు రూ. 2500 దాకా అయ్యేది. దీన్ని సామాన్యులు భరించడం కష్టంగా ఉండేది. తక్కువ డబ్బులకే వ్యాక్సిన్‌ అందివ్వాలనేది నా లక్ష్యం. లక్ష్యశుద్ధి ఉంటే లక్ష్యసిద్ధి కూడా ఉంటుంది. కొందరి సహకారంతో అలా నాకు రూ.15కోట్లు జమకూడాయి.

* వ్యాక్సిన్‌ తయారీకి ఎన్నాళ్లు పట్టింది?
1991 అక్టోబర్‌లో ఈ ఆలోచన వచ్చింది. 1992 నుంచి ఈ పనిలో ఉన్నా. ఆ తర్వాత ఏడాది మార్చికి మా కంపెనీ రిజిస్ట్రేషన్‌ అయింది. 1997 ఆగస్టుకి హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ తయారు చేశాం.

* ఈ క్రమంలో మీరు పడిన ఇబ్బందులేంటి?
అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందులో మొదటిది డబ్బు. నాకున్న రూ.2కోట్లు ఎంత వరకూ సరిపోతాయి? కావల్సింది రూ.15 కోట్లు. అన్నిటి కన్నా ముఖ్యమైంది ఈ ఉత్పత్తి పుట్టిన కొన్ని క్షణాల్లోనే బిడ్డకు అందాలి. ఇది మంచిది అని చెప్పడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఇది సోపో, టూత్‌ పేస్టో కాదు కదా! నియంత్రించే విధానం ఒకటి ఉండాలి. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆ పని చేస్తుంది. కానీ వాళ్ల దగ్గర అంతవరకూ ఎటువంటి విధివిధానాలు లేవు. వెళ్లి అడిగితే ‘ఆర్‌ యూ జోకింగ్‌’ అనేవారు? ఆరోగ్య కార్యదర్శి జావెద్‌ చౌదరీ గారి దగ్గరకు వెళితే... ‘నా సమయం వృథా చేయొద్దు. జోక్‌ చేస్తున్నావా. గెట్‌ అవుట్‌’ అన్నారు. అలా నాకు ఎవ్వరూ సహకరించలేదు.

* ఎవరికైనా లంచాలు ఇచ్చారా?
ఇచ్చాను. అనేక సవాళ్ల ఎదుర్కొన్నాను. శాస్త్రవేత్తలని సమీకరించుకోవడం కష్టం అయ్యింది. ఒక ప్రయోగశాల కట్టాలంటే ఒక నమూనా ఉండాలి. మరి మేం దేన్ని చూసి కట్టాలి. అయినా మంచిగానే కట్టాం. అయితే నేను బ్రహ్మని కాను, మయుడునీ కాదు. కొన్ని తప్పులు వచ్చాయి. సరిదిద్దుకున్నాం. డబ్బు లేదు, అనుభవం లేదు, విధివిధానాలు లేవు. అనుభజ్ఞులైన జనం లేరు, అన్నింటి కన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో దీని గురించి స్పందన లేదు. భయంకరమైన రెడ్‌ టేపిజం. చివరికి ప్రైవేట్‌గానే అమ్మడం మొదలుపెట్టాం.

* ఈ పరిస్థితుల్లో కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందింది?
నా కుటుంబం నన్ను భరించింది. నన్ను కట్టుకున్నావిడ నా మేనత్త కూతురే కాబట్టి ఆవిడకి నా గురించి బాగా తెలుసు. ఇతను ఒక నిర్ణయానికి వస్తే మారడు అనుకుంది. ఏకైక సంతానం కాబట్టి అమ్మానాన్నలు ఎదురుచెప్పలేదు.

* అప్పటికే ఉన్న కంపెనీలు మీకు పోటీ వచ్చాయా?
మేం ప్రారంభించిన తర్వాత 8 కంపెనీలు బయోటిక్‌ డివిజన్‌ని ప్రారంభించారు.  అప్పటికి ‘శాంతా బయోటెక్‌’కి చాలా పేరు వచ్చేసింది. మనమూ ఈ రంగంలోకి వెళ్లాలి అనే తపన ఇతరుల్లో మొదలైంది. కొంతమంది టెక్నాలజీని దిగుమతి చేసుకుని, మరొకటి చేసి ఈ రంగంలోకి వచ్చేశారు.  నేను డబ్ల్యుహెచ్‌వో ప్రీక్వాలిఫికేషన్‌కి వెళ్లాను. రెండేళ్లపాటు మా పనితీరుని పరీక్షించారు. ఆ పరీక్షలో విజయం సాధిస్తే అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌ అమ్ముకోవచ్చు. దాంట్లో మేం విజయం సాధించాం. యునిసెఫ్‌ మా దగ్గర కొనడం ప్రారంభించింది. తక్కిన వాళ్లు ఈ విషయంలో వెనకబడ్డారు. అలా మాకు అంతర్జాతీయ అనుమతులు వచ్చిన తర్వాత ఈ మందు మన బిడ్డలకన్నా ఇతర దేశాల బిడ్డలకే ఎక్కువగా అందింది. మన బిడ్డల కోసమన్నా ఆనాటి ఆరోగ్యమంత్రి అన్బుమణిరాందాస్‌ సహకరించలేదు. మన పొరుగు దేశాలు వైజ్ఞానికంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ దేశాలు మన దగ్గర కొనుక్కుని వాడుకున్నారు. కానీ మన బిడ్డలకు అందలేదు. పాకిస్తాన్‌కి మనమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చాం. నాకోసారి టెక్నాలజీ అవార్డు ఇచ్చారు. డబ్బుని వెనక్కి ఇచ్చేసి ఈ వ్యాక్సిన్‌ని మనదేశంలోనూ వాడండి అన్నాను. రెండోసారి అవార్డు వచ్చినప్పుడు అవార్డే వద్దన్నాను. నా సేవలు గొప్పవంటూనే నేను తయారుచేసిన వ్యాక్సిన్‌ వాడకపోతే ఎలా అని ప్రశ్నించాను. వాజ్‌పేయి గారి ప్రత్యేక కార్యదర్శి సుధీంద్ర కులకర్ణి గారికి చెప్పాను. అలా పదకొండేళ్లపాటు నా వ్యాక్సిన్‌ మన బిడ్డలకు చేరువకాలేదు. కానీ ఇప్పుడలా కాదు. మా వ్యాక్సిన్ల కారణంగా చాలామందికి వ్యాధి తగ్గింది.

* మొదట్లో నాస్తికుడిగా ఉండేవారు. మరి దైవత్వం వైపు ఎలా వచ్చారు?
మా అమ్మ ఆస్తికురాలు. చదువుకుంది. శ్రద్ధగా పూజాపునస్కారాలు చేసుకునేది. పెరిగిందేమో పరమ నాస్తికుడైన మామయ్య దగ్గర. అక్కడ హరిజనవాడల్లో తిరుగుతూ యాంటీబయోటిక్స్‌ ఇస్తూ విటమిన్‌ సి లు ఇచ్చేవాడు. ఆయన సమసమాజం కావాలని చెప్పేవాడు. ‘నువ్వు పెట్టుబడిదారీగా మారిపోతున్నావ్‌. శ్రామికుల అదనపు శ్రమే పెట్టుబడిదారుల పెట్టుబడి. నువ్వు నా దగ్గర పెరిగి ఇంత ద్రోహం చేస్తావను కోలేదు’ అన్నారాయన. నేను ‘శాంతా’ను ప్రారంభించిన తర్వాత ఉద్యోగస్తుల్లో నేను నాకోసం పనిచేస్తున్నాను అనే నమ్మకం కలిగించాను. పదహారు ఉత్పత్తులు. 1600 మంది ఉద్యోగులు. ఎంతో మంది వాటాదారులకు లాభాలువచ్చాయి. ఇక్కడ సంపద పెంచడం, పంచడం కూడా జరిగింది. మామయ్య చెప్పిన దాని ప్రకారం దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. దైవీ గుణాలు ముఖ్యం అని అనుకున్నాను. దయ, కరుణ, ఓపిక, క్షమ, సహనం అలవరుచుకున్నాను. ఒకప్పుడు తీక్షణంగా ఉండేవాడిని. ప్రభుత్వంలో కనీసం వందమందిని చంపేయాలి అనుకునే వాడిని. కానీ అమ్మ నన్ను మార్చింది. ఇప్పుడు చాలా హాయిగా ఉన్నాను. సంగీతంతో, సాహిత్యంతో జీవితం ముడిపెట్టుకుని చాలా ప్రశాంతంగా ఉన్నాను.

అన్నీ మోహనరాగాలే

మోహనరాగం అంటే నాకు ప్రాణం. నాకు రాగాల గురించి తెలియని వయసులోనే దారినపోతూపోతూ ఎక్కడైనా మంచి పాట వినిపిస్తే గోడకు ఆనుకుని రేడియోలో వచ్చే ఆ పాట వినేవాడిని. ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని పాటలు రికార్డు చేసుకున్నాను. రాగం ఏదో తెలియకుండా రికార్డు చేసుకున్నా.. కాస్త అవగాహన వచ్చిన తర్వాత చూస్తే అవన్నీ మోహనరాగాలే.

అప్పుడే కలాంను చూశా!

యాభై ఏళ్ల క్రితం డీఆర్‌డీవోలో చేస్తున్నప్పుడు అబ్దుల్‌కలాంగారు తారసపడ్డారు. ఆయన, నేను ఓ ప్రాజెక్టులో సభ్యులం. ఆయనను మిస్సైల్‌ సైంటిస్ట్‌ అని రాసేవారు. అయితే ఆయన ఓ గొప్ప మానవతావాది. నిజాయితీపరుడు. సైంటిస్ట్‌ల భుజంమీద చేయి వేసి అభినందించేవారు.
పుస్తకాలు తక్కువ రాశాను. కానీ మంచి పుస్తకం చదివితే సమీక్ష రాస్తాను. చాలామంది ముందుమాట రాయమని అడిగేవారు. పుస్తకం మొత్తం చదివి విషయం మీద సమగ్రంగా రాస్తాను. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి ‘సైకాలజీ టుడే’ పత్రికలో వ్యాసాలు రాస్తున్నాను.

అవగాహన లేదు

ఆ రోజుల్లో ఎయిడ్స్‌ గురించి ప్రచారం విపరీతంగా ఉండేది. ప్రపంచబ్యాంకు బలవంతంగా మనకు రుణమిచ్చి కండోమ్‌లు వాడమని చెప్పారు. మన ప్రభుత్వ పెద్దలు సిగ్గులేక బస్సులమీద రాయించారు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టారు. దీని మీద విమర్శిస్తే ‘విదేశీ లోన్‌ లేండీ’ అన్నారు అప్పటి నాయకులు. బాధాకరం ఏంటంటే హెపటైటిస్‌ బి గురించి ఎలాంటి ప్రచారం లేదు. అవగాహన కల్పించలేదు. హెపటైటిస్‌ అంటే కృత్రిమంగా సృష్టించిన ఓ మాయరోగం అని కొన్ని పత్రికలు రాశాయి. ఆ సమయంలో రామోజీరావుగారిని కలిసి మాట్లాడాను. ఆయన ‘క్రియేటెడ్‌ హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ బై వరప్రసాద్‌రెడ్డి’  అని ఆయన ఈనాడులో రాశారు. రుబెల్లాలా అందరు పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ ఇస్తే బావుంటుందినేది నా ఆలోచన. అందుకే నేను తక్కువ డబ్బులకే అందరికీ అందుబాటులో అమ్మాలనుకున్నా. ఈరెండు సాధించగలిగాం.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.